భారత్-జపాన్ ద్వైపాక్షిక సదస్సు: మోదీ-అబెల మధ్య ఏ అంశాలు చర్చకు రానున్నాయి?

మోదీ, షింజో అబె

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రధాని మోదీ జపాన్ పర్యటన నేపథ్యంలో.. రక్షణ రంగంలో బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవడం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఉమ్మడి నౌకా, సైనిక, వాయుసేన బలగాల ప్రదర్శన, బిగ్ డేటా, కృత్రిమ మేధస్సు, రొబోటిక్స్ రంగాలు భారత-జపాన్‌ల శిఖరాగ్ర సదస్సులో కీలకమని జేఎన్‌యూ ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ అంటున్నారు.

భారత ప్రధాని మోదీ 'యాక్ట్ ఈస్ట్' విధానం షింజో అబె 'స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్' విధానంతో సరిగ్గా అతుకుతుంది.

మొదట్లో దక్షిణ చైనా సముద్రంలో చైనా కృత్రిమ ద్వీపాల నిర్మాణం కారణంగానే భారత-జపాన్‌ల మధ్య సత్సంబంధాలు పెరిగాయని భావించారు.

అయితే ఈ ఏడాది మోదీ, అబెలు ఇద్దరూ షీ జిన్‌పింగ్‌ను కలిశారు.

ఏడేళ్ల తర్వాత ఒక జపాన్ ప్రధాని చైనాను సందర్శించడం ఇదే మొదటిసారి. అబె సందర్శన.. జపాన్ పోటీతత్వం నుంచి సహకారం వైపు మళ్లినట్లు తెలియజేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

జిన్‌పింగ్ ఎలాగైతే 'టూ ప్లస్ వన్' ఫార్ములా ద్వారా జపాన్, భారత్‌లతో కలిసి ఇతర దేశాలతో భాగస్వామ్యం నెలకొల్పుకోవాలని భావిస్తున్నారో, అలాగే భారత్, జపాన్‌లు కూడా ఇతర దేశాలలో ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాయి.

భారత-జపాన్‌ల ద్వైపాక్షిక సదస్సులో ఇరుదేశాల సైనిక, వాయుసేనల మధ్య జరగబోయే ఉమ్మడి ప్రదర్శన గురించి చర్చిస్తారు. జపాన్‌ బలగాలు నవంబర్ 1 నుంచి 14 వరకు మిజోరంలోని వైరాంగ్తెలో భారత బలగాలకు శిక్షణనిస్తాయి.

భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి జపాన్‌తో ప్రత్యేక సంబంధం ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో 70 వేల మందికి పైగా జపాన్ సైనికులు కోహిమా, ఇంఫాల్‌లో పోరాడుతూ మరణించారు.

భారతదేశం, అమెరికాలు 2004 నుంచి నిర్వహిస్తున్న ఉమ్మడి వాయుసేన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఆ ప్రదర్శనల్లో ఈసారి జపాన్ కూడా పాలు పంచుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో 1,039 జపాన్ సంస్థలు

ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం లోపల, వెలుపలి ప్రాంతాలతో కలిపే నార్త్ ఈస్ట్ రోడ్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌లో జపాన్ ప్రధాన భాగస్వామి.

జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా) ఈ ప్రాజెక్టును 2017 ఏప్రిల్‌లో ప్రారంభించింది. జికా ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.4,500 కోట్లు ఆర్థికసాయం చేస్తోంది. రెండు దేశాలు కూడా ఈ ప్రాంతంలో మూడు కొత్త రహదారులను నిర్మించాలని గుర్తించాయి.

ప్రస్తుతం భారతదేశమంతటా సుమారు 1,039 జపాన్ సంస్థలు పని చేస్తున్నాయి. ఆటోమొబైల్స్, టెలికమ్యూనికేషన్స్, పవర్ ఎక్విప్‌మెంట్, ఇతర వినియోగవస్తువుల రంగంలో జపాన్ సంస్థలు ఉన్నాయి.

ఈ సదస్సులో రెండు దేశాల మధ్య లాజిస్టిక్స్ సహకార ఒప్పందంపై కూడా సంతకాలు చేసే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

‘మేకిన్ ఇండియా’లో కీలక భాగస్వామి

భారత దేశానికి చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), జపాన్‌కు చెందిన అక్విజిషన్, టెక్నాలజీ అండ్ లాజిస్టికల్ ఏజెన్సీ (అట్లా)ల మధ్య 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య రక్షణ సామాగ్రి, టెక్నాలజీ, మానవరహిత విమానాలు, రొబోటిక్స్ తదితర ప్రాజెక్టులు కూడా తుది దశలో ఉన్నాయి.

జపాన్‌ భారీ పరిశ్రమలు మిత్సుబిషి, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్‌లతో డీజిల్‌తో నడిచే తేలికపాటి సోర్యు-క్లాస్ ఎటాక్ సబ్‌మెరైన్ల కోసం భారత్ చర్చలు జరుపుతోంది.

మరోవైపు, మోదీ చేపట్టిన 'మేకిన్ ఇండియా', 'స్కిల్ ఇండియా', 'స్టార్టప్ ఇండియా', 'డిజిటల్ ఇండియా', 'స్మార్ట్ సిటీస్' కార్యక్రమాలలో జపాన్ ఒక కీలక భాగస్వామిగా మారింది.

గతంలో రక్షణ సంబంధిత టెక్నాలజీలో ముందంజలో ఉన్న జపాన్ భారత్‌కు ఎలాంటి సహాయమూ చేసేది కాదు. కానీ తర్వాత కాలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ విషయంలో ప్రధానమైన భాగస్వామిగా మారడం ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)