భారత టీవీ చానెళ్లపై పాక్ నిషేధం: ‘భారత్ నీళ్లను ఆయుధంలా ఉపయోగిస్తోంది’ - పాకిస్తాన్ ఆరోపణ

ఫొటో సోర్స్, SAJJAD QAYYUM/AFP/GETTY IMAGES
పాకిస్తాన్ తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కుంటోందని ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేశంలో భారతదేశ టీవీ చానళ్ల పునఃప్రసారాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
భారత్ నుంచి పాకిస్తాన్లోకి వచ్చే నదీ జలాలను ఆ దేశం అడ్డుకుంటోందని పాక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మియా సాకిబ్ నిసార్ చెప్పారు. అందుకే భారత చానెళ్లపై నిషేధ నిర్ణయం న్యాయమైనదే అన్నారు.
భారత్ నీళ్లను ఆయుధంలా ఉపయోగిస్తోందని పాక్ వరుస ఆరోపణలు చేస్తోంది. పాకిస్తాన్ వైపు ప్రవహిస్తున్న నదులపై భారత్ డ్యాంలు కట్టి తమపై ఒత్తిడి పెంచుతోందని చెబుతోంది.
ఇరుదేశాల జల ఒప్పందాలను భారత్ ఉల్లంఘిస్తోందని పాక్ ఇటీవలే ఆరోపించింది. దీనికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమం చేస్తామని చెబుతోంది. పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తరచూ ఖండిస్తోంది.
పాక్ సుప్రీంకోర్టు విధించిన నిషేధం ఆ దేశంలో భారత కార్యక్రమాలు చూపించే స్థానిక చానళ్లపై కూడా ఉంటుంది. ఈ కేసులో ఒక కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం చీఫ్ జస్టిస్ కొట్టివేశారు. భారత చానెళ్లపై గతంలో ఉన్న నిషేధం ఎత్తివేయాలని కింది కోర్టు ఆదేశించింది.
ఫొటో సోర్స్, LOU DEL BELLO
పాకిస్తాన్ జల సంక్షోభం
పాకిస్తాన్లో 1990 నుంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. 2005లో ఇది మరింత తీవ్రమైంది. 2025 నాటికి పాక్ పూర్తిగా ఎండిపోతుందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ), పాకిస్తాన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ వాటర్ రిసోర్సెస్( పీసీఆర్డబ్ల్యుఆర్) ఆ దేశాన్ని హెచ్చరించాయి.
పాక్లో 80 శాతానికి పైగా వ్యవసాయం కోసం సింధు, దాని ఉప నదుల నీళ్లపై ఆధారపడతారు. వీటిలో చాలా నదులు హిమాలయాల నుంచే ప్రవహిస్తున్నాయి.
ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ సాకిబ్ నిసార్ దేశ నీటి సమస్యను దూరం చేసేందుకు స్వయంగా ఆసక్తి చూపుతున్నారు. పాక్లో రెండు ఆనకట్టల నిర్మాణం కోసం ఆయన నిధులు కూడా సేకరించడానికి సిద్ధమయ్యారు.
ఫొటో సోర్స్, SUPREME COURT OF PAKISTAN
ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలు
దేశ విభజన తర్వాత పాకిస్తాన్, భారత్ 1960 వరకూ వినియోగించుకున్న జలాల విషయంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. దాంతో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య సింధు-తాస్ ఒప్పందం జరిగింది.
భారత్ ఈ ఒప్పందం ఉల్లంఘించిందని ఆరోపిస్తున్న పాకిస్తాన్, దీనికి వ్యతిరేకంగా తీవ్ర ఉద్యమం చేస్తామని అంటోందని పాక్ పత్రిక డాన్ ఒక కథనం ప్రచురించింది.
భారత్ చీనాబ్ నదిపై 48 మెగావాట్ల సామర్థ్యంతో లోయర్ కల్నై, 1500 మెగావాట్ల సామర్థ్యంతో పాకల్ దుల్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. పాకల్ దుల్ డ్యాంపై పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
పాకల్ దుల్ ప్రాజెక్ట్ ఎత్తు 1708 మీటర్లు ఉందని. దాన్ని కడితే పాకిస్తాన్ వచ్చే నీటి స్థాయి తగ్గుతుందని, భారత్ తనకు నచ్చినట్టు నీళ్లు వదలడం, ఆపడం చేస్తుందని ఆరోపిస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ఒప్పందం?
సింధు-తాస్ ఒప్పందం ప్రకారం సింధు బేసిన్లోని ఆరు నదులు, వాటి ఉప నదుల నీటిని రెండు దేశాలు ఎలా ఉపయోగించుకోవాలి అనేదానిపై రెండు దేశాలు ఒక ఫార్ములా రూపొందించాయి.
ఆరింటిలో మూడు నదులు భారత్కు, మూడు నదులు పాకిస్తాన్కు వచ్చాయి. వీటిని తూర్పు, పశ్చిమ నదులు అంటారు.
తూర్పు నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలపై పాకిస్తాన్కు హక్కు ఉంటుంది. పశ్చిమ నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారత్కు హక్కు ఉంటుంది.
ఈ ఒప్పందం ప్రకారం కొన్ని షరతులకు లోబడి తూర్పు నదుల జలాలను భారత్ కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ ఒప్పదంలో ఏవైనా అభిప్రాయ బేధాలు వస్తే రెండు దేశాలు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాయి. గతంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ ఒప్పందాన్ని గౌరవించాయి.
ఫొటో సోర్స్, Getty Images
చానెళ్లపై నిషేధంతో ఏం సాధిస్తారు?
భారత సినిమాలు, టీవీ సీరియళ్లు పాకిస్తాన్లో చాలా పాపులర్.
2016లో ఇరుదేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో పాకిస్తాన్ అదే ఏడాది సెప్టెంబర్లో భారత సినిమాల విడుదలపై నిషేధం విధించింది.
ఒక నివేదిక ప్రకారం ఆ సమయంలో పాకిస్తాన్లోని సినిమా హాళ్లు తీవ్రంగా నష్టపోయాయి. దాంతో డిసెంబర్లో సినిమాలపై ఆ నిషేధం ఎత్తివేశారు.
2016లో భారత పాలిత కాశ్మీర్ ఉరిలో మిలిటెంట్ల దాడి తర్వాత భారత సినిమాల్లో పాకిస్తాన్ కళాకారులు నటించడంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
ఇవికూడా చదవండి:
- జ్వరం లేకుండానే డెంగీ రావచ్చు... ఇది మరీ ప్రమాదకరం
- వృద్ధాప్యం ఎందుకొస్తుంది? ఇవిగో... 9 కారణాలు
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాష
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- అమెరికా: జంతువుల ఎక్స్రేలు చూస్తారా..
- పాశ్చాత్య దేశాలకు సౌదీ అరేబియా ఎందుకంత అవసరం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)