పాకిస్తాన్: ఐఎస్ఐకి కొత్త చీఫ్.. ఎలాంటి మార్పులు రానున్నాయి?

  • 13 అక్టోబర్ 2018
పాక్ ఐఎస్ఐ కొత్త చీఫ్ Image copyright ISPR
చిత్రం శీర్షిక లెఫ్టినెంట్ జనరల్ ఆసిం మునీర్

పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఆసిం మునీర్‌ను ఆ దేశ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ( ఇంటర్ సర్వీసెస్ ఏజెన్సీ) కొత్త చీఫ్‌గా నియమించినట్టు పాకిస్తాన్ ఆర్మీ సమాచార విభాగం చెబుతోంది.

లెఫ్టినెంట్ జనరల్ ఆసిం మునీర్ పాకిస్తాన్ సైనిక అకాడమీలో గ్రాడ్యుయేట్ కాలేదు. ఆయన ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ నుంచి సైన్యంలో ఫ్రంటియర్ ఫోర్స్ రెజిమెంట్ నుంచి నియమితులయ్యారు.

లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఆయన సౌదీ అరేబియాలో కూడా ఉన్నారు. కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీతో కూడా సంబంధాలు ఉన్నాయి.

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని ప్రకటించడానికి కొన్ని రోజుల ముందే లెఫ్టినెంట్ జనరల్ ఆసిం మునీర్ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో నియమితులయ్యారు.

ఆసిం మునీర్ నిఘా ఏజెన్సీ చీఫ్ జనరల్ నవీద్ ముఖ్తార్ స్థానంలోకి వచ్చారు. ముఖ్తార్ 2016లో ఐఎస్ఐకి నేతృత్వం వహించారు.

Image copyright ISPR
చిత్రం శీర్షిక జనరల్ నవీద్ ముఖ్తార్

లెఫ్టినెంట్ జనరల్ ఆసిం మునీర్ ఇదే ఏడాది జులైలో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో సైన్యంలోని మరో నిఘా ఏజెన్సీ మిలిటరీ ఇంటెలిజెన్స్(ఎంఐ) చీఫ్‌గా ఉన్నారు. ఆయన్ను సైన్యంలో చాలా కచ్చితమైన అధికారిగా చెబుతారు.

కీలకమైన, ప్రత్యేక సమయాల్లో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఇంజెలిజెన్స్(డీజీఎంఐ)గా ఉన్నప్పటికీ, ఐఎస్ఐలో మొదటి నుంచీ ఉన్న సైనిక విధానాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఐఎస్ఐని పాకిస్తాన్ సైన్యంలో ప్రధాన విభాగంగా భావిస్తారు. కానీ ఇప్పటివరకూ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయానీ మాత్రమే పాక్ ఆర్మీ చీఫ్ కావడానికి ముందు ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నారు.

Image copyright Getty Images

చీఫ్ మారితే ఐఎస్ఐ విధానాలలో తేడా వస్తుందా?

చీఫ్‌లు మారినంత మాత్రాన ఆర్మీ విధానాలు మారవని పాకిస్తాన్ మాజీ మిలిటరీ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ ఆసిఫ్ యాసీన్ చెప్పారు.

యాసీన్ బీబీసీతో "పాకిస్తాన్‌లోని చాలా తక్కువ సంస్థలు తమ సొంత విధానాలను అనుసరిస్తాయి. కొత్త ఆర్మీ చీఫ్, కొత్త చైర్మన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, లేదా కొత్త ఐఎస్ఐ చీఫ్ వచ్చినంత మాత్రాన, వాళ్లు ఒక కొత్త దారిలో వెళ్లడం అనేది జరగదు" అన్నారు.

"ఇక్కడ జాతీయ వ్యూహాల ప్రకారం అధికారిక విధానం అనుసరించాలి. ఆర్మీ, ఐఎస్ఐ అందులో భాగంగా ఉంటాయి. అందుకే విధానాల్లో ఎలాంటి మార్పులూ చేయడం కుదరదు".

"దేశ అంతర్గత రక్షణకు సంబంధించిన అంశాల్లో కూడా ఐఎస్ఐ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, పాకిస్తాన్‌లో దాని పాత్రలో గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి పెద్ద మార్పూ లేదు. విధానాలు రూపొందించడంలో ఇతర సంస్థలు కూడా తమ అభిప్రాయం చెప్పవచ్చు" అన్నారు యాసిన్.

"ఐఎస్ఐ విధానాలు రూపొందించదు, వాటిని అమలు చస్తుంది. ఈ ఏజెన్సీ ఇచ్చే ఇన్‌పుట్ ద్వారా ప్రభుత్వం తమ విధానాలను నిర్ధారిస్తుంది".

Image copyright Getty Images

ఐఎస్ఐ ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటుందా?

"రాజకీయాల్లో ఆర్మీ జోక్యం చేసుకోవడం అనేది ప్రపంచమంతా ఉంది. ఒక దగ్గర తక్కువుంటే, ఇంకో దగ్గర ఎక్కువగా ఉంటుంది. కానీ కాలక్రమేణా పాకిస్తాన్ సహా ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో సైన్యం పాత్ర తగ్గిపోతూ వస్తోంది. ప్రజాస్వామ్యం బలోపేతం కావడమే దానికి కారణం" అన్నారు యాసిన్.

సాధారణంగా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే డీజీఎంఓకు, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మిలిటరీ చీఫ్‌ చాలా అనుకూలంగా ఉంటారని సైన్యంలో అందరూ భావిస్తారు.

"ఆర్మీ చీఫ్‌కు అనుకూలంగా ఉన్న అధికారులనే ప్రధాన మంత్రి ఈ పదవిలో నియమిస్తాడని దీని ద్వారా స్పష్టం అవుతోందని" విశ్లేషకులు చెబుతున్నారు.

Image copyright AFP

పాక్ ప్రధాన మంత్రి అధీనంలో ఐఎస్ఐ

ప్రధానమంత్రి తన విచక్షణ అధికారాలతో డీజీఐఎస్ఐని నియమిస్తారు. ఏజెన్సీ చట్టం ప్రకారం ఇది ప్రధానమంత్రికి లోబడి ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్ ఇద్దరికీ ఐఎస్ఐ చీఫ్ జవాబుదారీగా ఉంటారు.

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన పదవీకాలంలో రెండు సార్లు ఆర్మీ చీఫ్‌ను కూడా నియమిస్తారు.

ప్రస్తుత ఆర్మీ చీఫ్ 2019లో రిటైర్ అవుతారు, ఆయన స్థానంలో వచ్చే ఆర్మీ చీఫ్ 2022లో రిటైర్ అవుతారు.

"మిలిటరీ ఇంటెలిజెన్స్ అంటే ఎంఐ శత్రు సేనలు, వారి కార్యకలాపాలపై నిఘా పెడుతుంది. కానీ ఐఎస్ఐ మాత్రం రాజకీయపరంగా, సైనిక పరంగా రెండు స్థాయిల్లో పని చేస్తూ, తమ ఇన్‌పుట్ అందిస్తుంది" అని విశ్లేషకులు చెబుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాక్ ఆర్మీ, ఐఎస్ఐ‌కి మద్దతుగా పాకిస్తాన్ అవామీ పార్టీ ప్రదర్శన

"ఐఎస్ఐ చీఫ్‌కు తన సంస్థ పరిధిలో చాలా అధికారాలు ఉంటాయి. డీజీఐఎస్ఐ తన సంస్థ పరిధిలో ఎవరినైనా నియమించవచ్చు, తొలగించవచ్చు. తిరిగి సైన్యంలోకి కూడా పంపించవచ్చు, వారిని పోస్ట్ అవుట్ కూడా చేయవచ్చు" అని లెఫ్టినెంట్ జనరల్ జావేద్ అష్రఫ్ కాజీ చెప్పారు.

కానీ బయటి సంబంధాల విషయానికి వస్తే ఐఎస్ఐ చీఫ్ బలం అంతా దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్‌పై ఆధారపడి ఉంటుంది ప్రధాని ఆయన్ను పదవి నుంచి తొలగించవచ్చు. ఐఎస్ఐ చీఫ్ కింద ఉండే అధికారులను ఆర్మీ చీఫ్ నియమిస్తారు. సైన్యంలో ఆర్మీ చీఫ్ మాటే చెల్లుతుంది.

లెఫ్టినెంట్ జనరల్ జావేద్ అష్రఫ్ కాజీ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్నారు.

బేనజీర్ భుట్టో నేరుగా కాకుండా, డీజీఐఎస్ఐ ద్వారా కూడా మాట్లాడేవారని ఆయన చెప్పారు. ఇలా ఐఎస్ఐ చీఫ్ ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఒక కీలక లింకులా నిలుస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)