భారత్: ఒకపక్క ఊబకాయం.. మరోపక్క పోషకాహార లోపం.. ఎందుకిలా?
- డాక్టర్. సోఫీ, డాక్టర్. లిండ్సే కెయిర్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకాత్మక చిత్రం
పశ్చిమ దేశాల్లో అధిక బరువు కలిగిన వారు, పేద దేశాల్లో తక్కువ బరువు కలిగినవారు అధికంగా ఉంటారని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది.
పదింట తొమ్మిది దేశాలు 'బరువు' సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ దేశాల్లో ఊబకాయంతో బాధపడేవారు, పౌష్టికాహార లోపంతో బాధపడే ప్రజలు పక్కపక్కనే బతుకుతున్నారు.
ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జంక్ ఫుడ్ విస్తరించడం, గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు పెరగడం, రవాణా సౌకర్యాలు మెరుగవ్వడం, టీవీలు, శారీరక శ్రమను తగ్గించేస్తున్న గృహోపకరణాలు కూడా అందుకు కారణాలుగానే చెప్పుకోవాలి.
బరువు అధికంగా ఉన్నవారిలో పోషకాహార లోపం లేదని చెప్పలేం. కొందరు వయసుకు తగ్గ బరువు ఉంటారు, కానీ వారిలో కొవ్వు మోతాదుకు మించి ఉంటోంది.
పిల్లల్లో ఊబకాయం
ప్రతి దేశమూ ఎంతో కొంత మేర పోషకాహార లోపం సమస్య ఎదుర్కొంటోంది.
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆహార కొరతతో బాధపడుతున్న వారి సంఖ్య 2016లో 81.5 కోట్లు ఉంటుందని అంచనా. రెండేళ్లలో ఆ సంఖ్య 5 శాతం పెరిగింది. ఆఫ్రికాలో ఆ పెరుగుదల అధికంగా ఉంది. అక్కడ 20 శాతం మందిలో పోషకాహార లోపం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా గడచిన 40 ఏళ్లలో ఊబకాయం బాధితుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 60 కోట్ల మందికి పైగా వయోజనులు ఊబకాయంతో బాధపడుతుండగా, 190 కోట్ల మంది అధిక బరువు కలిగి ఉన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఊబకాయం రేటు అంతకంతకూ పెరిగిపోతోంది.
పిల్లల్లో ఊబకాయం రేటు మైక్రోనేషియా, మధ్య ప్రాచ్యం, కరీబియన్ ప్రాంతాల్లో అత్యధికంగా ఉంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆఫ్రికాలో ఊబకాయంతో బాధపడే పిల్లల సంఖ్య రెట్టింపయ్యింది.
చాలా ప్రాంతాల్లో చిన్నారులు తీసుకునే ఆహారంలో వాళ్ల శరీరానికి అవసరమైన మోతాదులో పోషకాలు ఉండటంలేదు.
దక్షిణాఫ్రికాలో దాదాపు ప్రతి ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. మరొకరు ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు కలిగి ఉన్నారు.
బ్రెజిల్లో 36 శాతం మంది బాలికలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఆయాసపడుతుండగా, 16 శాతం మంది ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు ఉన్నారు.
భారత్‌లో ఎలా ఉంది?
జీవన విధానంలో వచ్చిన మార్పులే ఊబకాయానికి, పోషకాహార లోపానికి కొంతమేర కారణమవుతున్నాయి.
భారత్, బ్రెజిల్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పాశ్చాత్య వంటకాల వైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చక్కెర, కొవ్వు, మాంసం అధికంగా తీసుకుంటున్నారు. పప్పు ధాన్యాలను అశ్రద్ధ చేస్తున్నారు.
కొన్ని దేశాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరగడమూ ఈ సమస్యకు ఓ కారణమే. అప్పటిదాకా సంప్రదాయ వంటకాలకు అలవాటుపడిన పిల్లలు, పట్టణాలకు వెళ్లాక జంక్ ఫుడ్ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఉదాహరణకు, చైనాలోని గ్రామీణ ప్రాంత చిన్నారులపై జరిపిన అధ్యయనంలో 10 శాతం మంది ఊబకాయంతో, 21 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని తేలింది.
పట్టణ ప్రాంతాల్లో సర్వే చేయగా 17 శాతం మంది చిన్నారులు ఊబకాయం, 14 శాతం మంది పౌష్టికాహార లోపం సమస్య ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది.
చాలామంది అధిక కెలోరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. అందులో విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.
ఆహార అలవాట్లలో మార్పుల కారణంగా భారత్‌లో కొందరు చిన్న వయసులోనే మధుమేహం లాంటి జబ్బుల బారిన పడుతున్నారని పుణెకు చెందిన ప్రొఫెసర్ రంజన్ యాజ్నిక్ తెలిపారు. "'సాధారణంగా వయసు మీదపడిన వారికి, ఊబకాయంతో బాధపడే వారికి మధుమేహం వస్తుంది. కానీ, ప్రస్తుతం భారత్‌లో తక్కువ బరువున్న యువతలోనూ మధుమేహం చూస్తున్నాం" అని ఆయన చెప్పారు.
తక్కువ పోషకాలు, అధిక కెలోరీలు ఉండే జంక్ ఫుడ్‌కు అలవాటు పడటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కొందరు చూసేందుకు సన్నగానే ఉన్నా వారి శరీరంలో కొవ్వు అధికంగా ఉంటోందని అన్నారు. ఆ కొవ్వు టైప్-2 మధుమేహంతో పాటు, గుండె సంబంధిత రుగ్మతలకు కారణమవుతుందని రంజన్ వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆకలి తీరేదెలా?
పిల్లలు ఎదిగే క్రమంలో విటమిన్లు, ఖనిజాలు సరైన మోతాదులో అందుతుండాలి. కానీ, జంక్ ఫుడ్‌కు అలవాటు పడటం వల్ల ఆ పోషకాలు లోపించి వారిలో ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
ఇంట్లో ఊబకాయంతో ఉన్న కుటుంబ సభ్యులు తినే ఆహారమే తింటున్నా కొందరు చిన్నారుల్లో పోషకాలు లోపిస్తాయి. కారణం, ఆ ఆహారంలో విటమిన్లు సరైన మోతాదులో లేకపోవడమే.
అలా చిన్నప్పుడు పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులు పెద్దయ్యాక స్థూలకాయం భారిన పడే అవకాశం ఉంటుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.
అందుకే, పిల్లలకు పోషకాహారం అందేలా చూడటం చాలా ముఖ్యం.
పాశ్చాత్య జీవన విధానం
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఊబకాయం సమస్య అధికంగా ఉంటోంది. ధనిక దేశాల్లోనూ ఉంది.
భారత్‌లో దాదాపు 10.2 కోట్ల మంది పురుషులు, 10.1 కోట్ల మంది మహిళలు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు కలిగి ఉన్నారని 2016లో ది లాన్సెట్ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో తేలింది.
బ్రిటన్‌లో 25 శాతం మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారు. వారి వైద్యం కోసం ప్రభుత్వంపై ఏటా 5.1 బిలియన్ పౌండ్ల భారం పడుతోంది. 37 లక్షల మంది చిన్నారులకు సరైన పోషకాహారం అందడంలేదు.
యూరోపియన్ యూనియన్‌లోని 15-19 ఏళ్ల వయసు పిల్లల్లో 14 శాతం మంది తక్కువ బరువుతో బాధపడుతుండగా, దాదాపు అంతే స్థాయిలో అధిక బరువు లేదా ఊబకాయంతో ఇబ్బందిపడుతున్నారు.
చిన్నతనంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలు పెద్దయ్యాక కేన్సర్ లాంటి సమస్యలకు దారితీసే ప్రమాదమూ ఉంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
కార్యాచరణ ఏమిటి?
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మధుమేహం, గుండె జబ్బుల రేటు మరింత పెరిగే అవకాశం ఉంది. వాటిని కట్టడి చేయడం ప్రభుత్వాలకు పెద్ద సవాలే అవుతుంది.
రానున్న దశాబ్ద కాలంలో ఆహార భద్రత, పోషకాహార లోపాన్ని పూర్తిగా నివారించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన కార్యక్రమంలో మొట్టమొదట చేరిన దేశం బ్రెజిల్.
ఊబకాయం సమస్యను కట్టడి చేయడం, తీపి పానీయాల వినియోగాన్ని 30 శాతం తగ్గించడం, పండ్లు, కూరగాయల రసాలు నేరుగా తీసుకోవడాన్ని 18 శాతం పెంచడం ఆ కార్యక్రమం లక్ష్యం.
కృత్రిమంగా తయారు చేసే తీపి పానీయాలపై 10 శాతం పన్ను వేయడం ద్వారా అందరికంటే ముందుగా 'చక్కెర పన్ను'ను అమలు చేసిన దేశంగా మెక్సికో పేరు తెచ్చుకుంది.
ఆ పన్ను ప్రభావంతో తీపి పదార్థాల వినియోగం నియంత్రణలోకి వస్తుంది. దాంతో 12 ఏళ్లలో ఊబకాయం కేసుల రేటును 12.5 శాతం తగ్గుతుందని మెక్సికో అంచనా వేస్తోంది.
ఇప్పుడు మెక్సికో మాదిరిగానే భారత్, బ్రిటన్ తదితర దేశాలు కూడా కార్యాచరణ ప్రారంభిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అబ్బాయిల ముందు అమ్మాయి ఎందుకు ఎక్కువ తినదు?
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- నాలుగేళ్లలో 25,600 బ్యాంకింగ్ మోసాలు, రూ.22,743 కోట్లు విలువైన కుంభకోణాలు
- తెలంగాణలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ: దొంగ ముఖాన్ని ఇట్టే పట్టేస్తుంది
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందంట!!
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- ఓటమి చేసే మేలేంటో మీకు తెలుసా!
- ఎవరు ఎక్కువ ఆరోగ్యవంతులు.. మగవాళ్లా లేక ఆడవాళ్లా?
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీసు ఇది.. భారత్‌లోనే ఉంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)