భారత్‌: పదేళ్లలో రెట్టింపైన సిజేరియన్ జననాల శాతం

  • 15 అక్టోబర్ 2018
అప్పుడే పుట్టిన శిశువు Image copyright Getty Images

భారత్‌లో పదేళ్ల కాలంలో సిజేరియన్ జననాల శాతం రెట్టింపైంది. 2005-06లో ఈ జననాలు తొమ్మిది శాతంగా ఉండేవని, 2015-16 నాటికి ఇవి 18.5 శాతానికి పెరిగాయని ప్రముఖ వైద్య పత్రిక 'ద లాన్సెట్‌'లో ప్రచురితమైన అధ్యయనాన్ని ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

భారత్‌లో సిజేరియన్ శస్త్రచికిత్సలు అత్యధికంగా జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 169 దేశాల గణాంకాలను సేకరించి, విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా 2000వ సంవత్సరం నుంచి 15 ఏళ్లలో సిజేరియన్ జననాల శాతం దాదాపు రెట్టింపైందని ద లాన్సెట్‌ పేర్కొంది.

సిజేరియన్ జననాల సంఖ్య 2000వ సంవత్సరంలో సుమారు 1.6 కోట్లు కాగా, 2015 నాటికి ఈ సంఖ్య దాదాపు 2.97 కోట్లకు చేరింది. 2000లో మొత్తం జననాల్లో 12 శాతంగా ఉన్న ఈ జననాలు 2015 నాటికి 21 శాతానికి పెరిగాయి. కొన్ని దేశాల్లో సీ-సెక్షన్ జననాల శాతం 'ఆందోళనకర స్థాయి'కి చేరుకుంది.

Image copyright Getty Images

అనవసరంగా చేయకూడదు: డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచంలోకెల్లా అత్యధికంగా డొమినికన్ రిపబ్లిక్‌లో 58.1 శాతం సిజేరియన్ జననాలు నమోదవుతున్నాయి. డొమినికన్ రిపబ్లిక్‌తోపాటు బ్రెజిల్, ఈజిప్ట్, టర్కీ దేశాల్లో ఈ జననాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. సిజేరియన్ ప్రసవాల శాతాన్ని తగ్గించేందుకు బ్రెజిల్ 2015లో ఒక విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

చాలా సందర్భాల్లో అవసరం లేకున్నా 'సిజేరియన్' చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

సిజేరియన్ జననాలు 15 శాతం దాటితే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా చేస్తున్నట్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల చెప్పింది. ప్రాణాలను నిలబెట్టగల సిజేరియన్ శస్త్రచికిత్సను అవసరమైన సందర్భాల్లోనే చేయాలని తెలిపింది.

ఈ శస్త్రచికిత్సను ఎవరూ అనవసరంగా చేయకూడదని, తద్వారా దీనివల్ల తల్లీబిడ్డకు తలెత్తగల సమస్యలను నివారించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

సిజేరియన్ శస్త్రచికిత్సల విషయంలో పేద, ధనిక దేశాల మధ్య చాలా అంతరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో సిజేరియన్ శస్త్రచికిత్స తప్పనిసరైన పరిస్థితుల్లో కూడా జరగడం లేదు. సబ్-సహారన్ ప్రాంతాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

2015లో పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతంలో కేవలం నాలుగు శాతం కేసుల్లోనే ఈ శస్త్రచికిత్సలు చేయగా, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతంలో 44 శాతం కేసుల్లో ఇవి జరిగాయి. పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతంతో పోలిస్తే ఈ ప్రాంతంలో 10 రెట్లు ఎక్కువ సిజేరియన్ శస్త్రచికిత్సలు జరిగాయి.

వైద్య కారణాల దృష్ట్యా అవసరమైనప్పుడు మాత్రమే సిజేరియన్ శస్త్రచికిత్సకు మొగ్గు చూపాలని వైద్యులకు, మహిళలకు, కుటుంబాలకు ఈ అధ్యయనం సూచిస్తోంది. పిల్లల జననానికి సంబంధించి అవగాహన పెంచాల్సి ఉందని చెబుతోంది.

Image copyright Getty Images

ఇబ్బందులు ఏమిటి?

కొన్ని అత్యవసర పరిస్థితుల్లో సిజేరియన్ శస్త్రచికిత్స తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడొచ్చు. ఉదాహరణకు ప్రసవం జరగాల్సిన విధంగా జరగకపోయినా, గర్భంలో శిశువు సరైన దిశలో లేకపోయినా ఈ శస్త్రచికిత్సను ఎంచుకోవచ్చు.

సిజేరియన్ శస్త్రచికిత్సతో తల్లీబిడ్డ ఇద్దరికీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తవచ్చని కింగ్స్ కాలేజ్ లండన్‌లో సామాజిక శాస్త్రాలు, మహిళల ఆరోగ్యం విభాగ ప్రొఫెసర్ జేన్ శాండల్ చెప్పారు. అధ్యయనం జరిపిన పరిశోధకుల్లో ఆమె ఒకరు.

''సిజేరియన్ శస్త్రచికిత్సలో గర్భాశయానికి కోత పెడతారు. దీనివల్ల లోపల మచ్చ ఏర్పడుతుంది. దీని కారణంగా, మళ్లీ గర్భం దాల్చినపుడు రక్తస్రావం జరగడం, మాయ సరిగా ఏర్పడకపోవడం, అండవాహికల్లో పిండం ఏర్పడటం, శిశువు గర్భంలోనే చనిపోవడం లేదా నెలలు నిండక ముందే జన్మించడం లాంటి సమస్యలు రావొచ్చు'' అని శాండల్ చెప్పారు.

ఈ ముప్పులు చిన్నవే కావొచ్చుగానీ తీవ్రమైనవని ఆమె తెలిపారు. ఈ శస్త్రచికిత్స చేయించుకొన్న ప్రతిసారి ఈ ముప్పు తీవ్రత పెరుగుతూ పోతుందని వివరించారు.

''సిజేరియన్ శస్త్రచికిత్సతో పుట్టే శిశువుల రోగ నిరోధక శక్తి వృద్ధిలో మార్పులు ఉండొచ్చు. దీనివల్ల శిశువులకు అలర్జీలు, ఆస్తమా ముప్పు పెరగొచ్చు. పేగుల్లో బ్యాక్టీరియాలో మార్పులు రావొచ్చు. ఇవి స్వల్పకాలిక సమస్యలు. దీర్ఘకాలిక సమస్యలపై లోతైన అధ్యయనం ఇంకా జరగలేదు'' అని ఆమె తెలిపారు.

సహజ కాన్పుతో పోలిస్తే, సిజేరియన్ కాన్పులు ఎక్కువగా జరిగినప్పుడు తర్వాతి కాన్పులో తల్లి ప్రాణాలకు ముప్పు ఎక్కువగా ఉంటుందని శాండల్ చెప్పారు.

Image copyright KATIE HORWICH / BBC

ఎందుకు చేస్తున్నారు?

అవసరంలేని సందర్భాల్లోనూ సీ-సెక్షన్ చేయడానికి వేర్వేరు దేశాల్లో వేర్వేరు కారణాలు ఉన్నాయని శాండల్ తెలిపారు.

''గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ఎలాంటి సమస్యా తలెత్తకుండా చూడటం, సమస్య ఏర్పడితే సకాలంలో గుర్తించడం అవసరం. దీనికి తగిన సిబ్బంది లేకపోవడం, ఏవైనా సమస్యలు తలెత్తినా సహజ కాన్పును సాఫీగా చేయగలమన్న నమ్మకం వైద్యులకు లేకపోవడం, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యుల ఆర్థిక ప్రయోజనాలు, మెడికో-లీగల్ అంశాలు, ఇతర కారణాల వల్ల ఈ శస్త్రచికిత్సలు అవసరంలేని సందర్భాల్లోనూ చేస్తున్నారు'' అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు