నూర్ ఇనాయత్ ఖాన్: బ్రిటన్ కీర్తించే గూఢచారి ఈ భారతీయ యువరాణి

నూర్ ఇనాయత్ ఖాన్

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ త్వరలో విడుదల చేసే 50 పౌండ్ల కరెన్సీ నోటుపై ముఖచిత్రం కోసం ప్రతిపాదనలు కోరుతూ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. చాలా మంది ఆ కరెన్సీపై నూర్ ఇనాయత్‌ ఖాన్‌ చిత్రం ఉండాలని కోరుతున్నారు.

అయితే, నూర్‌ బ్రిటన్ పౌరురాలేమీ కాదు. కానీ, బ్రిటన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఇంతకీ ఎవరీ నూర్ ఇనాయత్ ఖాన్?

నూర్ గురించి చెప్పాలంటే ఫ్రాన్స్‌కు వెళ్లాలి. అటు నుంచి భారత్‌కు రావాలి. మాస్కోలో పుట్టిన నూర్ నిజానికి ఓ యువరాణి. మైసూర్‌ను పాలించిన టిప్పుసుల్తాన్ వంశస్థురాలు.

నూర్ తండ్రి సూఫీ ముస్లిం. తల్లి అమెరికన్. మొదట వీరి కుటుంబం లండన్‌కు వెళ్లింది. అక్కడి నుంచి పారిస్‌కు వెళ్లి స్థిరపడింది.

ఫొటో సోర్స్, Getty Images

1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలవగానే నూర్ తన సోదరుడు విలాయత్‌తో కలిసి తిరిగి లండన్‌కు వచ్చారు. ఫ్రాన్స్‌లో నాజీల అరాచకాలను చూసి వారిపై పోరాడాలని నిర్ణయించుకున్నారు.

ఇంగ్లండ్‌కు రాగానే అక్కడ మహిళల వైమానిక దళంలో వైర్‌లెస్ రేడియా ఆపరేటర్‌గా చేరారు. అక్కడే బ్రిటన్ గూఢచర్య దళాలు ఆమె ప్రతిభను గుర్తించాయి.

నాజీలపై పోరాటంలో భాగంగా నాటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దళంలో నూర్ గూఢచారిగా చేరారు.

పారిస్‌లో గూఢచర్యం చేయడం అప్పటి పరిస్థితుల్లో చావుకు ఎదురుగా వెళ్లడంలాంటిదే. కానీ, ఆమె దానిని స్వీకరించారు.

నాజీ ఆక్రమిత పారిస్‌కు లండన్‌కు మధ్య రహస్యంగా సమాచారం చేరవేసే స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎస్‌ఓఈ) రేడియో ఆపరేటర్‌గా తన పని మొదలుపెట్టారు.

మాడెలీన్, నోరా బేకర్ అనే మారుపేర్లతో పారిస్‌లో రహస్యంగా విధులు నిర్వర్తించారు.

సహచరుడి నమ్మకద్రోహం

నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో గెస్టపోలు ( నాజీల రహస్య సైనిక దళం) జల్లెడ పడుతున్నాయి. అనుమానితులను కాన్సంట్రేషన్‌ క్యాంప్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నాయి.

పారిస్‌లోని నాజీ వ్యతిరేక గూఢచర్య సంస్థలను ధ్వసం చేస్తున్నాయి. ఆ సమయంలో పారిస్‌లో లండన్‌కు ఉన్న ఏకైక సమాచార వ్యవస్థ నూర్ ఒక్కరే.

తన చుట్టూ ఉన్న గూఢచర్య వ్యవస్థ ధ్వంసం చేసినా, తన పై అధికారులు వెనక్కి వచ్చేయమని ఆదేశించినా నూర్ వినలేదు. పారిస్‌లో బ్రిటన్ గూఢచారిగా అన్నీ తానై చూసుకున్నారు.

దాదాపు మూడు నెలలు ఒంటిచేత్తో తన పనిని నిర్వర్తించింది. నాజీలకు పట్టుబడకుండా మారుపేర్లతో తన స్థావరాన్ని మార్చుకుంటూ వెళ్ళారు.

కానీ, సహచర ఫ్రెంచ్ సైనికుడి ద్రోహం వల్ల ఆమె చివరకు గెస్టపో దళాలకు చిక్కారు.

చిత్రహింసలు పెట్టి..

గెస్టపో( నాజీల రహస్య సైనిక దళం) దాదాపు 10 నెలలు చిత్రహింసలు పెట్టినప్పటికీ నూర్ నుంచి లండన్‌కు సంబంధించిన ఒక్క రహస్యాన్ని కూడా వారు రాబట్టలేకపోయారు.

13 సెప్టెంబర్ 1944న నాజీల శిబిరంలో ఆమెను హత్య చేశారు.

అసమాన త్యాగం

నూర్ బ్రిటన్ పౌరురాలు కాదు. కానీ, ఆ దేశం కోసం ప్రాణాన్నే త్యాగం చేశారు. అందుకే బ్రిటన్ వాసులు ఇంకా ఆమెను గుర్తుంచుకుంటున్నారు.

ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా ఆమె త్యాగాన్ని గుర్తించింది. నూర్ పేరు మీద రెండు స్మారక కట్టడాలు నిర్మించింది. యేటా ఆమె వర్థంతి రోజు ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

బ్రిటన్ ప్రభుత్వం 1949లో ఆమెకు జార్జ్ క్రాస్ అవార్డును ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images

లండన్‌ స్క్వేర్‌ గార్డెన్స్‌లో నూర్‌ఖాన్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఒక ఆసియా ముస్లిం మహిళకు ఇంగ్లాండ్‌లో ఈ స్థాయి గౌరవం దక్కడం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.

నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌ చరిత్రను 'స్పై ప్రిన్సెస్‌' పేరుతో గ్రంథస్తం చేసిన జర్నలిస్టు, రచయిత శ్రావణి బసు ఆమె గురించి మాట్లాడుతూ, ''నూర్ సాహసం చరిత్రలో కనుమరుగై పోకుండా ప్రభుత్వం చూడాలి. అది చాలా ముఖ్యమైన బాధ్యత'' అని చెప్పారు.

''ఈ దేశం (ఇంగ్లాండ్) కోసం ఆమె చనిపోయారు. ఆమె త్యాగం నిరుపమానం. నిజానికి, ఆమెకు మన దేశం కోసం పోరాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనం ఆమెను మరిచిపోతే నేరం చేసినట్లే'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)