హాంకాంగ్ - జుహాయ్ - మకావు మార్గం: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభం

  • 23 అక్టోబర్ 2018
హంకాంగ్ - జుహాయ్ మార్గం Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ వంతెన నిర్మాణం 2009లో ప్రారంభమైంది

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన మంగళవారం ప్రారంభమవుతోంది. ఈ అద్భుత నిర్మాణానికి తొమ్మిదేళ్ళు పట్టింది.

ఈ వంతెన పొడవు 55 కిలోమీటర్లు. ఇది హాంకాంగ్ నుంచి మకావు మీదుగా చైనాలోని జుహాయి నగరానికి వెళ్తుంది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వంతెన ప్రారంభోత్సవం కోసం మంగళవారం జుహాయికి చేరుకుంటారని భావిస్తున్నారు.

ఈ వంతెన నిర్మాణానికి 2,000 కోట్ల డాలర్లు (దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు) ఖర్చయింది. అయితే, ఇది అవసరం లేని 'తెల్ల ఏనుగు' అని విమర్శకులు అంటున్నారు.

భద్రత సమస్యల వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఆలస్యం జరిగింది. ఈ పనుల్లో 18 మంది కార్మికులు చనిపోయారని అధికారులు చెప్పారు.

బుధవారం నుంచి ఈ వంతెనను అధికారికంగా ప్రజలకు అంకితం చేస్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు కృత్రిమ దీవులను కూడా నిర్మించారు

ఈ వంతెన ప్రత్యేకతలేమిటి?

ఈ బ్రిడ్జి దక్షిణ చైనాలోని మూడు తీర ప్రాంత నగరాలను - హాంకాంగ్, మకావు, జుహాయి - కలుపుతుంది.

భూకంపాలు, తుపాన్లను తట్టుకునే విధంగా నిర్మించిన ఈ వంతెన కోసం 4 లక్షల టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ మొత్తం ఉక్కుతో 60 ఐఫిల్ టవర్లను కట్టవచ్చు.

ఈ వంతెనలో 30 కిలోమీటర్ల మార్గాన్ని పెరల్ రివర్ డెల్టా సముద్రం మీదే నిర్మించారు. ఇందులో 6.7 కిలోమీటర్ల రోడ్డు మధ్యలో సముద్ర గర్భంలో ఉంటుంది. రెండు కృత్రిమ దీవుల గుండా ఈ సొరంగ మార్గం వెళ్తుంది.

ఇందులో ఇంకా లింకు రోడ్లు, జూహాయి, హాంకాంగ్ నగరాలను ప్రధాన వంతెనకు కలిపే భూతల సొరంగమార్గాలు కూడా ఉన్నాయి.

Image copyright Getty Images

ఈ వంతెనను ఎందుకు నిర్మించారు?

దక్షిణ చైనాలో హాంకాంగ్, మకావు వంటి తొమ్మిది నగరాలను కలుపుతూ విశాల తీర ప్రాంతాన్ని సృష్టించాలనే ప్రణాళికలో భాగంగా ఈ బ్రిడ్జి రూపుదిద్దుకుంది.

ఈ ప్రాంతంలో ప్రస్తుతం 6.8 కోట్ల మంది నివసిస్తున్నారు.

గతంలో, జుహాయి - హాంకాంగ్ ల మధ్య ప్రయాణానికి నాలుగు గంటలు పట్టేది. ఇప్పుడు ఈ వంతెన మీద ఆ వ్యవధి 30 నిమిషాలకు తగ్గిపోయింది.

చిత్రం శీర్షిక జుహాయ్ నుంచి హాంకాంగ్ వరకు నిర్మించిన వంతెన మార్గం

ఈ బ్రిడ్జి మీద ఎవరైనా వెళ్ళవచ్చా?

లేదు. కోటా విధానం ద్వారా అనుమతి పొందిన వారు మాత్రమే ఈ బ్రిడ్జి మీద ప్రయాణించాలి. అన్ని వాహనాలూ టోల్ సుంకం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రజారవాణా వ్యవస్థకు దీని మీద అనుమతి లేదు. ప్రైవేటు షటిల్ బస్సులు వెళ్ళవచ్చు. అయితే, దీనికి రైలు మార్గాలతో అనుసంధానం లేదు.

రోజూ 9,200 వాహనాలు ఈ వంతెన మీద ప్రయాణిస్తాయన్నది అధికారుల ప్రాథమిక అంచనా. అయితే, ఈ ప్రాంతంలో కొత్త రహదారుల నిర్మాణం కూడా జరిగిన నేపథ్యంలో ఈ అంచనాను వారు తగ్గించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హాంకాంగ్- జుహాయ్ మార్గం నిర్మాణ పనులు

ప్రజలు ఏమంటున్నారు?

ఈ ప్రాజెక్టు మీద విమర్శలు కూడా తీవ్రంగానే వినిపిస్తున్నాయి.

ఇదొక 'మృత్యు వంతెన' అని కొన్ని స్థానిక పత్రికలు అభివర్ణించాయి. హాంకాంగ్ వైపు నుంచి కనీసం తొమ్మిది మంది, చైనా వైపు నుంచి మరో తొమ్మిది కార్మికులు చనిపోయారని అధికారులు బీబీసీ న్యూస్ చైనీస్‌తో చెప్పారు.

వందల మంది కార్మికులు ఈ వంతెన నిర్మాణంలో గాయపడ్డారు.

అంతేకాకుండా, పర్యావరణానికి కూడా ఈ నిర్మాణం హాని చేస్తుందనే ఆరోపణలున్నాయి.

ఈ నిర్మాణం ఇప్పటికే సముద్ర జీవరాశికి ఎంతో హాని చేసిందని, ముఖ్యంగా అత్యంత అరుదైన తెల్ల డాల్ఫిన్‌లకు తీరని నష్టం కలిగించిందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

హాంకాంగ్ జలాల్లో డాల్ఫిన్ల సంఖ్య 148 నుంచి 48కి పడిపోయిందని, ఇది ఈ పదేళ్ళలో వచ్చిన మార్పు అని వరల్డ్ వైట్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్) హాంకాంగ్ శాఖ తెలిపింది.

"ఈ ప్రాజెక్ట్ సముద్ర పర్యావరణానికి కోలుకోలేనంతటి నష్టం మిగిల్చింది" అని డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్ ఓషన్ కన్సర్వేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ సమంతా లీ అన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక హాంకాంగ్ - జుహాయ్ మార్గం జలాల్లో కనిపించే అరుదైన తెల్ల డాల్ఫిన్లు

పెట్టిన ఖర్చుకు ఫలితం ఉంటుందా?

చుట్టుపక్కల లింకు రోడ్లు, కృత్రిమ దీవులతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అత్యధికంగా 2,000 కోట్ల డాలర్లు ఖర్చయింది. ఒక్క ప్రధాన వంతెన నిర్మాణానికే దాదాపు 700 కోట్ల డాలర్లు ఖర్చయింది.

ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు 10 లక్షల కోట్ల యువాన్లను సమకూర్చుతుందని చైనా అధికారులు చెబుతున్నారు. కానీ, హాంకాంగ్ అధికారులు మాత్రం అంత ఉండదని అంటున్నారు.

"కార్లు అధిక సంఖ్యలో ఆ వంతెనను ఉపయోగించకపోతే రాబడి ఎలా ఉంటుంది" అని తన్యా చాన్ బీబీసీ న్యూస్‌తో అన్నారు. నిర్మాణ వ్యయాన్ని రాబట్టడం సాధ్యమయ్యే పని కాదని కూడా చాన్ వివరించారు.

బీబీసీ చైనీస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వంతెన టోల్ సుంకం రూపంలో ఏడాదికి 8.6 కోట్ల డాలర్లను మాత్రమే ఆర్జిస్తుంది. ఈ మొత్తంలో మూడో వంతు బ్రిడ్జి నిర్వహణ వ్యయం కిందే పోతుంది.

విమర్శుకులు ఈ వంతెనను 'తెల్ల ఏనుగు'గా అభివర్ణిస్తున్నారు. రాబడి ఏమీ ఉండదని అంటున్నారు. ఇతరులు మాత్రం దీని ప్రధాన లక్ష్యం, హాంకాంగ్ - చైనా మధ్య భూభాగానికి మధ్య అనుసంధానానికి ప్రతీకగా కనిపించడమే అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో 34 కొత్త కేసులతో 226కు చేరిన కోవిడ్ బాధితులు

కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం

కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు

కరోనావైరస్ లాక్‌డౌన్: 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలి'

కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?

కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు