పాకిస్తాన్: హాఫీజ్ సయీద్ సంస్థలపై తొలగిన నిషేధం

  • షుమైలా జాఫ్రీ
  • బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
హఫీజ్ సయీద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ముంబయిలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో వందమందికి పైగా మరణించారు. ఆ దాడికి హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి అని భారత్, అమెరికాలు అంటున్నాయి.

ముంబయి 26/11 దాడుల ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్ సయీద్ నాయకత్వంలోని రెండు సంస్థలు- జమాత్ ఉద్ దావా (జె.యు.డి), ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్.ఐ.ఎఫ్) ల పేర్లు పాకిస్తాన్ లోని నిషేధిత సంస్థల జాబితా నుంచి తొలగిపోయాయి. దీనికి కారణం, గత ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ఉన్న నాలుగు నెలల కాలపరిమితి పూర్తవడమే.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధిత సంస్థల జాబితాలో ఉన్న ఈ సంస్థలను పాకిస్తాన్‌లోని నిషేధిత సంస్థల జాబితాలో కూడా చేరుస్తూ ఆ దేశాధ్యక్షుడు గతంలో ఆర్డినెన్స్ జారీ చేశారు.

అయితే, 'ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది' అని ఒక ఉన్నతాధికారి బీబీసీతో అన్నారు.

2008 ముంబయి దాడులకు సూత్రధారిగా భారత్, అమెరికాలు ఆరోపిస్తున్న హఫీజ్ సయీద్, 1990లలో లష్కరే తాయిబాను ప్రారంభించారు. ఆ సంస్థను నిషేధించిన తరువాత పాత సంస్థ అయి జమాత్-ఉద్-దావా (జెయుడి)ని 2002లో పునరుద్ధరించారు.

సయీద్‌ గురించి సమాచారం చెబితే కోటి డాలర్ల పారితోషికం ఇస్తామని అమెరికా 2012లో ప్రకటించింది. కానీ, సయీద్ మాత్రం అప్పుడప్పుడు నిర్బంధంలోకి వెళ్ళడం తప్పిస్తే చాలా వరకు స్వేచ్ఛంగానే తిరుగుతున్నాడు.

ఏప్రిల్‌లో ఆర్డినెన్స్ గడువు ముగిసిపోయాక ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం దాన్ని కొనసాగించేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ఈ ఆర్డినెన్స్‌కు చట్టరూపం ఇచ్చేందుకు పార్లమెంట్‌లో కూడా చర్చించలేదు.

దీనికి ముందు హాఫిజ్ సయీద్ ఈ ఆర్డినెన్స్‌ను ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. తమ సంస్థలను నిషేధించడం పాకిస్తాన్ సార్వభౌమత్వానికీ, రాజ్యాంగానికీ విరుద్ధమని తన పిటిషన్‌లో హఫీజ్ సయీద్ పేర్కొన్నారు.

అయితే ఆర్డినెన్స్ గడువు ఏప్రిల్‌లోనే ముగిసిపోవడంతో ఆ పిటిషన్‌కు విలువ లేకుండా పోయింది.

గమనించాల్సిన విషయం ఏంటంటే... హఫీజ్ సయీద్‌కు చెందిన ఈ రెండు సంస్థలూ ఆర్డినెన్స్‌కి ముందు కూడా అనుమానాస్పద సంస్థల జాబితాలో ఉన్నాయి. కాబట్టి... ఇక ముందు కూడా వీటిపై నిఘా కొనసాగుతుందని తెలుస్తోంది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

2008 నవంబర్ 26న ముంబయిలోని తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగింది.

పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి

ఈ విషయంపై జమాత్- ఉద్- దావా అధికార ప్రతినిధి మాతో మాట్లాడారు.

జమాత్- ఉద్- దావా, ఫలాహ్-ఇ-ఇన్సానియత్ సంస్థలపై నిషేధానికి సంబంధించిన ఆర్డినెన్స్ గడువు ముగిసిపోయిందన్న విషయం ఇస్లామాబాద్ హైకోర్టు‌లో విచారణ జరుగుతున్నప్పుడే ప్రభుత్వానికి అర్థమైనట్లు తెలుస్తోంది.

ప్రభుత్వంతో సంబంధమున్న కొందరు బీబీసీతో చెప్పిన సమాచారం ప్రకారం, ఈ రెండు సంస్థలను త్వరలోనే మళ్లీ నిషేధిత సంస్థల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. దీనికి ముఖ్య కారణం... ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం.

"తీవ్రవాద సంస్థలకు హవాలా మార్గాల ద్వారా డబ్బు అందడం వంటి విషయాలలో కఠినంగా వ్యవహరించాలని పాకిస్తాన్‌పై ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒకవేళ ఈ సంస్థలను ఆపలేకపోతే తమ దేశంపై కఠినమైన ఆంక్షలు అమలువుతాయన్న విషయం పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు" అని బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)