పాకిస్తాన్ చరిత్ర: జిత్తులమారి జియా ఉల్-హక్ ఖురాన్ సాక్షిగా భుట్టోను మోసం చేసిన వైనం
- రేహాన్ ఫజల్
- బీబీసీ ప్రతినిధి

జుల్ఫికర్ అలీ భుట్టో(ఎడమ)తో మహమ్మద్ జియా ఉల్-హక్
అది 1976 నాటి విషయం. పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో ముల్తాన్ పర్యటనలో ఉన్నారు.
జనరల్ జియా తన కింద ఉన్న డివిజన్‌లో అందరినీ భుట్టోకు స్వాగతం పలికేందుకు, ఆయన కారుపై పూలు చల్లేందుకు నియమించారు.
ముల్తాన్‌లో తన గదిలో ఉన్న భుట్టో అర్థరాత్రి ఏదో పని చేసుకుంటున్నారు. ఆయనకు అధ్దాల వెనక ఏదో నీడలా కనిపించింది. భుట్టో తన ఏడీసీతో అక్కడెవరున్నారో చూడమన్నారు.
వెళ్లి చూసి వచ్చిన ఏడీసీ బయట డివిజనల్ కమాండర్ మహ్మద్ జియా ఉల్-హక్ ఉన్నారని చెప్పారు.
భుట్టో ఆయన్ను లోపలికి పిలిపించి ఎందుకొచ్చారని అడిగారు. దానికి జియా "నేను మా అధ్యక్షుడు దేశానికి ఎంత సేవ చేస్తున్నారో ముందే విన్నా. రాత్రి ఈ భవనం ముందు నుంచి వెళ్తున్నప్పుడు, ఈ గదిలో ఇంత రాత్రివేళ లైట్ వెలుగుతూ కనిపించింది. అధ్యక్షుడు అర్థరాత్రి ఈ టైంలో కూడా పనిచేస్తుండడం చూడగానే షాకయ్యా" అని చెప్పారు.
జియా వేసిన ఆ బాణం గురి తప్పలేదు. ఆయన పొగడ్తలకు భుట్టోలాంటి తెలివైన వ్యక్తే ఉబ్బిపోయారు. ఆ రాత్రే ఆయన జ్ఞాపకాల్లో జియా భావి సైన్యాధ్యక్షుడుగా నిలిచిపోయారు.

ఫొటో సోర్స్, PIERRE PERRIN
మంచివాడిలా నటించే జిత్తులమారి
పాకిస్తాన్ మొదటి నియంత అయూభ్ ఖాన్‌లా అధికారం హస్తగతం చేసుకోడానికి జనరల్ జియా దగ్గర ఎలాంటి 'బ్లూ ప్రింట్' లేదు.
కానీ ఒకసారి అధికారం రుచి మరిగాక జనరల్ జియా తన ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి వేసిన ఎత్తుల గురించి చెప్పాలంటే, అలాంటి ఉదాహరణలు చాలా తక్కువగా దొరుకుతాయి.
జియా పాకిస్తాన్‌ను ఎక్కువ కాలం పాలించడానికి అదే కారణం అయ్యుంటుంది. పాకిస్తాన్ పాలకులపై వచ్చిన ప్రముఖ పుస్తకం 'పాకిస్తాన్ అట్ ద హెల్మ్' రచయిత తిలక్ దేవేశర్ జియా గురించి చెప్పారు. "ఆయన చాలా తెలివైన వారు. తనకంటే మర్యాదస్తుడు ఎవరూ లేరన్నట్లు అనిపించేవారు. ఎలాంటి సలహా ఇచ్చినా 'అద్భుతమైన ఐడియా' అనేవారు. కానీ తాము ఏం చేయాలనుకుంటే అదే చేసేవారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే జియా వాళ్లను వదలడానికి బయటివరకూ వెళ్లేవారు. వాళ్ల కోసం కారు తలుపు కూడా తెరిచేవారు. జనం దానికే సంతోషపడిపోయేవారు. కానీ ఆయన మనసులో ఏం ఉందో ఎవరికీ తెలిసేది కాదు. ఆయన చాలా తెలివిగా తన భావనలు బయిటికి కనిపించకుండా దాచుకునేవారు. అందుకే భుట్టో కూడా ఆయనను గుర్తించలేకపోయారు".
"భుట్టో ఆయన్ను అందరి ముందూ 'కోతి జనరల్' అని చాలా సార్లు పిలిచేవారు. కానీ జియా ఒక్క మాట కూడా అనేవారు కాదు. అప్పుడు ఆయన పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడుగా ఉండేవారు. భుట్టో ఎంత ఎగతాళి పట్టించినా, అన్నిటినీ మనసులోనే దాచుకున్నారు. అవకాశం రాగానే వాటన్నిటికీ ప్రతీకారం తీర్చుకున్నారు" అన్నారు తిలక్ దేవేశర్.

ఫొటో సోర్స్, chip hires
వద్దని హెచ్చరించినా జియానే ఎంచుకున్న భుట్టో
సైన్యంలో ఉన్న ఎంతో మంది జనరళ్లను పట్టించుకోని భుట్టో, 'నీ మాటే నాకు శాసనం' అని ఉబ్బించిన జనరల్ జియా ఉల్-హక్‌ను సైన్యాధ్యక్షుడుగా చేశారు. కానీ తర్వాత దానికి పూర్తిగా ఉల్టాగా జరిగింది. అవకాశం రాగానే, ఆయన భుట్టో కాళ్ల కింద కార్పెట్ లాగేశారు.
ఒకప్పుడు భుట్టోకు చాలా సన్నిహితులైన గులామ్ ముస్తాఫా ఖార్ నాతో "నేను భుట్టోను హెచ్చరించాను. జియాను సైన్యాధ్యక్షుడుగా చేసి, మీ జీవితంలోనే పెద్ద తప్పు చేస్తున్నారు అన్నా. నా మూడు ప్రశ్నలకు జవాబివ్వండని భుట్టో నాతోఅన్నారు. జియా చాలా బలమైనవాడా? అన్నారు. కాదు అన్నాను. జియాకు ఈ దేశంతో సంబంధం ఉందా? అన్నారు. లేదన్నాను. తర్వాత జియాకు ఇంగ్లీష్ వచ్చా? అని అడిగారు. నేను రాదు అన్నాను" అని చెప్పారు.

ఫొటో సోర్స్, PTI
గులాం ముస్తాఫా ఖార్
తర్వాత ఆయన నాతో "ముస్తఫా ఒక విషయం గుర్తుంచుకో. పాకిస్తానీ సైన్యం బాగా ఇంగ్లీష్ వచ్చినవాడిని, శాండ్రస్ట్‌లో చదివినవారిని, ఈ నేలపై పుట్టిన వాళ్లనే స్వీకరిస్తుంది. జియా బయటి వ్యక్తి. ఇంగ్లీషు రాదు. అందుకే, ఇంతకు మించిన వాళ్లు నాకెవరు దొరుకుతారు చెప్పండి? అన్నారు. నేను ఆయనతో మీరన్నదే నిజం కావాలి, కానీ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని నాకు తెలుసు" అన్నాను.

ఫొటో సోర్స్, Getty Images
పొగడ్తలతో ఉబ్బించే జియా
రాజకీయంగా చాలా తెలివైనవారని చెప్పే భుట్టో సైన్యాధ్యక్ష పదవిలో జియాను కూర్చోపెట్టడానికి కారణం ఏదై ఉంటుంది.
"జియా పాక్ అధ్యక్షుడిని ఆర్మ్‌డ్ కోర్ కల్నల్ ఇన్ చీఫ్‌గా ప్రకటించారు. ఆయన భుట్టోతో ఆ యూనిఫాం కూడా వేసుకోమన్నారు. ఆయన యూనిఫాం వేసుకోకపోయినా, భూట్టో పదవి గురించి ప్రకటించడానికి జియా భారీ ఏర్పాట్లు చేశాడు. భుట్టోను మునగచెట్టు చివరి వరకూ ఎక్కించారు. ఇక అక్కడ్నుంచి కింద పడేయడమే మిగిలింది" అని తిలక్ దేవేశర్ చెప్పారు.

బీబీసీ స్టూడియోలో రేహాన్ ఫజల్‌తో తిలక్ దేవేశర్
"ఒకసారి తనను కలవడానికి వచ్చిన జియాకు భుట్టో సమయం ఇవ్వలేదు. కానీ జియా అక్కడే కూచున్నారు. సుమారు నాలుగు గంటల తర్వాత భుట్టో ఆయన్ను పిలిపించారు. 'ఎందుకొచ్చావ్' అన్నారు. జియా మీకు బహుమతిగా ఖురాన్ తీసుకొచ్చాను అన్నారు. తర్వాత 'ఈ ఖురాన్‌పై ప్రమాణం చేసి చెబుతున్నా, నేనెప్పటికీ మీకు విశ్వాసపాత్రుడుగా ఉంటాను' అన్నారు. అంత నమ్మకంగా చెప్పేసరికి, జియా వల్ల తనకెలాంటి ప్రమాదం ఉండదని భుట్టో ధీమాగా ఉండిపోయారు".

ఫొటో సోర్స్, Getty Images
జనరల్ జియా ఉల్ హక్
భుట్టో అరెస్ట్
1977 జులై 4 రాత్రి 'ఆపరేషన్ ఫెయిర్ ప్లే' ప్రారంభించిన జనరల్ జియా భుట్టోతోపాటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన చిన్న నేతలందర్నీ అరెస్ట్ చేయించారు.
జనరల్ జియా సన్నిహతుడు కె.ఎం.ఆరిఫ్ తన 'వర్కింగ్ విత్ జియా' అనే పుస్తకంలో ఆ రోజు గురించి చెప్పారు. "జనరల్ జియా భుట్టోతో స్వయంగా టెలిఫోన్‌లో మాట్లాడారు. భుట్టోను సర్ అని సంభోదించిన ఆయన ప్రభుత్వానికి, పీఎన్ఏకు మధ్య వచ్చిన రాజకీయ ప్రతిష్టంభన వల్ల దేశ భద్రతకే ప్రమాదం ముంచుకొచ్చిందని చెప్పారు".
"అందుకే నేను చాలా ఆలోచించిన తర్వాత సైన్యంతో దేశ పాలనను నియంత్రించాలనే నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి మిమ్మల్ని, పీపీపీలోని కొందరు నేతలను కొంతకాలం కస్టడీలోకి తీసుకుంటున్నాను. మీ ఇంట్లో లభించినంత విశ్రాంతి అక్కడ ఉండకపోవచ్చు. ఈరోజు రాత్రే మీరు నా గవర్నమెంట్ హౌస్‌కు షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైళ్లు రాయాలంటేనే చిరాకు
ఒక సైనికాధికారిగా జియాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి.
వాటిలో సమయపాలన ఒకటి. జియా చాలా రోజుల ముందే ఇచ్చిన అపాయింట్‌మెంట్స్ మర్చిపోయేవారు. తన కింది అధికారుల 'యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్' రాయడం అంటే కూడా జియా తెగ చిరాకు పడిపోయేవారు.
దాంతో, జియా గదిలో ఆ ఫైళ్లన్నీ క్లియర్ కాకుండా పేరుకుపోయేవి. అధికారుల పదోన్నతుల కోసం ఏసీఆర్ రాయడం చాలా అవసరం. కానీ "నేనున్నా, మీకే నష్టం జరగదు" అని ఆయన వాళ్లతో అనేవారు. కానీ జియా హఠాత్తుగా చనిపోవడంతో చాలా మంది సైనికాధికారుల కెరీర్ నాశనమైపోయింది.

'వర్కింగ్ విత్ జియా' రచయిత కె.ఎం.ఆరిఫ్
కింగ్ ఆఫ్ ట్రివియా
జియాలో అద్భుతమైన స్టామినా ఉంది. రాత్రంతా అలసిపోకుండా పనిచేసే సత్తా ఉండేది. ఆయన రోజూ అర్థరాత్రి తర్వాత పడుకునేవారని ఆరిఫ్ చెబుతారు. కానీ, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆయనకు అవసరం లేని విషయాలు గుర్తుకొచ్చేవి. ఉదాహరణకు ఈరోజు రాత్రి ఏ వంట చేస్తున్నారు. అతిథులకు ఏ బహుమతి ఇస్తున్నారు అని ఏవేవో కబుర్లు చెప్పేవారు. అందుకే ఆయన్ను ట్రివియాగా, అనవసర విషయాలు మాట్లాడే పాలకుడుగా చెప్పుకునేవారు.

ఫొటో సోర్స్, Getty Images
బేనజీర్ భుట్టో
బోల్తా కొట్టించిన బేనజీర్
జియా చాలా ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
"ఎన్నికలకు 1988 నవంబర్ నెలను ఎంచుకున్నారు. ఎందుకంటే గర్భవతిగా ఉన్న బేనజీర్ భుట్టో సరిగ్గా అదే సమయానికి ప్రసవిస్తారని ఆయనకు నిఘావర్గాలు సమాచారం అందింది. అప్పుడు ఆమె ప్రచారంలో పాల్గొనలేరని జియా ఎత్తు వేశారు" అని తిలక్ దేవేశర్ చెప్పారు.
"జియా ఎత్తులు బేనజీర్‌కు తెలిశాయి. ప్రసవించే సమయంలోనే ఎన్నికల తేదీ ఉంటుందని ఆమె గుర్తించారు. దాంతో తన మెడికల్ రికార్డులు మార్చేశారు. ఇదంతా తెలీని జియా నవంబర్లో ఎన్నికలు పెట్టారు. కానీ సెప్టంబర్‌లోనే బిడ్డకు జన్మనిచ్చిన బేనజీర్ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్
దిల్లీ విద్యార్థులకు జియా ఆతిథ్యం
జియా ఉల్-హక్ దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నారు.
అందుకే 1981లో సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థుల ప్రతినిధి కమిటీ పాకిస్తాన్ వెళ్లినపుడు, జియా వారిని ఇంటికి భోజనానికి పిలవడమే కాదు, తన ప్రైవేటు విమానంలో వారిని పాకిస్తాన్ అంతా తిప్పారు.
ఆ సమయంలో పాకిస్తాన్‌లో నట్వర్ సింగ్ భారత్ హైకమిషనర్‌గా ఉన్నారు. తర్వాత నట్వర్ సింగ్ భారత విదేశాంగ మంత్రి కూడా అయ్యారు. ఆయన అప్పటి విషయాన్ని చెప్పారు.

జియా ఉల్-హక్‌తో నట్వర్ సింగ్
"స్టీఫెన్స్ కాలేజీ టీమ్ పాకిస్తాన్ వచ్చినపుడు, వారిని కలవడానికి కొంత సమయం ఇవ్వాలని నేను జియాను కోరాను. అంతే, ఆయన మొత్తం తన దళాన్ని పంపించి వారిని ఆహ్వానించారు. నేను వాళ్లతో అక్కడకు వెళ్లగానే జియాతోపాటు ముగ్గురు క్యాబినెట్ మంత్రులు, నలుగురు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఉన్నారు"
"ప్రిన్సిపాల్ రాజ్‌పాల్ తనతోపాటు 1944లో తీసిన జియా ఫొటో ఒకటి తీసుకెళ్లారు. అందులో జియా అందరికంటే వెనక లైనులో నిలుచుకున్నారు. జియా ఆ ఫొటోను తడుముతూ, ఆ రోజుల్లో నా దగ్గర డబ్బు లేక దీన్ని కొనలేకపోయా, అందుకే ఇది నా దగ్గర లేకుండాపోయింది" అన్నారు.
"భోజనం చేస్తున్న విద్యార్థులతో జియా మీరెక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? అని అడిగారు. వాళ్లు రైల్లో వెళ్లి మొహంజదారో, కరాచీ చూడాలనుకుంటున్నామని చెప్పారు. దాంతో జియా వెంటనే తన ఏడీసీని పిలిచారు. వీళ్లందరినీ నా ప్రైవేట్ విమానంలో ఎక్కడికి వెళ్లాలనుకుంటే, అక్కడికి తీసుకెళ్లండి. వీళ్లను బాగా చూసుకోవాలని అందరికీ చెప్పండి" అన్నారు.
"ఆ రోజుల్లో విమానంలో తిరగడం అంటే అది ఆ విద్యార్థులకు చాలా పెద్ద విషయం. ఆ రోజు వాళ్లు తిరిగి తమ హోటల్ గదులను చేరేసరికే ప్రతి గదిలో ఒక బహుమతి కూడా ఉంచారు. వాళ్ల ఉపాధ్యాయులందరికీ జియా తరఫున ఒక్కో కార్పెట్ గిఫ్ట్ ఇచ్చారు" అని నట్వర్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నట్వర్ సింగ్‌తో రేహాన్ ఫజల్
పాతబాకీ తీర్చిన జియా
1983లో జరిగిన అలీన సదస్సు కోసం జియా భారత్ వచ్చినపుడు, ఆయన తను 1944లో చదివిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని చూడ్డానికి వెళ్లారు.
మలయ్ నీరవ్ అప్పట్లో ఆ కాలేజీలో హిస్టరీ క్లాసులు చెప్పేవారు. ఆయనకు ఆరోజు ఇప్పటికీ గుర్తుంది. "జియా గ్రే కలర్ శార్వాణీ, పైజామాతో వచ్చారు. మెల్లగా నడుస్తూ ప్రిన్సిపాల్ గదిలోకి వచ్చారు. నేనీ గదిలోకి నా జీవితంలో ఒకేసారి వచ్చానన్నారు. ఎందుకొచ్చానో మీకు చెప్పను అన్నారు. బహుశా ఆయన అప్పట్లో ఏదైనా తప్పు చేశారేమో" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"తర్వాత ఆయన తను చదివిన ఒక గదిలోకి వెళ్లారు. ఆరోజు ఆ గదిలో ఒక అబ్బాయి నిద్రపోతున్నాడు. జియా ఆ గది తలుపు కొట్టగానే, లోపల నుంచి చాలా గట్టిగా 'హూ ఈజ్ దేర్' అన్నాడు. వెంటనే నవ్విన జియా 'ఈ గది 1944లో ఎలా ఉండేదో, ఇప్పుడూ అలాగే ఉంది' అన్నారు".
తర్వాత ఆ కాలేజీ దగ్గరే ఉండే సుఖియా అనే వ్యక్తిని కలిశారు. ఆయనకు ఒక చిన్న ధాభా ఉండేది. అక్కడ బర్ఫీ, సమోసాలు లాంటివి అమ్మేవారు. సుఖియాను గుర్తుపట్టి, ఆయన కోసం తను తెచ్చిన బహుమతిని ఇచ్చారు. సుఖియా తన ఖాతా పుస్తకం ఆయనకు ఇచ్చి, నా దగ్గర నువ్వు పెట్టిన బాకీ ఇంకా తీరలేదు అన్నారు. దానికి జియా 'ఈరోజు నీకు వడ్డీతో సహా చెల్లించేస్తా' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జియాకు జ్ఞానీ జైల్ సింగ్ పంచ్
జియా అదే పర్యటనలో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ను కలిశారు. దాని గురించి తిలక్ దేవేశర్ చెప్పారు.
"ఆ సమావేశంలో ఆయన జైల్‌సింగ్‌తో పాకిస్తాన్ భారత్‌తో శాంతిని కోరుకుంటోందని అన్నారు. కానీ, అప్పట్లో పాక్ భారత్‌లో ఖలిస్థాన్ ఉద్యమాన్ని సమర్థిస్తోంది. జియా మాటలు విన్న జైల్‌సింగ్ పంజాబీలో "కన్ను కొడుతూనే, ముసుగు కూడా వేసుకోవాలంటే కుదరదు" అని గడుసుగా జవాబిచ్చారు".
"అది విని అందరూ పెద్దగా నవ్వేశారు. కానీ జైల్‌సింగ్ జియాకు ఏం చెప్పాలనుకున్నారో ఆ విషయాన్ని గట్టిగానే చెప్పారు. ఆ మాటల్లో "ఖలిస్తాన్‌ను సమర్థిస్తూనే భారత్‌తో శాంతి కోరుకుంటున్నామని చెబుతున్నారే" అనే గూఢార్థం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భుట్టోను క్షమించని జియా
భుట్టో దయాభిక్ష పిటిషన్‌ను జియా చదవకుండానే తిరస్కరించారని చెబుతారు.
కానీ కె.ఎం.ఆరిఫ్ మాత్రం "జియా దాన్ని చాలా జాగ్రత్తగా చదివారు. ఫైల్‌లో ఎర్ర ఇంకుతో 'ద పిటిషన్ ఈజ్ రెజెక్టెడ్' అని రాశారు" అని చెప్పారు.
"హత్య కేసులో భుట్టో దోషిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినపుడు, ఖాన్ అబ్దుల్ వలీ ఖాన్ జనరల్ జియాతో 'ఒక సమాధి, ఇద్దరు మనుషులున్నారు, భుట్టో మొదట అందులోకి వెళ్లకుంటే, అతడి బదులు నువ్వు వెళ్తావు' అన్నారు. భుట్టోను వదిలేస్తే, ఆయన నన్ను వదలడని జియా కూడా అనుకున్నారు. అందుకే భుట్టో క్షమాభిక్ష పిటిషన్ తన దగ్గరికి రాగానే, జియా దాన్ని నిమిషంలో రెజెక్ట్ చేశారు" అని దేవేశర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచమంతా భుట్టోకు ప్రాణభిక్ష పెట్టాలని అపీల్ చేసింది. కానీ జియా ఎవరి మాటా వినలేదు. ఎందుకంటే 'ఆయన్ను వదిలేస్తే తన ప్రాణాలకే ప్రమాదం' అని భావించారు.
భుట్టో తిరిగి అధికారంలోకి వస్తే తనను వదిలిపెట్టరని ఆయనకు బాగా తెలుసు. పాకిస్తాన్ రాజ్యాంగంలో భుట్టో స్వయంగా రాయించిన సెక్షన్-6 ప్రకారం "ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని దించేస్తే, వారిపై దేశద్రోహం ఆరోపణలు నమోదు చేసి, మరణశిక్ష విధిస్తారు".
"భుట్టో బతికుంటే దాన్ని తనపైనే ఉపయోగిస్తారని జియా కచ్చితంగా భావించారు" అని తిలక్ దేవేశర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖాళీగా జియా శవపేటిక
జియా ఉల్-హక్ చాలా ఏళ్లపాటు పాకిస్తాన్‌లో అధికారంలో ఉన్నారు. కానీ 1988 ఆగస్టు 17న బహావల్‌పూర్ దగ్గర జరిగిన ఒక విమాన ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ఈ విమాన ప్రమాదంలో జియాతోపాటు, పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి ఆర్నాల్డ్ రాఫెల్, ఇద్దరు జనరల్స్, ఒక లెఫ్టినెంట్ జనరల్, ముగ్గురు మేజర్ జనరల్, ఐదుగురు బ్రిగేడియర్లు కూడా చనిపోయారు.
మూడు రోజుల తర్వాత జరిగిన జియా అంత్యక్రియలకు అప్పటి భారత రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్, పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, నట్వర్‌సింగ్ ఇస్లామాబాద్ వెళ్లారు.
జియా అంతిమయాత్రలో వేలమంది పాల్గొన్నారు, కానీ ఆయన శవపేటిక ఖాళీగా ఉంది. విమాన ప్రమాదం తర్వాత జనరల్ జియా శరీరానికి సంబంధించిన కొన్ని భాగాలే దొరికాయి.
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)