జమాల్ ఖషోగ్జీ హత్య: గొంతు నులిమి చంపేశారన్న టర్కీ

ఖషోగ్జీ హత్య

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య ఎలా జరిగింది? దీని గురించి టర్కీ మొట్టమొదటిసారి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఖషోగ్జీని గొంతు నులుమి హత్య చేశారని చెబుతోంది.

అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ అరేబియా ఏంబసీలో జరిగిన ఈ హత్య గురించి చాలా వారాల నుంచీ మీడియా వార్తలు ప్రచురించిన తర్వాత టర్కీ తరఫున ఈ ప్రకటన వచ్చింది. అయితే, ఆ దేశం తమ వాదనను సమర్థించేందుకు ఎలాంటి ఆధారాలూ చూపించలేదు.

చీఫ్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ ఫిదాన్ సోమవారం "సౌదీ అరేబియాతో జరిగిన చర్చల వల్ల ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని" అన్నారు.

ఇటు, సౌదీ అరేబియా ఈ సమావేశాల గురించి ఎలాంటి ప్రస్తావనా తీసుకురాలేదు.

ఫొటో సోర్స్, EPA

టర్కీ ఏం చెప్పింది?

టర్కీ తరఫున విడుదలైన ఒక ప్రకటనలో "ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం జమాల్ ఖషోగ్జీని సౌదీ అరేబియా కాన్సులేట్‌లోకి అడుగు పెట్టగానే గొంతు నులిమి హత్యచేశారు" అని తెలిపారు.

"తర్వాత ముందే అనుకున్నట్టు ఆయన శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కనిపించకుండా చేశారు" అని అందులో చెప్పారు.

ఖషోగ్జీ సౌదీ పౌరుడు, ఆయన ఆమెరికా మీడియా కోసం పనిచేసేవారు. తన దేశ పాలకులను తీవ్రంగా విమర్శించేవారని భావిస్తున్నారు.

ఖషోగ్జీ మృతదేహం ఇప్పటివరకూ దొరకలేదు. కానీ టర్కీ, సౌదీ అరేబియా ఆయన్ను సౌదీ కాన్సులేట్‌లో హత్య చేశారని అంగీకరించాయి.

అయితే ఆయన హత్య ఎలా జరిగిందనేదాని గురించి రకరకాలుగా చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

టర్కీలోని సౌదీ కాన్సులేట్

సౌదీ రాజ కుటుంబంపై ప్రశ్నలు

ఈ హత్యకు సౌదీ అరేబియానే కారణమని టర్కీ బహిరంగంగా ఆరోపిస్తోంది.

టర్కీలో అధికార పక్షమైన ఏకే పార్టీ ప్రతినిధి బుధవారం "ఎవరైనా సీనియర్ స్థాయి వ్యక్తి అనుమతిలేనిదే ఈ హత్య జరిగుండదని" అన్నారు.

ఈ హత్య వెనుక రాజ కుటుంబం ప్రమేయం ఉందనే విషయాన్ని సౌదీ అరేబియా ఖండిస్తోంది.

టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగన్ గత వారం సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడారు. కేసు దర్యాప్తులో పరస్పరం సహకరించుకోవడానికి ఇద్దరూ అంగీకరించారు.

అంతకు ముందు కొందరు టర్కీ అధికారులు తమ దగ్గర ఖషోగ్జీని హత్య చేశారని నిరూపించే ఆడియో-విజువల్ ఆధారాలు ఉన్నాయని మీడియాకు చెప్పారు. కానీ ఇప్పటివరకూ వాటిని బయటపెట్టలేదన్నారు.

టర్కీ మీడియా తమకు అందిన సమాచారం ప్రకారం ఖషోగ్జీని ఎలా చంపారనే వివరాలు వెల్లడించింది. హత్యకు ముందు ఆయన్ను హింసించారని కూడా చెప్పింది.

స్థానిక టీవీ ఛానల్‌కు గత వారం ఒక ఇంటవ్వ్యూ ఇచ్చిన ఖషోగ్జీ ఫియాన్సీ, టర్కీ యువతి హతీజే జెంగిజ్ "సౌదీ అరేబియా పాలకులు ఆయన్ను చంపడానికి కుట్ర చేశారని తెలిసుంటే" ఖషోగ్జీని అసలు ఏంబసీకి వెళ్లనిచ్చేదాన్నే కాదు" అన్నారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

సౌదీ అరేబియా ఏం చెబుతోంది?

సౌదీ అరేబియా అటార్నీ జనరల్ షేక్ సౌద్-అల్-మొజెబ్, టర్కీ చీఫ్ ప్రాసిక్యూటర్ ఫిదాన్‌ను రెండు సార్లు కలిశారు. కానీ తర్వాత దీనిపై ఎలాంటి ప్రకటనా చేయకుండానే సౌదీ వెళ్లిపోయారు.

సౌదీ అరేబియా ఖషోగ్జీ గురించి రెండు వేరు వేరు ప్రకటనలు జారీ చేసింది.

మొదట్లో ఖషోగ్జీ అదృశ్యమైనపుడు, ఆయన రాయబార కార్యాలయం నుంచి సజీవంగా బయటకు వెళ్లారని చెప్పింది. తర్వాత ఆయన హత్య జరిగిందని అంగీకరించింది.

హత్యపై దర్యాప్తు జరుగుతోందని సౌదీ అరేబియా చెబుతోంది. దీనికి సంబంధించి 18 మందిని అరెస్టు చేశామంటోంది. వారిపై సౌదీ అరేబియాలో విచారణ జరుగుతుందని చెప్పింది. కానీ వారిని తమకు అప్పగించాలని టర్కీ కోరుతోంది.

ఖషోగ్జీ హత్యతో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా చాలా దేశాలు సౌదీ అరేబియాను తీవ్రంగా విమర్శించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)