‘సప్లిమెంట్స్’ వాడొచ్చా? వాడకూడదా?

సప్లిమెంట్ పిల్ తీసుకుంటున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

మెరుగైన ఆరోగ్యం కోసం 'గ్రీన్ టీ క్యాప్సూల్స్' వాడిన ఓ వ్యక్తి కాలేయం తీవ్రంగా దెబ్బతింది. అత్యవసరంగా కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో కృత్రిమ పోషకాలు అవేనండీ సప్లిమెంట్స్‌పై చర్చ మళ్లీ మొదలైంది.

జిమ్ మెక్ కాన్ట్స్ అనే వ్యక్తి మెరుగైన ఆరోగ్యం కోసం గ్రీన్ టీ క్యాప్సూల్స్‌ను వాడారు. ఆ క్యాప్సూల్స్‌ వాడితే తన ఆరోగ్యం బాగుంటుందని ఆయన భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది.

ఇలా మాత్రల రూపంలో తీసుకునే కృత్రిమ పోషకాలు నిజంగా పని చేస్తాయా? వీటిని వాడొచ్చా? వీటి వల్ల కలిగే లాభాలేవి? ప్రమాదాలేవి? వంటి ప్రశ్నలకు నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

ఇంగ్లండ్‌లో సప్లిమెంట్స్‌ను యూరోపియన్ యూనియన్ నిబంధనల మేరకే తయారు చేస్తారు. ఈ క్యాప్సూల్స్ వాడకం వల్ల కలిగే పరిణామాలు.. ఆ యూనియన్ నియమావళికి లోబడి ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ప్రముఖ వ్యాపార సంస్థలకు చెందిన సప్లిమెంట్ల వల్ల ఎప్పుడూ సమస్య తలెత్తలేదని వైద్యులు తెలిపారు.

కానీ ఆహారానికి సంబంధించిన సప్లిమెంట్ వల్ల అస్సలు హాని ఉండదు అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని యూనివర్సిటీ ఆఫ్ నాట్టింగ్‌మామ్‌కు చెందిన డా.వేన్ కార్టర్ అన్నారు.

మోతాదుకు మించి ఆహార సప్లిమెంట్లను తీసుకుంటే అది విషపూరితం అవుతుంది. ప్రధానంగా కాలేయం(లివర్)పై దాని ప్రభావం పడుతుంది.

''ఈ సప్లిమెంట్ క్యాప్సూల్స్ ఆరోగ్యానికి మంచివే అయితే, వీటిని ఎక్కువగా తీసుకుంటే ఇంకా మేలేకదా..! అని ప్రజలు ఆలోచిస్తారు'' అని డా.కార్టర్ అన్నారు.

విచక్షణ లేకుండా, వివిధ రకాల సప్లిమెంట్లను ఒకేసారి వాడటం కూడా పెనుప్రమాదానికి కారణం అవుతుందని ఆయన అన్నారు.

పలురకాల సప్లిమెంట్లను ఒకేసారి వాడినపుడు, వాటిల్లో ఒక సప్లిమెంటు మరో సప్లిమెంటు పనితీరును ప్రభావితం చేయవచ్చు. లేదా మీరు వాడే సప్లిమెంట్లలో ఒకేరకమైన పోషక పదార్థాలున్నపుడు, వాటి మోతాదు పెరిగినట్లే అవుతుంది.

''సప్లిమెంట్స్ వాడటం కొన్నిసార్లు మంచిదే కావచ్చు కానీ, అవి అందరిపై ఒకేలా పని చేస్తాయని కాదు'' అని డా.కార్టర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

చిన్నపిల్లల ఆరోగ్యం

సాధారణంగా నిపుణులు కొన్ని సప్లిమెంట్లను ఇస్తారు.

ఉదాహరణకు పిల్లలను కనడానికి సిద్ధంగా ఉన్న మహిళలు గర్భం దాల్చడానికి ముందు నుంచే 'ఫోలిక్ యాసిడ్' మాత్రలను వాడాలని చెబుతారు. గర్భం దాల్చిన మహిళలు తమ గర్భానికి 12 వారాల వయసు వచ్చే వరకూ ఫోలిక్ యాసిడ్ మాత్రలను వాడాలని, అలా వాడితే ప్రసవానంతరం పిల్లల్లో తలెత్తే సమస్యలను నివారించవచ్చని ఇంగ్లండ్‌కు చెందిన 'నేషనల్ హెల్త్ సర్వీస్' సంస్థ సూచిస్తోంది.

1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు సాధారణంగా విటమిన్-డి సప్లిమెంట్స్‌ ఇస్తారు.

ఇవే సప్లిమెంట్లను అవసరమైన సమయం కన్నా తక్కువ సమయం సూర్యరశ్మిలో గడిపేవారికి, రోజులో ఎక్కువ కాలం ఇంటికే పరిమితమైన పెద్దవారికి కూడా ఇస్తారు.

సాధారణంగా విటమిన్-డి సూర్యరశ్మి ద్వారా అందుతుంది. శరీరంలో ఈ విటమిన్ లోపం ఏర్పడితే, అది పిల్లల్లో రికెట్స్ వ్యాధికి, పెద్దల్లో ఎముకల్లో నొప్పిని కలిగించే 'ఆస్టియో మలేషా' వ్యాధికి దారితీస్తుంది.

''వంద సంవత్సరాల క్రితం లండన్‌లోని చాలా మంది పిల్లలకు రికెట్స్ వ్యాధి ఉండేది. విటమిన్-డి సప్లిమెంట్‌ను ఇవ్వడం వలన ఆ సమస్యను నిర్మూలించగలిగాం'' అని రాయల్ నేషనల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌కు చెందిన డా.బెన్జమిన్ జాకబ్స్ అన్నారు.

అపుడే పుట్టిన పిల్లలకు అరుదుగా వచ్చే అత్యంత ప్రమాదకరమైన రక్తసంబంధ వ్యాధిని నివారించడానికి పిల్లలు పుట్టిన 24 గంటల్లోగా విటమిన్-కె ఇంజెక్షన్ ఇస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

అభివృద్ధి చెందుతున్న వైద్య విజ్ఞానం

అలర్జీలు, అనారోగ్యం వల్ల చికిత్స సమయాల్లో ఇలాంటి సప్లిమెంట్లు కూడా అవసరం అవుతాయి.

ఉదాహరణకు మాంసాహారం, జంతువుల పాలు, వాటికి సంబంధించిన మరే ఇతర ఆహార పదార్థాలను తీసుకోని వ్యక్తులకు(వేగన్) మాంసాహారంలో ఉండే బీ-12 విటమిన్ అందదు. అందుకోసం వారికి 'బీ-12' సప్లిమెంట్ అవసరం కావొచ్చని 'నేషనల్ హెల్త్ సర్వీస్' చెబుతోంది.

కానీ అందరికీ ఈ సప్లిమెంట్ల వల్ల ప్రయోజనం కలుగుతుంది అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈవిషయమై స్పందిస్తూ..

'చాలా మందికి ఈ సప్లిమెంట్ల అవసరం ఉండదు. సూర్యరశ్మి నుంచి అందే విటమిన్-డి మినహా తక్కిన విటమిన్లు, మినరల్స్‌ను సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పొందవచ్చు' అని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.

చేప మందు మాత్రలు (ఒమెగా-3) గుండె పనితీరును మెరుగుపరుస్తాయని, మేధోశక్తిని పెంచుతాయన్న అభిప్రాయాలున్నాయి. కానీ తాజా పరిశోధనల్లో ఈ విషయం పూర్తిగా నిర్ధారణ కాలేదు.

''వైద్య శాస్త్రంలో పౌష్టికాహారం(న్యూట్రిషన్) గురించిన ఎంతో కొత్త సమాచారం వెలుగులోకి వస్తోంది. కానీ ఈ సప్లిమెంట్ల వల్ల కలిగే ప్రయోజనాలు అందరిపై ఒకేలా పని చేయవు'' అని బెర్రీ ఓటవే అండ్ అసోసియేట్స్ డైరెక్టర్ శామ్ జెన్నింగ్స్ అన్నారు.

ఇలాంటి సప్లిమెంట్లను వాడాలనుకున్నపుడు, వాటికి సంబంధించి ఏవైనా హెచ్చరికలు, శాస్త్రీయమైన రుజువులు ఉంటే ముందుగా వాటిని పరిశీలించాలని డా.కార్టర్ సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images

సప్లిమెంట్లు వాడాలనుకునేవారికి చిట్కాలు

  • ప్రముఖ కంపెనీలకు చెందిన సప్లిమెంట్లను కొనండి. తమ ఉత్పత్తుల నాణ్యత గురించి ఆ కంపెనీలు భరోసా ఇస్తాయి.
  • మీరు వాడాలనుకుంటున్న సప్లిమెంట్లను క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా మీ(స్త్రీ/పురుషుడు) వయసు వారిపై ప్రయోగించారా లేదా అని తెలుసుకోండి.
  • సప్లిమెంట్లకు చెందిన హెచ్చరికలను జాగ్రత్తగా పరిశీలించండి. ఉదాహరణకు హృద్రోగులు కొన్ని రకాల సప్లిమెంట్లను వాడరాదు.
  • వివిధ రకాల సప్లిమెంట్లను ఒకేసారి వాడే ముందు ఒకసారి ఆలోచించండి.
  • వైద్యులు సూచించిన మోతాదుకు మించకుండా వాడండి.

సోర్స్: డా.కార్టర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)