భారతదేశ 'తొలి' కమ్యూనిటీ రేడియో దశాబ్ది వేడుక... ఇది తెలంగాణ దళిత మహిళల విజయ గీతిక

  • 15 అక్టోబర్ 2018
రేడియో స్టేషన్ నిర్వహణలో 'జనరల్’ నరసమ్మ
చిత్రం శీర్షిక రేడియో స్టేషన్ నిర్వహణలో 'జనరల్’ నరసమ్మ

పెద్దగా చదువురాని కొందరు గ్రామీణ దళిత మహిళలు కలిసి పదేళ్లపాటు ఒక రేడియోను నడిపించడం సాధ్యమేనా? సాధ్యమేనని నిరూపించి చూపించారు వారు.

భారతదేశంలోనే మొదటి కమ్యూనిటీ రేడియోగా చెప్తున్న సంగం రేడియోకు అక్టోబరు 15తో పదేళ్ళు. ఒకవైపు దశాబ్ది ఉత్సవాలు, మరో వైపు వెంటాడే సమస్యలు. ట్రాన్స్మిటర్ ఏర్పాటులో ఇబ్బందులు, ట్రాన్స్‌ఫార్మర్ కొనుగోలుకు నిధుల కొరత వంటి కష్టాలతో ఈ రేడియో ఎలా తన గొంతును నిరాటంకంగా వినిపిస్తోందో తెలుసుకుందామా?

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionదేశంలోనే 'తొలి' కమ్యూనిటీ రేడియోకు నేటితో పదేళ్లు

ఎలా మొదలైంది?

తెలంగాణలోని జహీరాబాద్ చుట్టుపక్కల పల్లెల్లో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) కొన్ని దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. దళిత మహిళల అభ్యున్నతి, సంప్రదాయ వ్యవసాయం, తృణ ధ్యాన్యాలపై ఇది కృషి చేసింది. అదే క్రమంలో ఈ మహిళలకు తమదైన మాధ్యమం అవసరం పడింది. ''ప్రధాన స్రవంతి టీవీ, రేడియోలు వీరికి అనువైన సమయంలో ప్రసారాలు చేయవు, వీరిదైన భాష, యాస అందులో ఉండవు, సమస్యలు, మంచిచెడులను అవి పట్టించుకోవు, అందువల్ల వీరికి స్థానిక మీడియా ఉండాలి'' అనుకుంది ఆ సంస్థ.

చిత్రం శీర్షిక రేడియో స్టేషన్

అదే సమయంలో, ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) 'లెర్నింగ్ వితౌట్ ఫ్రంటియర్స్' అనే కార్యక్రమం ప్రారంభించింది. గ్రామీణ నిరక్షరాస్యులు, పట్టణ అక్షరాస్యుల మధ్య సరిహద్దులు చెరిపేయాలన్నది ఆ కార్యక్రమం ఉద్దేశం.

"నేర్చుకోవడమనేది రెండు వైపులా ఉండాలి. విద్యావంతులు కూడా గ్రామీణ నిరక్షరాస్యుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని యునెస్కోకు చెప్పాం. వారు ఒప్పుకున్నారు. మా కమ్యూనిటీ రేడియోకి మద్దతిచ్చారు. భవనం, ట్రాన్స్మిటర్ ఇచ్చారు" అంటూ కమ్యూనిటీ రేడియో ఎలా మొదలైందో వివరించారు డీడీఎస్ వ్యవస్థాపకుడు సతీశ్.

ఈ రేడియోకి మొదట్లో బ్రాడ్‌కాస్టింగ్ అనుమతి దొరకలేదు. క్యాసెట్లలో రికార్డు చేసి పల్లెల్లో నలుగురున్న చోట వినిపించేవారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. కానీ విదేశీ నిధులు తీసుకోకూడదు, కమ్యూనిటీలు ఇచ్చే నిధులతోనే నడిపించాలనే షరతు పెట్టింది. 2008 అక్టోబర్ 15న ఈ రేడియో ప్రారంభమైంది.

చిత్రం శీర్షిక స్టూడియోలో పాటల రికార్డింగ్

ఎవరు నడిపిస్తారు?

ఈ రేడియోలో పనిచేసే వారంతా గ్రామీణ దళిత మహిళలే. వారు పెద్దగా చదువుకోలేదు. రేడియో నిర్వహణకు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలను మాత్రం నేర్చుకున్నారు. రిపోర్టర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియోలో మోడరేషన్, ఎడిటింగ్, ట్రాన్స్మిషన్.. అన్నీ వీళ్లే చేస్తారు.

మొదటి ఐదేళ్లు ఒక ప్రొఫెషనల్ ఈ రేడియోను నడిపించారు. ఆమె వెళ్లిపోయాక, పూర్తి బాధ్యతలు ఈ మహిళలే తీసుకున్నారు. రోజూవారీ పనులతోపాటు చిన్న చిన్న రిపేర్లు చేయగలరు వీరు.

"నన్ను రేడియోలో పనిచేయమంటే చేయను అన్నాను. 'ఇది చాలా సన్నం పని (సున్నితమైన పని). ఏ బటన్ నొక్కితే ఏమవుతుందో, అది పాడైతే నాకు తిప్పలు, వద్దు' అన్నా. చివరకు రిపోర్టింగ్ చేయడానికి ఒప్పుకున్నాను. అప్పట్లో స్టూడియో చూసుకునే ఆమె మానేసిన తర్వాత ఆ పని కూడా మేమే చేయడం మొదలుపెట్టాం. మొదట్లో క్యాసెట్లు రికార్డు చేసుకొచ్చేవాళ్లం. కంప్యూటర్ వచ్చాక ఎడిటింగ్ బాగా సులువు అయింది. విజయేంద్ర పాటిల్ అనే ఆయన ఎడిటింగ్, కంప్యూటర్ నేర్పారు. ఇప్పుడు నేను ఫీల్డు రికార్డింగు, స్టూడియో రికార్డింగు, ఎడిటింగ్, ప్రోగ్రామ్, బ్రాడ్‌కాస్టింగ్ చేయగలుగుతా" అని చెప్పారు 'జనరల్' నరసమ్మ.

సంగం రేడియో పెట్టినప్పటి నుంచి ఈమె ఇందులో చురుగ్గా ఉన్నారు.

చిత్రం శీర్షిక స్టూడియోలో చర్చా కార్యక్రమంలో మహిళలు

ఏం ప్రసారమవుతాయి?

రోజుకు రెండు గంటలపాటు రాత్రి 7 నుంచి 9 వరకు ఈ రేడియో ప్రసారాలు ఉంటాయి. అంతా స్థానిక యాసలోనే. ఇందులో స్థానిక అంశాలపై స్టూడియో డిస్కషన్లు, ఫీల్డు నుంచి తీసుకొచ్చిన రిపోర్టులు, కొంత మంది నిపుణులు చెప్పే సలహాలతోపాటు జానపద పాటలు కూడా ఉంటాయి.

వారానికోసారి వివిధ గ్రామాల్లో ఉండే సంగం రేడియో రిపోర్టర్లు ఏ కార్యక్రమాలు చేయాలనేది సమావేశం పెట్టుకుని చర్చిస్తారు.

'ఒక్క సినిమా పాట వేయలేదు'

"మేం ఇప్పటివరకు ఒక్క సినిమా పాట కూడా వేయలేదు. అన్నీ ఊరి పాటలే. మనిషి పుట్టినప్పటి నుంచీ చనిపోయే వరకూ ప్రతీ సందర్భానికి సంబంధించిన పాటలూ ఉంటాయి. రేల పాటలు, చేల పాటలు, దంచుడు పాటలు, ఇసిరే పాటలు, పెళ్లి దగ్గర పాటలు, శోభనం పాటలు, పెద్ద మనిషి పాటలు అన్ని పాటలూ ప్రసారం చేస్తాం. కొందరు పెద్దవాళ్లు చనిపోతే వాళ్ల వారసులు వచ్చి, వారి గొంతు వినాలని ఉంది, పాటలు వేయమంటారు. మేం చెట్ల మందు గురించి చెబుతాం. డీడీఎస్ ఇచ్చే విత్తనాలు, చెట్ల మందుల గురించి వచ్చే వారు ఎక్కువ. వ్యవసాయ సమస్యల గురించి చెబితే ఒకసారి శాస్త్రవేత్తలు వచ్చి సమస్యను పరిష్కరించి వెళ్లారు. ఇక ఆడవాళ్లు గైనిక్ సమస్యల గురించి ఎవరికీ చెప్పుకోలేరు. అలాంటివారు రేడియో ప్రసారాలు అయిపోయాక మా నంబరుకు కాల్ చేసి 'నాకు సమస్య ఉంది, ఎవరికీ తెలియకుండా మందు ఇస్తారా' అని అడుగుతారు" అంటూ ప్రసారాల గురించి వివరించారు నరసమ్మ.

చిత్రం శీర్షిక ఫీల్డ్ రిపోర్టింగ్

పాటలే కాదు, స్థానికుల బతుకు చిత్రానికి సంబంధించిన ఎన్నో సమస్యలపై వారు చర్చిస్తారు. బీబీసీ బృందం ఈ రేడియో స్టూడియోను సందర్శించిన రోజు ఆసక్తికర చర్చ జరిగింది. నాలుగు దశాబ్దాల క్రితం సరైన, తిండి బట్ట లేకుండా బతికిన ఈ ప్రాంత దళితులకు డీడీఎస్ భూమి ఇప్పించడం, ఆ భూమి తీసుకోవడానికి దళితులు పడ్డ ఇబ్బందులు, అగ్రకులాలవారమని చెప్పుకొనేవారి ప్రవర్తన, ఇప్పుడు ఆ భూమితో దళితులు ఎదిగిన తీరు లాంటి అంశాలను చర్చించారు.

ట్రాన్స్మిటర్ ఏర్పాటులో జాప్యం

కమ్యూనిటీ రేడియో నిర్వహణకు పెద్ద సమస్య నిధులు. సంగం రేడియోను ఏడాదికి 50 రూపాయల చొప్పున స్థానికులు చందా ఇచ్చి నిర్వహిస్తున్నారు. గతంలో యూనిసెఫ్ సాయంతో తీసుకున్న ట్రాన్స్మిటర్ పాడైంది. దీంతో 30 కిలోమీటర్ల పరిధిలో వినిపించే ప్రసారాలు కాస్తా ఇప్పుడు ఐదు కి.మీ. పరిధికి తగ్గిపోయాయని నిర్వాహకులు విచారం వ్యక్తంచేశారు. కొత్త ట్రాన్స్మిటర్ ఏర్పాటు ఒక సమస్య.

మిగిలిన గ్రామానికి కరెంటు అందే లైన్ నుంచే ఈ రేడియో స్టేషన్ నడుస్తోంది. సొంతంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోకపోతే ఓల్టేజీ మార్పుల వల్ల తరచూ వైర్లు కాలిపోయే సమస్యలు వస్తున్నాయి.

చిత్రం శీర్షిక క్షేత్రస్థాయి నుంచి రిపోర్టింగ్

"ఈ రేడియో ఒక సిద్ధాంతం మీద నడుస్తోంది. మేం డీడీఎస్ స్ఫూర్తికి వ్యతిరేకంగా పల్లె మూలాలకు, తరతరాలుగా వస్తున్న సేద్య పద్ధతులకు వ్యతిరేకంగా ఉన్న ప్రకటనలు కూడా తీసుకోం" అంటూ చెప్పుకొచ్చారు నరసమ్మ.

ఈ మధ్య చాలా మంది ఫోన్ చేసి, ''ఏమైంది రేడియో మూసేసారా? మాకు వినపడడం లేదు'' అని అంటున్నారని ఆమె తెలిపారు.

''ట్రాన్స్మిటర్ సరిగా లేకపోతే రేడియో సరిగా విపడదు. మరో సమస్య పాత ట్రాన్స్మిటర్ స్థానంలో కొత్తది పెట్టుకోవడానికి అనుమతి తెచ్చుకోవడం. దీని కోసం అధికారులు నెలల సమయం తీసుకుంటున్నారు" అంటూ ఆక్షేపించారు నరసమ్మ.

చిత్రం శీర్షిక సతీశ్

'ప్రభుత్వం నుంచి ప్రకటనల సొమ్ము రాలేదు'

భారత ప్రభుత్వం ఈ రేడియోలకు ప్రకటనలు ఇస్తుంది. అయితే ప్రకటనల సొమ్ము విడుదల చేయడం లేదని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.

"కమ్యూనిటీ రేడియోలు విదేశీ సాయం తీసుకోకూడదనీ, మేమే మద్దతిస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. కానీ మాకు రూ.3.5 లక్షల ప్రకటనల సొమ్ము ఆపేశారు. ఆ బాకీ గురించి ఒత్తిడి చేస్తే మమ్మల్ని ఇబ్బందిపెడతారని భయం వేస్తోంది. ప్రపంచ కమ్యూనిటీ రేడియోల సంఘం అమార్క్ సంస్థ సాయం కూడా తీసుకోలేకపోతున్నాం. ఈ చుట్టుపక్కల ప్రజల ఆదాయం తక్కువ. అయినా వారి తాహతుకు తగిన డబ్బు ఇస్తున్నారు. జహీరాబాద్ పెద్ద నగరం కాదు. కాబట్టి అక్కడి వ్యాపారులు మాకు ప్రకటనలు ఇవ్వలేరు. ట్రాన్స్మిటర్‌కు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు కావాలి. ఈ పరిస్థితుల్లో క్రౌడ్ ఫండింగ్‌కు వెళ్తే కొన్ని పైసలొచ్చాయి. బయటపడగలుగుతాం. కానీ పరిస్థితి ఇలానే ఉంటే ఎలా కొనసాగాలి? భవిష్యత్తు ఎలా అనేది సమస్య" అన్నారు డీడీఎస్ వ్యవస్థాపకుడు సతీశ్.

ఇన్ని అవాంతరాల మధ్యే ఈ రేడియో తన ప్రస్థానంలో ఒక దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. డీడీఎస్ సంస్థ ఆలోచనతోపాటు స్థానిక దళిత మహిళల పట్టుదల, అంకితభావం ఈ రేడియోను ముందుకు తీసుకెళ్తున్నాయి.

సంగం రేడియో దశాబ్ది వేడుకలు సోమవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం మచునూరు గ్రామంలో జరుగుతున్నాయి.

''మా మందిలో ఎన్నో రకాల తెలివితేటలున్నాయి. ఎన్నో రకాల పాటలున్నాయి. భాష, యాస ఉన్నాయి. పంటలు, వ్యవసాయం, చెట్ల మందుల గురించి అవగాహన ఉంది. ఇలాంటి రేడియో స్టేషన్లు ఉంటేనే కదా వీటన్నింటి గురించి కొత్త తరానికి తెలిసేది. తరం మారే కొద్దీ వెనక్కు ఏం జరిగింది అనేది తెలియదు. కాబట్టి ఇలాంటి రేడియో స్టేషన్లకు ప్రభుత్వం సాయం చేస్తే కనీసం ఇవి ముందుకు నడవగలుగుతాయి'' అంటూ సంఘం రేడియో ఆవశ్యకత గురించి చెప్పారు నరసమ్మ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)