అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ ట్యాప్ అవుతోందా? ‘మీరు ఐఫోన్‌ను వదిలేసి హువావే వాడండి’ : చైనా

  • 26 అక్టోబర్ 2018
ట్రంప్, ట్రంప్ ఫోన్ Image copyright THE WHITE HOUSE

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫోన్ ట్యాప్ అవుతోందని, ఆయన తన వ్యక్తిగత ఫోన్‌లో స్నేహితులతో ఏం మాట్లాడుతున్నారో అదంతా చైనా, రష్యాలు వింటున్నాయంటూ తాజాగా వచ్చిన ఓ వార్తా కథనంపై చైనా స్పందించింది. అవి నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది.

అనుమానం ఉంటే, ట్రంప్ ఐఫోన్‌ను వదిలేసి చైనా కంపెనీ తయారు చేసిన హువావే ఫోన్ వాడాలని సరదాగా సలహా ఇచ్చింది.

ట్రంప్ తన పాత స్నేహితులతో ఐఫోన్‌లో ఏం మాట్లాడుతున్నారో అంతా చైనీయులు, రష్యన్లు వింటున్నారని అమెరికన్ ఇంటలిజెన్స్ విభాగం నివేదిక చెబుతోందంటూ ఈ నెల 24న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనం పేర్కొంది. అలా భద్రత లేని కాల్స్ మాట్లాడవద్దని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు కూడా తెలిపింది.

అయితే, ఆ కథనాన్ని "ఫేక్ న్యూస్"గా డోనల్డ్ ట్రంప్ అభివర్ణించారు.

భద్రతా అధికారులు క్షుణ్ణంగా పరీక్షించి ఇచ్చిన ఫోన్లనే తాను వినియోగిస్తున్నానని ఆయన చెప్పారు.

ఆ కథనానికి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ గురువారం వ్యంగ్యంగా స్పందించారు. "ఆ వార్త చదువుతుంటే, ఉత్తమ స్క్రిప్ట్ విభాగంలో ఆస్కార్ అవార్డు పొందేందుకు ప్రస్తుతం అమెరికాలో కొందరు తీవ్రంగా కష్టపడుతున్నట్లు అనిపించింది" అని వ్యాఖ్యానించారు.

చైనా సంస్థ తయారు చేసిన ఫోన్‌ను ట్రంప్ వాడితే భద్రతకు ఢోకా ఉండదేమో అని ఆమె అన్నారు.

"ఒకవేళ ప్రస్తుతం వాళ్లు వాడుతున్న ఐఫోన్లలో భద్రతపై అనుమానం ఉంటే హువావే ఫోన్‌ను వాడొచ్చు" అని సూచించారు.

"అప్పటికీ అనుమానాలు తగ్గకుంటే, అన్ని రకాల ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలనూ వాడటం మానేసి, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసుకునే అవకాశం కూడా వాళ్లకుంది" అని చున్‌యింగ్ అన్నారు.

ట్రంప్ ఫోన్‌ కాల్స్‌పై నిఘా పెడుతూ ఆయన ఏం మాట్లాడుతున్నారో విని, ఆయన ఆలోచనలను చైనా, రష్యాలు తెలుసుకుంటున్నాయని అమెరికా నిఘా అధికారులు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఎలక్ట్రానిక్ పరికరాల భద్రతపట్ల ట్రంప్ తీరుతో తాము విసిగిపోయామని ఆ అధికారులు అన్నారని తెలిపింది.

ట్రంప్ మాత్రం ఈ అనుమానాలను తోసిపుచ్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కొన్నాళ్లుగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన చైనా, అమెరికాల మధ్య కొన్నాళ్లుగా వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది.

అంతర్జాతీయ వాణిజ్య విధానం గురించి ట్రంప్ ఎవరి మాటలు వింటున్నారో తమకు అస్సలు అర్థం కావడంలేదని అమెరికాలోని చైనా రాయబారి కుయ్ తియాంకై ఇటీవల అన్నారు.

గూఢచర్యం ఆరోపణలతో హువావే సహా చైనాకు చెందిన పలు కంపెనీలపై గతంలో అమెరికా దర్యాప్తు జరిపించింది.

హువావే, జెడ్‌టీఈ ఫోన్లతో అమెరికా భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని, అవి అమెరికాలోని ఏ సంస్థతోనూ కలవకుండా నిషేధించాలని అమెరికా కాంగ్రెస్ కమిటీ సూచించింది.

అయితే, అమెరికా ఆరోపణలను హువావే, జెడ్‌టీఈలు ఖండించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు