ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బిలియనీర్స్... ఏ దేశంలో ఎందరున్నారు?

  • 23 అక్టోబర్ 2018
హాంకాంగ్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2017లో హాంకాంగ్‌లో 20 మందికి పైగా అపర కుబేరులున్నారు.

మీరు కానీ, మీ బంధువులు కానీ హాంకాంగ్‌లో నివసిస్తూ ఉంటే లీ కా-షీంగ్ గురించి తెలిసే ఉంటుంది. ఆయనకు మీ జేబు నుంచి డబ్బు ఇచ్చి ఉంటారు కూడా!

లీ కా-షీంగ్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఈ 90 ఏళ్ల వ్యాపారవేత్త ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద సుమారు 37.7 బిలియన్ డాలర్లు ఉంటుంది.

రవాణా, ఫైనాన్షియల్ రంగాల నుంచి, ఇంధన లేదా వినిమయ సంస్థల వరకూ ఈయన వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి.

Image copyright Getty Images

బహుళ జాతీయ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సంస్థ 'వెల్త్ ఎక్స్' విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఇతర దేశాలతో పోలిస్తే, ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఎక్కువ మంది హాంకాంగ్ నగరంలోనే ఉన్నారు. అయితే, న్యూయార్క్ నగరం మాత్రం ఇందుకు మినహాయింపు.

హాంకాంగ్ నగరంలో ప్రస్తుతం 93 మంది బిలియనీర్స్ (కోటీశ్వరులు) నివసిస్తున్నారు. 2016సం.తో పోలిస్తే ఇప్పటికి 21 మంది వ్యక్తులు ఈ కోటీశ్వరుల జాబితాలో కొత్తగా చేరారు.

ప్రపంచంలో ఎక్కువ మంది ధనికులున్న పది దేశాల్లో సగం దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆర్థిక అసమానతలు ఉన్న దేశాలేనని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

కొత్తగా పుట్టుకొస్తున్న బిలియనీర్ల వల్ల ప్రపంచంలోని ధనికుల సంఖ్య కూడా పెరుగుతోంది.

100 కోట్ల డాలర్ల సంపద కలిగిన ధనికులు 2017సం.లో 2,754మంది ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వీరందరి సంపద విలువ 9.2 ట్రిలియన్ డాలర్లు! అంటే జర్మనీ, జపాన్ రెండు దేశాల ఉమ్మడి స్థూల జాతీయోత్పత్తిని కలిపితే వచ్చే సంపద కంటే ఎక్కువ.

బిలియనీర్లు ఎక్కువగా ఉన్న నగరాలు (సోర్స్: వెల్త్-X)
నగరం 2017లో బిలియనీర్ల సంఖ్య 2016 నుంచి వచ్చిన మార్పు
1. న్యూయార్క్ 103 +1
2. హాంకాంగ్ 93 +21
3. శాన్‌ఫ్రాన్సిస్కో 74 +14
4. మాస్కో 69 -2
5. లండన్ 62 0
6. బీజింగ్ 57 +19
7. సింగపూర్ 44 +7
8. దుబాయ్ 40 +3
9. ముంబై 39 +10
9. షెన్‌జెన్ (చైనా) 39 +16
11. లాస్ ఏంజెలెస్ 38 +6
12. ఇస్తాంబుల్ 36 +8
13. సౌ పౌలో 33 +4
14. హ్యాంగ్‌ఝౌ (చైనా) 32 +11
15. టోక్యో 30 +8
16. ప్యారిస్ 29 0
17. రియాధ్ 26 +2
18. జెద్దా 23 +1
19. షాంఘై 23 +3
20. మెక్సికో నగరం 21 +2
టాప్ 10 బిలియనీర్లు ఉన్న దేశాలు (సోర్స్: వెల్త్-X)
దేశం బిలియనీర్ల సంఖ్య మార్పు(%) 2016-17 మొత్తం సంపద (బిలియన్ డాలర్లలో)
అమెరికా 680 9.7% 3,167
చైనా 338 35.7% 1,080
జర్మనీ 152 17.8% 466
భారత్ 104 22.4% 299
స్విట్జర్లాండ్ 99 15.1% 265
రష్యా 96 -4.0% 351
హాంకాంగ్ 93 29.2% 315
యునైటెడ్ కింగ్‌డమ్ (యు.కె) 90 -4.3% 251
సౌదీ అరేబియా 62 8.8% 169
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 62 19.2% 168

పెరుగుతున్న కోటీశ్వరుల సంఖ్య పట్ల నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక వర్గం నిపుణులు.. ప్రజల సంపాదనలో ఏర్పడిన అంతరాల వల్ల ఉత్పన్నమైన నైతిక అంశాల గురించి మాట్లాడుతున్నారు. ఉదాహరణకు, 'ఆక్స్‌ఫామ్' అనే ఎన్జీఓ కూడా పేదరికంపై విడుదల చేసిన తన వార్షిక నివేదికలో, అత్యంత ధనిక వర్గంపై పన్నుల భారం మరింత పెంచాలని సూచించింది.

ఇక మరో వర్గం నిపుణులు, కొత్తగా తయారవుతున్న బిలియనీర్ల పట్ల సానుకూలంగానే మాట్లాడుతున్నారు.

Image copyright Getty Images

ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్త కెరోలిన్ ఫ్రాన్డ్ 2016సం.లో రాసిన 'ద రైజ్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్ టైకూన్స్ అండ్ దెయిర్ మెగా ఫర్మ్స్' పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ఈమె సంపన్నులకు మద్దతు పలికారు.

''సంపన్నులను విమర్శించడం, నిందించడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ, అందరూ అలా కాదు. వివిధ మార్గాల్లో సంపదను కూడగట్టవచ్చు. అయితే, సమాజంపై ఈ ధనికుల ప్రభావం.. వారు ఏ మార్గాల్లో సంపన్నులయ్యారనే విషయంపై ఆధారపడి ఉంటుంది'' అని కెరోలిన్ ఫ్రాన్డ్ బీబీసీతో అన్నారు.

ఎటువంటి వనరులు లేకుండా స్వశక్తితో వ్యాపారం చేసి, కోట్లు సంపాదించిన వ్యక్తుల వల్ల మాత్రమే తోటివారికి లాభం చేకూరుతుంది.

Image copyright Getty Images

అపర కుబేరులు ప్రపంచవ్యాప్తంగా 72 దేశాలకు విస్తరించారని అమెరికా వ్యాపార పత్రిక ఫోర్బ్స్ మ్యాగజీన్ తెలిపింది. భారత్, చైనా, హాంకాంగ్ దేశాలు రెండంకెల వృద్ధిని సాధించాయి.

ఆసియా అపర కుబేరుల సంఘం సభ్యులు 784కు పెరిగారు. ఈ సంఖ్య ఉత్తర అమెరికాలోని కుబేరుల జనాభా(727) కంటే ఎక్కువ. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి.

చైనా జనాభాలోని 1% ధనికులు, దేశ సంపదలో మూడో వంతు సంపదను కలిగి ఉన్నారని, 25% ఉన్న నిరుపేదలు దేశ సంపదలో కేవలం ఒక్క శాతాన్ని మాత్రమే కలిగి ఉన్నారని బీజింగ్ యూనివర్సిటీ 2016లో చెప్పింది.

మానవాభివృద్ధి సూచి జాబితాలో చివరి 20 స్థానాల్లో 19 ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆఫ్రికా దేశాల్లో 44 మంది అపర కుబేరులున్నారు. వీరందరి సంపద విలువ మొత్తం 93 బిలియన్ డాలర్లు.

ఒక ముక్కలో చెప్పాలంటే ఇలా ఊహించుకోవచ్చు... ఈ 44 మంది కుబేరులే ఒక దేశంగా ఏర్పడితే, వీరి సంపద ఆఫ్రికాలోని 54 దేశాల్లో అత్యధిక స్థూల జాతీయోత్పత్తి సాధించిన దేశాల్లో 8వ స్థానంలో నిలుస్తుంది!

'ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్' లెక్కల ప్రకారం 2017లో ఆఫ్రికా తలసరి ఆదాయం 1,825 డాలర్లు. కానీ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో భారత్ కంటే వేగంగా సంపన్నులు పెరుగుతున్నారు.

1990 దశకం మధ్యలో కేవలం ఇద్దరు భారతీయులకు మాత్రమే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. కానీ 2016లో 84 మంది చోటు సంపాదించారు.

2016 నాటికి, భారత్‌లో 28 కోట్లమంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని ప్రపంచ బ్యాంకు గణాంకాలు అంచనా వేశాయి.

Image copyright Getty Images

''పేద దేశాలతో పోల్చుకుంటే, ధనిక దేశాల్లో సంపన్నుల వృద్ధి తక్కువగా ఉండటం అన్నది, ఆయా దేశాల్లో కష్టించి పని చేసే, గుర్తింపుకు నోచుకోనివారికి కోపం తెప్పించేదిగా ఉండొచ్చు. కానీ పేద దేశాల్లో సంపన్నుల సంఖ్య పెరగడం అన్నది ఆ దేశాల్లోని ఆరోగ్యకర ఆర్థిక వ్యవస్థకు అద్దం పడుతోంది. కానీ ఉత్పాదకత లాభసాటిగా ఉండటం అన్నది ఆ దేశ జీవన ప్రమాణాలు వృద్ధి చెందడానికి ప్రధాన కారణం'' అని ఫ్రాన్డ్ అన్నారు.

అభివృద్ధి

చైనాలో తయారీ రంగ పరిశ్రమలు వృద్ధి చెందడంతో కార్మికుల వేతనాలు 2009-2013 మధ్య మూడింతలు పెరిగినట్లు 'అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్' వెల్లడించిన విషయాన్ని ఫ్రాన్డ్ ప్రస్తావించారు.

అపర కుబేరులు స్థాపించిన సంస్థల కంటే, ఎదుగుతున్న మార్కెట్‌లో స్థాపించిన సంస్థలు.. ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయని ఆర్థికవేత్తల అధ్యయనాలు చెబుతున్నాయి.

Image copyright Getty Images

''అలాంటి మార్కెట్‌లలో పారిశ్రామికవేత్తలు సంపన్నులు కావడం సహజమే. వీరిపై అభివృద్ధి చెందిన దేశాల్లోని సంస్థలతో పోటీ పడే సానుకూల ప్రభావాలు కూడా ఉంటాయి'' అని ఫ్రాన్డ్ తెలిపారు.

2025 నాటికి 500 కంపెనీలు, ప్రపంచంలోని అపర కుబేరుల్లో 50శాతం మంది, వర్ధమాన దేశాల్లో ఉంటారని కన్సల్టెన్సీ సంస్థ మెక్ కిన్సే జోస్యం చెబుతోంది.

ఈ చర్చకు ఆక్స్‌ఫామ్ సంస్థ మరో కోణాన్ని తెరపైకి తెచ్చింది.

1990-2010 మధ్య పెరిగిన అసమానతలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది ప్రజలను తీవ్ర దారిద్ర్యం నుంచి బయటపడకుండా అడ్డుకుంది.

''సమాజంలోని పేదలకు సాయం అవసరమైన సందర్భాల్లో చాలా సార్లు.. ఈ ఆర్థిక రంగాల అభివృద్ధి, సంపన్నుల జేబులు నింపింది. ఆఫ్రికా దేశాల్లోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిని అందించిన నైజీరియా లాంటి దేశాల్లో దారిద్ర్యం పెరిగింది'' అని ఆక్స్‌ఫామ్‌కు చెందిన రెబెకా గోవ్లాండ్ బీబీసీతో అన్నారు.

Image copyright Getty Images

1987-2002 సంవత్సరాల మధ్య 23 దేశాలకు చెందిన సంపన్నుల వివరాలను అధ్యయనం చేశారు. అందులో రాజకీయ నాయకులతో పరిచయాల వల్లే వారు ధనవంతులయ్యారని గుర్తించారు. ఈ పరిణామాలు ఆ దేశ ఆర్థిక రంగం, సంపదపై ప్రభావం చూపుతాయి.

సంపన్నుల గురించి ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ మాట్లాడుతూ, ధనవంతులందరూ సంపదను తమ పిల్లలకు ఇస్తూపోతే సమాజ చలనశక్తికి వారే అడ్డంకిగా మారుతారని అన్నారు.

2017లో... ప్రపంచంలో, స్వశక్తితో సంపాదించిన సంపద (56.8%), వారసత్వంగా వచ్చిన సంపద (2016లో 13.2% ఉన్న సంపద 2017లో 11.7%కి పెరిగింది)గా విభజించవచ్చని 'వెల్త్ X' అధ్యయనంలో తెలిపింది.

Image copyright Getty Images

''ఈ సందర్భంలో సంపన్నులపై పన్ను విధానం, వారికిచ్చే పాలసీల విషయంలో ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా వారసత్వ సంపద గురించి ఆలోచించాలి. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందే. కానీ వారి పిల్లలు తమ తల్లిదండ్రుల సంపదను అనుభవిస్తూ కూర్చుంటాం అంటే సరిపోదు. తమ తల్లిదండ్రుల్లాగే వారు కూడా పని చేయాలి'' అని కెరోలిన్ ఫ్రాన్డ్ అన్నారు.

''ఈ ప్రయాణంలో రాజకీయ అధికారాన్ని నియంత్రించాలి. లేకపోతే సక్రమమైన సంపదను కూడా రాజకీయాలే శాశిస్తాయి. అలా జరగకుండా జాగ్రత్తపడటానికి బలమైన వ్యవస్థ అవసరం'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ఎన్‌కౌంటర్: నిందితుల మృతదేహాలు అప్పగించాలని కుటుంబ సభ్యుల ఆందోళన

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’.. క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?

'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే...'

సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...