అమెరికాలో కాల్పులు: దేశవ్యాప్తంగా ప్రార్థన ప్రదేశాల్లో భద్రత పెంపు

మృతులకు నివాళిగా వైట్‌హౌస్ వద్ద ప్రదర్శనలో పాల్గొన్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో యూదుల ప్రార్థనాలయంలో ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోయారని పోలీసులు తెలిపారు. నిందితుడి మీద హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి అమెరికా చరిత్రలోనే యూదులపై జరిగిన అత్యంత దారుణమైనదిగా భావిస్తున్నారు.

నిందితుడు 46 ఏళ్ల రాబర్ట్ బోవర్స్‌గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుపాకీతో హత్యకు పాల్పడడంతో పాటు, 29 అభియోగాలు నమోదు చేశారు.

జాత్యహంకార నేరం కింద కూడా కేసు వేస్తామని, దాంతో అతనికి మరణశిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయవాదులు చెప్పారు.

ఈ కాల్పుల ఘటనలో నలుగురు పోలీసులతో సహా ఆరుగురు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా గాయపడ్డాడు.

ఇది అమెరికా చరిత్రలోనే యూదులపై జరిగిన అత్యంత దారుణమైన దాడిగా భావిస్తున్నామని యూదులపట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ది యాంటీ- డిఫమేషన్ లీగ్ తెలిపింది.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రార్థన ప్రదేశాల్లో భద్రతను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ట్విటర్లో స్పందించారు.

ఈ పరిణామాలను పరిశీలిస్తున్నామని.. సమీపంలో ఉన్నవారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాను పిట్స్‌బర్గ్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు.

ఓ వేడుక కోసం పలువురు గుమికూడిన సమయంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం పది గంటలకు ఈ కాల్పుల ఘటన జరిగింది.

నగరంలోని స్క్విరెల్ హిల్ ప్రాంతంలో యూదులు అధిక సంఖ్యలో ఉంటారు. సాధారణంగా ఇక్కడి యూదుల ప్రార్థన స్థలం వారాంతాల్లో రద్దీగా ఉంటుంది. తెల్ల జాతీయుడైన బోవర్స్... ఓ రైఫిల్, పిస్టల్‌తో ఈ ప్రార్థనా కేంద్రంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Google

పోలీసులు వచ్చే సమయానికి అతడు ప్రార్థనా కేంద్రంలోని గదిలో ఉన్నాడు.

పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ వెండల్ హిస్‌రిచ్ విలేఖర్లతో మాట్లాడుతూ, " ఇది చాలా భయంకరమైన సంఘటన. నా జీవితంలో విమానాలు కూలిపోవడం లాంటి సంఘటనలు కూడా చూశాను. కానీ, ఇది అన్నింటికన్నా దారుణం" అన్నారు.

ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారని, మరో ఇద్దరు స్వాట్ అధికారులు గాయపడ్డారని ఆయన చెప్పారు.

అయితే, మృతుల్లో పిల్లలు ఎవరూ లేరని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎవరు?

తుపాకితో దాడి చేస్తూ ఆ వ్యక్తి "యూదులంతా చావాల్సిందే" అని అరిచినట్లు అమెరికన్ మీడియా తెలిపింది.

రాబర్ట్ బోవర్స్ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలో కూడా యూదు వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నట్లు తెలిసింది.

కాల్పులకు పాల్పడిన బోవర్స్ అధికారులకు ముందే తెలుసో లేదో తనకు తెలియదని ఈ కేసును పరిశోధన చేస్తున్న పిట్స్‌బర్గ్ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ బాబ్ జోన్స్ అన్నారు.

అతని ఉద్దేశాలు ఏంటన్నది ఇప్పటి వరకు తెలియదని, అతను ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు విశ్వసిస్తున్నారని ఆయన చెప్పారు.

ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని కోణాలను లోతుగా పరిశీలిస్తామని అన్నారు.

బోవర్స్‌కు కూడా ఈ ఘటనలో బుల్లెట్ గాయాలయ్యాయి, అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

నిందితుడు రాబర్ట్ బోవర్స్

అధ్యక్షుడు ట్రంప్ స్పందన

"ఇది అత్యంత దారుణమైన సంఘటన" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండడం సిగ్గుచేటని విలేఖర్లతో అన్నారు.

కాల్పులకు తెగబడిన వ్యక్తి "మానసిక రోగి" అని, మరణ శిక్షల చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని ట్రంప్ అన్నారు.

"ఇలాంటి వాళ్లు దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే, ఈ ఘోరాలు కచ్చితంగా ఆగిపోవాలి" అని వ్యాఖ్యానించారు.

అమెరికా తుపాకి చట్టాలను ప్రస్తావించినప్పుడు, దానికి దీనికి పెద్దగా సంబంధం లేదని ట్రంప్ అన్నారు.

లోపల భద్రత కట్టుదిట్టంగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆ తర్వాత ఇండియానా పోలీస్‌లో జరిగిన రైతుల సదస్సులో ప్రసంగించిన ట్రంప్, మత విద్వేషాలను ఏమాత్రం సహించేది లేదు, దాన్ని అందరూ ఖండించాల్సిందే. ఎప్పుడైనా, ఎక్కడైనా గట్టిగా ఎదుర్కోవాల్సిందే అన్నారు.

ఫొటో సోర్స్, NYPDCT

ఫొటో క్యాప్షన్,

న్యూయార్క్‌లోని యూదుల ప్రార్థన కేంద్రంలో పోలీసుల భద్రత

న్యూయార్క్ పోలీసు శాఖ నగరంలోని అన్ని యూదు ప్రార్థన కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తగా పోలీసులను మోహరించింది.

వాషింగ్టన్‌లోని బీబీసీ ప్రతినిధి డాన్ జాన్సన్ ఈ ఘటనను విశ్లేషిస్తూ, " ట్రంప్ విమర్శకులకు ఒక పక్క పార్శిల్ బాంబులు అందుతుంటే, మరోవైపు వచ్చే నెలలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ దారుణం జరగడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)