జమాల్ ఖషోగి అదృశ్యం: సౌదీ పాత్ర ఉంటే తీవ్రంగా శిక్షిస్తామన్న డోనల్డ్ ట్రంప్

  • 13 అక్టోబర్ 2018
జమాల్ ఖషోగి Image copyright Getty Images

సౌదీ పాత్రికేయుడు జమాల్ ఖషోగి హత్యకు సౌదీ అరేబియా ప్రభుత్వమే కారణమని వెల్లడైతే ఆ దేశానికి ‘తీవ్ర శిక్ష’ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

‘‘అదే జరిగితే నేను చాలా బాధపడతాను, కోపం వస్తుంది’’ అని ట్రంప్ అన్నారు. అయితే, సౌదీతో భారీ సైనిక కాంట్రాక్టులను రద్దు చేసే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు.

సౌదీ అరేబియాలోని రాచరిక ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే పాత్రికేయుడు జమాల్ ఖషోగి అక్టోబర్ 2న టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో అదృశ్యమయ్యారు.

వాషింగ్టన్ పోస్ట్ దినపత్రికకు వ్యాసాలు రాసే జమాల్, కాన్సులేట్ కార్యాలయంలో హత్యకు గురయ్యారని నిరూపించటానికి తమ వద్ద ఆడియో, వీడియో సాక్ష్యాలు ఉన్నాయని టర్కీ భద్రతా వర్గానికి చెందిన వారొకరు బీబీసీతో చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ దగ్గర ఏం జరిగింది?

ఈ ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ, జమాల్ అదృశ్యం వెనుక నిజాన్ని తవ్వి తీస్తామని ప్రమాణం చేశారు.

అయితే, సౌదీ అరేబియా పాత్ర ఉందని తేలితే ఆ దేశాన్ని శిక్షించటానికి తమ సైనిక కాంట్రాక్టులను రద్దు చేయటం కన్నా ఇతర మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఆయనను హత్య చేయాలంటూ తాను ఆదేశించినట్లు వస్తున్న ఆరోపణలు ‘అసత్యాల’ని సౌదీ అరేబియా చెప్తోంది.

Image copyright Reuters

జమాల్ అదృశ్యం వెనుక నిజం తెలియాలి: ఐరాస సెక్రటరీ జనరల్

మరోవైపు, జమాల్ అదృశ్యం వెనుక ‘నిజం’ వెల్లడించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ డిమాండ్ చేశారు.

ఇటువంటి అదృశ్యాలు ఇంకా తరచుగా జరుగుతాయని.. అలా జరగటం మామూలు విషయంగా మారిపోతుందని తాను భయపడుతున్నట్లు బీబీసీతో చెప్పారు.

అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ శుక్రవారం ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. జమాల్ అదృశ్యం వెనుక ‘పూర్తి వాస్తవాలు’ వెలికి తీయాలని తామూ కోరుకుంటున్నామని.. అయితే, ఆయనను చంపాలని తాము ఆదేశాలు జారీ చేసినట్లు చేస్తున్న ఆరోపణలు ‘నిరాధార’మని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సౌద్ బిన్ నాయిఫ్ బిన్ అబ్దులజీజ్ పేర్కొన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఖషోగీ ప్రియురాలు హటీస్ చెంగిజ్ ఈ విషయంలో అమెరికా సహాయాన్ని అర్థించారు

ఆంటోనియో గుటెరెస్ బాలిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సమావేశంలో మాట్లాడుతూ, ‘‘వాస్తవాలు స్పష్టమవ్వాలంటే మనం బలంగా అడగాల్సిన అవసరముంది’’ అని చెప్పారు.

‘‘అసలు ఏం జరిగింది? కచ్చితంగా ఎవరు బాధ్యులు అనేది మనం తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనలు దీనికి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాలి’’ అని పేర్కొన్నారు.

సౌదీ అరేబియా ఈ నెలలో రియాద్‌లో ఒక కీలకమైన పెట్టుబడి సదస్సు నిర్వహిస్తోంది.

జమాల్ విషయంలో ఏం జరిగిందనే దానిపై ‘‘స్పష్టమైన జవాబు’’ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఆ సదస్సుకు హాజరయ్యే విషయమై తగిన విధంగా స్పందించాలని గుటెరెస్ వ్యాఖ్యానించారు.

Image copyright AFP

టర్కీ రికార్డింగ్స్ ఏం చెప్తున్నాయి?

టర్కీలోని సౌదీ అరేబియా దౌత్యకార్యాలయంలో దాడి జరిగిందని, ఘర్షణ చోటు చేసుకుందని తాజా వార్తలు సూచిస్తున్నాయి.

ఇందుకు సంబంధించి ఒక ఆడియో, వీడియో రికార్డులు ఉన్నాయని టర్కీ భద్రతా వర్గానికి చెందిన అధికారి ఒకరు బీబీసీ అరబిక్‌కు నిర్ధారించారు. అయితే, టర్కీ అధికారులు కాకుండా వేరెవరైనా వాటిని చూడటం కానీ వినటం కానీ జరిగిందా అన్నది ఇంకా తెలియలేదు.

జమాల్‌ను కొడుతున్నట్లు వినవచ్చునని.. ఆయనను చంపేసి ముక్కలు చేసినట్లు ఈ రికార్డులు చెప్తున్నాయని ఒక సోర్స్ చెప్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో తెలిపింది.

‘‘అరబిక్‌లో మాట్లాడుతున్న ఆయన స్వరం, ఇతర పురుషుల గొంతులు వినొచ్చు. ఆయనను ఎలా ఇంటరాగేట్ చేశారో, ఎలా హింసించారో, ఎలా చంపారో వినొచ్చు’’ అని మరొక వ్యక్తి కూడా వాషింగ్టన్ పోస్ట్‌తో చెప్పారు.

జమాల్ స్మార్ట్ వాచ్ రికార్డు చేసిన ధ్వని రికార్డులను అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు టర్కీ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీబీసీకి దీనిని నిర్ధారించటం సాధ్యం కాలేదు.

ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ కార్యాలయంలోకి జమాల్ ఖషోగి ప్రవేశిస్తున్నప్పటి సీసీటీవీ దృశ్యాలను టర్కీ టీవీ ఒకటి ఇప్పటికే ప్రసారం చేసింది. జమాల్ త్వరలో టర్కీ మహిళ హటీస్ చెంగిజ్‌ను వివాహం చేసుకోనున్న నేపథ్యంలో, అందుకు అవసరమైన పత్రాలను తీసుకోవటం కోసం ఈ కాన్సులేట్‌కి వచ్చారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఖషోగీ అదృశ్యం కావడం వెనుక సౌదీ ఇంటలిజెన్స్ అధికారుల ప్రమేయం ఉందని సూచిస్తున్న చిత్రం

ఆ తర్వాత సౌదీ అంటెలిజెన్స్ అధికారులుగా అభివర్ణిస్తున్న కొందరు వ్యక్తులు టర్కీలోకి ప్రవేశిస్తున్న, దేశం నుంచి బయటకు వెళుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.

జమాల్ అదృశ్యంలో 15 మంది సభ్యుల బృందం ఉందని అభిజ్ఞవర్గాలు గుర్తించినట్లు టర్కీ మీడియా చెప్తోంది. వారిలో ఒకరు లండన్‌ నుంచి పనిచేస్తున్న మహర్ ముత్రెబ్ అనే ఇంటెలిజెన్స్ కల్నల్, మరొకరు ఫోరెన్సిక్స్ నిపుణుడని భావిస్తున్నట్లు బీబీసీకి చెప్పారు.

అయితే, సౌదీతో కలిసి సంయుక్త దర్యాప్తు జరపటానికి టర్కీ ప్రభుత్వం అంగీకరించింది. సౌదీ ప్రతినిధి బృందం టర్కీకి వచ్చింది.

ఈ దౌత్య సంక్షోభానికి సత్వర పరిష్కారం కనుగొనాలని సౌదీ రాచకుటుంబం కోరుకుంటోందన్న సంకేతాల మధ్య సౌదీ రాచరికానికి చెందిన సీనియర్ వ్యక్తి ప్రిన్స్ ఖాలెద్ అల్-ఫైజల్ టర్కీ వచ్చి వెళ్లారన్న వార్తల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)