శ్రీలంక రాజకీయ సంక్షోభంలో చైనా పాత్ర ఉందా?

మహిందా రాజపక్సె, రణిల్ విక్రమసింఘె, మైత్రీపాల సిరిసేన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మహిందా రాజపక్సె, రణిల్ విక్రమసింఘె, మైత్రీపాల సిరిసేన

శుక్రవారం శ్రీలంకలో అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘెను తొలగించి ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు రాజపక్సెతో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించడంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది.

విక్రమసింఘె దీనిని రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు.

స్పీకర్ వెంటనే పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని, తాను బలాన్ని నిరూపించుకుంటానని తెలిపారు. అయితే, పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 16న ప్రారంభం అవుతాయని సిరిసేన తెలిపారు.

2015లో శ్రీలంక రాజ్యాంగానికి చేసిన 19వ సవరణ ప్రకారం, అధ్యక్షునికి పరిమితమైన అధికారాలు ఉంటాయి. ఇదే సవరణ ద్వారా అధ్యక్షునికి ప్రధానిని తొలగించే అధికారాన్ని కూడా తొలగించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మహిందా రాజపక్సె

పిల్లి-ఎలుక ఆట

విక్రమసింఘెను రెండోసారి దురదృష్టం వెంటాడింది. ఆయన మొదటిసారి 2001లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు ప్రధాని అయ్యారు. అయితే 2004లో అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ఆయన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు.

రాజపక్సెను ప్రధానిగా నియమించడంతో సిరిసేన, విక్రమసింఘెల మధ్య జరుగుతున్న పిల్లి, ఎలుక ఆట పూర్తయింది.

2015 ఎన్నికల సమయంలో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన సిరిసేన, రాజపక్సెల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఎన్నికలలో సిరిసేన, రాజపక్సెను సవాలు చేసి, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.

ప్రస్తుతం రాజపక్సె, సిరిసేనలు గతంలోని అభిప్రాయభేదాలను పక్కనబెట్టి ఒక్కటయ్యారు. దీనిని 2019 ఎన్నికలకు ముందస్తు ఏర్పాటుగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, ISHARA S. KODIKARA

ఫొటో క్యాప్షన్,

మైత్రీపాల సిరిసేన

చైనా హస్తం

రాజపక్సె రెండోసారి అధ్యక్షునిగా పదవీబాధ్యతలు నిర్వహించినపుడు భారతదేశంతో సంబంధాలు అంత బాగాలేవు. చైనాతో ఆయన కుదుర్చుకున్న ఒప్పందాలు భారత్‌కు అంతగా నచ్చలేదు.

2014 ఎన్నికలలో రాజపక్సె విజయానికి చైనా చాలా కృషి చేసిందని భావిస్తున్నారు. అయినా కూడా ఆయనకు విజయం దక్కలేదు.

రాజపక్సె పరాజయం భారత విజయంగా భావించేవాళ్లు కూడా ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక, చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ రాజపక్సె ఎన్నికలలో విజయం సాధించడానికి సుమారు రూ.50 కోట్లు సాయం చేసిందనే వార్తను ప్రచురించింది.

అయితే, రాజపక్సె, కొలంబోలోని చైనా ఎంబసీ, హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీలు దీనిని ఖండించాయి.

ఫొటో సోర్స్, LAKRUWAN WANNIARACHCHI

ఫొటో క్యాప్షన్,

శ్రీలంక పునర్నిర్మాణంలో చైనా పాత్ర చాలా ఎక్కువగా ఉంది

భారత- శ్రీలంక దోస్తీ మీద చైనా కన్ను

శ్రీలంకలో ఎల్టీటీఈ 2009 నాటికి పూర్తిగా కనుమరుగైంది. దేశంలో 26 ఏళ్ల అంతర్యుద్ధం అనంతరం దేశ పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న మొదటి దేశంగా చైనా ముందుకు వచ్చింది.

మైత్రీపాల సిరిసేన అధ్యక్షుడు కాగానే రాజపక్సె పాలనలో ప్రారంభమైన చైనా నిర్వహిస్తున్న ప్రాజెక్టులను అవినీతి, ఎక్కువ ఖర్చు, ప్రభుత్వ నియమాల ఉల్లంఘన కారణాలను చూపుతూ రద్దు చేశారు. అయితే, కేవలం ఒక ఏడాదిలోనే వాటన్నిటినీ కొన్ని చిన్నచిన్న మార్పులతో తిరిగి ప్రారంభించారు.

మరోవైపు, విక్రమసింఘెను భారతదేశానికి స్నేహితునిగా భావిస్తున్నారు. అదే సమయంలో భారతదేశం ఎన్నడూ రాజపక్సెకు ఉన్న పాపులారిటీని కూడా తక్కువ అంచనా వేయలేదు.

పోయిన ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకను సందర్శించినపుడు ఆయన రాజపక్సెను కలిశారు. ఈ ఆగస్టులో రాజపక్సె భారతదేశానికి వచ్చి మోదీని కలుసుకున్నారు. గత శనివారం విక్రమసింఘె భారతదేశానికి వచ్చారు కానీ వారం రోజులలో పరిణామాలు ఇలా మారిపోతాయని ఎవరూ ఊహించలేదు.

ఫొటో సోర్స్, LAKRUWAN WANNIARACHCHI

ఫొటో క్యాప్షన్,

శ్రీలంక పునర్నిర్మాణంలో చైనా పాత్ర చాలా ఎక్కువగా ఉంది

ప్రస్తుత పరిణామాల వెనుక భారత్ కానీ, చైనా కానీ లేవని శ్రీలంకలో పని చేసిన సీనియర్ జర్నలిస్టు ఆర్కే రాధాకృష్ణన్ అన్నారు. అయితే, రెండు దేశాలకు శ్రీలంక విషయంలో స్వప్రయోజనాలు ఉన్నాయని అందువల్ల రెండు దేశాలు కూడా ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాయని ఆయన అన్నారు.

సిరిసేన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నది వివరిస్తూ ఆయన.. దేశంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గిస్తానని సిరిసేన ప్రజలకు చేసిన హామీలను నెరవేర్చలేకపోయారని వివరించారు.

అందువల్ల సిరిసేన ప్రస్తుతం దేశంలో రాజపక్సెకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని, మళ్లీ అధ్యక్షుడు కావాలని భావిస్తున్నారని రాధాకృష్ణన్ తెలిపారు.

ప్రస్తుతం రాజపక్సెకు చాలా ప్రజాబలం, ధనబలం ఉంది. అందువల్ల బలపరీక్షలో ఆయన నెగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయని రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు.

గతంలో తన ఓటమికి భారతదేశమే కారణమని రాజపక్సె ఆరోపించినా, అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారవచ్చు.

అయితే రాజపక్సె ప్రధాని కావడం తమిళుల రాజకీయ ఆకాంక్షలకు మాత్రం తీవ్రమైన దెబ్బ అని రాధాకృష్ణన్ అన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌లో తమిళ జాతీయ కూటమి పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉంది. ఈ సంక్షోభంలో రాజపక్సె విజయం సాధిస్తే అది ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయి, రణిల్ విక్రమసింఘెకు చెందిన జాతీయ యునైటెడ్ నేషనల్ పార్టీ ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)