#fallingstarschallenge: చైనా యువతీ, యువకులు ఎందుకిలా పడిపోతున్నారంటే..

  • కెర్రీ అలెన్
  • బీబీసీ ప్రతినిధి
చైనా

ఫొటో సోర్స్, Sina Weibo/Yexiaomeier_May

ఇటీవలే సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయిన #fallingstarschallenge ఇప్పుడు చైనాలో కూడా ప్రవేశించింది - అయితే రూపం మార్చుకుని.

చైనా యువత ఇప్పుడు దాన్ని తమదైన విధానంలో పేరడీ చేస్తున్నారు. అదే సమయంలో ఈ ఛాలెంజ్ చైనా సమాజంలోని అసమానతలను కూడా వేలెత్తి చూపిస్తోంది.

ఈ #fallingstarschallenge మొదట ఆగస్టులో రష్యాలో బాగా పాపులర్ అయింది. రష్యాలోని ధనికవర్గానికి చెందిన పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని ప్రారంభించారు.

#fallingstarschallenge2018 హ్యాష్ ట్యాగ్ కలిగిన ఈ ఛాలెంజ్‌లో వాళ్లు లగ్జరీ కార్లు, హెలికాప్టర్ల నుంచి పడిపోయినప్పుడు తమ చుట్టూ లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, నోట్ల కట్టలు, ఇతర వస్తువులు పడిపోయినట్లు ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా వేగం పుంజుకుంది. చైనాలోని సంపన్న వర్గాలకు చెందిన యువత కూడా దీనిని అనుసరించారు.

అయితే చైనా మధ్యతరగతి యువత మాత్రం దీనికి సరికొత్త రూపాన్నిచ్చారు. వారు తాము తన నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబించేలా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

చైనా మైక్రోబ్లాగ్ సైనా వెయిబోలో లక్షలాది మంది ఇలా #fallingstars పేరిట తమ చిత్రాలను పోస్టు చేశారు.

అయితే దీని వెనకాల ఇతర కారణాలు కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చైనాలో అవినీతి, మోసాలు పెరిగిపోవడంతో సంపన్న వర్గాలపై సందేహాలు పెరుగుతున్నాయి. దాని వల్లే యువత ఇలాంటి ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ ఛాలెంజ్‌లో చైనా మీడియా కూడా తమ దేశానికి చెందిన యువత, రష్యా యువత మధ్య తేడాలను చూపిస్తూ.. చైనా యువత దీనిని చాలా సృజనాత్మకంగా ఉపయోగించుకుంటున్నారని ప్రశంసిస్తోంది.

ఫొటో సోర్స్, Sina Weibo

ఫొటో క్యాప్షన్,

చైనాలో #fallingstarschallenge చిత్రాలు యువత నిత్యజీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి

నిజమేనా?

#fallingstarschallengeలో ఒక రష్యా మహిళ తన ఖరీదైన వాహనం నుంచి పడిపోతే ఆమె చుట్టూ లగ్జరీ వస్తువులు ఉండగా, చైనా ప్రజలు పడిన చిత్రాల చుట్టూ మాత్రం చవకైన గృహోపకరణాలు, వారికి నిత్య జీవితంలో, చదువులో ఉపయోగపడే వస్తువులు ఉన్నాయంటూ చైనా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

దీనిని బట్టి ఇలాంటి కథనాలను చైనా అధికారులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీనిలో నిజమెంతో తేల్చాలని బీబీసీ కొందరు చైనీయులను ప్రశ్నించింది.

ఒక మారథాన్‌లో పాల్గొన్న ఫొటోలను పోస్ట్ చేసిన యువతిని ప్రశ్నించినపుడు ఆమె, ''నేను రేసులో పాల్గొనేప్పుడు నాకు ఈ ఛాలెంజ్ గుర్తుకు వచ్చింది. దీంతో నేను ఇలా ఆసక్తి రేకెత్తించే విధంగా ఫొటో తీసి నా స్నేహితులతో పంచుకున్నాను'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Sina Weibo/MrBailuj

ఫొటో క్యాప్షన్,

మారథాన్ ముందు ఛాలెంజ్ కోసం ఫొటో తీసుకుంటున్న యూజర్

విద్యాసంస్థలో పని చేసే మరో యువతి అనేక మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల మధ్య పడిపోయినట్లు కనిపించే ఫొటోను పంచుకున్నారు.

మే అనే మరో యువతి, తాను ఫిట్‌గా ఉండేందుకు ఎన్ని కష్టాలు పడుతున్నానో తెలిపే చిత్రాలను ఎంచుకున్నట్లు తెలిపారు.

మీ వద్ద ఉన్న సంపదను ప్రదర్శిస్తే దాని వల్ల ఇతరుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని మరో యూజర్ బీబీసీకి తెలిపారు. అందుకే చైనాలోని సంపన్నులు చాలా మంది ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం లేదని తెలిపారు.

ఫొటో సోర్స్, Sina Weibo

ఫొటో క్యాప్షన్,

చైనా యూజర్లు చాలా సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నారని చైనా మీడియా ప్రశంసిస్తోంది

సంపన్న వర్గం నిజాయితీపై సందేహాలు

2012లో షీ జిన్ పింగ్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చైనాలో పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక చర్యలు చేపడుతున్నారు.

ఇటీవల తమ సంపదను ప్రదర్శించే వారిని అక్కడ అనుమానాస్పదంగా, కొంత శతృత్వంతో చూస్తున్నారు. చైనాలోని అత్యంత ధనికుడైన వాంగ్ జియాలిన్ కుమారుడు సికాంగ్ 2015లో తన పెంపుడు కుక్క కోసం సుమారు 26 లక్షల రూపాయలను ఖర్చు చేసినపుడు అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నెల మొదట్లో చైనా ప్రముఖ నటి ఫాన్ బింగ్ బింగ్ పన్ను ఎగవేత కింద జరిమానా విధించినపుడు, చైనా సంపన్న వర్గానికి చెందిన వాళ్ల నిజాయితీపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

ఇటీవల చైనా సోషల్ మీడియాలో చైనాలోని సూపర్ రిచ్ వర్గాలపై విచారణ జరపాలని, వారు న్యాయంగా సంపాదించారో లేదో తేల్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బహుశా అందువల్లే చైనాలో ప్రస్తుతం ఎక్కువ మంది #fallingstarschallenge లో పాల్గొనడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)