సిరియా యుద్ధం: అసద్ పైచేయికి రసాయన ఆయుధాలే కారణమా?

  • 26 అక్టోబర్ 2018
సిరియా యుద్ధంలో గాయపడిన బాలుడు Image copyright EPA

''నా భార్యాపిల్లలు, నా తమ్ముళ్లు.. మా ఇంట్లోవాళ్లే కాదు ఇరుగుపొరుగువారు కూడా నురగలు కక్కుకుంటూ అలాగే నేలకొరిగిపోతున్నారు.. వాళ్ల శరీరమంతా వణికిపోతోంది. నిమిషాల్లోనే నా పరిస్థితీ అలాగే మారింది. స్పృహతప్పి పడిపోయాను. ఎవరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాకు వైద్యం చేశారు. స్పృహలోకి రాగానే నా భార్యాపిల్లల కోసం అడిగాను... అక్కడికి పావు గంట తరువాత నా భార్య, ఇద్దరు కవల పిల్లలను నా దగ్గరకు తీసుకొచ్చారు. కానీ.. వారు సజీవంగా లేరు.. అప్పటికే ప్రాణాలు కోల్పోయారు''

- గత ఏడాది రసాయన దాడి నుంచి బతికి బయటపడిన ఓ సిరియా పౌరుడి భయంకరమైన అనుభవం ఇది.

తనను గద్దె దించాలని ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఏడేళ్లుగా యుద్ధం చేస్తున్నారు. 3,50,000 మందిని బలి తీసుకున్న భీకర యుద్ధంలో అసద్ పైచేయి సాధించి విజయానికి చేరువగా కనిపిస్తున్నారు. మరి, ఈ భయంకరమైన యుద్ధంలో అసద్ గెలుపునెలా అందుకుంటున్నారు?

అందుకు ఆయనకు దొరికిన బలమైన ఆయుధమేంటి?

బీబీసీ పనోరమా, బీబీసీ అరబిక్ చేపట్టిన సంయుక్త పరిశోధనలో తొలిసారిగా రసాయన ఆయుధాలే ఈ యుద్ధంలో పైచేయికి కీలకం అయ్యాయని తేలింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionసిరియా: సొంత ప్రజలపైనే రసాయన దాడులు చేయించిన ప్రబుత్వం

1) పెరిగిన రసాయన ఆయుధాల వాడకం

సిరియాలో 2013 సెప్టెంబరు నుంచి 106 చోట్ల రసాయన దాడులు జరిగినట్లు ఆధారాలున్నట్లుగా బీబీసీ పరిశోధనలో నిర్ధారణయింది. కాగా 2013 సెప్టెంబరులోనే సిరియా అధ్యక్షుడు 'ఇంటర్నేషనల్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్'(సీడబ్ల్యూసీ)పై సంతకం చేశారు. ఆ తరువాతే ఈ దాడులన్నీ జరిగాయి.

సీడబ్ల్యూసీపై సంతకం చేయడానికి నెల రోజుల ముందు రాజధాని డమాస్కస్ శివారు ప్రాంతాల్లో రసాయన ఆయుధాల దాడి జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో నెర్వ్ ఏజెంట్ సరిన్ వినియోగించారు. ఈ దాడులకు గురైనవారి బాధాకర చిత్రాలు అప్పట్లో ప్రపంచాన్ని విచారంలోకి నెట్టాయి. ఈ దాడులకు అక్కడి ప్రభుత్వమే కారణమని పాశ్చాత్య దేశాలు ఆరోపించగా, అసద్ మాత్రం తిరుగుబాటుదారులపై ఈ నింద మోపారు.

ఆ సందర్భంలో సిరియాలో సైనిక చర్యకు దిగుతామని అమెరికా బెదిరించగా.. అసద్‌కు మద్దతు పలుకుతున్న రష్యా జోక్యం చేసుకుని సిరియాను రసాయన ఆయుధాల వినియోగాన్ని నిలిపివేసేలా ఒప్పందంపై సంతకం చేసేందుకు ఒప్పించింది. తమ వద్ద ఉన్న 13 వేల టన్నుల రసాయన ఆయుధాలను 'ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్'(ఓపీసీడబ్ల్యూ), ఐరాసలు ధ్వంసం చేశాయని అసద్ ప్రకటించినప్పటికీ, ఆ తరువాత కూడా సిరియాలో రసాయన దాడుల జాడలు బయటపడుతున్నాయి.

'రసాయన ఆయుధ దాడులు భయంకరంగా ఉంటాయ'ని అలెప్పో నగరానికి చెందిన అబూ జాఫర్ తెలిపారు. బాంబులు, రాకెట్ లాంఛర్లతో దాడి చేస్తే ఒక్కసారిగా ప్రాణాలు పోతాయి. కానీ, రసాయన ఆయుధాలతో దాడులు చేస్తే ఊపిరి అందక విలవిలలాడుతూ ప్రాణాలొదులుతారని ఆయన చెప్పారు.

అయితే... సిరియా అధ్యక్షుడు అసద్ మాత్రం తామెప్పుడూ రసాయన ఆయుధాలు ఉపయోగించలేదనే చెబుతున్నారు.

''2013లో రసాయన ఆయుధాలన్నిటినీ నాశనం చేసిన తరువాత మా వద్ద ఇంకే రసాయన ఆయుధాలూ మిగల్లేదు'' అని అసద్ ఈ ఏడాది ప్రారంభంలో మరోసారి ప్రకటించారు.


రసాయన ఆయుధాలంటే ఏమిటి?

ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా హతమార్చేందుకు వాడే రసాయనాలను రసాయన ఆయుధాలుగా ఓపీసీడబ్ల్యూ నిర్వచిస్తోంది. అంతర్జాతీయంగా వీటి వినియోగంపై నిషేధం ఉంది.

2014 నుంచి ఓపీసీడబ్ల్యూ చేపట్టిన నిజనిర్ధారణ కార్యక్రమం.. ప్రస్తుతం ఓపీసీడబ్ల్యూ, ఐరాసల సంయుక్త దర్యాప్తులో సిరియాలో 37 రసాయన దాడుల ఘటనలను గుర్తించారు. ఇవన్నీ 2013 సెప్టెంబరు నుంచి 2018 ఏప్రిల్ మధ్య జరిగినవే.

కాగా మరో 18 దాడుల్లోనూ రసాయన ఆయుధాలను వినియోగించినట్లు ఐరాస మానవ హక్కుల సమితికి చెందిన స్వతంత్ర విచారణ కమిషన్(సీవోఐ) గుర్తించింది.


సిరియా సీడబ్ల్యూసీ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత జరిగినట్లుగా ఆరోపణలున్న 164 రసాయన దాడుల నివేదికలను బీబీసీ పనోరమ, అరబిక్‌లు పరిశీలించాయి.

ఇందులో 106 దాడుల్లో రసాయన ఆయుధాలు వినియోగించినట్లు విశ్వసనీయ ఆధారాలున్నాయని ఈ పరిశీలనలో తేలింది. అయితే, ఇందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయని బీబీసీ బృందం గుర్తించింది.

సిరియాలో రసాయన ఆయుధాల వినియోగాన్ని కిరాతక చర్యగా అభివర్ణించారు ఐరాసలో బ్రిటన్ శాశ్వత రాయబారి కెరెన్ పియర్స్. వందేళ్లుగా వీటిపై నిషేధం ఉందని.. ఇవి భయంకరమైనవని ఆమె అన్నారు.


డాటా పరిశీలన ఎలా సాగింది..

2013 సెప్టెంబరు తరువాత చోటుచేసుకున్న 164 దాడులకు సంబంధించిన డాటాను బీబీసీ టీం పరిశీలించింది. అంతర్జాతీయంగా పేరున్న వైద్య, అధ్యయన, మానవ హక్కుల సంస్థలు నిష్పాక్షికంగా అందించిన ఈ నివేదికలను ఆధారంగా చేసుకుని బీబీసీ రసాయన ఆయుధ దాడులపై నిర్ధారణకు వచ్చింది.

నివేదికలను పరిశీలించే ప్రక్రియలో బీబీసీ నిపుణులు, ప్రత్యేక అధ్యయనకర్తలను భాగస్వాములను చేసింది. వారు ఈ ఘటనల్లో రసాయన దాడులు అనడానికి కేవలం ఒకేఒక్క ఆధారమున్నవాటిని పక్కన పెట్టేశారు. అలాగే తగిన ఆధారాలు, బలమైన ఆధారాలు లేనివాటినీ ఈ జాబితా నుంచి తొలగించారు. రసాయన ఆయుధాల వినియోగానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు, నమ్మకమైన నిర్ధారణలు ఉన్నవి మాత్రమే పరిగణనలోకి తీసుకుని మొత్తం 106 దాడుల్లో రసాయన ఆయుధాలను వినియోగించినట్లు తేల్చారు.


బీబీసీ తేల్చిన 106 రసాయన దాడుల్లో అత్యధికం వాయువ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో జరిగినవే. ఇడ్లిబ్ పక్కనే ఉన్న హమా, అలెప్పోలోనూ... డమాస్కస్ సమీపంలోని తూర్పు ఘూటా ప్రాంతంలోనూ ఈ దాడులు జరిగాయి.

యుద్ధ కాలంలోని వేర్వేరు కాలావధుల్లో ఈ ప్రాంతాలన్నీ ఎప్పుడోఒకప్పుడు తిరగుబాటుదారుల చేతుల్లో ఉన్నవే.

అయితే, ఇలాంటి దాడుల కారణంగా ఎక్కువ ప్రాణనష్టం జరిగింది హమా ప్రావిన్స్‌లోని కాఫర్ ఝిటా, తూర్పు ఘూటాలోని దౌమాలో. ఈ రెండు పట్టణాల్లోనూ ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకర యుద్ధం సాగింది.

కాగా.. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని ఖాన్‌షేకౌన్‌లో 2017 ఏప్రిల్ 4న జరిగిన రసాయన దాడి అత్యంత తీవ్రమైనదిగా ఈ డాటా చెబుతోంది. ఈ దాడిలో 80 మందికిపైగా మరణించారని విపక్షానికి చెందిన ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

రసాయన దాడులు అత్యంత భయంకరమైనవి అయినప్పటికీ సిరియాలో సాధారణ పౌరులు ఎక్కువగా చనిపోయింది మాత్రం క్లస్టర్ బాంబులు, పేలుడు పదార్థాల వల్లేనని ఐరాస మానవ హక్కుల నిపుణులు చెబుతున్నారు.

2. ఆధారాలివిగో..

సిరియాలో రసాయన ఆయుధాలన్నిటినీ నిర్మూలించినట్లు ఓసీసీడబ్ల్యూ-ఐరాస సంయుక్త కార్యక్రమానికి చెందిన పరిశీలకులు 2014 జూన్‌లో ప్రకటించారు. ''సిరియాలో రసాయన ఆయుధాలున్నాయని మాకు తెలిసిన ప్రతిచోటా వాటిని తొలగించడమో.. నాశనం చేయడమో చేశాం'' అని పరిశీలకుల్లో ఒకరైన టాంగేర్ అప్పట్లో ప్రకటించారు. అయితే.. ఫలానా చోట ఉన్నాయంటూ తమకు సమాచారం అందించినవాటినే తాము నిర్మూలించామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ లోపం కారణంగానే రసాయన ఆయుధాలను పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించిన తరువాత కూడా అలాంటి దాడులకు సంబంధించిన ఆధారాలు లభ్యమవుతూనే ఉన్నాయి.

సిరియా: ‘ఆకలి తీరాలంటే కోరిక తీర్చాలన్నారు’

Image copyright AFP

కళ్లెదుటే భార్యాపిల్లలు కుప్పకూలిపోయారు

ఖాన్‌షేకౌన్‌లో 2017 ఏప్రిల్ 4న జరిగిన దాడిలో అబ్దుల్ యూసప్ తన భార్య, పదకొండు నెలల వయసున్న ఇద్దరు కవలలను, తన ఇద్దరు తమ్ముళ్లను కోల్పోయారు. ఆయన ఇరుగుపొరుగువారు కూడా ఈ దాడిలో మరణించారు.

అప్పటి దాడిని గుర్తు చేసుకున్న ఆయన ''మా ఇంట్లోవాళ్లు.. మా చుట్టుపక్కలవారు.. హఠాత్తుగా నురగలు కక్కుకుంటూ నేలకొరిగిపోతున్నారు. వాళ్ల శరీరమంతా వణికిపోతోంది. నా పరిస్థితీ అలాగే ఉంది. అది కచ్చితంగా రసాయన దాడి ప్రభావమేనని నాకు అర్థమైంది.. స్పృహతప్పి పడిపోయాను. వెంటనే ఎవరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాకు వైద్యం చేశాక తెలివొచ్చింది. స్పృహలోకొచ్చాక నేను నా భార్యాపిల్లల కోసం అడిగాను... అక్కడికి పావు గంట తరువాత నా భార్య, ఇద్దరు కవల పిల్లలను నా దగ్గరకు తీసుకొచ్చారు. కానీ.. వారు సజీవంగా లేరు.. అప్పటికే ప్రాణాలు కోల్పోయారు'' అని ఏడుస్తూ చెప్పారు.

సెనైడ్ కంటే 20 రెట్లు ప్రమాదకరం..

ఆ రోజు జరిగిన దాడిలో వాడిన సారిన్ రసాయన ప్రభావానికి చాలామంది లోనయినట్లు ఓపీసీడబ్ల్యూ-ఐరాస సంయుక్త పరిశోధన కార్యక్రమం(జేఐఎం) నిర్ధారించింది.

సారిన్ అనేది సెనైడ్ కంటే 20 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైనది. దీని ప్రభావానికి గురయితే నిమిషాల్లోనే మరణిస్తారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionక్లోరిన్ నుంచి నోవిచోక్ వరకూ: రసాయన ఆయుధాలకు 100 ఏళ్లు

ఖాన్‌షేకౌన్‌లో సారిన్ విడుదల చేయడం వెనుక సిరియా ప్రభుత్వ హస్తం ఉందని తాము బలంగా నమ్ముతున్నామని జేఐఎం వెల్లడించింది. సారిన్ నింపిన బాంబును విమానం నుంచి జారవిడిచారన్న ఆరోపణలున్నాయి.

సిరియా అధ్యక్షుడు అసద్ ఈ ఆరోపణలను కొట్టిపారేయగా.. ఆయనకు మద్దతిస్తున్న రష్యా మరో కథనాన్ని వినిపించింది. ఉగ్రవాదులకు చెందిన ఆయుధాగారంపై సిరియా వైమానిక దళం బాంబు దాడి చేసినప్పుడు ఆ ఆయుధాగారంలోని రసాయన ఆయుధాలు ధ్వంసమై ఇలా జరిగిందని రష్యా చెబుతోంది.

అయితే, ఓపీసీడబ్ల్యూ పరిశీలక బృందంలోని స్టెఫాన్ మోగ్ల్ మాత్రం ఈ దాడిలో వాడిన సారిన్ రసాయనం సిరియా ప్రభుత్వానికి చెందినదేననడానికి తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు.

Image copyright Reuters

సిరియాలో రసాయన ఆయుధాల నిర్మూలన సమయంలో తాము సేకరించిన శాంపిళ్లలోని సారిన్‌కు, ఈ దాడిలో వాడిన సారిన్‌కు స్పష్టమైన పోలిక ఉందని స్టెఫాన్ చెబుతున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ సారిన్ వెలువడడానికి కారణమైన పూర్వగామి రసాయన సమ్మేళనం(ప్రీకర్సర్ కెమికల్) ఒకటేనని.. దాని ఆధారంగానే ఇందులో సిరియా ప్రభుత్వం పాత్ర ఉన్నట్లు తేల్చామని స్టెఫాన్ చెబుతున్నారు. సిరియాలో రసాయన ఆయుధాల నిర్మూలన పూర్తికాలేదనడానికి ఇదే నిదర్శనమని ఆయన చెప్పారు.

అయితే, బీబీసీ వెల్లడించిన 106 రసాయన దాడుల్లో ఇదొకటి కాగా, మిగతా 105 దాడుల వెనుక ఎవరున్నారనేదీ చూడాలి.

చర్మంపై బొబ్బలు తేలేలా చేసే రసాయన దాడులు రెండు జరిగాయి. ఈ రెండింటి వెనుక ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) హస్తం ఉందని జేఐఎం నిర్ధారించింది. బీబీసీ డాటా ప్రకారం మరో మూడు రసాయన దాడుల వెనుకా ఐఎస్ హస్తం ఉంది. అయితే, ఐఎస్ కాకుండా సిరియాలోని ఇంకే ఉగ్రవాద సంస్థా ఇలాంటి రసాయన దాడులకు పాల్పడినట్లు జేఐఎం, ఓపీసీడబ్ల్యూ చెప్పలేదు. బీబీసీ డాటా కూడా ఇతర ఉగ్రవాద సంస్థలు ఇలాంటి దాడులకు పాల్పడినట్లుగా గుర్తించలేదు.

కానీ, సిరియా ప్రభుత్వం, రష్యా మాత్రం తిరుగుబాటుదారులే రసాయన ఆయుధాలతో దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు బీబీసీ గుర్తించిన 106 రసాయన దాడుల్లో 51 సందర్భాల్లో గగనతలం నుంచే ఈ ఆయుధాలను జారవిడిచినట్లు తేలింది. ఇందుకు వీడియో, ఫొటో ఆధారాలతో పాటు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆధారాలూ ఉన్నాయి. ఇలా గగనతలం నుంచి జరిపిన దాడులన్నీ సిరియా ప్రభుత్వం పనేనని బీబీసీ భావిస్తోంది.

కాగా అసద్ ప్రభుత్వానికి మద్దతుగా 2015 నుంచి రష్యా వేలాదిగా జరుపుతున్న వైమానిక దాడుల్లో ఎక్కడా రసాయన ఆయుధాలు వినియోగించినట్లుగా ఆధారాలు లేవని దీనిపై విచారణ జరిపిన ఐరాస మానవ హక్కుల నిపుణులు వెల్లడించారు.

అదేసమయంలో ఓపీసీడబ్ల్యూ దర్యాప్తులోనూ తిరుగుబాటుదారులకు వైమానిక దాడులు చేసే సామర్థ్యం లేదని తేలింది.

దీంతో గగనతలం నుంచి చేసిన రసాయనదాడులన్నీ సిరియా ప్రభుత్వం పనేనని తెలుస్తోంది.

రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్(చాతమ్ హౌస్)లో మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో కార్యక్రమాల హెడ్ డాక్టర్ లినా ఖాతిబ్ దీనిపై మాట్లాడుతూ.. ''సిరియాలోని రసాయన దాడుల తీరు పరిశీలిస్తే వాటిలో ఎక్కువ శాతం ప్రభుత్వం, దాని మిత్రపక్షాలే ఎక్కువగా రసాయనదాడులకు పాల్పడుతున్నాయని తెలుస్తోంది. తిరుగుబాటుదారులపై పట్టుకు సైనిక చర్య కానీ, సాధారణ ఆయుధాలు కానీ వినియోగించే పరిస్థితుల్లో లేకపోతే ఇలా చేస్తున్నారు'' అని అభిప్రాయపడ్డారు.

ఖాన్‌షేకౌన్‌ దాడిలో సారిన్ వాడినప్పటికీ మిగతా దాడుల్లో ఎక్కువగా క్లోరిన్ వినియోగించినట్లు గుర్తించారు.

చట్టబద్ధంగా అనేక అవసరాల కోసం ప్రపంచవ్యాప్తంగా వినియోగించే క్లోరిన్‌ను ఆయుధంగానూ ప్రయోగించొచ్చు.. కానీ, ఇంటర్నేషనల్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ దీని వాడకాన్ని నిషేధించింది.

సిరియాలో బీబీసీ నిగ్గుతేల్చిన 106 దాడుల్లో 79 సందర్భాల్లో క్లోరిన్ వినియోగం కనిపించింది.

3. రసాయన ఆయుధాల వినియోగం వ్యూహాత్మకమా?

ఈ 106 దాడుల సమయాన్ని, దాడుల ప్రాంతాలనూ పరిశీలిస్తే ఇవన్నీ వ్యూహాత్మకంగా జరిగినట్లు అర్థమవుతోంది. 2014లో ఇడ్లిబ్, హమాల్లో.. 2015లో ఇడ్లిబ్‌లో, 2016లో అలెప్పోలో, 2017లో తూర్పుఘూటాలో ఇవి జరిగాయి.

ఈ నగరాల్లో దాదాపుగా ఒకే ప్రాంతాల్లో ఈ దాడులన్నీ చోటుచేసుకున్నాయి. సుమారుగా ఒకే సమయాల్లో దాడులు జరిగాయి. పైగా అసద్ ప్రభుత్వ దళాలు దాడులు చేసిన సమయాల్లోనే ఈ రసాయన దాడులూ చోటుచేసుకోవడం ప్రస్తావనార్హం.

తొందరగా పట్టుచిక్కించుకోవడం కోసం.. తిరుగుబాటుదారులపై దాడుల సమయంలో పౌరుల ఆటంకంగా లేకుండా వారిని అక్కడి నుంచి పారిపోయేలా చేసేందుకు ఇలా రసాయన ఆయుధాలతో భయపెట్టడం వ్యూహం కావొచ్చని.. అలాగే, సుదీర్ఘకాలంగా యుద్ధం సాగుతుండడంతో ఆయుధాల కొరత ఏర్పడుతున్న సమయాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించేందుకు ఈ మార్గం ఎంచుకుని ఉంటారని కూడా చాతమ్ హౌస్ హెడ్ ఖాతిబ్ అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా సుదీర్ఘకాలం భీకర యుద్ధం కొనసాగిన అలెప్పోలో ఇలాంటి వ్యూహం అనుసరించినట్లు భావిస్తున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionప్రమాదంలో పసిపిల్లలు

అలెప్పోను తిరుగుబాటుదారుల నుంచి విముక్తి చేసి తమ స్వాధీనంలోకి తీసుకునేందుకు గాను అసద్ ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడినట్లు చెబుతున్నారు.

అలెప్పోలో తొలుత సాధారణ ఆయుధాలతో భీకర దాడులు చేశారు. అనంతరం రసాయన దాడులు జరపడంతో పెద్దఎత్తున సాధారణ ప్రజలూ మరణించారు. దీంతో పౌరులు భయంతో ఆ ప్రాంతాన్ని వీడడంతో అసద్ ప్రభుత్వం తిరుగుబాటుదారులపై సులభంగా దాడులు చేసే అవకాశం ఏర్పడిందని ఖాతిబ్ విశ్లేషించారు.

2016 నవంబరు, డిసెంబరు మధ్య తూర్పు అలెప్పోను అసద్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటున్న సమయంలో మొత్తం 11 క్లోరిన్ దాడులు జరిగినట్లు నివేదికలున్నాయి. ఇందులో అయిదు యుద్ధం చివరి రెండు రోజుల్లో జరిగిన దాడులే. దీంతో.. ఇవన్నీ తొందరగా పట్టు సాధించడానికి ప్రభుత్వమే ఈ పనికి పాల్పడిందనడానికి ఆధారాలని నివేదికలు చెబుతున్నాయి.

మరోవైపు తిరుగుబాటుదారుల వద్ద ఫోరెన్సిక్ సైంటిస్ట్‌గా పనిచేసిన అబూ జాఫర్ కూడా రసాయన ఆయుధాల దాడులను నిర్ధారిస్తున్నారు. అలెప్పోలో యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు కొన్ని మృతదేహాలను పరిశీలించానని.. మృతశరీరాల నుంచి క్లోరిన్ వాసన రావడం తాను గుర్తించానని జాఫర్ చెప్పారు.

ద్రవరూప క్లోరిన్ ఉన్న బాంబులను వేస్తారని.. అది వాయు రూపంలోకి మారుతుందని.. అయితే, వాతావరణంలోని గాలి కంటే ఇది బరువుగా ఉండడం వల్ల నేలపైనే ఉండి ఊపిరాడకుండా చేస్తుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా.. బాంబుల నుంచి రక్షించుకునేందుకు భూగర్భ ఆశ్రయాల్లో దాక్కున్నవారు కూడా దీనికి బలవుతారని.. ఇది వాతావరణంలోని గాలి కంటే బరువుగా ఉండడం వల్ల లోతైన ప్రాంతాల్లోకి వెళ్లి చేరుతుందని.. అందువల్ల ఇలా బంకర్లలో తలదాచుకున్నవారు కూడా దీనికి బలయ్యారని జాఫర్ చెప్పారు.

క్లోరిన్ వాయువు కళ్లు, గొంతు.. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందని.. క్లోరిన్‌కు ఆర్ద్రత తోడైనప్పుడు ఆమ్లం జనిస్తుంది కాబట్టి, అలా గొంతు, కళ్లు, ఊపిరితిత్తుల్లో చేరినప్పుడు అక్కడ యాసిడ్లు ఉత్పత్తయి కణజాలాలు నాశనమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రజలు భూమి మీద కనిపిస్తే రాకెట్ లాంచర్లతో... భూమిలోపల దాక్కుంటే క్లోరిన్ వాయువుతో చంపేశారని జాఫర్ ఆరోపించారు.

యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు 1,20,000 మందికి పైగా పౌరులు అలెప్పో నుంచి వెళ్లిపోయారు.

2018 జనవరి, ఏప్రిల్ మధ్య తూర్పు ఘూటాలోనూ ఇలాంటి పరిస్థితులే చోటుచేసుకున్నాయి.

తూర్పు ఘూటాలోని అతిపెద్ద పట్టణం దైమాలో నాలుగు నెలల కాలంలో నాలుగు రసాయన దాడులు జరిగాయి. నేలపై యుద్ధం ప్రారంభించడానికి ముందు గగనతలం నుంచి పెద్ద ఎత్తున దాడులు జరిగాయి.

ఇక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్నవారు, వైద్యులు చెబుతున్న ప్రకారం ఏప్రిల్ 7న చివరి దాడి జరిగింది. పసుపు రంగులో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒకటి కొన్ని ఫ్లాట్ల సముదాయంపై పడింది. ఆ తరువాత ఒక రోజులోనే తిరుగుబాటుదారులు ఓటమి అంగీకరించకతప్పలేదు.

ఆ ఫ్లాట్లలోని కింది అంతస్తుల్లో ఉన్నవారిలో 30 మంది చిన్నారులు, మహిళలు, ఇంకా చాలామంది మరణించినట్లు తిరుగుబాటుదారులకు అనుకూలంగా ఉండే ఉద్యమకారులు విడుదల చేసిన వీడియోల్లో ఉంది.

చనిపోయినవారి నోట్లోంచి నురగలు వచ్చిన ఆనవాళ్లున్నాయని.. వారి ఒంటిపై రసాయనాల వల్ల కాలిన గాయాలున్నాయని యాసిర్ అల్ దొమానీ అనే ఒక ఉద్యమకారుడు వెల్లడించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఎనిమిదేళ్ల సిరియా యుద్ధం... ఎడతెగని మానవ విషాధం

అక్కడికి రెండు రోజుల తరువాత రష్యా మిలటరీ నిపుణులు ఆ ఫ్లాట్ల వద్దకు వచ్చి పరిశీలించి క్లోరిన్ కానీ, ఇతర రసాయనాలు కానీ వాడినట్లు ఆధారాలేమీ లేవని తేల్చి వెళ్లిపోయారు.

బ్రిటన్ సహకారంతో తిరుగుబాటుదారులు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ రష్యా ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసింది.

అయితే, రెండు వారాల తరువాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఓపీసీడబ్ల్యూ నిజనిర్ధారణ కమిటీ శాంపిళ్లను తీసుకుని పరీక్షించి క్లోరిన్ ఆనవాళ్లున్నాయని తేల్చింది. నిజనిర్ధారణ కమిటీ మరిన్ని ఆధారాలు చూపించే పనిలో ఉండగానే పశ్చిమ దేశాలూ ఈ దాడిలో సిరియా క్లోరిన్ వాడిందని ఒప్పుకొన్నాయి.

అక్కడికి వారం తరువాత... సిరియా రసాయన ఆయుధ కార్యక్రమంతో సంబంధం ఉన్నట్లుగా చెప్పే మూడు ప్రాంతాలపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు వైమానిక దాడులు చేశాయి.

తూర్పుఘూటాను స్వాధీనంలోకి తీసుకున్నామని సిరియా సైన్యం ప్రకటించడానికి కొద్ది గంటల ముందు ఈ దాడులు జరిగాయి. అప్పటికే తూర్పు ఘూటా నుంచి 1,40,000 మంది ప్రజలు తమ ఇళ్లను వీడి వెళ్లిపోయారు.

''జనం ఏడుస్తూ తమ ఇళ్లను వీడారు. అలసిపోయిన ముఖాలతో జనం దయనీయంగా కనిపించారు. వారి ముఖాల్లో కనిపించే బాధను ఇప్పటికీ మర్చిపోలేం'' అని దౌమాకు చెందిన మాన్యువల్ జరాదె చెప్పారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక దాడుల ఆనవాళ్లు

సిరియా ప్రభుత్వం ముందుకురాలేదు..

రసాయన ఆయుధాలు వినియోగించారనే విషయంలో బీబీసీ ప్రశ్నలకు సిరియా ప్రభుత్వం సమాధానమివ్వదు. బీబీసీ పనోరమా బృందాన్ని డమాస్కస్ వెళ్లేందుకు, దౌమాలో రసాయన దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.

సిరియా ప్రజల విషయంలో అంతర్జాతీయ సమాజం విఫలమైందని ఓపీసీడబ్ల్యూ మాజీ ఇన్‌స్పెక్టర్ జూలియన్ టాంగేర్ అభిప్రాయపడ్డారు. సిరియాలో అసద్‌కు ఇది జీవన్మనరణ పోరాటం.. యుద్ధం నుంచి వెనక్కు వెళ్లేందుకు అవకాశం లేదు. కానీ, యుద్ధాన్ని గెలవడానికి ఇది మాత్రం సరైన విధానం కాదని ఆయన అన్నారు.

అయితే... సిరియా అధ్యక్షుడు అసద్ బయటపడినట్లేనా? అంటే.. కచ్చితంగా కాదనే అంటున్నారు ఐరాసలో అమెరికా రాయబారి కెరెన్ పియర్స్. ''ఆధారాల సేకరణ కొనసాగుతోంది.. ఏదో ఒక రోజు న్యాయం గెలుస్తుంది.. ఆ దిశగా మా పని వేగవంతం చేస్తున్నాం'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)