ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

బంగారు గనుల వ్యాపారంలో ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా కెనడాకు చెందిన బ్యారిక్ గోల్డ్ సంస్థ ఆవిర్భవించనుంది.

'ర్యాండ్ గోల్డ్ రిసోర్సెస్' కంపెనీను కొనబోతున్న బ్యారిక్ గోల్డ్ సంస్థ, 18 బిలియన్ డాలర్ల విలువైన (రూ. 13,16,43,00,00,000) కంపెనీ అవ్వనుంది.

ప్రపంచంలోనే అత్యంత విలువైన బంగారు గనుల్లో ఈ రెండు కంపెనీలకూ కొన్ని గనులున్నాయి. ఈ రెండు కంపెనీలు సంవత్సరానికి 6.6 మిలియన్ ఔన్సులకుపైగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.

ఈ కంపెనీల ఉమ్మడి భాగంలో 2/3వ వంతు భాగాన్ని బ్యారిక్ సంస్థ షేర్‌ హోల్డర్స్‌కు, తక్కిన మూడో భాగం ర్యాండ్ గోల్డ్ కంపెనీకు దక్కనున్నాయి.

తగ్గిన బంగారం ధరల నేపథ్యంలో ఈ సంవత్సరం ఇరు కంపెనీల షేర్లు 30% పడిపోయాయి.

బ్యారిక్ బంగారు గనులు

ఫొటో సోర్స్, Getty Images

''మార్కెట్లో మా షేర్లు పడిపోవడంతో మేం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు'' అని ర్యాండ్ గోల్డ్ సీఈఓ మార్క్ బ్రిస్టోవ్ అన్నారు.

''రాబడుల్లో ఆధిక్యం సాధించడమే మా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది'' అని బ్రిస్టోవ్ అన్నారు.

ఈ సంవత్సరం బంగారు ధరలు 8% తగ్గడంతో ఉత్పత్తిదారుల్లో ఆందోళన మొదలైంది.

ఈ రెండు కంపెనీల కలయిక వల్ల తాము రాబడుల దిశగా పయనిస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ర్యాండ్ గోల్డ్‌కు చెందిన బంగారు గనులు అస్థిర పరిస్థితులున్న దేశాల్లో ఉన్నాయి. కానీ బ్యారిక్ సంస్థ గనులు ఉన్న దేశాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ర్యాండ్ గోల్డ్ లోటును బ్యారిక్ సంస్థ భర్తీ చేయగలదని కొందరి నిపుణుల అభిప్రాయం.

బంగారు గనుల్లో తవ్వకాలు

ఫొటో సోర్స్, RANDGOLD

కానీ మరికొందరు నిపుణులు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు.

''ఉత్పత్తి చాలావరకు తగ్గింది. రెండు కంపెనీల షేర్ల విలువలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ బ్యారిక్ షేర్ హోల్డర్లు ఇతర మార్కెట్లలో ఆసక్తి చూపితే ఆ కంపెనీలు ఆశిస్తున్నది జరగకపోవచ్చు'' అని మార్కెట్స్.కామ్‌కు చెందిన పెట్టుబడుల రంగ విశ్లేషకుడు నీల్ విల్సన్ అన్నారు.

రెండు కంపెనీల కలయికతో ఏర్పడబోయే కొత్త కంపెనీకు బ్యారిక్ పేరు అలానే ఉంటుంది. బ్యారిక్ షేర్లు న్యూయార్క్, టొరొంటో షేర్ మార్కెట్ లిస్టింగ్‌లోనే ఉంటుంది. కానీ ర్యాండ్ గోల్డ్ ‘లండన్ లిస్టింగ్’ రద్దవుతుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)