అమెరికా పార్శిల్ బాంబుల కేసులో ఒకరి అరెస్ట్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విమర్శకులు లక్ష్యంగా పంపుతున్న పార్శిల్ బాంబుల కేసులో అక్కడి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, నటుడు రాబర్ట్ డి నీరో సహా 12 మందికి ఇటీవల ఇలాంటి పార్శిల్ బాంబులు వచ్చాయి.
శుక్రవారం ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లోనూ రెండు బాంబులను కనుగొన్నారు.
అమెరికాలో మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకున్న సమయంలో ఇలా జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అక్టోబర్ 22న, న్యూయార్క్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ఇంటి వద్ద ఉన్న ఓ పోస్ట్ బాక్స్‌లో పేలుడు పదార్థం ఉన్న ప్యాకేజ్‌ను గుర్తించారు. డెమొక్రటిక్ పార్టీకి సానుభూతిపరుడైన సోరోస్‌ను మితవాద వర్గాలు తరచూ లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
సోరోస్ ఉద్యోగి కనుగొన్న ఈ పేలుడు పదార్థాన్ని బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
సోరోస్ ఇంటి సమీపంలో ఉన్న ఈ పోస్ట్ బాక్స్‌లోనే పేలుడు పదార్థమున్న ప్యాకేజ్‌ను కనుగొన్నారు
ఆ మరుసటి రోజు ఇలాంటి పదార్థాన్నే డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కోసం వచ్చిన ఓ ప్యాకేజ్‌లో సీక్రెట్ సర్వీస్ కనుగొంది.
అక్టోబర్ 24న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కోసం వచ్చిన ప్యాకేజ్‌లో మరో పేలుడు పదార్థాన్ని అధికారులు గుర్తించారు. హిల్లరీ క్లింటన్, బరాక్ ఒబామాలకు వచ్చిన ప్యాకేజ్‌లను, వారికి డెలివరీ చేసే ముందుగానే కనుగొన్నామని అమెరికా సీక్రెట్ సర్వీస్ వెల్లడించింది.
ఆ తర్వాత బుధవారం ఉదయం, అమెరికాలోని సీఎన్ఎన్ వార్తా సంస్థకు పేలుడు పదార్థమున్న ప్యాకేజ్ అందింది. సీఎన్ఎన్ కార్యక్రమంలో ఆరోజు పాల్గొననున్న సీఐఏ మాజీ డైరెక్టర్ జాన్ బ్రెన్నన్‌ను ఉద్దేశించి ఆ ప్యాకేజ్‌ను పంపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను జాన్ బ్రెన్నన్.. తరచూ విమర్శిస్తుంటారు.
సీఎన్ఎన్ కార్యాలయానికి వచ్చిన ప్యాకేజ్‌లో తెల్లటి పౌడర్‌ను కనుగొన్నామని, ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
సీఎన్ఎన్ కార్యాలయంలో.. పేలుడు పదార్థాన్ని గుర్తించినపుడు అత్యవసర సమయాల్లో వాడే అలారమ్‌ను మోగించారు. సీఎన్ఎన్ లైవ్ ప్రసారాల సమయంలో ఈ అలారమ్‌ను వినవచ్చు.
ఆ మరునాడు మాజీ అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్‌కు కూడా పేలుడు పదార్థమున్న ప్యాకేజీ వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత డెమొక్రటిక్ పార్టీకి చెందిన మహళ మ్యాక్సిన్ వాటర్స్ కోసం వాషింగ్టన్ డీసీలో, పేలుడు పదార్థమున్న ప్యాకేజ్ వచ్చింది. ఆమెను ఉద్దేశించిన రెండో అనుమానిత ప్యాకేజ్‌ను లాస్ ఏంజెలస్‌లో అధికారులు గుర్తించారు.
గురువారం నాడు, న్యూయార్క్ నగరంలోని హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నీరోకు చెందిన ట్రీబెకా రెస్టారెంట్‌కు వచ్చిన మరో పేలుడు పదార్థాన్ని అధికారులు గుర్తించారు. రాబర్ట్ డీ నీరో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తరచూ విమర్శిస్తుంటారు. ట్రంప్‌ను ‘ఓ జాతీయ విపత్తు’ అని డీ నీరో ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు కూడా.
అమెరికా మాజీ ఉప ప్రధాని జోయ్ బీడెన్‌కు కూడా పేలుడు పదార్థాలున్న రెండు ప్యాకేజ్‌లు వెళ్లాయని ఎఫ్.బి.ఐ. తెలిపింది.
ఫొటో సోర్స్, AFP
మ్యాక్సిన్ వాటర్స్ పేరుపై వచ్చిన ప్యాకేజ్‌ను కనుగొన్న తపాలా కార్యాలయం
పైన పేర్కొన్న ఏ సందర్భంలో కూడా పేలుడు సంభవించలేదు. కానీ అన్ని ప్యాకేజ్‌లు, డెమొక్రటిక్ పార్టీ మాజీ చైర్‌పర్సన్ వాస్సర్‌మన్ షల్ట్జ్ పేరు మీద వచ్చాయి. అందులో ఆమె పేరును కూడా తప్పుగా రాశారు.
సీఎన్ఎన్ వార్తా సంస్థకు అందిన పార్సిల్లో నల్లటి టేపుతో చుట్టిన ఆరు అంగుళాల వస్తువును పైప్ బాంబ్‌గా అనుమానిస్తున్నారు. కానీ పైన పేర్కొన్న ప్యాకేజ్‌లలో వచ్చినవి నిజమైన పేలుడు పదార్థాలా కాదా అన్న విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
కానీ నటుడు రాబర్ట్ డీ నీరోకు వచ్చిన పార్సిల్ ఎక్స్-రేలోని వస్తువు పైప్ బాంబును పోలి ఉంది.
ఇవి కూడా చదవండి
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- లక్షలాది మొబైల్స్‌కు ‘ట్రంప్ అలర్ట్’
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- డేజా వూ: ‘ఎక్కడో చూసినట్టుందే’ అని మీరెప్పుడైనా అనుకున్నారా? అయితే ఈ 8 విషయాలూ మీకోసమే
- వెనెజ్వేలా: పోషించే శక్తి లేక పిల్లల్ని అమ్మేస్తున్నారు
- జంతువులతో ఆటాడుకున్న భారతీయ రింగ్ మాస్టర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)