నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోంది? అసలు సాధ్యమేనా?

  • 20 అక్టోబర్ 2018
నకిలీ చంద్రుడి వెలుగులు వస్తే Image copyright Getty Images
చిత్రం శీర్షిక చెంగ్డు ఆకాశంలో నిండు చంద్రుడు

కృత్రిమ చంద్రుడిని ఆకాశంలోకి పంపి చీకటిలో కృత్రిమ వెలుగులను కురిపించాలని భావిస్తున్నట్టు ఒక చైనా కంపెనీ ప్రకటించింది.

పీపుల్స్ డెయిలీ న్యూస్ పేపర్ కథనం ప్రకారం చెంగ్డు నగరంలో ఉన్న ఒక ప్రైవేట్ ఏరో స్పేస్ సంస్థ 2020కల్లా "ప్రకాశవంతమైన ఉపగ్రహాలను" అంతరిక్షంలోకి పంపాలనుకుంటోంది. వీధి దీపాల అవసరమే లేనంతగా అవి వెలుగులు పంచుతాయని ఆ సంస్థ చెబుతోంది.

కృత్రిమ చంద్రుడి వార్తలు శాస్త్రవేత్తల్లో ఆసక్తిని, అనుమానాలను రేకెత్తించాయి. కొంతమంది అదెలా? అని ఆశ్చర్యపోతుంటే, మరి కొంత మంది మాత్రం ఈ వార్తపై జోకులు వేసుకుంటున్నారు.

Image copyright Getty Images

ఈ ప్రాజెక్ట్ గురించి మనకేం తెలుసు?

పెద్దగా ఏం తెలీదు- కానీ తెలిసిన ఆ కాస్త సమాచారం కూడా పరస్పర విరుద్ధంగా ఉంది. గత వారం పీపుల్స్ డెయిలీ పత్రిక ఈ వార్త గురించి మొదట ప్రచురించింది. చెంగ్డు ఏరోస్పేస్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ మైక్రోఎలక్ట్రానిక్స్ సిస్టమ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూచ్ కో లిమిటెడ్ ఛైర్మన్ వూ చుంఫెంగ్ మీడియా సమావేశంలో చెప్పిన వివరాలను పత్రిక తమ కథనంలో కోట్ చేసింది.

"ప్రకాశవంతమైన ఉపగ్రహాలను" అంతరిక్షంలోకి పంపాలనే ఆలోచనపై గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుపుతున్నామని, ఇప్పుడు ఆ సాంకేతికత ఉపయోగించడానికి సిద్ధంగా ఉందని వూ తెలిపారు. ఈ ఉపగ్రహాలను 2020లో ప్రయోగించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

"2022లో మూడు పెద్ద అద్దాలను లాంచ్ చేస్తామని" వూ చెప్పినట్టు చైనా డెయిలీ వార్తా పత్రిక రాసింది. ఈ ప్రాజెక్టుకు ఏదైనా అధికారిక సహకారం ఉందా, లేదా అనే వివరాలు మాత్రం ఇంక స్పష్టం కాలేదు.

Image copyright Getty Images

కృత్రిమ చంద్రుడు ఎలా పనిచేయచ్చు?

ఈ కృత్రిమ చంద్రుడు ఒక అద్దంలా పనిచేస్తాడు. చైనా డెయిలీ కథనం ప్రకారం సూర్యుడి వెలుగును ఇది భూమిపై పడేలా ప్రతిబింబిస్తుంది.

ఈ అద్దం భూమికి దాదాపు 500 కిలోమీటర్ల పరిధిలో అంటే దాదాపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉన్నంత దూరంలో ఉంటుంది. చంద్రుడు భూమికి సగటున దాదాపు 3,80,000 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతుంటుంది.

ఈ నకిలీ చంద్రుడు ఎలా ఉంటాడు అనేదానిపై కథనంలో ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు. కానీ వూ మాత్రం తమ ఉపగ్రహాలు సూర్యరశ్మిని 10 నుంచి 80 కిలోమీటర్ల ప్రాంతంలో ప్రతిబింబించేలా చేసి, నిజమైన చంద్రుడి కంటే 8 రెట్ల వెలుగును అందిస్తాయని చెబుతున్నారు.

వూ చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఉపగ్రహాలు అందించే వెలుగును పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయవచ్చు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వీధి దీపాల ఖర్చు కంటే మా ఉపగ్రహం తక్కువ- చెంగ్డు ఏరో స్పేస్ అధికారులు

కానీ... ఎందుకు?

డబ్బు ఆదా చేయడానికి. ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కానీ చెంగ్డు ఏరోస్పేస్ ప్రతినిధులు మాత్రం అంతరిక్షంలో నకిలీ చంద్రుడిని పంపడానికి ఇప్పుడు వీధి దీపాల చెల్లిస్తున్న కరెంటు ఖర్చు కంటే తక్కువ మొత్తం అవుతుందని చెబుతున్నారు.

ప్రకాశవంతమైన ఉపగ్రహాలతో 50 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వెలుగు అందించడం వల్ల ఏడాదికి 1.2 బిలియన్ యువాన్ల (రూ.1150 కోట్లు) విద్యుత్ ఛార్జీలు ఆదా చేయవచ్చని వూ చెప్పినట్లు చైనా డెయిలీ తెలిపింది.

భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు "కరెంటు లేని ప్రాంతాలకు" కూడా ఇవి వెలుగులు అందించగవని ఆ పత్రిక చెప్పింది.

"ఇలాంటి దాన్ని పెట్టుబడుల్లా భావించవచ్చు" అని గ్లాస్గో యూనివర్సిటీ స్పేస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లెక్చరర్ డాక్టర్ మాటియో సెరియోట్టీ బీబీసీకి తెలిపారు.

"రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాకు చాలా ఖర్చవుతుంది. ఇలా 15 ఏళ్లపాటు ఉచిత వెలుగులు అందుతూ ఉంటే, అది దీర్ఘకాలంలో దేశం ఆర్థికపరంగా మరింత ఎదిగేందుకు ఉపయోగపడవచ్చు" అని ఆయన అన్నారు.

Image copyright Getty Images

అది సరే, ఇది సాధ్యమేనా?

సైన్స్ ప్రకారం, ఇది సాధ్యమే అంటారు డాక్టర్ సెరియోట్టీ

కానీ తన ప్రయోజనాన్ని అందించేందుకు ఈ నకిలీ చంద్రుడు చెంగ్డుపైన శాశ్వతంగా కక్ష్యలో ఉండాల్సి వస్తుంది. అంతరిక్షం నుంచి భూమిని చూడడంతో పోల్చుకుంటే అది చాలా చిన్న ప్రాంతం అవుతుంది.

అంటే ఈ ఉపగ్రహం భూ-స్థిర కక్ష్యలోనే ఉండాల్సి ఉంటుంది. అంటే భూమికి దాదాపు 37 వేల కిలోమీటర్ల ఎత్తున అది ఉండాలి.

"ఇక్కడ ఒక సమస్య ఉంది. ఉపగ్రహాన్ని అంత దూరం నుంచి చాలా కచ్చితత్వంతో కింద ఉన్న ప్రాంతానికి సూటిగా సరైన దిశలో ఉంచాల్సి ఉంటుంది" అని సెరియోట్టీ చెప్పారు.

అంత దూరం నుంచి ఏదైనా ప్రభావం కనిపించాలంటే, ఆ అద్దం నిజంగా చాలా చాలా భారీగా ఉండాలి.

Image copyright Getty Images

పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

"ఉపగ్రహాల లైట్ల కాంతి సాయంత్రం వెలుగులా ఉండాలి. దానివల్ల జంతువుల దినచర్యపై ఎలాంటి ప్రభావం పడకూడదు" అని హబిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ కంగ్ వీమిన్ పీపుల్స్ డెయిలీకి చెప్పారు.

కానీ చైనాలో సోషల్ మీడియా యూజర్లు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రిపూట తిరిగే జంతువులను ఇవి గందరగోళానికి గురిచేస్తాయని కొందరు భావిస్తే, చైనాలోని చాలా నగరాలు రాత్రి వేళల్లో ఇప్పటికే కాంతి కాలుష్యంలో చిక్కుకున్నాయని మరికొందరు పోస్ట్ చేశారు.

"ఇప్పటికే కాంతి కాలుష్యంలో అల్లాడుతున్న నగరాల్లో రాత్రి పూట వెలుగును ఈ నకిలీ చంద్రుడు మరింత పెంచుతాడు. అనవసరమైన వెలుగుకు తెరవేయలేకపోతున్న చెంగ్డు ప్రజలకు కొత్తగా మరిన్ని సమస్యలు సృష్టిస్తాడు" అని ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్‌ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ జాన్ బారెంటైన్ న్యూస్ అవుట్‌లెట్‌ ఫోర్బ్స్‌కు తెలిపారు.

"వెలుగు మరీ తీవ్రంగా ఉంటే, అది ప్రకృతిలో రాత్రి నియమాలకు అంతరాయం అవుతుంది. ఆ ప్రభావం జంతువులపై పడవచ్చు" అని డాక్టర్ సెరియోట్టీ బీబీసీతో అన్నారు.

కానీ దానికి బదులు ఆ వెలుగు వెలిసిపోయినట్టు ఉంటే, దానివల్ల ఉపయోగం ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

Image copyright Getty Images

ఇలా ఇదే మొదటిసారా?

లేదు, పగటి వెలుతురు సృష్టించే ఒక అంతరిక్ష అద్దం గురించి ఇంతకు ముందు కూడా ప్రయత్నాలు జరిగాయి.

1993లో రష్యా శాస్త్రవేత్తలు ఒక 20 మీటర్ల రిఫ్లెక్టర్‌ను మిర్ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్న ఒక సప్లై నౌక నుంచి విడుదల చేశారు. అది 200 కిలోమీటర్ల నుంచి 420 కిలోమీటర్ల మధ్య కక్ష్యలో తిరుగుతుంది.

జ్నమాయా 2 అనే ఈ రిఫ్లెక్టర్, భూమిపై 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సన్నటి స్పాట్ లైట్ వేయగలదు. ఈ ఉపగ్రహం కాలిపోయే ముందు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఐరోపాపై వెళ్లింది.

1990లో ఇది విఫలమైన తర్వాత జ్నమాయా కంటే పెద్ద మోడళ్లు తయారు చేయాలని కూడా ప్రయత్నించారు. అప్పట్లో దీని గురించి చెప్పిన బీబీసీ సైన్స్ ఎడిటర్ "అంతరిక్షంలోని అద్దాలతో భూమిపై వెలుగు నింపవచ్చు అనడానికి భవిష్యత్తులో చిన్న అవకాశం కూడా లేదు" అన్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు