బౌడికా: రోమన్ల సైన్యాన్ని తరిమికొట్టిన తొలి మహారాణి, ఆమె నేర్పే ఆరు జీవిత పాఠాలు

బౌడిక

ఫొటో సోర్స్, Getty Images

సుమారు 2వేల ఏళ్ల క్రితం లోహ యుగంలో ఓ ఉన్నత వర్గానికి చెందిన మహిళ రోమన్ సైన్యాన్ని చీల్చి చెండాడారు. తన పోరాట పటిమతో రోమన్లను తరిమి కొట్టారు. ఆ యోధురాలి పేరు బౌడిక.

చరిత్ర ఆమెను ప్రఖ్యాత, వివాదాస్పద వ్యక్తిగా గుర్తుపెట్టుకుంటుంది. తొలితరం ఫెమినిస్ట్, స్వాతంత్ర్య యోధురాలిగా ఆమెను కీర్తిస్తారు. ఆమె ఓ క్రూరమైన వ్యక్తి అని ఇంకొందరు భావిస్తారు.

బౌడికా గురించి చరిత్ర ఏం చెప్పినా, ఆమె ఓ తిరుగులేని నాయకురాలు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఆ యోధురాలి నుంచి ఈ తరం వ్యక్తులు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు చాలా ఉన్నాయి.

1. దుస్తులతో జాగ్రత్త

ఎదుటివాళ్ల దృష్టిని ఆకర్షించడంలో దుస్తులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పటి ఆఫీసులకే కాదు, లోహ యుగం నాటి పరిస్థితులకు కూడా ఈ నియమం వర్తిస్తుందని బౌడికా నిరూపించారు.

‘ఆమె చాలా ఎత్తుగా ఉంటుంది. రూపంలో రౌద్రం తాండవిస్తుంది. నడుము దాకా జుట్టు, మెడలో బంగారు నెక్లెస్, చేతికి కడియం, భిన్న రంగుల్లో ఉండే ‘ట్యునిక్’ (ఒక రకమైన లో దుస్తులు), దాన్ని కప్పేసే మందపాటి పరదా... ఇలా చక్కటి వస్త్రధారణతో ఆమె చాలా శక్తిమంతంగా కనిపించేవారు’ అని రోమన్ చరిత్రకారుడు కాసియస్ డియో ఆమెను వర్ణించారు.

బౌడికా విగ్రహాల్లో కూడా ఆ దర్పం స్పష్టంగా కనిపిస్తుంది. తొలి రోజుల్లో శక్తిమంతమైన వస్త్రాలంకరణను ఆయుధంగా మార్చుకున్న వ్యక్తి బౌడికా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఫొటో సోర్స్, Getty Images

2. పేరులో చాలా ఉంది

ప్రాచీన బ్రైతానిక్ భాషలోని బౌడ్ అనే పదం నుంచి బౌడికా అనే పేరు పుట్టింది. ఆ పదానికి ‘విజయం’ అని అర్థం. బౌడిగా అంటే విజయాన్ని తీసుకువచ్చేదని అర్థం. ఆ పేరు ఆమెకు పుట్టుకతో లభించింది కాదు. కాలక్రమంలో ఆ పేరును ఆమె స్వీకరించారని చెబుతారు. భారీ బలగాలను సమీకరించడంలో ఆ పేరు కూడా సాయపడిందని అంటారు. అందుకే... పేరులో చాలా ఉంది.

3. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు

బౌడికా భర్త ప్రాసుటాగస్ తూర్పు ఆంగ్లియాలోని ఐసెనీ తెగను పాలించేవారు. ఆయన రోమన్ల ఆక్రమణను సమ్మతించేవారు. ఆ కారణంగానే తన కుర్చీని కాపాడుకున్నారు. కానీ, ఆయన చనిపోయాక రోమన్లు ఆ రాజ్యాన్ని కూడా చేపట్టాలని చూశారు. భూముల్ని కబ్జా చేశారు. భారీ సుంకాల్ని చెల్లించడానికి బౌడికా నిరాకరించడంతో ఆమెను కొట్టి, ఆమె కుమార్తెలను రేప్ చేశారు.

ఆ క్రమంలో బౌడికా శక్తిని రోమన్లు తక్కువగా అంచనా వేశారు. రోమన్లపై తిరగబడాలని నిర్ణయించుకున్న బౌడికా, తన సొంత తెగ ప్రజలతో పాటు ఇతర బలగాలను సమీకరించారు. వాళ్లు విజయవంతంగా రోమన్ల తొమ్మిదవ సైనిక బలగాలను ఓడించడంతో పాటు రోమన్ల రాజధాని కోల్చెస్టర్‌ను నాశనం చేశారు. ఆ పైన లండన్, సెయింట్ ఆల్బన్స్‌ నగరాలను సమూలంగా నేలమట్టం చేశారు.

స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేయడంతో లభించిన ఫలితం అది.

ఫొటో సోర్స్, Getty Images

4. బలగాల సంఖ్య కంటే సరైన శిక్షణ ముఖ్యం

యుద్ధం మొదలుపెట్టాక అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. కానీ, బౌడికా ఆ పని చేయలేదు. లండన్‌, సెయింట్ ఆల్బన్స్ నగరాలను నేలకూల్చడంతో... బౌడికా సైన్యంపై దండెత్తి ప్రతీకారం తీర్చుకోవాలని రోమన్ గవర్నర్ నిర్ణయించారు. నిజానికి రోమన్లతో పోలిస్తే బౌడికా సైన్యంలో పదింతల మంది సైనికులున్నారు. కానీ వాళ్లకు ఎలాంటి శిక్షణ లేదు. సరైన ఆయుధాలు లేవు.

కానీ, రోమన్ల సైనికులు సుశిక్షితులు. శత్రువులను ఎలా దెబ్బతీయాలో వాళ్లకు బాగా తెలుసు. అందుకే సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రోమన్లు బౌడికా సైన్యంపై విజయం సాధించారు.

బలగాలు... అంటే ఉద్యోగుల సంఖ్య కంటే సరైన శిక్షణ ముఖ్యం అని బౌడికా ఉదంతం తెలియజేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

5. గుంపులో నుంచి బయటపడాలి

బౌడికా చేసిన దాడి రోమన్లపై జరిగిన మొదటి తిరుగుబాటేం కాదు. కానీ, ఆ తిరుగుబాటు చేసింది ఓ మహిళ కావడంతో అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. బౌడికా మహిళ కాబట్టే రోమన్లపై ఎన్ని తిరుగుబాట్లు జరిగినా, ఇది ఎక్కువమందికి తెలుసని చరిత్రకారులు చెబుతారు.

అత్యంత బలమైన రోమన్ల సామ్రాజ్యంపై దండెత్తిన అతి కొద్ది మహిళల్లో ఒకరిగా బౌడికా అందరికీ గుర్తుండిపోతారు. చరిత్ర పుస్తకాల్లో ఆమె గురించిన సమాచారం తక్కువగా ఉన్నప్పటికీ ‘తిరుగుబాటు’ అనే ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ఆమె పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images

6. రోల్ మోడల్ చాలా ముఖ్యం

బౌడికా కథ చాలాకాలంపాటు మరుగునపడిపోయింది. 16వ శతాబ్దంలో రచయితలు చరిత్రపైన ఆసక్తి చూపడంతో బౌడిక విజయగాథ మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ I కూడా బౌడికా కథ నుంచి స్ఫూర్తి పొందారు.

సామ్రాజ్యవాదంలో శక్తిమంతమైన నాయకురాలిగా విక్టోరియన్లు బౌడికాను గుర్తించారు. స్త్రీలకు ఓటు హక్కు కోసం జరిగిన ఉద్యమంలో కూడా బౌడికానే స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆ ప్రేరణతోనే పోరాడి యూకేలో మహిళలు ఓటు హక్కు సాధించారు.

‘బౌడిక స్వరూపం అస్పష్టంగా ఉంటుంది. అందుకే ఆమెలో రకరకాల పార్శ్వాలు కనిపిస్తాయి. అనేక రకాల అంశాల్లో ఆమె ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని రిచర్డ్ హింగ్లీ అనే పురాతత్వవేత్త చెబుతారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)