అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మరింత పేదరికంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్

  • 10 అక్టోబర్ 2018
అమెరికా, చైనాల పోరును ప్రతిబింబించే చిత్రం Image copyright Getty Images

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంతో ప్రపంచం మరింత పేదరికంలోకి వెళ్లేందుకు, మరింత ప్రమాదకరంగా తయారయ్యేందుకు ఆస్కారం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) హెచ్చరించింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తాజా అంచనాలతో ఈ హెచ్చరిక చేసింది. ఈ ఏడాదికి, వచ్చే ఏడాదికి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, అమెరికా, చైనా మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం ఈ పురోగతికి పెద్ద విఘాతం కలిగిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

వాణిజ్యపరమైన అడ్డంకులు మరింతగా పెరిగితే కుటుంబాలు, వ్యాపారాలపైనా, మొత్తం ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త మౌరిస్ ఓబ్స్‌ఫెల్డ్ చెప్పారు.

Image copyright Getty Images

''వాణిజ్య విధానం రాజకీయాలను ప్రతిబింబిస్తుంది. అనేక దేశాల్లో రాజకీయాలు స్థిరంగా లేవు. ఈ పరిస్థితితో ముప్పు పెరుగుతోంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

జీవన ప్రమాణాల మెరుగుదలకు, విద్యాభివృద్ధికి, అసమానతల తగ్గింపునకు ప్రపంచ నాయకులు కలసికట్టుగా పనిచేయకపోతే ప్రపంచం మరింత పేదరికంలోకి వెళ్తుందని, మరింత ప్రమాదకరంగా తయారవుతుందని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త హెచ్చరించారు.

ఇటీవల ఆరు వేల కోట్ల డాలర్ల అమెరికా ఉత్పత్తులపై చైనా కొత్తగా సుంకాలు విధించింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ వైపు ఎక్కువగా మొగ్గు చూపే రాష్ట్రాల్లో తయారైన ద్రవీకృత సహజవాయువు లాంటి ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, అమెరికాలో నవంబరులో జరుగనున్న ఎన్నికలను ప్రభావితం చేసేందుకు యత్నించొద్దని చైనాను ట్రంప్ హెచ్చరించారు. తమ రైతులను, కార్మికులను చైనా లక్ష్యంగా చేసుకొంటే చాలా వేగంగా, పెద్దయెత్తున ప్రతిచర్యలు చేపడతామని చెప్పారు.

రెండు వేల కోట్ల డాలర్ల చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు గత నెల్లో అమల్లోకి వచ్చాయి.

Image copyright Reuters

'అంతర్జాతీయ వృద్ధి రేటు 3.7 శాతం'

2018, 2019లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిరేటు 3.7 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. ఐఎంఎఫ్ జులైలో అంచనా వేసిన 3.9 శాతం వృద్ధి రేటు కన్నా ఇది తక్కువ.

యూరో జోన్‌లో ఆర్థిక వృద్ధి నెమ్మదిగా సాగుతోందని, చాలా వర్ధమాన దేశాలు ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయని అంచనాలు చెబుతున్నాయి.

దక్షిణ అమెరికాలోని వెనెజ్వేలాలో ఐదేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం వచ్చే ఏడాదీ ఉంటుందని భావిస్తున్నారు. 2019లో ఈ దేశంలో ద్రవ్యోల్బణం కోటి శాతానికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.

దక్షిణ అమెరికాలోని మరో దేశం అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థ కూడా 2018, 2019ల్లో మరింతగా క్షీణించే ఆస్కారముంది. సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఉద్దేశించిన ఐఎంఎఫ్ 'బెయిలవుట్' ప్రణాళికకు అర్జెంటీనా ఇటీవలే అంగీకరించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మీపై చూపే ప్రభావం ఇదీ...

వాణిజ్య యుద్ధంతో రెండు దేశాలకూ నష్టమే

అమెరికా, చైనా పోటాపోటీగా సుంకాలు విధించడం వల్ల 2019లో రెండు దేశాల్లో ఆర్థిక వృద్ధిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.

అలాగే అమెరికాలో ట్రంప్ ప్రకటించిన భారీ పన్ను మినహాయింపులతో ఏర్పడ్డ సానుకూలత కూడా తగ్గిపోవడం మొదలవుతుంది.

దిగుమతయ్యే అన్ని కార్లపై 25 శాతం పన్ను విధిస్తామన్న అమెరికా ఆ మేరకు నిర్ణయిస్తే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి శాశ్వత విఘాతం కలుగుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.

అంతర్జాతీయ సుంకాలు వ్యాపారంపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, పెట్టుబడులు తగ్గిపోయేలా చేస్తాయని, రుణాల వ్యయం పెంచుతాయని చెప్పింది.

పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం వల్ల అమెరికా, చైనా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయని ఐఎంఎఫ్ పేర్కొంది.

దీనివల్ల వచ్చే ఏడాది చైనాలో ఆర్థిక వృద్ధి రేటు ఐదు శాతం దిగువకు చేరుకుంటుందని తెలిపింది. వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని ఇప్పటివరకున్న అంచనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)