జింబాబ్వే కరెన్సీ సంక్షోభం: నో క్యాష్, నో కేఎఫ్‌సీ

  • 12 అక్టోబర్ 2018
జింబాబ్వే సంక్షోభం Image copyright Getty Images

జింబాబ్వే కరెన్సీ విలువ వేగంగా పడిపోతుండడం, వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో స్థానిక, విదేశీ వ్యాపారుల దుకాణాలు మూతపడుతున్నాయి. 2008లాగే మళ్లీ తీవ్ర ఆర్థిక సంక్షోభం వస్తుందేమోనని దేశంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

"మేం చాలా కష్టాల్లో ఉన్నాం. ద్రవ్యోల్బణం చాలా పెరిగింది. ప్రతి రోజూ, ప్రతి నిమిషం ధరలు మారిపోతున్నాయి" అని అక్కడి హోల్ సేల్ వ్యాపారి ఒకరు చెప్పారు.

దీనిని క్లిష్ట సమయంగా భావించిన కేఎఫ్‌సీ జింబాబ్వేలో తమ అవుట్‌లెట్లన్నీ మూసివేసింది. చాలా సూపర్ మార్కెట్లు చాలా వస్తువుల అమ్మకాలు తగ్గించేశాయి.

దేశంలోని గనుల్లో తవ్వకాలు జరుపుతున్న సంస్థలు, ఇతర ఎగుమతిదారులు విదేశీ మారక నిల్వలు అందడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.

Image copyright EPA

"పరిస్థితి 2008లాగే ఉంటుందా, అంతకంటే ఘోరంగా మారుతుందా అని నాకు భయమేస్తోంది" అని హరారేలో నర్సుగా పనిచేస్తున్న గ్రేస్ అన్నారు.

ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతుంటే.. నగదు బదిలీలపై కొత్తగా 2 శాతం పన్ను విధించడం, స్థానిక కరెన్సీలో మార్పులకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న వరుస ప్రకటనలు వారిని మరింత భయపెడుతున్నాయి.

జింబాబ్వేకు ఇంధన దిగుమతులు హఠాత్తుగా ఆగిపోయాయి. వాణిజ్యం ఘోరంగా దెబ్బతింది. జోల్లార్స్ లేదా జిమ్ డాలర్స్ పేరుతో చెలామణి అవుతూన్న స్థానిక బాండ్ నోట్లను వ్యాపారులు తీసుకోవడం లేదు. ప్రస్తుతం నల్ల బజారులో వీటి విలువ ఒక అమెరికా డాలరుకు నాలుగైదు డాలర్లు ఉంటోంది.

Image copyright EPA
చిత్రం శీర్షిక సూపర్ మార్కెట్లలో కనిపించని సరుకులు

చక్కదిద్దే ప్రయత్నాలు

దేశంలో పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదని జానూ-పీఎఫ్ ప్రభుత్వ సహాయ మంత్రి ఎనర్జీ ముటోజీ తెలిపారు.

"మనం ఇప్పుడు చూస్తోంది ఊహాత్మక ప్రవర్తన మాత్రమే. జనం నగదు నిల్వ చేస్తున్నారు. కానీ కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుంది. జానూ-పీఎఫ్ పాలనలో సురక్షితంగా ఉన్నామని జింబాబ్వే ప్రజలు తెలుసుకోవాలి. మా ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉంది. అందుకే ప్రజలు చాలా సంయమనంతో ఉండాలని కోరుతున్నాం" అన్నారు.

అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను పదవి నుంచి తప్పించి జింబాబ్వేలో అధికారంలోకి వచ్చిన జానూ-పీఎఫ్ ప్రభుత్వం, ముగాబే పాలనలోని అనవసర ఖర్చులు, అవినీతి, అస్థిర విధానాలు, ఎగుమతులు మందగించడం వల్ల ఏర్పడ్డ ఆర్థిక లోటును భర్తీ చేసే ప్రయత్నాలు చేస్తోంది.

దేశంలో ఆర్థిక స్థిరత్వం తీసుకొచ్చేందుకు జింబాబ్వే కొత్త ఆర్థిక మంత్రి చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగానూ కొంత మద్దతు లభిస్తోంది.

2008 ఆర్థిక పతనం సమయంలో ప్రభుత్వం ప్రజల పొదుపు మొత్తాలను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అలాగే జరుగుతుందేమోనని దేశంలో ప్రజలు భయపడిపోతున్నారు.

Image copyright Reuters

మరోవైపు ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. "మీరు ఎన్నికల్లో ఎలాగైనా గెలవవచ్చు, కానీ ఆర్థికవ్యవస్థను చక్కదిద్దలేరు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ పంపుల దగ్గర పరిస్థితిని మార్చలేరు" అని ప్రతిపక్ష ఎండీసీ ఎంపీ అన్నారు.

2009లో కరెన్సీ విలువ పతనం కావడంతో జింబాబ్వే విదేశీ కరెన్సీపై ఆధారపడడం ప్రారంభించింది. 2016 వరకూ ఇదే కొనసాగింది. తర్వాత బాండ్ నోట్లు ప్రవేశపెట్టినపుడు, వాటి వల్ల అవినీతి మరింత పెరుగుతుందని, ప్రభుత్వంలో అనవసర ఖర్చులు పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఆర్థిక విశ్లేషకులు మాత్రం కొత్త ప్రభుత్వం మెల్లగా పరిస్థితిని చక్కదిద్దే దిశగా అడుగులు వేస్తోందని భావిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా దేశ ఆర్థిక స్థితికి కళ్లెం వేయడానికి మరికొంత సమయం పడుతుందని చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)