ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ దగ్గర ఏం జరిగింది?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ దగ్గర ఏం జరిగింది?

  • 13 అక్టోబర్ 2018

సౌదీకి చెందిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగి.. టర్కీలోని సౌదీ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లినప్పటి నుంచీ ఆచూకీ లేకుండాపోయారు. ఈ విషయంలో సౌదీ అరేబియా సమాధానం చెప్పాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.

ఇదే విషయంపై 22 మంది సెనేటర్లు ట్రంప్ కు లేఖ కూడా రాశారు. అసలు గత వారం ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ దగ్గర ఏం జరిగింది? టర్కీ చేస్తోన్న ఆరోపణాలేంటి?

చివరిసారిగా, జమాల్ ఖషోగి తన వివాహానికి సంబంధించిన పత్రాలను తీసుకునేందుకు ఇస్తాంబుల్ లోని సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నపుడు కనిపించారు. కార్యాలయం లోపలే అతన్ని పట్టుకొని హత్య చేశారని టర్కీ వాదిస్తోంది.

అసలు కథ ఇస్తాంబుల్ విమానాశ్రయం దగ్గర ప్రారంభమైంది. ఒక ప్రైవేట్ జెట్ లో కొంతమంది సౌదీ అరేబియా పౌరులు అక్కడకు చేరుకున్నారు.

సెక్యూరిటీ చెక్ నుంచి వారు బయటకు వస్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి. వీరు సౌదీ నుంచి వచ్చిన హిట్ స్క్వాడ్ సభ్యులు అన్నది టర్కీ ఆరోపణ.

సౌదీ నుంచి వచ్చిన బృందంలోని సభ్యులు వీరే అని టర్కీ అధికారులు బీబీసీకి తెలిపారు.

ఈ వ్యక్తి సౌదీ ఇంటలిజెన్స్ లో పని చేస్తోన్న కల్నల్ అని, అతను లండన్ లోని సౌదీ ఎంబసీలో పని చేస్తాడని టర్కీ అధికారులు తెలిపారు. మరొక వ్యక్తిని ఫోరెన్సిక్ నిపుణుడిగా భావిస్తున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంట పద్నాలుగు నిమిషాలకు జమాల్ ఖషోగి కాన్సులేట్ భవనంలోకి వెళ్లడం కనిపించింది. అతన్ని పెళ్లి చేసుకోబోయే మహిళ బయటే ఉన్నారు.

కొద్దీ సేపటి తరువాత అంటే మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల ప్రాంతంలో కొన్ని వాహనాలు కాన్సులేట్ నుంచి బయటకు వెళ్లిపోయాయి. అవి 200 మీటర్ల దూరంలో ఉన్న సౌదీ కాన్సుల్ జనరల్ ఇంటికి చేరుకున్నాయి. ఈ అంశం మీదనే టర్కీ దర్యాప్తు జరుపుతోంది. ఆ వాహనాల్లో అసలు వాళ్లు ఏం పట్టుకెళ్లారు? అందులో జమాల్ ఖషోగి మృత దేహం ఉందా?

ఒక వ్యాన్ గరాజ్ లోకి ప్రవేశించడం అక్కడి కెమెరాలలో రికార్డ్ అయింది. సాయంత్రం ఐదున్నరకు కూడా జమాల్ ను పెళ్లి చేసుకోబోయే మహిళ అతని కోసం అక్కడే ఎదురుచూస్తున్నారు.

అయితే ఐదు నలభైకి సౌదీ నుంచి వచ్చిన వారు మళ్లీ తమ ప్రైవేట్ జెట్ లో తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయానికి చేరుకున్నారు. మరొక విమానంలో మరికొందరు బయలుదేరారు. ఈ రెండు విమానాలు కూడా రియాద్ కు పయనమయ్యాయి.

మరోవైపు సౌదీ యువరాజుతో ధృడమైన సంబంధాలు ఏర్పరచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీలోని అత్యున్నత ప్రభుత్వ వర్గాలతో ఈ విషయంపై చర్చించినట్టు తెలిపారు.

అయితే జమాల్ ఖషోగి స్నేహితుల్లో, ఇతర జర్నలిస్ట్ మిత్రుల్లో మాత్రం ఆశలు అడుగంటుతున్నాయి.

‘‘అతను చాలా మృదుస్వభావి. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. అతను ఎల్లప్పుడూ సౌదీ ప్రజలు ఎంత గొప్పవారో, సౌదీ ఎంత గొప్ప దేశమో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు” అని అబ్దుల్ రహమాన్ ఎల్ షయాల్ పేర్కొన్నారు.

కానీ అతని నమ్మకానికి గండి పడిందా? సౌదీ అరేబియా మాత్రం తమపై వస్తోన్న ఆరోపణలను ఖండిస్తూ జమాల్ ఖషోగి కోసం వెతుకుతున్నామని అంటోంది. అయితే టర్కీ మాత్రం సౌదీ అరేబియానే ఖషోగిని హతమార్చిందని ఆరోపిస్తోంది.

ఇంతకీ జమాల్ ఖషోగి ఎవరు? అతను ఎందుకంత ముఖ్యమైన వ్యక్తి?

ఆయన అల్-వతన్ అనే వార్తాపత్రికకు ఒకప్పటి ఎడిటర్. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను ఆయన ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. అయితే సౌదీ రాజకుటంబానికి ఖషోగికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకప్పుడు ఆయన సౌదీ సీనియర్ అధికారులకు సలహాదారుగా కూడా ఉండేవారు.

సౌదీ అరేబియా వ్యవహారాలపై గట్టి పట్టు ఉన్న ఖషోగి 2017 వేసవిలో అమెరికాకు వెళ్లారు. అసమ్మతి రాగాలు వినిపిస్తున్న వారి మీద మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేర జరుగుతోన్న అణిచివేత నుంచి బయటపడడం కోసం తన దేశం నుంచి తనను తానే వెలి వేసుకుంటున్నానని ప్రకటించారు.

అరబిక్ వార్తాపత్రిక అల్-హయత్ లో తన వ్యాసాలను ప్రచురించే పబ్లిషర్‌ను వాటిని నిలిపివేయాలని సౌదీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఖషోగి ఆరోపించారు. అంతే కాదు, తనని ఎటువంటి ట్వీట్లు కూడా చేయొద్దని చెప్పినట్టు ఆయన అన్నారు. అయితే, అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్‌కు అతను వ్యాసాలు రాయడం మాత్రం మానలేదు. అలాగే పశ్చిమ దేశాల మీడియాలోనూ ఆయన ఎన్నో సార్లు కనిపించారు.

గత సంవత్సరం నవంబర్‌లో బీబీసీలో ప్రసారమయ్యే హార్డ్ టాక్ కార్యక్రమంలో ఖషోగి ఇంటర్వ్యూ ప్రసారమైంది. తమ దేశంలో కొనసాగుతున్న ఏక వ్యక్తి పాలనపై ఆయన ఆందోళన వ్యక్తపర్చారు.

"నా పిల్లలు, మనవళ్లు మనవరాళ్ల గురించి నాకు బెంగగా ఉంది. అక్కడి ఏక వ్యక్తి పాలన ఆందోళన కలిగిస్తోంది. సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. ఏక వ్యక్తి పాలన అనేది ఏ దేశంలోనైనా పతనానికే దారితీస్తుంది. అది సౌదీ అరేబియా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇరాక్ కావచ్చు" అని ఆ ఇంటర్వ్యూలో ఖషోగి చెప్పారు.

మరోవైపు ఈ అంశంలో అమెరికా అధికారికంగా దర్యాప్తు చేపట్టే అవకాశముంది. అంతే కాదు, ఈ అంశంలో సౌదీపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)