అఫ్గానిస్తాన్ కరవు: తాలిబన్లతో యుద్ధం కంటే దుర్భిక్షంతోనే ఎక్కువ వలసలు

అఫ్గానిస్తాన్‌లో భీకర దుర్భిక్షం మానవీయ సంక్షోభానికి దారి తీస్తోంది. అక్కడి ప్రభుత్వం, తాలిబన్ల మధ్య జరుగుతున్న పోరు కారణంగా వలస వెళ్తున్నవారి కంటే ఈ ఏడాది ఈ కరవు కారణంగా వలస వెళ్తున్నవారి జనాభాయే ఎక్కువగా ఉంది.
ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యే పరిస్థితులు కల్పిస్తున్న తీవ్ర కరవుపై అప్గాన్‌లోని హేరత్ నుంచి బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మాణీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది..
అఫ్గాన్ పశ్చిమ ప్రాంతంలోని పట్టణం హేరత్ శివార్లలో తాత్కాలికంగా వేసుకున్న ఒక గుడారం వద్ద నీళ్లు ఉబుకుతున్న కళ్లతో దీనంగా కనిపిస్తున్న షాదీ మొహమ్మద్(70)ని కలిశాను. ఆయన తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న చిన్న గుడారం అది.
''ఈ గుడిసెలో ఎనిమిది మంది ఉంటున్నాం. ఆకలితో మాడిపోతున్నాం.. తాగడానికి నీళ్లు కూడా లేవు. మాకున్నకొద్దిపాటి వస్తువులను తీసుకుని ఇక్కడకు బయలుదేరాం.. దార్లోనే సగం సామాను పోగొట్టుకున్నాం. మాకిప్పుడు ఆకలి, దాహం తప్ప ఇంకేమీ లేవు. నా భార్య, నా తమ్ముడు చనిపోయారు. సగం మంది పిల్లలను తీసుకుని బతుకుజీవుడా అని ఇక్కడికొచ్చాం. మిగతా సగం మంది పిల్లలను వదిలేసి వచ్చాం'' అంటూ ఆయన తన నిస్సహాయ స్థితిని చెప్పుకొచ్చారు.
అఫ్గాన్ పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఏర్పడిన దారుణ కరవు కారణంగా ఆహారం, పని వెతుక్కుంటూ సొంతూళ్లను వీడి వెళ్లిన 2,60,000 మందిలో షాదీ మొహమ్మద్ కూడా ఒకరు. అంతర్జాతీయ బలగాలు 2014లో ఇక్కడ పోరాటాన్ని నిలిపివేసిన తరువాత నుంచి హింస మరింత పెరిగిపోతున్న తరుణంలో ఇప్పుడీ కరవు అఫ్గాన్ ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టింది.
మరోవైపు మునుపెన్నడూ లేని స్థాయిలో తాలిబన్లు దేశంలోని అత్యధిక భూభాగాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అయితే, ప్రభుత్వం, తాలిబన్ల మధ్య పోరాటంలో నలిగిపోతూ వలస వెళ్లిన జనాభా కంటే ఇప్పుడీ కారణంగా తరలిపోతున్న ప్రజల సంఖ్య ఎక్కువని ఐరాస చెబుతోంది.
ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం(యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ)లో భాగంగా హేరత్‌లో కరవు పీడిత ప్రజలకు చేపడుతున్న సహాయ చర్యల బాధ్యత చూస్తున్న ఖాదిర్ అసీమీ 'పెద్ద సంఖ్యలో ప్రజలు ఊళ్లను వదిలి వలస వెళ్తున్నారు' అంటూ అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టారు.
కరవు ప్రభావానికి లోనయిన 22 లక్షల మంది ప్రజలను ఆదుకునేందుకు ఐరాస 3.46 కోట్ల డాలర్లను కేటాయించింది. ప్రస్తుతం యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ ఆహారం కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని ప్రజలకు పంపిణీ చేస్తోంది.
- ఆరేళ్ల బాలిక జైనబ్‌ను రేప్ చేసి చంపిన వ్యక్తిని ఉరితీసిన పాకిస్తాన్
- #MeToo: ‘సోషల్ మీడియా లేకుంటే నా గోడు ఎవరూ వినేవారు కాదు’
‘పిల్లల గొంతు తడపడానికీ చుక్క నీరు లేదు’
కరవు కారణంగా ఊళ్లను వీడి వస్తున్నవారి సహాయార్థం ఐరాస పెద్ద సంఖ్యలో శిబిరాలను ఏర్పాటుచేసింది. ఇలాంటి ఒక శిబిరం వద్ద తన నలుగురు పిల్లలతో ఒక మహిళ నాకు కనిపించింది. అఫ్గాన్ ఉత్తర ప్రాంతంలోని ఫర్యాబ్ నుంచి వచ్చినట్లు చెప్పారమె.
''మా దగ్గర తిండి కొనుక్కోవడానికి కొంచెం డబ్బులు ఉండుంటే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు'' అంటూ కన్నీరు పెట్టుకుందామె.
''వర్షం కురిసి ఏడాది దాటింది. పచ్చని ఆకు కూడా ఎక్కడా కనిపించడం లేదు. పిల్లల ప్రాణాలు నిలపడానికి చుక్క నీరు తాగించాలన్నా ఎక్కడా దొరకడం లేదు. ఇది చాలదన్నట్లుగా తాలిబన్లు, సైన్యం మధ్య భీకర పోరాటం సాగుతోంది. దిక్కుతోచడం లేదు.''
చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో పశుసంపదను అమ్ముకుంటున్నారు. వ్యవసాయాధార దేశంలో తీవ్ర కరవు రావడంతో ప్రజలు అల్లాడుతున్నారు.
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- జన్యు బ్యాంక్‌లో భద్రంగా లక్షల రకాల వరి వంగడాలు
పంజా విసరనున్న చలిపులి
మరోవైపు ఎంతోకాలంగా పెండింగులో ఉన్న పార్లమెంటు ఎన్నికలు కూడా కొద్ది రోజుల్లో జరగనున్నాయి. అక్టోబరు 20న అఫ్గాన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
అయితే, ప్రజలు మాత్రం నాయకులు తమ కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
అఫ్గాన్ కరవు పీడిత ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టేందుకు చలికాలం కూడా ముంచుకొస్తోంది. తాత్కాలిక గుడారాల్లో ఉంటున్న ఈ కరవు పీడితులకు చలికాలం ప్రాణాంతకమే. ఇప్పుడిప్పుడే కరవు నుంచి బయటపడే పరిస్థితులు కనిపించకపోవడంతో ఈ కొత్త ముప్పును తప్పించుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.
''చలికాలం వస్తే ఈ గుడారాల్లో బతకడం చాలా కష్టం. వీరంతా ఏమవుతారో తెలియడం లేదు. గత పద్దెనిమిదేళ్లలో ఇలాంటి దారుణమైన కరవును చూడలేదు'' సహాయ చర్యల బాధ్యత చూస్తున్న ఖాదిర్ అసీమీ అన్నారు.
ఇవి కూడా చదవండి
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- ఫొటోల్లో: కరవు కోరల్లో ఆస్ట్రేలియా
- తీవ్ర కరవు కోరల్లో చిక్కుకున్న ఆస్ట్రేలియా రాష్ట్రం
- దుర్భిక్షం ముంగిట్లో యెమెన్
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
- ‘భూమి నాశనమవుతున్న శకంలో మనం జీవిస్తున్నాం’
- అమెరికా: జంతువుల ఎక్స్‌రేలు చూస్తారా..
- అభిప్రాయం: ప్రకృతి వైపరీత్యానికీ శబరిమల దేవుడికీ ఎలా ముడిపెడతారు?
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)