పాకిస్తాన్‌: దైవ దూషణ కేసులో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి

ఆసియా బీబీ

ఒక చరిత్రాత్మక తీర్పు. దైవదూషణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మరణశిక్ష విధించిన ఒక మహిళను పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది.

బుధవారం చీఫ్ జస్టిస్ సాబిక్ నిసార్ ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ ఆమెను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పును వెలువరించారు.

ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని మతగురువులు పిలుపునిచ్చారు.

తీర్పును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఇస్లామాబాద్ సహా పాకిస్తాన్‌లోని పలు పట్టణాలలో నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. కరాచీలో పలువురు నిరసనకారులు కర్రలతో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.

2010లో ఆసియా బీబీ తోటి మహిళలతో ఘర్షణ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తను దూషించారన్న ఆరోపణలపై ఆమెను దోషిగా తేల్చారు. అయితే తాను నిర్దోషినని ఆమె నాటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పటివరకు ఆమె ఎనిమిదేళ్లకు పైగా ఏకాంత కారాగార శిక్షను అనుభవించారు.

పాక్తిస్తాన్‌లో తమకు గిట్టని వారిని దైవదూషణ నేరం మోపి వారిపై కక్ష తీర్చుకుంటున్నారనే విమర్శలు ఎన్నాళ్లుగానో వినవస్తున్నాయి.

దైవదూషణకు సంబంధించిన ఆరోపణలపై కఠినంగా వ్యవహరించే పాకిస్తాన్‌లో ఆమె కేసుపై భిన్నవాదనలు వినిపించాయి.

ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ విజ్ఞప్తి చేసిన ఒక పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్‌ను ఆయన సొంత అంగరక్షకుడే కాల్చి చంపడంతో ఆసియా బీబీ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఆసియా బీబీపై వచ్చిన ఆరోపణలు ఏంటి?

2009లో ఆసియా బీబీ లాహోర్‌కు సమీపంలోని ఒక తోటలో పళ్లు కోస్తుండగా వివాదం తలెత్తింది.

ఆసియా బీబీ ఒక కప్పులో నీళ్లు తాగడంతో తోటి మహిళలు దాని వల్ల ఆ కప్పు మలినమైందని ఆరోపించారు. దాని తదనంతరం తలెత్తిన వివాదంలో తోటి మహిళలంతా ఆసియా బీబీ ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారు.

ఆ సందర్భంగా ఆసియా బీబీ దైవదూషణ చేశారని వారు ఆరోపించారు. పోలీసు విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.

అయితే తాను తన తోటి మహిళలకు మాటకు మాట సమాధానం ఇచ్చిన మాట వాస్తవమే కానీ, తానేమీ దైవదూషణ చేయలేదని ఆసియా బీబీ అంటున్నారు.

ఆసియా బీబీకి పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ సల్మాన్ తసీర్ మద్దతుగా నిలువగా, 2011 ప్రారంభంలో ఆయన అంగరక్షకుడు ముంతాజ్ ఖాద్రీయే ఆయనను కాల్చి చంపారు.

ఖాద్రీకి ఆ తర్వాత మరణశిక్ష విధించినా, అతన్ని నేటికీ కీర్తించేవారూ ఉన్నారు.

ఆసియా బీబీ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఆసియా బీబీని నిర్దోషిగా విడుదల చేయడంతో హింసాత్మక సంఘటనలు తలెత్తవచ్చని ఆందోళన చెందుతున్నారు.

తమకు దేశంలో భద్రత లేదని ఆమె కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అనేక దేశాలు ఆమెకు ఆశ్రయం ఇస్తామని ముందుకు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)