చైనా, జపాన్‌ల మధ్య ఆకస్మిక స్నేహబంధం

చైనాలో రెపరెపలాడుతున్న జపాన్ జాతీయ జెండా అరుదైన చిత్రం

ఫొటో సోర్స్, EPA

అమెరికాతో వ్యాపార సంబంధాలు బెడిసికొట్టడంతో చైనా, జపాన్ దేశాల మధ్య ఊహించని స్నేహం చిగురిస్తోంది.

ఈ రెండు దేశాల మధ్య చాలా కాలంగా సరిహద్దు గొడవలు, ఇరు సైన్యాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షింజో అబే చైనా పర్యటన ఓ చరిత్రాత్మక మలుపునకు దారి తీసింది. గత 7 ఏళ్ళలో జపాన్ ప్రధాని చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం.

చైనా, జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలపరుచుకోవాలని, తమ ప్రాంతాల మధ్య నెలకొన్న అస్థిర పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

శుక్రవారంనాడు జపాన్ ప్రధాని షింజో అబే చైనా ప్రధానితో సమావేశమయ్యారు.

విభేదాలకు కారణం ఏమిటి?

ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి కానీ రాజకీయ సంబంధాలు మాత్రం చాలా సున్నితంగా ఉన్నాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో చైనా భూభాగాన్ని కొంత జపాన్ ఆక్రమించుకుంది. ఈ భూభాగాల విషయంలో ఇరు దేశాలు ఇంకా ఒక ఒప్పందానికి రావాల్సివుంది.

ఫొటో సోర్స్, Reuters

''పోటీ పడటం నుంచి కలిసి ప్రయాణించే స్థాయికి వచ్చాం. ఈ ద్వైపాక్షిక సంబంధాలు నూతన అధ్యాయానికి నాంది పలికాయి'' అని జపాన్ ప్రధాని చైనా మీడియాతో అన్నారు.

చైనా ప్రధాని మాట్లాడుతూ.. ''ఇరు దేశాల మధ్య సుస్థిరమైన, ఆరోగ్యవంతమైన సంబంధాల కోసం ప్రయత్నిస్తాం'' అన్నారు.

ఈ భేటీకి ఉన్న ప్రాముఖ్యం

అమెరికాకు, ఇతర ప్రపంచ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంటే.. ఇతర దేశాలు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని శ్వేతభవనం కఠినతరం చేస్తోందని అర్థం చేసుకోవచ్చు.

డోనల్డ్ ట్రంప్ పాలనలో ఇతర దేశాల ఎగుమతులపై సుంకాలు చాలా పెరిగాయి. ఈ విషయమై స్పందిస్తూ.. ఆయా దేశాల అక్రమ వ్యాపార విధానాల నేపథ్యంలోనే ఇలా పన్నులు పెంచామని అమెరికా పేర్కొంది.

చైనా లక్ష్యంగా అమెరికా చేసిన ఈ వ్యాపార యుద్ధం.. జపాన్‌, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపింది.

ధృఢమైన వ్యాపార సంబంధాలు ఇరు దేశాల ప్రజలను గతంలోకంటే మరింత దగ్గర చేస్తాయని జపాన్ ప్రధాని మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

జపాన్, చైనా దేశాలు ఆసియాలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఇకపై ఇరు దేశల మధ్య వార్షిక సమావేశాలు జరగాలని, పలు రంగాల ఆవిష్కరణల్లో పరస్పరం సహకరించుకోవాలన్న ఒప్పందాలపై సంతకాలు చేశారు.

వ్యాపార సంబంధాల్లోని అవరోధాలను నిరోధించడానికి, ఎగుమతులపై పన్నుల భారాన్ని తగ్గించడానికి పరస్పరం సహకరించుకోవాలని ప్రతిజ్ఞ పూనారు.

చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలతో కలిపి విస్తృతమైన ఆర్థిక భాగస్వామ్యం, ప్రత్యేక వాణిజ్య మండలి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కూడా!

మరి ఉత్తర కొరియా పరిస్థితి?

ఈ ప్రయత్నాలన్నీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మాత్రమే కాదని, తమ భూభాగంలో శాంతిని పరిరక్షించడానికి కూడా అని ఇరు దేశాలు చెబుతున్నాయి.

కానీ వీరు ఆశిస్తున్న శాంతికి ఉత్తర కొరియా నుంచి ప్రమాదం పొంచి ఉంది.

ఉత్తర కొరియాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న ఏకైక దేశం చైనా మాత్రమే. ఉత్తర కొరియాలోని క్షిపణులకు అత్యంత చేరువలో ఉన్న దేశం జపాన్! మరోవైపు ఉత్తర కొరియాలో చాలా మంది జపాన్ పౌరులు చొరబాటుదారులుగా ఖైదు చేయబడ్డారు.

అణునిరాయుధీకరణ అంశంలో ఉత్తర కొరియా సానుకూలంగా స్పందించి, తమ దేశంలో బందీలుగా ఉన్న జపాన్ పౌరులను విడుదల చేస్తే, ఉత్తర కొరియాతో రాజకీయ సంబంధాలను పునరుద్ధరించడానికి జపాన్ కట్టుబడి ఉందని షింజో అబే అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)