శ్రీలంక విషయంలో భారత్-చైనా ఒక్కటవ్వాలా?

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి చైనాయే కారణమని విదేశీ మీడియా సంస్థలు విమర్శించడాన్ని చైనా పత్రికలు ఖండించాయి. శ్రీలంకలో పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్‌-చైనాలు కలిసి పనిచేయడానికి అనువైన వాతావరణం కూడా ఉందని చైనా మీడియా తెలిపింది.

ఇతర దేశాల అంతర్గత విషయాల్లో చొరబడకూడదనే మౌలిక సిద్ధాంతాన్ని అనుసరిస్తూనే తాము శ్రీలంకలోని అన్ని పార్టీలతో స్నేహంగా ఉన్నామని అక్టోబర్ 29న చైనా విదేశాంగ శాఖ తెలిపింది. చర్చల ద్వారా అక్కడ అన్ని పార్టీలు తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటాయని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది.

‘శ్రీలంకలోని అంతర్గత పరిస్థితులను ‘భారత్ అనుకూల-చైనా అనుకూల’ వర్గాల మధ్య పోరాటమని విదేశీ మీడియా పేర్కొంటోంది. కానీ, అందులో నిజం లేదు’, అని చైనాకు చెందిన గువాంచా పత్రిక తన కథనంలో పేర్కొంది.

అధికారంలో మహింద రాజపక్సె ఉన్నా, రనిల్ విక్రమ సింఘె ఉన్నా... శ్రీలంకతో చైనా స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తుందని ఆ కథనాన్ని రాసిన లాంగ్ షింగ్‌చున్ పేర్కొన్నారు.

రాజపక్సె మోదీ

ఫొటో సోర్స్, Getty Images

‘మూడు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శ్రీలంక విషయంలో భారత్ చైనాలు కలిసి తోడ్పాటునివ్వాలి. శ్రీలంకలో రాజకీయ మార్పులు జరుగుతున్న ఈ సమయంలో ఆ దేశంపైన ప్రాబల్యం కోసం భారత్ చైనాలు పోటీపడకూడదు’ అని చైనాకు చెందిన జాతీయవాద పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

‘చైనాతో శ్రీలంక బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. దానివల్ల ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితి మరింత జటిలమవుతుంది. కొన్నాళ్లుగా వేడెక్కుతోన్న భారత్ -చైనాల బంధంపైన కూడా అతి ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని ఆ పత్రిక తెలిపింది.

‘శ్రీలంకకు భారత్‌ను దూరం చేసేందుకు చైనా ఎలాంటి ప్రయత్నాలూ చేయట్లేదు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దడానికి భారత్-చైనాలు కలిసి పనిచేసేందుకు కావల్సిన వాతావరణం ఉంది’ అని బీజింగ్‌లోని నేషనల్ స్ట్రాటజీ ఇన్‌స్టిట్యుట్‌‌కు చెందిన పరిశోధకుడు క్వియాన్ ఫెంగ్ తెలిపారు.

రాజపక్సె

రాజపక్సె ప్రధాని అయితే ఆయన శ్రీలంకను భారత్‌కు దూరం చేసి, చైనాకు దగ్గర చేస్తారనే వాదనలో అర్థం లేదని చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకుడు లూ షియోగ్ అన్నారు.

‘అందరు నాయకులలానే రాజపక్సె కూడా తన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ముందడుగు వేస్తారు. భారత్‌ చైనాలతో బంధం విషయంలో కూడా అలానే ఆలోచిస్తారు’ అని లూ చెప్పారు.

‘రాజపక్సె పునరాగమనం గురించి భారత్ ఆందోళన చెందడాన్ని అర్థం చేసుకోగలం. శ్రీలంక నిర్మాణ రంగంలో చైనా భారీ పెట్టుబడులకు ఆయన అవకాశం కల్పించారు. రాజపక్సె రాకతో మళ్లీ ఈ ప్రాజెక్టుల విషయంలో చైనా పెట్టుబడిదారుల ఉత్సాహం పెరుగుతుంది’, అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

‘శ్రీలంకలో భారత్ ప్రాబల్యం కచ్చితంగా ఉంది. చైనా పెట్టుబడులను వదులుకోమని శ్రీలంకకు భారత్ సూచించే అవకాశం లేదు. శ్రీలంకలో భారత్ తన ఉనికిని ప్రదర్శించాలంటే, అక్కడ చైనాతో కలిసి పనిచేయడమే ఉత్తమ మార్గం’ అని గ్లోబల్ టైమ్స్ పత్రిక కథనం విశ్లేషించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)