గూగుల్‌ ఉద్యోగుల వాకౌట్: మహిళల పట్ల వివక్షపై ప్రపంచవ్యాప్త నిరసనలు

  • 1 నవంబర్ 2018
గూగుల్ వాకౌట్ Image copyright Reuters

మహిళల పట్ల గూగుల్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ కార్యాలయాల నుంచి ఉద్యోగులు వాకౌట్ చేస్తున్నారు.

లైంగిక అనుచిత ప్రవర్తన ఆరోపణల పట్ల వ్యవహరించే తీరులో మార్పులు తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా, బలవంతపు మధ్యవర్తిత్వాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. ఈ మార్పులు తీసుకువస్తే బాధిత మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలవుతుంది.

గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ దీనిపై స్పందిస్తూ, దోషి మీద చర్య తీసుకునే ఉద్యోగుల హక్కును తాను సమర్థిస్తానని అన్నారు.

"మీలో చాలా మందిలో ఉన్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకోగలను" అని సిబ్బంది మొత్తానికి ఉద్దేశించిన ఇ-మెయిల్‌లో పిచాయ్ అన్నారు.

"నేనూ మీతో ఏకీభవిస్తున్నాను. మన సమాజంలో చాలా కాలంగా ఉన్న సమస్యను పరిష్కరించడానికి, అవును గూగుల్‌లో కూడా పరిస్థితి మెరుగుపరచడానికి నేను కట్టుబడి ఉన్నాను" అని సిఇఓ తన లేఖలో వివరించారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక న్యూయార్క్
Image copyright Walkout organisers
చిత్రం శీర్షిక సింగపూర్
Image copyright PA
చిత్రం శీర్షిక డబ్లిన్
Image copyright Reuters
చిత్రం శీర్షిక లండన్
Image copyright TWITTER@TEDONPRIVACY@GOOGLEWALKOUT VIA REUTERS
చిత్రం శీర్షిక జ్యూరిక్

వాకౌట్‌కు దారితీసిన పరిస్థితులేమిటి?

గతవారం గూగుల్‌లోని ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి మీద లైంగిక అనుచిత ప్రవర్తన ఆరోపణలు వచ్చాయి. అవి "విశ్వసనీయమైన" ఆరోపణలేనని గూగుల్ సంస్థ కూడా భావించింది. కానీ, ఆ ఆరోపణలకు గురైన వ్యక్తికి సంస్థ నుంచి వెళ్ళిపోయిన తరువాత 9 కోట్ల డాలర్లు చెల్లించడం ఉద్యోగులను ఆగ్రహానికి గురిచేసింది. ఆ ఆరోపణలను ఎదుర్కొన్న ఆండీ రూబిన్ 'ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్' సృష్టికర్త. ఆయన ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని తోసిపుచ్చారు.

మంగళవారం నాడు మరో ఉద్యోగి - ఈసారి గూగుల్‌లోని ఎక్స్ రీసర్చ్ ల్యాబ్‌కు చెందిన వ్యక్తి కూడా రాజీనామా చేశారు. ఆయన పేరు రిచర్డ్ డివాల్. తన విభాగంలో చేరడానికి ఇటీవలే ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న ఒక మహిళ పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. డివాల్ దీని మీద ఇంతవరకూ ఏమీ మాట్లాడలేదు. కానీ, రాజీనామా చేసిన తరువాత తన పట్ల తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారని మాత్రం అన్నారు.

లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కనీసం 48 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారని, వారికి ఎలాంటి చెల్లింపులూ జరపలేదని చెప్పిన పిచాయ్, 'న్యూయార్క్ టైమ్స్' రిపోర్ట్ ఇబ్బందికరంగా ఉందని అంగీకరించారు.

Image copyright WalKOUT ORGANISERS
చిత్రం శీర్షిక మార్పు కోసం వాకౌట్ అనే ఈ పత్రాన్ని వాకౌట్ చేస్తున్న గూగులు ఉద్యోగులు డెస్క్ వద్ద వదలి వెళ్తున్నారు

ఉద్యోగులు ఏం కోరుతున్నారు?

గురువారం నాటి వాకౌట్లో పాల్గొన్న ఉద్యోగులు, 'నేను నా డెస్క్ దగ్గర కూర్చోవడం లేదు. లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన, పారదర్శకత లేమి వంటి సమస్యలకు వ్యతిరేకంగా వాకౌట్ చేస్తున్నాను' అని సహోద్యోగులకు చెబుతున్నారు.

వాళ్ళు గూగుల్ యాజమాన్యం నుంచి ఏం కోరుతున్నారు?

1. జీతభత్యాలు, అవకాశాల కల్పనలో వివక్షకు ముగింపు పలకాలి.

2. లైంగిక ఆరోపణల మీది నివేదికలను బహిరంగం చేయాలి.

3. లైంగిక వేధింపుల ఆరోపణలను సురక్షితంగా, వ్యక్తిగత వివరాల గోప్యతతో చేయగలిగే అవకాశం.

4. చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్‌ను నేరుగా సిఇఓకు రిపోర్ట్ చేసే స్థాయికి పెంచాలి. ఆయన ప్రతిపాదనలను నేరుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు తెలిపాలి.

5. బోర్డులో ఉద్యోగుల ప్రతినిధిని నియమించాలి.

6. ఇప్పుడున్న ఫిర్యాదులపైనే కాకుండా భవిష్యత్తులోనూ బలవంతపు మధ్వవర్తిత్వానికి ముగింపు పలకాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)