డోనల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించిన జమాల్ ఖషోగ్జీ ప్రియురాలు

ఫొటో సోర్స్, EPA
ఖషోగ్జీ ప్రియురాలు హటిస్ సెన్‌గిజ్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైజ్హౌజ్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు హత్యకు గురైన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ ప్రియురాలు హటిస్ సెన్‌గిజ్ తెలిపారు. ఖషోగ్జీ హత్య దర్యాప్తుపై ట్రంప్ నిజాయితీగా లేరని విమర్శించారు.
అమెరికా ప్రజల అభిప్రాయానికి ప్రభావితమై వైట్‌హౌజ్ తనకు ఆహ్వానం పంపి ఉంటుందని భావిస్తున్నట్లు టర్కిష్ టీవీతో ఆమె చెప్పారు.
మూడువారాల కిందట ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో జర్నలిస్టు ఖషోగ్జీ హత్యకు గురైన విషయం తెలిసిందే.
సౌదీ రాజకుటుంబానికి ఈ హత్యతో సంబంధం ఉందన్న ఆరోపణలను రియాద్ ఖండించింది.
ఖషోగ్జీ హత్య గురించి మొదట తమకేమీ తెలియదని సౌదీ అరేబియా తెలిపింది. తర్వాత అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖషోగ్జీది పథకం ప్రకారం చేసిన హత్యేనని ప్రకటించారు.
సౌదీ వివరణతో సంతృప్తి చెందడం లేదని ట్రంప్ తెలిపారు. ఆ దేశంపై ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంత కీలకమైనవో నొక్కి చెప్పారు.
సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు ఈ హత్య జరిగే విషయం తెలిసే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు.
ఖషోగ్జీ హత్యకు సంబంధించి రియాద్‌లో అరెస్టైన 18 మంది సౌదీలను తమకు అప్పగించాలని టర్కీ ప్రభుత్వం శుక్రవారం సౌదీ ప్రభుత్వాన్ని కోరింది.
అయితే, టర్కీ, సౌదీల మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
ఫొటో సోర్స్, EPA
జమాల్ ఖషోగ్జీ కుమారుడు సలాహ్ బిన్ జమాల్‌ను రియాద్‌లో కలుసుకున్న సౌదీ యువరాజు
ఖషోగ్జీ ప్రియురాలు ఏమంటున్నారు?
సౌదీ అధికారుల ఉచ్చులో చిక్కుకుంటాడని తెలిస్తే ఖషోగ్జీని ఆ దేశ రాయబార కార్యాలయానికి వెళ్లడానికి అంగీకరించేదాన్ని కాదని సెన్‌గిజ్ అన్నారు.
ఖషోగ్జీ అదృష్యమైన రోజు జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
''ఈ హత్యతో ప్రమేయం ఉన్నవారు ఏ స్థాయిలో ఉన్నాసరే వారిని శిక్షించాలి. మాకు న్యాయం చేయాలి'' అని హబెర్ టర్క్ టీవీతో ఆమె చెప్పారు.
హత్యపై సౌదీ అధికారులను ఇప్పటివరకు సంప్రదించలేదని తెలిపారు.
ఒకవేళ ఖషోగ్జీ మృతదేహం దొరికి అంత్యక్రియలు సౌదీలో జరిగితే అక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు.
ఖషోగ్జీని ఎవరు హత్య చేశారు? మృతదేహం ఎక్కడ ఉందో చెప్పాలని రియాద్‌ను టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్ డిమాండ్ చేశారు.
ఖషోగ్జీ హత్య అనంతరం అమెరికాలో స్థిరపడిన అతని పెద్ద కుమారుడు కుటుంబంతో కలిసి గురువారం సౌదీకి వచ్చారు.
సౌదీ నేతలపై విమర్శలు చేయడంతో ఖషోగ్జీ కుటుంబాన్ని అక్కడి ప్రభుత్వం దేశ బహిష్కరణ చేసింది. ఈ నిషేధాన్ని ఇటీవల సడలించింది.
ఫొటో సోర్స్, EPA
సౌదీ కాన్సులేట్‌లో హత్యకు గురైన జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ
ఇతర దేశాల స్పందన ఏమిటి?
సౌదీ పాశ్చాత్య మిత్రదేశాలు ఈ హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ దారుణంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఆ దేశాన్ని కోరుతున్నాయి.
హత్య అనంతరం గల్ఫ్ దేశాలకు ఆయుధాల ఎగుమతిని జర్మనీ నిలిపివేసింది. ''ఇది అప్రజాస్వామికం. సౌదీకి ఆయుధాల అమ్మకాన్ని నిలిపివేస్తాం'' అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ తెలిపారు. అయితే, ఆయుధాల అమ్మకానికి ఖషోగ్జీ హత్యకు సంబంధం లేదని, రెండింటిని కలిపి చూడకూడదని చెప్పారు. సౌదీకి ఆయుధాల అమ్మకంపై ఆంక్షలు విధించాలని యురోపియన్ యూనియన్ గురువారం తీర్మానించింది.
సౌదీ రాజకుటుంబంపై విశ్వాసం ఉంచాలని రష్యా ప్రభుత్వం తెలిపింది. వారిని నమ్మకపోవడానికి ఎవరికి ఎలాంటి కారణాలు కనిపించవని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
- సెల్ఫీ ‘వెనుక’ ఇంత కథ ఉందా?
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)