హెచ్-1బీ వీసా: నిబంధనల్లో మార్పు వల్ల అమెరికాలోని చాలా మంది భారతీయులు వెనక్కి రావల్సిందేనా?
వీడియో: హెచ్-1బీ నిబంధనల మార్పుతో భారతీయ నిపుణులపై పడే ప్రభావమేంటి?
హెచ్-1బీ వీసాలకు సంబంధించిన నియమాల్లో అమెరికా కొన్ని మార్పులు చేసింది. దీని ప్రభావం భారతీయ ఇంజినీర్లపైనా, భారతీయ కంపెనీలపైనా, మొత్తంగా భారత ఆర్థికవ్యవస్థపైనా పడనుంది.
హెచ్-1బీ వీసా కిందకు వచ్చే వృత్తులనూ, ఈ వీసా శ్రేణిలోకి వచ్చే ఉపాధి నిర్వచనాన్నీ మార్చే ప్రయత్నంలో ఉంది ట్రంప్ ప్రభుత్వం. దీంతో భారతీయ ఇంజినీర్లపైనా, భారతీయ కంపెనీల పైనా… మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడనుంది.
ఫొటో సోర్స్, Getty Images
హెచ్-1బీ వీసా అంటే ఏమిటి? తాజా మార్పుల ప్రభావం ఏమిటి?
హెచ్-1బీ వీసాలిచ్చే ప్రక్రియ 1990లో ప్రారంభమైంది. ఈ వీసా పొందాలంటే ఉన్నత విద్య అభ్యసించిన వారై ఉండాలి.
కొన్ని ప్రత్యేకమైన వృత్తుల్లో పని చేసేందుకు అమెరికన్ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాలకు చెందిన నిపుణులను నియమించుకునేందుకు ఇచ్చే వీసానే హెచ్-1బీ వీసా అంటారు.
గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియను ప్రారంభించిన హెచ్-1బీ వీసాదారులు తమ వర్క్ వీసాలను తరచూ పునరుద్ధరించుకోవచ్చు.
కొత్త ప్రతిపాదన ప్రకారం విదేశీ కార్మికులెవరైనా తమ గ్రీన్ కార్డ్ దరఖాస్తు పరిశీలనలో ఉన్నంత వరకూ అమెరికాలో ఉండకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
ఈ వీసా ప్రోగ్రాం ద్వారా మెరుగైన, ప్రతిభావంతులైన విదేశీ పౌరులపై దృష్టిపెట్టేందుకు వీలవుతుందని అమెరికా అంతర్గత భద్రతా విభాగం అంటోంది.
అమెరికన్ కార్మిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం… ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తారు. వీటిలో 65 వేల కోటా నైపుణ్యం గల కార్మికులది కాగా, మరో 20 వేల వీసాలను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పొందినవారికి ఇస్తుంటారు.
కొత్త ప్రతిపాదన ప్రకారం ఇప్పుడు దరఖాస్తుదారులందరినీ 65 వేల వీసా పూల్ లోనే చేరుస్తారు. అంటే అమెరికాలో డిగ్రీ పొందిన వారికే ప్రాధాన్యం ఉంటుందని అర్థం.
ఫొటో సోర్స్, FREDERIC J. BROWN/getty images
నలుగురిలో ముగ్గురు భారతీయులే
అమెరికాలో హెచ్-1బీ వీసాలు పొందేవారిలో దాదాపు నాలుగింట మూడొంతుల మంది భారతీయులే. చైనా పౌరులది రెండో స్థానం. అంటే ఈ మార్పుల ప్రభావం భారతీయులపైనా, భారతీయ కంపెనీలపైనా పడనుందని అర్థం. చాలా మంది భారతీయులు వెనక్కి రావాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.
అమెరికా తలపెట్టిన ఈ చర్య ప్రభావం భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలపై భారీగానే ఉంటుంది. భారత సంతతికి చెందిన అమెరికన్లకు చెందిన చిన్న, మధ్య స్థాయి కంపెనీలు కూడా ఈ మార్పుతో ప్రభావితం కాక తప్పదు.
హెచ్-1బీ వీసాల విషయంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. ప్రతి నలుగురు హెచ్-1బీ వీసాదారుల్లో కేవలం ఒక్కరే మహిళ. ఇక ఈ వీసా పొందిన భారతీయ మహిళల విషయానికొస్తే.. వారి సంఖ్య 63 వేల 220.
ఫొటో సోర్స్, Getty Images
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ ఐటీ దిగ్గజాలకు దాదాపు 60 శాతం ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. అంతే కాదు, ఈ కంపెనీలన్నీ హెచ్-1బీ వీసాదారుల్నే పెద్దఎత్తున తమ ఉద్యోగులుగా నియమించుకుంటాయి.
అందుకే, భారతీయ ఇంజినీర్లపైనా, భారతీయ కంపెనీలపైనా హెచ్-1బీ వీసాల జారీలో మార్పుల ప్రభావం పడుతుంది. అంతేకాదు, భారతీయ ఆర్థికవ్యవస్థపై కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే… నాస్‌కామ్ అంచనా ప్రకారం, భారత జీడీపీలో ఐటీ కంపెనీల భాగస్వామ్యం 9 శాతం కన్నా ఎక్కువే.
ఇవి కూడా చదవండి:
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- ధోనీ లేకుండా భారత్ టీ-20 టీమ్
- ఇక్కడ హెచ్ఐవీ బాధితులకు పెళ్లి సంబంధాలు చూడబడును
- ఈ 38 మందికి హెచ్ఐవీ ఎలా సోకింది?
- మొబైల్ గేమ్స్: ఇది వ్యసనమే కాదు.. ఓ వ్యాధి
- 'సురభి': పీహెచ్డీలు చేసినా నాటకాలతో వారి బంధం వీడలేదు!
- రామ్ గోపాల్ వర్మ 'జీఎస్టీ'పై ఎందుకు అభ్యంతరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)