పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి

  • జఫర్ సయ్యద్
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

అయూబ్ ఖాన్ ఆత్మకత 'ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్' ఉర్దూ అనువాదం

జనరల్ అయూబ్ ఖాన్ ఆత్మకథ 'ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్' అనే పుస్తకం పాకిస్తాన్ చరిత్రలోని ఎన్నో కీలక సందర్భాలకు సాక్షిగా నిలుస్తుంది. ఆ ఆత్మకథలో ఆయన వాక్య ప్రవాహం ఇలా సాగింది:

"నేను అక్టోబర్ 5 న కరాచీ చేరుకున్నాను, నేరుగా జనరల్ సికిందర్ మీర్జాను కలవడానికి వెళ్లాను. ఆయన లాన్లో కూచుని ఉన్నారు. కష్టంగా, దిగులుగా కనిపిస్తున్నారు. నేను ఆయనతో 'మీరు బాగా ఆలోచించుకున్నారా?' అని అడిగాను"

"అవును"

"ఇది తప్ప వేరే దారి లేదా?"

"లేదు, ఇది తప్ప వేరే దారి లేదు"

కఠిన నిర్ణయం తీసుకునేలా పరిస్థితులు అక్కడి వరకూ చేరుకోవడం నాకు చాలా బాధగా అనిపించింది. కానీ అది అనివార్యం. దేశాన్ని రక్షించుకోడానికి నా ఆఖరి ప్రయత్నం.

ఆ సంభాషణ జరిగిన రెండు రోజుల తర్వాత అక్టోబర్ 7న సాయంత్రం పాకిస్తాన్ తొలి అధ్యక్షుడు ఇస్కందర్ మిర్జా రాజ్యాంగాన్ని రద్దు చేశారు. అసెంబ్లీని భంగం చేశారు. రాజకీయ పార్టీలను నియంత్రిస్తూ పాకిస్తాన్ చరిత్రలో మొదటి మార్షల్ లా అమలు చేశారు. అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్‌ను మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు.

అది మొదటి ప్రయత్నం. అందుకే మార్షల్ లా గురించి రేడియోలో (టీవీలు అప్పటికి రాలేదు) "నా ప్రియమైన దేశవాసులారా" లాంటి ప్రసంగాలేవీ ఇవ్వలేదు.

దానిని టైప్ రైటర్‌పై టైప్ చేశారు, రాత్రి పదిన్నర గంటలకు సైక్లోస్టైల్ చేసి వార్తాపత్రికల ఆఫీసులకు, రాయబార కార్యాలయాలకు పంపించారు.

రేడియో పాకిస్తాన్, టెలిగ్రాఫ్ భవనాలను అవసరమైనప్పుడు ఉపయోగించడానికి సైనిక దళాలు చుట్టుముట్టాయి. వాటిని తమ అదుపులోకి తీసుకున్నాయి.

60 ఏళ్లైనా పాకిస్తాన్‌లో ఆ చీకటి రాత్రి చాయలు ఇప్పటికీ ఉన్నాయి. చాలా మంది విశ్లేషకులు దానిని అనివార్య నిర్ణయం అంటారు.

ఫొటో క్యాప్షన్,

ఇస్కందర్ మీర్జా

చంద్రుడి నుంచి ఎవరూ రారు

అప్పుడు ఇస్కందర్ మిర్జా రాసిన మార్షల్ లా సైక్లోస్టైల్ కాపీలను తర్వాత తరాలు మళ్లీ మళ్లీ పంచుకుంటూనే వచ్చాయి. ఎన్నో ఏళ్ల పాటు పాత్రలు మారినా, పాత కథ మాత్రం కొనసాగింది.

ఉదాహరణకు ఆ రాత్రి ఇస్కందర్ మీర్జా పంపిన ఆ కాపీలో ఏం రాసుందో చూద్దాం.

నేను గత రెండేళ్లుగా దేశంలో చాలా తీవ్రమైన పరిస్థితులు చూస్తున్నాను. అధికారం కోసం అందరూ తీవ్రంగా కొట్టుకుంటున్నారు. సామాన్యులను, నిజాయితీపరులను దోపిడీ చేస్తున్నారు. రాజకీయ కారణాల కోసం ఇస్లాం పేరును వాడుకుంటున్నారు.

రాజకీయ పార్టీలు ఎన్నికలతో అరాచకాలు సృష్టిస్తున్నాయి. ఇలాంటి వారే రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చి పాకిస్తాన్‌ను నాశనం చేశారు. మనకు మన ముందున్న సమస్యలను పరిష్కరించేలా కొత్త ప్రభుత్వం కావాలి. దానిని మనమే ఏర్పాటు చేసుకోవాలి. మనకోసం చంద్రుడి పైనుంచి కొత్తవారెవరూ రారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంను అపహాస్యం చేస్తున్నాయి.

తర్వాత మార్షల్ లా అమలు చేసిన వారు కూడా ఇదే స్క్రిప్టును మార్చి మార్చి ఉపయోగిస్తూ వచ్చారు.

ఫొటో క్యాప్షన్,

పాక్ మూడో ప్రధాన మంత్రి అలీ బుర్గా

అంతరిక్షంలోకి ప్రజాస్వామ్యం

ఇస్కందర్ మీర్జా ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది అన్నారు. కానీ అది నిజానికి మార్షల్ లా అమలైనప్పుడే అది నవ్వులపాలైంది. తర్వాత మూడు నెలలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అప్పటి ప్రధాని మలిక్ ఫిరోజ్ ఖాన్ నేతృత్వంలోని కూటమి గెలుస్తుందనుకున్నారు. ఆ పార్టీ నేతలు మరోసారి ఇస్కందర్ మీర్జాను దేశాధ్యక్షుడుగా చేయరేమోనని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

'మనల్ని ఆదుకోడానికి చంద్రుడిపై నుంచి ఎవరూరారన్న' ఇస్కందర్ మీర్జా చివరకు ప్రజాస్వామ్యాన్నే అంతరిక్షంలోకి చేర్చాలనుకున్నారు.

బయటి వారు కూడా అదే విషయం గుర్తించారు. మార్షల్ లా అమలుకు కాసేపటి ముందు బ్రిటన్ హై కమిషనర్ తన ప్రభుత్వానికి రహస్యంగా పంపిన సమాచారంలో పాకిస్తాన్ ఎన్నికల్లో గెలిచే ప్రభుత్వంలో తనకు నచ్చని వారు ఉంటే దాన్ని విరోధిస్తానని ఆ దేశాధ్యక్షుడు తనకు చెప్పినట్టు రాశారు.

ఇస్కందర్ మిర్జాకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే ఎంత శ్రద్ధ ఉందో ఆయన సెక్రటరీ కుదరతుల్లా సాహాబ్ మాటల్లో తెలుస్తుంది.

సాహాబ్ తన ఆత్మకథ 'సాహాబ్‌నామా'లో "1958 సెప్టంబర్ 22న పాకిస్తాన్ రాష్ట్రపతి ఇస్కందర్ మిర్జా నన్ను పిలిచారు. ఆయన చేతుల్లో పాకిస్తాన్ రాజ్యాంగం కాపీ ఉంది. ఆయన ఆ పుస్తకం వైపు చూపిస్తూ, 'నువ్వు ఈ చెత్తను చదివావా' అన్నారు" అని చెప్పారు.

"రాజ్యాంగంపై ప్రమాణం చేసి పాకిస్తాన్ అధ్యక్ష పదవిలో కూర్చున్న ఇస్కందర్ మీర్జా, దాని గురించి చెప్పడానికి 'ట్రాష్' అనే మాట ఉపయోగించారు. నేను షాక్ అయ్యాను" అని రాశారు.

ఫొటో క్యాప్షన్,

ఇస్మాయిల్ ఇబ్రహీమ్ చంద్రగీర్‌తో ఇస్కందర్ మీర్జా(ఎడమ) కరచాలనం

అనుమానమే ఆయుధం

ఇస్కందర్ మీర్జా చెత్తగా వర్ణించిన పాక్ రాజ్యాంగం 1956 మార్చి 23న అమలైంది. దానిని పాకిస్తాన్ పార్లమెంటులో ఆయన నేతృత్వంలోనే రూపొందించారు. ఆ రాజ్యాంగం ప్రకారం గ్రేట్ బ్రిటన్ డొమినియన్ నుంచి బయటపడిన పాకిస్తాన్ ఒక స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది. అదే రాజ్యాంగం పాకిస్తాన్‌ను ఇస్లాం ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించింది.

కానీ అందులో ప్రధాన మంత్రి కంటే అధ్యక్షుడి హోదా ఎక్కువని రాశారు. దానిలోని 58 (2బి)లో అధ్యక్షుడు ప్రధానమంత్రిని ఎప్పుడైనా తొలగించవచ్చని కూడా రాశారు.

ఇస్కందర్ మిర్జా అనుమానం అనే ఆయుధం ముందు 58 (2బి) అనేది ఒక చిన్న కత్తిలా మారింది.

ఏ ప్రధానిపై సందేహం వచ్చినా ఆయన వారిని తొలగించేవారు. అలా ఐదుగురు ప్రధానులను పదవి నుంచి తొలగించారు. వారిలో...

  • మహమ్మద్ అలీ బోగరా - 1955లో ఆగస్టులో రాజ్యాంగం అమలు కాక ముందే రాజీనామా ఇచ్చారు.
  • చౌధరి మహమ్మద్ అలీ-1955 ఆగస్టు నుంచి 1956 ఆగస్టు వరకూ ఉన్నారు.
  • హుసేన్ షహీద్ సుహ్రావర్దీ-1956 అక్టోబర్ నుంచి 1957 సెప్టెంబర్ వరకూ ఉన్నారు.
  • ఇబ్రహీమ్ ఇస్మాయిల్ చంద్రీగర్-1957 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ఉన్నారు.
  • ఫిరోజ్ ఖాన్ నూన్- 1957 డిసెంబర్ నుంచి 1958 అక్టోబర్ వరకు ఉన్నారు.
ఫొటో క్యాప్షన్,

1961లో కరాచీ విమానాశ్రయంలో బ్రిటన్ మహారాణికి స్వాగతం పలుకుతూ

ఇస్కందర్ మీర్జా కుట్రలు

పాకిస్తాన్ ప్రధాన మంత్రి పదవి మ్యూజికల్ చెయిర్ ఆటలా మారడం గురించి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా అప్పట్లో జోకులు వేసేవారని చెబుతారు. "పాకిస్తాన్‌లో ప్రధాన మంత్రులు మారినంత వేగంగా, నేను నా పంచెలు కూడా మార్చుకోనేమో" అన్నారంటారు.

ఇస్కందర్ మీర్జా దారుణమైన కుట్రలకు ఉదాహరణలు ఆయన సెక్రటరీ 'సాహాబ్‌నామా' పేజీల్లో కనిపించాయి.

"ఇస్కందర్ మీర్జా గవర్నర్ జనరల్ అయిన మూడు నెలల తర్వాత సాయంత్రం నాకు సుహ్రావర్దీ ఫోన్ చేశారు. ప్రధాన మంత్రిగా నేను ప్రమాణం చేయడానికి ఏ రోజును నిర్ణయించారు అని అడిగారు"

"నేను నాకు తెలీదు అన్నాను. నువ్వసలు సెక్రటరీవేనా అని నన్ను తిట్టారు. వెంటనే గవర్నర్ జనరల్ దగ్గరకు వెళ్లి తేదీ గురించి అడిగి నాకు చెప్పు అన్నారు".

"తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్కందర్ మీర్జా దగ్గరికి వెళ్లాను. ఆయన కొంతమంది ఫ్రెండ్స్‌తో పేకాడుతున్నారు. నేను ఆయన్ను బయటికి తీసుకెళ్లి సుహ్రావర్దీ అడిగిన విషయాన్ని చెప్పాను. దానికి ఆయన గట్టిగా నవ్వారు.

"నా తరఫున నువ్వు సుహ్రావర్దీకి ఒక మాట చప్పు. ప్రమాణస్వీకారం తేదీని ఎల్లుండి నిర్ణయించాం. చౌధరీ మహమ్మద్ అలీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు" అన్నారు.

అది సుహ్రావర్దీకి చెప్పగానే, ఆయన 'సరే మళ్లీ అదే కుట్రా' అన్నారు.

కానీ అది కొనసాగుతూ వచ్చింది. తన కుట్రలకు చివరకు ఆయనే మూల్యం చెల్లించుకున్నారు. ఇస్కందర్ మిర్జా తన జూనియర్ అధికారి అయూబ్ ఖాన్‌ను ఆర్మీ చీఫ్ చేయడమే కాదు, మార్షల్ లా అమలుకు ముందు ఆయన పదవీకాలం మరో రెండేళ్లు పొడిగించారు.

అదే అయూబ్ ఖాన్ మార్షల్ లా విధించిన 20 రోజుల్లోనే ఇస్కందర్ మిర్జాను పడవలో ఎక్కించి, అంతరిక్షంలోకి కాదు, మొదట క్వెట్టాకు, తర్వాత బ్రిటన్ పంపించివేశారు.

ఈ స్క్రిప్ట్ పాకిస్తాన్‌లో ఎంత కాలం చేతులు మారిందంటే, అది బాగా పాతబడి చివరకు చీకి, చినిగిపోయింది. మార్షల్ లా ఎవరు అమలు చేస్తే అది చివరకు ఆ ఆర్మీ చీఫ్‌నే మింగేస్తుంది.

ఫొటో క్యాప్షన్,

ప్లాసీ యుద్ధం సమయంలో రాబర్ట్ క్లైవ్‌తో ఇస్కందర్ మీర్జా ముత్తాత మీర్ జాఫర్

అసలు ఇస్కందర్ మిర్జా ఎవరు?

దానికి ముందు మీర్ జాఫర్ గురించి చెప్పాలి. 1757లో ప్లాసీ యుద్ధంలో బెంగాల్‌ను పాలిస్తున్న సిరాజుద్దౌలా ఆంగ్లేయుల చేతిలో ఓటమి పొందడంలో మీర్ జాఫర్ కీలక పాత్ర పోషించారు. ఆ మీర్ జాఫర్ ముని మనవడే ఈ ఇస్కందర్ మీర్జా.

ఇదే ఇస్కందర్ మీర్జా కొడుకు హుమయూ మీర్జా 'ఫ్రం ప్లాసీ టు పాకిస్తాన్' అనే ఒక పుస్తకం రాశారు. అందులో సంచలనం కలిగించే చాలా విషయాలు చెప్పారు.

రచయిత హుమయూ మీర్జా సిరాజుద్దౌలాను దుష్టుడుగా, క్రూరుడుగా వర్ణించారు. లార్డ్ క్లైవ్ చేతుల్లో ఓటమికి స్వయంగా ఆయనే బాధ్యుడని చెప్పారు. సిరాజుద్దౌలాను ఎవరు సింహాసనం ఎక్కించారో (ఆయన దృష్టిలో తన పూర్వీకులు మీర్ జాఫర్) వారికే ఆయన ద్రోహం చేశారని ఆరోపించారు.

తర్వాత ఆయన సుమారు 200 సంవత్సరాల తర్వాత బెంగాల్ చరిత్ర కరాచీలో పునరావృతమైంది. మీర్ జాఫర్ ముని మనవడైన ఇస్కందర్ మీర్జా నెత్తికెక్కించుకున్న అయూబ్ ఖాన్‌ ఆయననే అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దేశం బయటకు పంపించివేశారు.

బ్రిటన్‌ ఇంపీరియల్ మిలిటరీ కాలేజ్ నుంచి శిక్షణ పొందిన భారత ఉపఖండంలోని ఒకే ఒక సైనిక అధికారి ఇస్కందర్ మీర్జా. కానీ పాకిస్తాన్లో ఆయన సివిల్ లైన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రాంతంలో పొలిటికల్ అధికారిగా చేరారు.

ఫొటో క్యాప్షన్,

పాకిస్తాన్‌లో ట్రక్కుల వెనుక అయూబ్ ఖాన్ చిత్రం

పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత లియాకత్ అలీ ఖాన్ ఆయన్ను దేశ రక్షణ మంత్రిగా చేశారు. గవర్నర్ జనరల్ గులామ్ మహమ్మద్ ఆరోగ్యం పాడవడంతో రాజీనామా చేశారు. దాంతో ఇస్కందర్ మీర్జా ఆయన స్థానంలో గవర్నర్ జనరల్ అయ్యారు. ఆ తర్వాత జరిగిందంతా పాకిస్తాన్ చరిత్రలో ఒక భాగంగా మారిపోయింది.

అక్టోబర్ 7న మార్షల్ లా అమలు చేసిన ఇస్కందర్ మీర్జా, తర్వాత రాజ్యాంగం, అసెంబ్లీని రద్దు చేసే తొందర్లో కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారు.

ఇస్కందర్ మీర్జా అక్టోబర్ 7-అక్టోబర్ 27 మధ్య 20 రోజులు బిజీగా ఉన్నారు. మొదట సైన్యంలో అయూబ్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారిని తొలగించడంతోనే సరిపోయింది. అది కుదరకపోవడంతో చివరకు అక్టోబర్ 24న అయూబ్ ఖాన్‌ను చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేషటర్ పదవి నుంచి తొలగించి ప్రధానమంత్రిగా చేశారు.

కానీ అయూబ్ ఖాన్‌కు ఇస్కందర్ మీర్జా కుట్రల గురించి సమాచారం అందుతూ ఉండేది. దాని గురించి ఆయన తన 'ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్' లో రాశారు.

ఫొటో క్యాప్షన్,

అమెరికా ప్రథమ మహిళ జాక్వెలిన్ కెనెడీతో అయూబ్ ఖాన్

"ఇస్కందర్ మీర్జాతో ఆయన భార్య ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. మీరు తప్పు చేస్తున్నారు. ఆ అయూబ్ ఖాన్‌ను కూడా తొలగించండి అనేవారు".

"నేను ఆయన దగ్గరికి వెళ్లి, మీరు ఆర్మీ అధికారులను అరెస్టు చేయమని ఆదేశిస్తున్నట్టు విన్నాం. అన్నాను".

"దానికి ఆయన మీరు తప్పుడు వార్త విన్నారు" అన్నారు.

నేను ఇక ఎత్తులు వేయడం ఆపండి. జాగ్రత్తగా ఉండండి. మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు. మా అందరికీ మీపై విశ్వాసం ఉంది. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు చెప్పండి" అన్నాం

అసలు రాజ్యాంగమే లేనప్పుడు, అధ్యక్షుడి పదవిలో అర్థం ఏముంది అని అయూబ్ ఖాన్ కూడా అనుకున్నారు. రాజ్యంగానికి విలువ లేనప్పుడు అధ్యక్షుడు ఎందుకు ఉండాలి అని భావించారు.

అక్టోబర్ 27 రాత్రి జనరల్ బర్కీ, జనరల్ అజామ్, జనరల్ ఖాలిద్ షేక్ ఇస్కందర్ మీర్జా ఇంటికెళ్లారు. నౌకర్లు 'సార్ విశ్రాంతి తీసుకుంటున్నారు' అని చెప్పారు. కానీ వారు అంత సులభంగా వదల్లేదు. గౌనులోనే ఉన్న అధ్యక్షుడి ముందు టైప్ చేసిన రాజీనామా పెట్టారు. ఆ పత్రంపై సంతకాలు చేయించారు. "మీ సామాను తీసుకోండి. మీరు తక్షణం అధ్యక్షుడి నివాసం వదిలి వెళ్లాలి" అన్నారు.

ఇస్కందర్ మీర్జా ఏదో చెప్పాలని ప్రయత్నించారు. కానీ బేగమ్ నహీద్ మరోసారి తెలివైన వారనిపించుకున్నారు. ఆమె ఒకే మాట అడిగారు. "అయితే, నా పిల్లుల పరిస్థితి ఏంటి" అన్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)