తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం - బీబీసీ రియాలిటీ చెక్

  • 21 అక్టోబర్ 2018
బీబీసీ భారతీయ భాషలు

అంశం- అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాష తెలుగు.

నిజం- అవును, అమెరికా థింక్ టాంక్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఆ దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గత ఏడేళ్లలో 86 శాతం పెరిగింది. అయితే, అమెరికాలో ఇంగ్లిష్ కాకుండా ఎక్కువగా మాట్లాడే టాప్ 20 భాషల్లో ఇంకా స్థానం పొందలేకపోతోంది.


అమెరికాలో ఇంగ్లిష్ కాకుండా సర్వ సాధారణంగా మాట్లాడే భాషల గురించి ఆలోచిస్తే, వాటిలో తెలుగు కూడా ఉంటుందని ఎవరూ ఊహించరు.

అమెరికాలో తెలుగు మాట్లాడేవారు 2010-2017 మధ్య 86 శాతం పెరిగినట్టు ఆన్‌లైన్లో ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వీడియో చెబుతోంది.

ఈ వీడియో అమెరికాలో ఉన్న సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా జరిగిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించింది. అమెరికాలో మాట్లాడుతున్న భాషల గురించి తెలుసుకోడానికి అది జనాభా గణాంకాలను విశ్లేషించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నీనా దావులూరి, మిస్ అమెరికాగా ఎంపికైన తొలి ఇండియన్-అమెరికన్. ఈమె ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు

తెలుగు భాష పెరగడానికి కారణం ఏంటి?

తెలుగు భాషను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8 కోట్ల 40 లక్షల మంది మాట్లాడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికులు మాట్లాడే నాలుగో భాష తెలుగు.

అమెరికాలో మాట్లాడే భాషలపై జరిగిన అధ్యయనంలో అమెరికన్ కమ్యూనిటీ సర్వే గణాంకాలను ఉపయోగించారు. 2010-2017మధ్య జరిగిన ఈ సర్వేలో.. ఇంట్లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ కాకుండా ఎంత మంది ఏయే భాషల్లో మాట్లాడుతున్నారో పరిశీలించారు.

గత ఏడాది అమెరికాలో 4 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నట్టు గుర్తించారు. ఇది 2010లో ఉన్న వారితో పోలిస్తే రెట్టింపు అయ్యింది.

అమెరికాలో అత్యంత వేగంగా పెరుగుతున్న టాప్ 10 భాషల్లో ఏడు భాషలు దక్షిణ ఆసియాకు చెందినవి కావడం విశేషం.

తెలుగే ఎందుకు?

"హైదరాబాద్ - అమెరికాలోని ఇంజనీరింగ్, టెక్నాలజీ పరిశ్రమల మధ్య సంబంధాలకు వీరిలో చాలా మంది కారణమని చెప్పచ్చు" అని అమెరికాలోని తెలుగు పీపుల్ ఫౌండేషన్ స్థాపకుడు ప్రసాద్ కునిశెట్టి చెప్పారు. ఆయన ఐటీ రంగంలో తన కెరీర్ కొనసాగించడం కోసం 2001లో యూఎస్ వచ్చారు.

1990ల మధ్యలో జరిగిన ఐటీ వృద్ధితో అమెరికాలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు.

అమెరికాలో ఉన్న వారిలో చాలా మంది హైదరాబాద్ నుంచే ఇక్కడికి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు 800కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో అమెరికాకు వస్తున్న తెలుగు ఐటీ నిపుణుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

టెక్నాలజీ, ఇంజనీరింగ్ పరిశ్రమకు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక మేజర్ హబ్‌గా మారింది. అమెరికాకు భారీగా ఐటీ నిపుణులను అందిస్తోంది.

తెలుగు మాట్లాడే అమెరికన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐటీ నిపుణులను తమ సంస్థల్లో నియమించుకోవడం కూడా గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

చాలా మంది భారతీయులు హెచ్-1బి వీసా స్కీమ్‌ ద్వారా ప్రయోజనం పొందారు. అది ఏటా టెక్నాలజీ రంగం వైపు వచ్చే కొన్ని వేల మంది విదేశీయులు వర్క్ వీసాలు పొందడానికి కారణమైంది. ఒక అంచనా ప్రకారం వీటిలో 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. ఈ వీసా పొందినవారు అమెరికాలో శాశ్వత నివాస హోదాకు దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాద్‌కు చెందినవారు

తెలుగు సంఘాల ప్రభావం

తెలుగు సినిమా, ఇంటర్నెట్‌తో పాటు అమెరికాలోని తెలుగు సంఘాలు కూడా భాషా వ్యాప్తికి చాలా కృషి చేస్తున్నట్లు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ చెప్పారు. ఈ తరం పిల్లలకు మాతృభాషను చేరువ చేసేందుకు తెలుగు సంఘాలు మొదలుపెట్టిన 'మన బడి', 'పాఠశాల' లాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు.

అమెరికాలోని కొన్ని దేవాలయాల్లో తెలుగు నేర్పిస్తున్నారని, తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికన్ కుర్రాళ్లు కూడా తనకు తెలుసని, క్రమంగా తెలుగువాళ్లు స్థానిక రాజకీయాల్లోకి కూడా అడుగేస్తున్నారని అంటారు ప్రసాద్.

గతంలో ‘తానా’ అధ్యక్షుడిగానూ సేవలందించిన ప్రసాద్... ఏటా భారత్‌ నుంచి అమెరికా వచ్చే విద్యార్థుల్లో తెలుగువారి సంఖ్యే ఎక్కువని చెబుతారు.

అమెరికాలో ఉంటున్న తెలుగు మాట్లాడేవారిలో మొదటి ఇండియన్-అమెరికన్ మిస్ అమెరికా నీనా దావులూరి, ప్రస్తుత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

మాట్లాడేవారి శాతం పెరగడం చూస్తే తెలుగు ప్రాధాన్యం పెరిగినట్టే అనిపిస్తుంది. కానీ మిగతా భాషలతో పోలిస్తే ఇది దిగువ స్థాయి నుంచి ప్రారంభమైంది.

సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ లెక్కల ప్రకారం 2010-2017 మధ్య అమెరికాలో పుంజుకున్న కొత్త భాషల్లో స్పానిష్, చైనీస్, అరబిక్, హిందీ కూడా ఉన్నాయి.

అమెరికాలోని దాదాపు 32 కోట్ల మొత్తం జనాభాలో ఇంగ్లిష్ కాకుండా వేరే భాషలు మాట్లాడేవారు 60 శాతానికి పైగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది స్పానిష్ మాట్లాడుతున్నారు.

మిగతా వారిలో చాలా మంది దక్షిణాసియా భాషలు మాట్లాడుతున్నారు. వీటిలో హిందీ మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఉర్దూ, గుజరాతీ, తర్వాత తెలుగు ఉన్నాయి.

అమెరికాలో ఇళ్లలో ఫ్రెంచ్, జర్మన్ భాషలు మాట్లాడేవారి సంఖ్య తగ్గింది. గత దశాబ్దంగా ఇటాలియన్ భాష మాట్లాడేవారి సంఖ్య 2 లక్షలకు పైగా తగ్గింది.

సర్వేలో దాదాపు 80 శాతం మంది తెలుగు మాట్లాడేవారు తాము ఇంగ్లిష్ కూడా బాగా మాట్లాడగలమని చెప్పారు.

అయితే, జనాభా లెక్కల్లో ఒక లోపం ఉంది. సర్వేలో పాల్గొన్న వారిని మిగతా భాషల్లో ప్రావీణ్యం కాకుండా ఇంగ్లిష్ ఎంత బాగా మాట్లాడగలరని కూడా అడిగారని జార్జ్ మసాన్ యూనివర్సిటీలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ జెన్నిఫర్ లీమన్ చెప్పారు.

"ఇంగ్లిష్ బాగా మాట్లాడేవారిని, ముఖ్యంగా అమెరికాలో పుట్టిన వారిని లేదా చిన్నతనంలోనే ఇక్కడకు వచ్చినవారికి ఇంగ్లిషేతర భాషల్లో ఎంత ప్రావీణ్యం ఉందో తెలుసుకోవడం చాలా కష్టం" అన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)