వాట్సాప్‌లో 'అపరిచిత వీడియో కాల్' బగ్‌, పరిష్కరించిన నిపుణులు

  • 12 అక్టోబర్ 2018
వాట్సాప్‌లోని సాంకేతిక సమస్యకు పరిష్కారం Image copyright Reuters

మీకు వాట్సాప్‌లో ఓ అపరిచిత నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. అదేంటో తెలుసుకుందామని, ఆన్సర్ చేయగానే యాప్ ఉన్నట్లుండి క్రాష్ అయిపోతుంది.

దీన్నే బూబీ-ట్రాప్డ్ వీడియో కాల్ అంటారు. కొద్దికాలంగా చాలామంది యూజర్లను విసిగిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం లభించింది.

దీన్ని పరిష్కరించడం నిజంగా ఓ పెద్ద సవాలే అని పరిశోధకుడు టావిస్ ఆర్మండీ వ్యాఖ్యానించారు. ఈ సమస్యను పరిష్కరించిన బృందంలో ఆయనా ఉన్నారు.

ఆండ్రాయిడ్, యాపిల్ స్మార్ట్‌ఫోన్లలోని వాట్సాప్ అప్లికేషన్లలో ఈ సమస్యను ఆగస్టులో గుర్తించారు.

వాట్సాప్‌లో సాఫ్ట్‌వేర్‌లో సమస్యలను పరిశోధించడానికి గూగుల్ నియమించిన బృందంలో సభ్యురాలైన నటాలీ సిల్వనోవిచ్ ఈ సమస్యను తొలిసారి గుర్తించారు. వాట్సాప్‌లో వీడియోలను పంపించే సమయంలో ప్యాకెట్ల రూపంలో ఉన్న కొంత డాటా యాప్‌ను క్రాష్ చేస్తోంది అని ఆమె వివరించారు.

అయితే, వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో మాత్రం వీడియోల ట్రాన్స్‌ఫర్ వేరే పద్ధతిలో జరుగుతుంది. అందువల్ల వెబ్ వెర్షన్‌పై ఈ బగ్ ఎలాంటి ప్రభావమూ చూపించలేదు.

Image copyright PA

"సరైన సమయంలో స్పందించిన మా సాంకేతిక బృందం ఈ సమస్యను పరిష్కరించింది. అప్లికేషన్‌లో యూజర్ల డాటా భద్రతకు సంబంధించి మేము తరచూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చిస్తుంటాం. ఇదంతా యూజర్లకు తమ డాటా భద్రతపై భరోసా ఇవ్వడం కోసమే" అని ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే దీనివల్ల దాడులు జరిగినట్లు గానీ, అప్లికేషన్ హ్యాక్ అయిందని గానీ ఎలాంటి ఆధారాలూ లేవని ఫేస్‌బుక్ తెలిపింది.

ప్రస్తుతం వాట్సాప్‌ని ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)