హాలోవీన్ పండగ: అమెరికాలో తెలుగువాళ్లు ఎలా చేసుకుంటారో తెలుసా?

  • రజిత
  • బీబీసీ కోసం అమెరికా నుంచి
హాలోవీన్ పండుగ

ఫొటో సోర్స్, AFP

దాదాపు తొమ్మిదేళ్ల కిందట చుట్టూ మనుషులు రాక్షసుల్లాగా అలంకరించుకుంటే భయమేసింది. ఇలా వేసుకున్నారేంటి అని అనుకున్నా. స్నేహితుల పిల్లలు బుజ్జి మంత్రగత్తెల్లాగా మారిపోయి బకెట్లు పట్టుకుని ఇంటింటికి వెళ్లి చాక్లెట్లు సేకరించి.. దాన్నో సొత్తులాగా దాచుకుంటుంటే ఇదేంటబ్బా అనుకునే దాన్ని.

హాలోవీన్ పండగ గురించి తెలిసినా.. దాన్ని ఎంత గొప్పగా చేసుకుంటారన్నది మాత్రం అమెరికాకు వచ్చాకే చూశా.

ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లకైతే ఈ పండగ.. ఈ వేషాలు సహజం. కాని భారత్ నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చిన నాకు మాత్రం చాలా వింతగా.. విచిత్రంగా అనిపించింది.

ఇంకా చెప్పాలంటే.. తొలినాళ్లలో ఈ పండుగకు పెద్దలు వేసుకునే వేషాలు చూసి చాలా వికారంగా అనిపించేది. పిల్లలు సరే.. మరి పెద్దలు కూడానా అనుకునేదాన్ని.

కానీ రోజులు గడిచే కొద్దీ అదంతా అలవాటైపోయింది.

ఒకసారి తెలుగు ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ ఫొటోలు చూసి అవాక్కయ్యా.

ఇంత ఘోరంగా ఎలా తయారయ్యారో అనుకున్నా.

ఇక ఈ పండగ ముందు బయట షాపింగ్‌కు వెళ్తే ఎక్కడా చూసినా పుర్రెలు, అస్థిపంజరాల బొమ్మలు కనిపించేవి.

వాటిని చూసి బాగా రియాక్ట్ అయ్యి.. తర్వాత వాళ్లు కూడా మనుషులే అనుకుని అలవాటుపడ్డాను.

నాలాగే ఇక్కడ చాలామంది తెలుగువాళ్లూ అలవాటుపడ్డారు. ఎంతలా అంటే.. అరే మన చిన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుండేదేమో అని ఫీలయ్యేంత.

ఇప్పుడు మన తెలుగు వాళ్లు కూడా హలోవిన్ థీమ్ తో బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నారు.

బకెట్లుబకెట్లు చాక్లెట్లు

నా ఎనిమిదేళ్ల పాప పోయినేడాది ట్రిక్.. ఆర్ ట్రీట్‌ అంటూ దాదాపు మూడు బకెట్ల చాక్లెట్లు సేకరించింది.

ఇక్కడ పిల్లలైతే ఇలా సేకరించిన చాక్లెట్లను దాదాపు ఏడాదంతా తింటారు.

వాళ్లు బకెట్లు కాకుండా దాదాపు మనిషి పట్టేంత పెద్దపెద్ద బ్యాగులను భుజాన వేసుకుని.. చాకొలెట్లు కలెక్ట్ చేస్తారు. దాన్ని ఒక నిధిలా దాచుకుంటారు. పెద్దవాళ్లను ముట్టనివ్వకుండా జాగ్రత్తపడతారు.

ఇళ్ల దగ్గర పెద్దవాళ్లు కూడా పండగ రోజు సాయంత్రం చాకొలెట్లను పెట్టుకుని ఇంటి గుమ్మం ముందు కూర్చొని అటువైపు వచ్చిన పిల్లలకు పంచుతారు.

పిల్లలు ట్రిక్ ఆర్ ట్రీట్ అన్నపుడు మేం ట్రిక్ చేయలేం కానీ.. ఇదిగో ట్రీట్ అంటూ చాకొలెట్స్ ఇస్తారు.

వాస్తవానికి మొదట్లో ఇది రైతుల పండుగ కాబట్టి.. గుమ్మడికాయలు.. వాటితో చేసిన బొమ్మలు.. డిజైన్లు ఇచ్చేవారు. ఇప్పుడు వీటిని చాక్లెట్లు మింగేశాయి.

ఇప్పుడు అంతా అలవాటైపోయింది. ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకైతే ఇదంతా సాధారణం.

ఈ పుర్రె బాగుందా.. ఆ ఆకారం బాగుందా అంటూ వెదుక్కొంటూ ఉంటారు.

ఇప్పుడు నేను కూడా రేపు పాపను బుక్ క్యారెక్టర్ లాగా రెడీ చేసి స్కూలుకు పంపడానికి సిద్ధమవుతున్నాను.

హాలోవీన్ పండగ అంటే

వాస్తవానికి ఈ పండగ కూడా తెలుగు పండగ లాంటిదే.

మనకు మొదట్లో దసరా, బతుకమ్మ పండుగలకు డీజేలు, పాటలు, కొరియో గ్రఫీ చేసిన డాన్స్ లు ఉండేవి కాదు.

తరాలు మారే కొద్దీ సంబరాల్లోనూ మార్పులు వస్తున్నాయి.

ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగు పిల్లలు ఇక్కడివారితో బాగా కలిసిపోతున్నారు కాబట్టి.. తెలుగు వాళ్లు కూడా హాలోవీన్ను చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు.

మన పండగలనూ ఇక్కడ బాగా చేసుకుంటున్నారు.

భవిష్యత్తు ఇదే.. ఇక్కడే అని నిర్ణయించుకున్నవాళ్ళు మన పండగలతో పాటు ఇక్కడి పండగలనూ బాగా చేసుకుంటున్నారు. క్రిస్మస్ పండగను కూడా చాలా మంది తెలుగు వాళ్లు బాగా జరుపుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)