#BBCShe: భారతదేశంలో విజయం స్ఫూర్తితో పాకిస్తాన్‌లో..

  • షుమైలా జాఫ్రీ
  • బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
#BBCShe , పాకిస్తాన్

ఇదో సుదీర్ఘ ప్రయాణం. నేను మీడియాలో ఒక రిపోర్టర్‌గా చేరి దాదాపు పద్ధెనిమిదేళ్లయింది. విధి నిర్వహణలో భాగంగా నా ద్వారా ప్రజల కథలను వినిపించేందుకు నేను వేలాది కిలోమీటర్లు ప్రయాణించాను. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఎక్కువగా మహిళలకు సంబంధించిన అంశాల మీద రిపోర్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది.

కశ్మీర్ నుంచి గవాదర్ వరకు, వజీరిస్తాన్ నుంచి రాజన్‌పూర్ వరకు, డజన్ల కొద్దీ మహిళలు తమ హృదయాలను, తమ వాకిళ్లను తెరిచి నన్ను ఆహ్వానించారు. వాళ్లు ఎన్నో సవాళ్లను.. ప్రకృతి విపత్తులు కావచ్చు, ఉగ్రవాదం కావచ్చు, సామాజిక కట్టుబాట్లు కావచ్చు, లైంగిక వేధింపులు కావచ్చు, హింస కావచ్చు.. ఎదుర్కొనడాన్ని నేను చూశాను.

నేను చెప్పాలనుకున్న కథలను ఒక మంచి ఉద్దేశంతో, జర్నలిస్టులకు మార్గదర్శకమైన సంపాదక విచక్షణతో నేనే ఎంపిక చేసుకున్నాను.

అయితే అవి ఇప్పుడు ఒక రకంగా వన్-వే కమ్యూనికేషన్‌లా, ఒక స్వగతంలా అనిపిస్తున్నాయి.

బీబీసీ విలువలలో వైవిధ్యం, లైంగిక సమతుల్యత అన్నవి ప్రధానమైనవి. ప్రపంచవ్యాప్తంగా బీబీసీ జర్నలిస్టుల వార్తలలో అవి ప్రతిఫలిస్తాయి.

మహిళా పాఠకుల చెంతకు చేరడానికి మేం నిరంతరం చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పుడు బీబీసీ పాకిస్తాన్‌లో ఒక సిరీస్ ప్రారంభిస్తోంది. దీని ద్వారా పాకిస్తానీ యువతులకు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పిస్తోంది.

ఈ రెండు వారాల సిరీస్ నవంబర్ 1 నుంచి ప్రారంభం అవుతోంది.

ఈ సిరీస్ కోసం మేం పాకిస్తాన్‌లోని నాలుగు నగరాలు.. లాహోర్, క్వెట్టా, లర్కానా, అబోటాబాద్‌లకు వెళుతున్నాం. తద్వారా మేం ఈ చర్చను మహిళల ముంగిట్లోకి తీసుకెళ్తున్నాం.

ఈ నగరాలు, యూనివర్సిటీలను ఎంపిక చేసుకునేప్పుడు మేం అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలు దీనిలోకి వచ్చేలా జాగ్రత్త తీసుకున్నాం.

ఫొటో క్యాప్షన్,

#BBCShe సెషన్‌లో దివ్య ఆర్య

ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీ భారతదేశంలో #BBCShe పేరిట ఇదే రకమైన కార్యక్రమం చేపట్టింది. దిల్లీలోని జర్నలిస్ట్ దివ్య ఆర్య దీనికి నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమం చాలా సంచలనం సృష్టించింది. మహిళా సమస్యలపై అది తన దృక్పథాన్ని పూర్తిగా మార్చేసిందని దివ్య తెలిపారు.

''పాజిటివ్, నిర్మాణాత్మక ఉదాహరణల వల్ల ఎక్కువ మార్పులు వస్తాయని, ఇప్పటివరకు మీడియా ఆ పని చేయలేదని, అందువల్ల అలాంటి కథనాలపై దృష్టి పెట్టాలని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న యూనివర్సిటీ విద్యార్థులు ఒత్తిడి తెచ్చారు'' అని దివ్య తెలిపారు.

పాకిస్తాన్ యువతులు కూడా అదే చెబుతున్నారు.

భారతదేశంలో చేపట్టిన #BBCShe ప్రాజెక్టులో, మీడియాలో రిపోర్ట్ చేయాల్సిన అంశాలను మహిళలే ఎంపిక చేశారని దివ్య తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళల పట్ల వివక్షతో పాటు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లు, లైంగిక హింస నుంచి బయటపడ్డవారి గురించి మీడియాలో మరిన్ని కథనాలు రావాలని వారు కోరారు.

భారతదేశంలో చేపట్టిన #BBCShe ప్రాజెక్టు నుంచి మేం చాలా నేర్చుకున్నాం. బీబీసీ కథనాలు మరింత ఆసక్తికరంగా ఉండేందుకు... ఆ విజయాన్ని మేం సరిహద్దుకు ఇవతల కూడా పంచుకోవాలని, పాకిస్తాన్ మహిళలకు కూడా తమ సమస్యలు వెల్లడించడానికి అవకాశం ఇవ్వాలని భావించాం.

ఈ చర్చల సారాంశాన్ని మేం బీబీసీ ఉర్దూ, ఇతర భారతీయ భాషలలోని మల్టీ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ చేస్తూ ఉంటాం.

బీబీసీ మహిళా పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు తమ అభిప్రాయాలను షార్ట్ వీడియోలు, టెక్ట్స్ కామెంట్ల రూపంలో మాకు పంపాలని కోరుతున్నాం.

మేం మా ప్రేక్షకులతో జరిగే చర్చల సారాంశాన్ని క్రోడీకరిస్తూ నాలుగు చోట్ల నుంచి ఫేస్‌బుక్ లైవ్ కూడా చేస్తాం.

యూనివర్సిటీలలో జరిగే చర్చలలో పాల్గొనే అవకాశం లభించని వారు, బీబీసీ ఉర్దూ ఫేస్‌బుక్ పేజీలో ఆన్‌లైన్‌లో పాల్గొనవచ్చు లేదా ట్విటర్‌లో #BBCShe అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా చర్చలో పాల్గొనవచ్చు.

మొదటి దశ #BBCShe లో వచ్చిన సూచనలు, ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ ప్రాజెక్టు రెండవ దశలో బీబీసీ టీమ్స్ ఆయా ప్రాంతాలలో చర్చించాల్సిన అంశాలను నిర్ణయిస్తాయి.

ఈ ప్రాజెక్టు లక్ష్యం మహిళా ప్రేక్షకులకు సాధికారత చేకూర్చడం, వారి సమస్యలను శ్రద్ధగా వినడం, భవిష్యత్తులో వాటిపై చర్చలు జరిగేలా చూడడం.

బీబీసీ కథనాలలో మహిళా దృక్పథం మరింత ఎక్కువగా కనిపించాలనేది మా కోరిక.

#BBCShe ప్రాజెక్టు అంతా దాని గురించే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)