జికా వైరస్: బ్రెజిల్ ప్రేమ కథలు

  • 3 నవంబర్ 2018
జికా ప్రేమ కథలు

మూడేళ్ళ నాటి మాట. బ్రెజిల్‌లో ఎంతో మంది గర్భిణులకు జికా వైరస్ సోకటంతో వేలాది మంది పిల్లలకు తల్లి కడుపులో ఉన్నప్పుడే మెదడు దెబ్బతిన్నది.

వీరిలో ప్రముఖంగా కనిపించే లక్షణం.. మైక్రోసెఫలీ. అంటే ఈ పిల్లల తలలు సాధారణ పరిణామం కంటే చాలా తక్కువగా ఉంటాయి. తల్లి గర్భంలోనే మెదడు దెబ్బతినటంతో పుట్టుకతోనే ఈ పిల్లల తలలు చిన్నవిగా ఉంటాయి.

జికా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నపుడు, నా కూతురు క్యాటీకి కూడా మైక్రోసెఫలీ ఉందని నాకు తెలిసింది.

ఆ తర్వాత కొన్నేళ్లకు, క్యాటీ పారాడే వయసులో బ్రెజిల్‌లో జికా బారినపడ్డ చిన్నారుల గురించి నేను తరచుగా ఆలోచించేవాడిని. వాళ్లు ఎలా ఎదుగుతున్నారు? వారి కుటుంబాలు ఈ వ్యాధిని ఎలా ఎదుర్కొంటున్నాయి? ఇలాంటి ప్రశ్నలు నన్ను వెంటాడేవి.

అది తెలుసుకోవటానికి నేను ఈ వసంత రుతువులో బ్రెజిల్ వెళ్లాను.

చిత్రం శీర్షిక మైక్రోసెఫలీతో బాధపడుతున్న క్యాటీతో ఈ కథనం రచయిత విలియం క్రేమర్

బ్రెజిల్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఓక ఊరు రిసైఫ్. వెలుతురు రణగొణ ధ్వనులతో నిండిన ఒక గదిలో ఒక చాప మీద ఇద్దరు పిల్లలు బాసింపట్లు వేసుకుని కూచుని ఉన్నారు.

ఒక్కో చిన్నారికీ సాయంగా నీలి రంగు కోటు ధరించిన పెద్దవాళ్లు ఇద్దరు ఉన్నారు. పక్కనే మరో వ్యక్తి నీలం రంగు కోటు ధరించి గిటార్ మీటుతూ సాంబా పాట పలికిస్తున్నారు.

ఇద్దరు చిన్నారుల్లో గిల్హేర్మ్ అనే ఓ బాలుడు.. ఒక యువకుడి ఒడిలో కూర్చుని అతడు కొంచెం సాయం చేస్తుండగా.. గిటార్ శ్రుతికి అనుగుణంగా డ్రమ్ వాయిస్తున్నాడు.

కానీ అతడి చిన్ని స్నేహితుడు డానియెల్ ఆయా ఒడిలో కూర్చుని చేయి లేపలేకపోతున్నాడు. అయితే.. పాట వింటూ అతడు నవ్వుతూ తల ఊపుతున్నాడు.

చిత్రం శీర్షిక ఈశాన్య బ్రెజిల్‌లోని రెసైఫ్‌లో కాంజెనిటల్ జికా సిండ్రోమ్ (సి.జి.ఎస్) చిన్నారులు

ఈ ఇద్దరు పిల్లలకీ గర్భంలోనే తల్లి ద్వారా జికా వైరస్ సంక్రమించటంతో పలు అంగవైకల్యాలకు గురయ్యారు. దీనిని వైద్య పరిభాషలో కాన్‌జెనిటల్ జికా సిండ్రోమ్ (సీజడ్‌ఎస్) అని వ్యవహరిస్తారు. మూడేళ్ల కిందట... అంటే 2015, 2016 సంవత్సరాల్లో బ్రెజిల్‌లో వ్యాపించిన జికా వైరస్ కారణంగా దాదాపు 3,000 మంది పిల్లలు సీజడ్ఎస్‌తో జన్మించారు.

ఇందులో బాగా ప్రముఖంగా కనిపించే లక్షణం.. మైక్రోసెఫలీ - తలలు అసాధారణ రీతిలో చిన్నవిగా ఉండటం. ఇలా చిన్న తలలతో అప్పుడే పుట్టిన పిల్లల ఫొటోలు, వీడియోలను మూడేళ్ల కిందట ప్రపంచ మీడియా పెద్దఎత్తున ప్రసారం చేసింది.

అయితే, గిల్హేర్మ్ అలా కనిపించలేదు. కానీ జికా వైరస్ వ్యాప్తి తారాస్థాయిలో ఉన్న సమయంలో పుట్టటంతో.. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించాలని అతడి తల్లి జెర్మనా సోరెస్ పట్టుపట్టారు.

''పరీక్షల ఫలితాలు వచ్చేటప్పటికి కొంత సమయం పట్టింది. అవి వచ్చాక వైద్యులు ఎంత భయపెట్టే విధంగా చెప్పొచ్చో అంత దారుణంగా చెప్పారు. అబ్బాయి జీవితంలో నడవలేడు. ఏడాది కన్నా ఎక్కువ బతకడు అంటూ అంచనాలు చెప్పారు'' అని జెర్మానా గుర్తు చేసుకున్నారు.

‘‘ఈ చిన్నారిది చాలా దృఢమైన వ్యక్తిత్వం’’

గిల్హేర్మ్ నడవలేడు. అయినా కానీ వైద్యుల అంచనాలను తలకిందులు చేశాడు.

అతడు బంగీ తాళ్లలో కూర్చుని సంతోషంగా పైకీ కిందకి ఎగరటం నేను చూశాను. ఈ చికిత్సను స్పైడర్ థెరఫీ అంటారు.

అతడికి కొన్ని పదాలు తెలుసు. అందులో 'నో' అనే పదం కూడా ఉంది. అవకాశం చిక్కగానే అతడు ఆశ్చర్యకరమైన శక్తి, లాఘవంతో నా దగ్గరున్న మైక్రో ఫోన్ లాగేసుకున్నాడు.

''వీడికి స్థైర్యం చాలా ఎక్కువ. అనుకున్న పని చేసేదాకా వదలడు. తనకు ఏం కావాలనేది అతడికి తెలుసు. ఒకసారి 'నో' అన్నాడంటే ఇక వద్దనే'' అంటారు జెర్మానా.

చిత్రం శీర్షిక నాలుగు వందల మందికి పైగా మహిళలున్న యునైటెడ్ మదర్స్ ఆఫ్ ఏంజెల్స్ (యుఎంఏ) నాయకురాలు జెర్మానా

బహుశా ఈ లక్షణాలు తల్లి నుండి వచ్చి ఉండొచ్చు. గిల్హేర్మ్ వ్యాధి గురించి వైద్యులు చెప్పినపుడు తొలుత దిగ్భ్రాంతికి గురైన జెర్మానా, ఆ తర్వాత ముందున్న సవాళ్ల గురించి చాలా పరిశోధన చేశారు. తన కొడుకు ఇతర చిన్నారుల కన్నా చాలా నెమ్మదిగా ఎదుగుతాడని ఆమె తెలుసుకున్నారు.

''నేను నా కొడుకు కోసం ఆరేళ్ళ పాటు ఎదురు చూశాను. నా బిడ్డను నేను కాపాడుకుంటా. నా బిడ్డను ఇంటికి తెచ్చుకున్నా. వికలాంగుల చిన్నారిని పెంచే ప్రపంచంలోకి ప్రవేశించా'' అని ఆమె చెప్పారు.

గిల్హేర్మ్ కోసం వైదులను కలిసే క్రమంలో అలాంటి పిల్లల తల్లిదండ్రులు చాలామందితో ఆమెకు పరిచయం అయ్యింది. వారందరితో కలిపి ఆమె ఒక వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారు.

ఇది క్రమంగా విస్తరించి ఇప్పుడు 'యునైటెడ్ మదర్స్ ఆఫ్ ఏంజెల్స్ - ఉమా' అనే పేరుతో ఒక పరస్పర మద్దతు వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఇందులో 400 మందికి పైగా తల్లులు సభ్యులుగా ఉన్నారు. జెర్మానాను తమ నాయకురాలిగా భావిస్తుంటారు.

చిత్రం శీర్షిక డాక్టర్ వానెస్సా వాండర్ లిండెన్

రెసైఫ్ ప్రాంతంలో మైక్రోసెఫలీ వ్యాధిని తొలిసారి గుర్తించిన డాక్టర్ వనేసా వాన్ డెర్ లిండెన్. ఇప్పిడు గిల్హేర్మ్ ఆమె దగ్గరే చికిత్స పొందుతున్నాడు. ఆమె పసిపిల్లల నాడీ శాస్త్ర నిపుణురాలు.

తొలిసారి అనే సిజడ్ఎస్ రోగిని 2015 ఆగస్టులో గుర్తించారు. మెదడును సీటీ స్కాన్ చేసినపుడు చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్నాయని వెల్లడైంది. కానీ ఈ ఇన్ఫెక్షన్లు ఏ కారణంగా వచ్చాయనేది వైద్య పరీక్షలు నిర్ధారించలేకపోయాయి. సాధారణంగా శరీరంలో ఇన్ఫెక్షన్‌కి టాక్సో ప్లాస్మోసిస్ ద్వారానో హెచ్ఐవీ ద్వారానో రుబెల్లా లేదా సీఎంవీ వంటి వైరస్‌ల ద్వారానో పసిపిల్లల్లో అంగవైకల్యం ఏర్పడుతుంది. కానీ ఈ వైద్య పరీక్షల్లో వైరస్ అంతుచిక్కకపోయేసరికి డాక్టర్ వనేసా మరింత లోతైన పరిశోధనకు సిద్ధమయ్యారు.

కొద్ది కాలంలోనే అటువంటి మరిన్ని ఉదంతాలు బయటపడ్డాయి. సెప్టెంబరు 14న అదే రకమైన లక్షణాలతో ముగ్గురు పిల్లలను చూశారు డాక్టర్.

ఈ విషయాన్ని రెసైఫ్ వైద్యశాఖ దృష్టికి తీసుకెళ్లిన డాక్టర్ వనేసా తన పరిశోధన కోసం కొంత ఆర్ధిక సహాయం కావాలని కోరారు. వనేసా తల్లి అనా కూడా పిల్లల వైద్యనిపుణులే. అందుకే తన పరిశోధన గురించి ఆమె అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నది వెన్నెసా.

''నా దగ్గరకి కూడా అలాంటి లక్షణాలున్న ఏడుగురు పిల్లలు చికిత్స కోసం వచ్చారు'' అని ఆమె చెప్పారు.

వనేసా సోదరుడు హెలియో కూడా చిన్న పిల్లల డాక్టరే. ఇక్కడికి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గియోనియాలో ఆసుపత్రి అతనిది. అతను కూడా ఒక పిల్లవాడి మెదడు స్కాన్ చేసిన చిత్రాలు వనేసాకు వాట్సప్ చేశారు. ఇవే లక్షణాలు కనపడ్డాయి.

వనేసా వద్దకు వచ్చిన అనేక మంది తల్లులు ప్రసవం సమయములో తమకు బొబ్బలు వచ్చాయని చెప్పారు. డెంగ్యూ జ్వరంలా వచ్చిందని మరికొందరు చెప్పారు. అయితే డెంగ్యూ జ్వరం కోసం జరిగిన పరీక్షల్లో మాత్రం అది కాదనే తేలింది.

మెదడు పెరిగే సమయంలో దానికి కావలసిన కండరాలను తయారు చేయటానికి ఉపయోగపడే కణాలు రేడియల్ గ్లియా కణాలు. జికా వైరస్ ఆ గ్లియా కణాలను తినేస్తుంది అన్న విషయం ఇప్పుడు నిర్ధారణ అయ్యింది.

మెదడును ఎంఆర్ఐ స్కాన్ చేశాక డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పగలిగే విషయాలు చాలా ఉంటాయి. కానీ తొలిసారిగా జికా వైరస్ బారినపడ్డ తల్లులకు పుట్టిన పిల్లలను స్కాన్ చేసిన తర్వాత ఆ స్కాన్ ఫొటోలు గమనించిన వనేసాకు ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటో కనిపించింది.

నుదుటి భాగం బాగా దెబ్బతిన్నది. కండరాల చలనశీలతను ప్రభావితం చేసేది ఈ నుదుటి నిర్మాణమే. ప్రస్తుతం వనేసా వద్ద చికిత్స పొందుతున్న 130 చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. నుదుటి బాహ్య కవచం కూడా బాగా దెబ్బ తిన్నది. ఈ కవచం రక్షణోనే మెదడులోని తెల్లపొరలు కాల్షియం తీసుకుంటాయి. నుదుటి భాగాన్ని గట్టిపరుస్తుంది.

అలా గట్టిపడక పోతే మూర్ఛరోగానికి దారి తీస్తుంది. ఆమె వద్దకు వచ్చిన వాళ్లలో మూడింట రెండు వంతుల మంది పుట్టిన మొదటి సంవత్సరంలోనే ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు.

డాక్టర్ వనేసా వద్దకు వచ్చే రోగుల్లో కనీసం 60 శాతం మందికి బహువిధాల అభ్యాస వైకల్యాలున్నాయి. కొంత మందకి కనీసం ఇంద్రియ జ్ఞాన సామర్ధ్యం కూడా లేదు. మరికొంత మంది మందబుద్ధిలోకి ప్రవేశిస్తున్నారు.

కొంత మందికి తల పరిమాణం మరీ చిన్నదిగా ఉంటే మరికొంత మంది వినికిడి లోపం, దృష్టి లోపం, మోకాళ్ళు మోచేతులు మెలిదిరిగి పోవటం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.

జైకా వైరస్ బారిన పడిన పిల్లల కథలు ఎంతో వైవిధ్యమైనవిగా కనిపిస్తున్నప్పటికీ స్థూలంగా ఒకే కథ. ఒకే వ్యాధి మూలం. కానీ ఆ వ్యాధి ప్రభావంలో జీవించటానికి ఆ పిల్లలు వారి కుటుంబాలు పడుతున్న కష్టం మాత్రం ఎన్నో రూపాలు తీసుకొంటోంది.

''ఆ పాప కు ఎనిమిది నెలలు. ఇప్పటివరకు ఏ సమస్యా రాలేదు''

డాక్టర్ వనేసా తన తొలి జైకా వైరస్ రోగిని గుర్తించిన సమయంలోనే.. 2015 ఆగస్టులో తొలిసారి మా అమ్మాయికి మెదడు స్కాన్ చేయించాం.

అప్పటికి ఆ అమ్మాయికి ఎనిమిది నెలలు. ఏ సమస్యా లేదు. కానీ, ఆమె తమ్ముడు దూకుడుగా ఉంటే.. క్యాటీ అందుకు భిన్నంగా ఆమె చేతులు కట్టుకుని తన ఉయ్యాల కుర్చీలో అలానే కూర్చిండిపోయేది.

ఆ పాప పుట్టినపుడు పుట్టిన ఇతర పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో కలుస్తూ.. నవ్వుతూ తుళ్లుతూ కేరింతలు కొడుతూ నిటారుగా కూర్చుంటూ ఉంటే.. క్యాటీ బాల్యం ఆ వేసవి మొత్తం కొనసాగింది. తాను నవ్వలేదు. ఎదురుగా ఉన్న వస్తువుల మీద స్పష్టంగా దృష్టి నిలపలేదు. చుట్టూ ఉన్న వస్తువులను అందుకునే ప్రయత్నం చేయలేదు. అసలు తలను నిటారుగా నిలపలేకపోయింది.

ఆస్పత్రిలో క్యాటీ మెదడును స్కాన్ చేశాక డాక్టర్ మమ్మల్ని పిలిపించారు. ''నిజాయితీగా చెప్పాలంటే స్కాన్ ఫలితాలు బాగాలేవు'' అని చెప్పారు. కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న ఒక బొమ్మ మీద - మా అమ్మాయి మెదడులో యాపిల్ ఆకారంలో నలుపు తెలుపు రంగుల్లోని ప్రాంతాన్ని చూపారు. నల్ల రంగు ఉన్న భాగం చాలా పెద్దదిగానూ తెల్ల రంగు ఉన్న భాగం చాలా చిన్నదిగానూ ఉంది.

క్యాటీ వెంట్రిక్యులోమెగాలీ వ్యాధిగ్రస్తురాలని నిర్ధారించారు. అంటే మెదడు భాగం చాలా ఎక్కువగా ద్రవరూపంగానే మిగిలి ఉంది. ఘనరూపం సంతరించుకోలేదు. మైక్రోసెఫాలి వ్యాధి పరీక్ష కూడా చేయించారు. అయితే.. గర్భంలో ఉన్నపుడు, ప్రసవం చాలా సాధారణంగానే ఉండింది. కాబట్టి, క్యాటీకి అంతర్లీనంగా ఆ వ్యాధి ఉండొచ్చని, మా బాబుకు కూడా అది ఉండే అవకాశం లేకపోలేదనీ హెచ్చరించారు.

అయితే.. అది కాన్‌జెనిటల్ జికా సిండ్రోమ్ కాదని కనీసం మాకు తెలుసు. ఎందుకంటే.. జికా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు మేం వెళ్లలేదు. మరో రెండున్నరేళ్ల తర్వాత.. క్యాటీ రుగ్మత అరుదైన జన్యు లోపం వల్ల తలెత్తిందని, మా బాబుకు అటువంటి సమస్య ఏదీ లేదని మాకు తెలిసింది.

కానీ క్యాటీ పుట్టాక చూసిన తొలి శీతాకాలం మాత్రం దారుణంగా సాగినది. మొత్తం శీతాకాలంలో క్యాటీ ఒక్కసారి కూడా నవ్వలేదు.

మేం క్యాటీని తీసుకుని బయటకు వెళ్లలేకపోయాం. విపరీతమైన చలి. మా దగ్గరున్న బండి.. ప్రయాణంలో కదలికల సమయంలో క్యాటీ మృదువైన శరీరానికి అనువుగా లేకపోయింది. ఆహారం మింగటానికి అవసరమైన సంక్లిష్ట కదలికలు క్యాటీకి అమరలేదు. ఆమెకు సరిగ్గా తినిపించటానికి సరైన కుర్చీ కూడా మా దగ్గర లేదు. తనకు మలబద్దకం వచ్చేది. కోపం వచ్చేది. క్యాటీ చనిపోతుందా అన్న ఆందోళన నా మనసును కల్లోలపరచేది.

సాయంత్రం అయ్యేసరికి మా స్క్రీన్లు బ్రెజిల్ జికా వ్యాధి బేబీల ఫొటోలతో నిండిపోయాయి. ''మా వ్యక్తిగత కష్టాలు కూడా అంతర్జాతీయ వార్త అయినట్లయితే అది ఇంకెంత కఠినంగా ఉండేది?'' అని నాకు అనిపించింది.

"ఆమెకు ఏమయిందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉన్నారు జనం"

2016 ఆరంభంలో పెట్రోలినా నగరంలో మైక్రోసెఫాలితో పుట్టిన మూడో పాప మారియా కరోలినా.

''జనం చాలా ఆసక్తి చూపారు. పాప పుట్టినపుడు నా గది నిండా జనమే. పుట్టిన పాప ఎలా ఉందో చూద్దామని వచ్చిన వాళ్లే'' అని ఆమె తల్లి లెటీసియా కానసీకావో డా సిల్వా చెప్పారు.

''కొంతమంది తల్లితండ్రులు ఆసుపత్రి గదిలో మాతో ఉండటానికి ఇష్టపడలేదు'' అని తెలిపారు.

స్థానిక పత్రిక విలేకరి ఒకరు ఫోన్ చేశారు. ''నాతో నా పాప తో ఒక రోజు గడపాలని కోరారు. మా జీవితం ఎలా ఉంటుందో దగ్గరగా పరిశీలించటానికి'' అని తెలిపారు లేటిసియా. ''అయితే నేను ఆ విజ్ఞప్తిని తిరస్కరించాను. నా కూతురు కథనాలతో తమ పత్రిక అమ్మకాలు పెంచుకోవడానికి వస్తున్నారని నాకు తెలుసు'' అన్నారు.

టీవీల్లో ఈ వ్యాధిని ఒక వైద్య సంబంధిత విషయంగా చెప్పకుండా.. అదేదో భయంకరమైన వ్యాధిగా చూపించటం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. జికా వైరస్ సోకిన పిల్లల గురించి వారి రూపు రేఖలు గురించి వస్తున్న వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు.

అదే సమయంలో లేటిసియా ఆత్మ స్థైర్యం కోల్పోలేదు. ఆమె నలుగురు పిల్లలను పెంచింది. కానీ ఈ అనూహ్యమైన భారాన్ని ఎలా మోయనుంది?

మిగిలిన పిల్లల మాదిరిగానే ఈ పాపనూ పెంచాల్సి ఉంటుందని ఆమె నిదానంగా అర్ధం చేసుకున్నారు.

మేం మాట్లాడుతున్నప్పుడు లెటీసియా తన కూతురు మారియాకు జావ తాగిస్తున్నారు. మారియా ఆరోగ్యాంగానే ఉంది. చక్కగా తింటోంది.

తన అన్నలు, అక్కల మాదిరిగానే ఏదో ఒక రోజు మారియా కూడా నడవగలుగుతుందనీ మాటాడుతుందనీ లెటీసియా విశ్వాసంతో ఉన్నారు.

''నా కల అది. మా అమ్మాయిది కూడా. ఎందుకంటే అన్నలు, అక్కలు ఆడుకుంటున్నపుడు తనుకూడా ఆడుకోవాలన్న కుతూహలం ప్రదర్శిస్తోంది'' అని ఆమె చెప్పారు.

పెట్రోలినా ఆరోగ్య కేంద్రంలో మేము మాట్లాడుకుంటున్నాము. అక్కడ ఏడెనిమిది కుటుంబాలు పొగయ్యాయి.

''నా పాపను ఇతరుల కళ్ళ పడకుండా ఎందుకు దాచాలి?''

మేమున్న గదికి పక్క గదిలో మారియా లూయిజా అనే పాపకు ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఆ పాప తల్లి రఫేలా కొయెలో ఆరాజో.

లూయిజా పుట్టినప్పుడు మైక్రోసెఫాలి వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ కాలేదు. కానీ వార్తలు చూసిన తర్వాత కానీ ఆమెకు అర్ధం కాలేదు వాళ్ళ పాపకి కూడా అదే వ్యాధి ఉంది అన్న విషయం.

అయితే లెటీసియా లానే రఫేలా కూడా.. తమ పాపను కుతూహలంతో తొంగి తొంగి చూసే వాళ్లతో విసుగు చెందారు. అలా నక్కి నక్కి చూసేవాళ్ళతో ఇబ్బందిగా ఉంటే.. పాపను బట్టల్లో పెట్టి దాచేయమని డాక్టర్ సూచించారు.

''నేను ఆలోచించా. నా కూతురును నేనెందుకు దాయాలి? అలా అనిపించాక ఆమెను తీసుకుని బయటకువెళ్లటం మొదలు పెట్టాను. చుట్టూ ఉన్న జనాలు మమ్మల్ని చూసినపుడల్లా నేను వాళ్ళ వంక నవ్వుతూ చూసేదాన్ని'' అని ఆమె చెప్పారు.

''పాపకు సుస్తీ చేసిందా అని ఆడిగేవాళ్ళు. పాపకు మైక్రోసెఫాలి అనే వ్యాధి ఉందని బదులిచ్చేదాన్ని. అపుడపుడూ అలాంటి వారి పట్ల కోపంగా ప్రవర్తించకుండా ఓపిగ్గా బదులిచ్చే శక్తినివ్వమని దేవుడిని ప్రార్ధించేదాన్ని. అడపాదడపా ఓపిక చచ్చిపోయేది - అయినా ఒక నిట్టూర్పు విడిచి వాళ్ళకు నవ్వుతూ సమాధానం ఇచ్చేదాన్ని'' అని వివరించారు.

చిత్రం శీర్షిక 'జికా పిల్లల మెరుగైన జీవితమే మా లక్ష్యం' అంటున్న యునైటెడ్ మదర్స్ ఆఫ్ ఏంజెల్స్

''ఈ పిల్లలకు నాణ్యమైన జీవితం అందించటానికే మా పోరాటం''

నేను మాట్లాడిన తల్లులందరూ జెర్మానా సోరెస్ నడుపుతున్న యునైటెడ్ మదర్స్ ఆఫ్ ఏంజెల్స్ సంస్థలో భాగస్వాములు.

జెర్మానా ఈ మధ్యనే వివిధ ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు. ఆమెతో పాటు ఒక మనస్తత్వ శాస్త్ర నిపుణులు, సామాజిక కార్యకర్తలు కూడా పర్యటనలో పాల్గొన్నారు.

కొంత తాత్సారం తర్వాత పెర్నాంబుకో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ పర్యటనకు ఆర్ధిక సహాయం చేసింది.

జికా వైరస్ బారిన పడ్డ కుటుంబాలకు ఇది ఓ పెద్ద మలుపు. వ్యాధి నిర్ధారణతో వచ్చిన షాక్ నుండి తెరుకున్నారు. భౌతికంగానూ భావోద్వేగం పరంగానూ స్థిమితపడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఇతర అంశాలమీద.. వికలాంగుల ప్రత్యేక అవసరాలు, ఈ ప్రపంచంలో తమ పిల్లలు ఎలా ఎదగాలి, ఎలా మెలగాలి, వాళ్ళ కు విద్యాబుద్ధులు నేర్పించటమెలా.. అనే విషయాల మీద దృష్టి పెడుతున్నారు.

''ఈ పిల్లలకు సమాజపరంగా అందాల్సిన హక్కులు అందేలా చేయటం మా బాధ్యత. ఈ పిల్లలకు నాణ్యమైన జీవితాన్ని అందించటానికే మా ఈ పోరాటం'' అన్నారు జెర్మానా.

Image copyright Getty Images

బ్రెజిల్‌లో జికా వైరస్ ఎలా ప్రవేశించింది?

బ్రెజిల్‌లో 2013లో కాన్ఫెడరేషన్ కప్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నపుడు ఈ వైరస్ తొలిసారి దేశంలో ప్రవేశించిందన్న వాదన ఉంది.

మరికొంతమంది జూన్ 23న తహితి క్లబ్ ఆటగాళ్ళు ఉరుగ్వే జట్టుతో తలపడినపుడు తహితి జట్టు ఆటగాళ్ల ద్వారా ఈ వైరస్ ప్రవేశించినదని అంటారు. ఆ పోటీ రాసిఫీలోనే జరిగింది.

జికా వైరస్ వ్యాపిస్తున్న సమయంలోనే ఫ్రెంచ్ పొలినేసియా వైరస్ కూడా ఈస్టర్ దీవిలో ప్రవేశించింది. తర్వాత కుక్ దీవులు, న్యూ కాలేదోనియా దీవులకు కూడా విస్తరించింది.

ఈ మధ్య కాలంలో బ్రెజిల్ పరిశోధకులు ముందుకు తెచ్చిన మరో వాదన కూడా ఉంది. బ్రెజిల్‌కు వలస వచ్చిన హైతీ వాసుల ద్వారా కానీ లేదా ఇతర దేశాల్లో మకాం వేసిన బ్రెజిల్ సైనికుల రాకపోకల ద్వారా గానీ ఈ వైరస్ దేశంలో ప్రవేశించి ఉండొచ్చన్నది ఆ వాదన.

1947లో ఈ జికా వైరస్‌ను తొలిసారి ఉగాండాలో కనిపెట్టారు. ఈ వైరస్ గురించి మాటాడుతున్న వారంతా ముందుకి తెచ్చే ఒక ప్రశ్న.. జైకా వైరస్ దేశంలోకి రాక ముందు పుట్టుకతో వచ్చే ఈ అవలక్షణాలు ఎక్కడా ఎందుకు కనిపించలేదు?

అయితే, 2016లో జరిగిన ఒక పరిశోధనలో ఫ్రెంచ్ పొలినేసియాలో ఇటువంటి 19 మంది రోగులను గుర్తించారు. ఈ రోగ నిర్ధారణ కూడా బహుశా జికా వైరస్‌తోనే ముడిపడి ఉంటుంది. ఈ సమయంలోనే ఈ వైరస్ మరింత పెట్రేగట్టానికి ముందు నెమ్మదించి ఉండొచ్చు.

2015లో తొలిసారి ఈ వైరస్ వ్యాపించినపుడే ఇది జనసమ్మర్థంతో కూడిన పేదల బస్తీల్లో ఎంత తీవ్రంగా వ్యాపించగలదో ఎంత ప్రమాదకరమైన ప్రభావం చూపగలదో రుజువు చేస్తోంది.

ఈ వైరస్ ఎక్కువగా ఏడిస్ ఈజిప్టై అనే జాతికి చెందిన దోమలో ఎక్కువగా నివాసముంటుంది. ఆ దోమ ఎక్కువ దూరం ఎగరలేదు. రసైఫ్‌లో 15 లక్షల జనాభా ఉంది. ఎక్కువ మంది పేదల బస్తీల్లోనే నివాసముంటారు. మసకబారిన ఇళ్లు పొగచూరిన ద్వారాలే ఇక్కడ సర్వసాధారణంగా కనపడతాయి.

జికా వైరస్ పీడిత కుటుంబాలన్నీ ప్రధానంగా అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాలే.

గణాంక నిపుణులు వేనెర్ వియేరా డిసౌజా నిర్వహించిన పరిశోధన ప్రకారం మైక్రోసెఫలీ వ్యాధి వ్యాప్తి ధనికులు నివసించే ప్రాంతాల కంటే పేదల బస్తీల్లో ఆరు రెట్లు అధికమని అంచనా వేశారు.

పేదల బస్తీల్లో నివసించే పేదలే ఎక్కువగా దోమకాటుకు గురవుతారు. వీళ్ళు నివసించే ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపం బాగా కనిపిస్తుంది.

మూడో వంతు బ్రెజిల్ పౌరులకు రక్షిత మంచినీటి సరఫరా అందుబాటులో లేదు. అందువల్లనే నీళ్లను ట్యాంకుల్లో నిలువ ఉంచుకుంటారు. అలా నిల్వ ఉన్న నీళ్లలోనే ఏడిస్ ఈజిప్టై దోమలు తమ సంతానాన్ని పెంచుకుంటాయి.

2015 డిసంబర్‌లో బ్రెజిల్ ప్రభుత్వం దాదాపు 2,20,000 మంది సైనికులను సానిటరీ ఇనస్పెక్టర్లకు తోడు ఇచ్చి ఇంటింటికీ పంపింది. ఆయా నివాస ప్రాంతాల్లో నీళ్ల ట్యాంకులు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించటానికి.

అటువంటి ప్రయత్నాలు దోమల వ్యాప్తిని అరికట్టడానికి తోడ్పడి ఉండొచ్చు కానీ జికా వైరస్ నివారణ బాధ్యత పూర్తిగా తల్లులదే అని ప్రభుత్వం ప్రకటించటం ఆశ్చర్యం. ఈ లెక్కన తమ పిల్లలు జీవితాంతం అంగవైకల్యంతో చెదిరిపోయున ముఖంతో ఉండటానికి తమదే బాధ్యత అని తల్లులు కుమిలిపోవాలేమో?

ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని.. జికా వైరస్ బాధిత కుటుంబాలకు నెలవారీ స్టైపండ్ చెల్లించి ఆయా కుటుంబాలకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలి అని జెర్మానా డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్య పట్ల సానుభూతి కలిగిన ఒక పార్లమెంట్ సభ్యునితో కలిసి జెర్మానా ఆమె బృందం.. వైరస్ బాధిత మహిళలకు నెలకు 1,200 డాలర్ల పరిహారం ఇవ్వాలన్న బిల్లును పార్లమెంటులో ఆమోదింపచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

''వికలాంగ ప్రయోజనాలు రాయితీలకు అదనంగా ఇది ఇవ్వాలి'' అంటారు జెర్మానా.

చిత్రం శీర్షిక చిన్నారి మెలీసా విటోరియా సెవరినాతో తల్లి కాసియానా

‘‘ఈ పిల్లలను వదిలేయలనుకున్నాను’’

మెలిస్సా విటోరియా సెవెరినా పుట్టినప్పుడు ఆమె తల ఉపరితల చుట్టుకొలత 26.5 సెంటీ మీటర్లు మాత్రమే. బ్రెజిల్‌లో ఆరోగ్యంగా పుట్టే పిల్లల తలల సగటు ఉపరితల కొలత 34.5 సెంటీ మీటర్లు.

రెండేళ్లు గడిచాక ఇప్పుడు ఆమె ముఖం హృదయాకారంలో చూడముచ్చటగా ఉంది. ఆమె కళ్లు గోదుమ రంగులో మెరుస్తున్నాయి. అయితే, చూపు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. కానీ తన చుట్టూ ప్రపంచాన్ని శ్రద్ధగా వింటోంది. నేను నా చేతి వేళ్లు ఆమె ముందుకు చాచినపుడు.. ఆ పాప తన పడికిలితో ఒడిసి పట్టుకుంది.

నా కూతురు సరిగ్గా ఒక ఏడాది పెద్దది. మెలిస్సా విటోరియాను చూసినపుడు నా కూతురు ఎలా ఉండేదో బాగా గుర్తొచ్చింది. మెలిస్సాకు ఈ మధ్యే తొంటి ఆపరేషన్ చేశారు. దానివల్ల ఆమె కాళ్ళను ఎడంగా ఉంచటానికి కడియాలు తొడిగారు. ఆమె తల్లి కాసియానా తన పాపను జాగ్రత్తగా హత్తుకుని తీసుకెళ్లింది.

మరోవైపు, విటోరియా కవల సోదరుడు ఎడ్సన్ మిగెల్ చుట్టూ గెంతుతూ తల్లి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. కాసియానాకు సోకిన జికా వైరస్ ప్రభావం విటోరియా మీద చూపినట్లుగా అతడి మీద ప్రభావం చూపినట్లు లేదు.

మిగెల్ బరువు 13 కిలోలు. అతడి సోదరి బరువు 7.5 కిలోలు. కూతురి అవసరాల కోసం బలవర్థకమైన పాలపొడి కొనే స్తోమత తనకు లేదన్నారు కాసియానా.

ఈ ఇద్దరు కవల పిల్లలు 2016 జనవరిలో నెలలు నిండకముందే పుట్టారు. ఈ పిల్లలను తన దగ్గర ఉంచుకోవటం కాసియానాకు ఇష్టంలేదు.

''అలాగనటం సిగ్గుచేటని డాక్టర్ అన్నారు'' అని ఆమె గుర్తు చేసుకున్నారు. ''నేను చాలా ఏడ్చాను. నాకు బాగాలేదు. చాలా ఆక్రోశించాను. పిల్లలకు హాని చేయాలన్న చెడ్డ ఆలోచనలు వచ్చాయి. వాటన్నిటి నుంచి బయటపడ్డాను'' అని ఆమె తెలిపారు.

Image copyright Getty Images

ఆమె మూడు వారాలు ఆసుపత్రిలో ఉన్నారు. ఒకసారి విటోరియా ఏడుపు ఆపకపోతే పాప గొంతు నొక్కుతూ ఏడుపు ఆపటానికి ప్రయత్నించారు కాసియానా. అది పక్కనున్న వాళ్ళు చూశారు. మరునాడు మనస్తత్వ నిపుణులు ఆసుపత్రికి వచ్చి కాసియానా తోనూ ఆమె తల్లితోనూ మాట్లాడారు.

''అప్పటి నుండీ విటోరియాను సాకటంలో మా అమ్మ నాకు చాలా సాయం చేసింది'' అంటూ కాసియానా నెమ్మదిగా చెప్పారు. ఆమె ఇబ్బందిపడుతూ నవ్వారు. ''ఆసుపత్రి నుంచి వెళ్లాక రెండు నెలల వరకూ ఈ పాపను ఎవరికైనా ఇచ్చేయాలని ప్రయత్నించాను. కానీ మా అమ్మ తిరస్కరించింది'' అని తెలిపారు.

కుంగుబాటు తగ్గటానికి మందులు ఇచ్చిన తర్వాత కాసియానా పరిస్థితి కాస్త మెరుగుపడింది. ప్రస్తుతం అలాంటి మందులు తీసుకోవటం లేదు కానీ ఆమె ముఖంలో సంతోషం కనిపించటం లేదు. కళ్ళలో నైరాశ్యం నిండి ఉంది.

''భావోద్వేగాలు లేకుండా జీవించటం ఏమీ బాగోలేదు. కానీ ఎంత ప్రయత్నించినా నాకవి రావటం లేదు'' అని ఆమె అంటారు.

విటోరియా వైకల్యానికి తనను తానే నిందించుకుంటారు కాసియానా. పిల్లలు కనటాన్ని మరో ఏడాది వాయిదా వేయాలని తాను అనుకున్నానని.. కానీ పిల్లలు కావాలన్న తన భర్త ఒత్తిడి చేయటంతో పిల్లలను కనాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. భర్త మాట వినకుండా తన మనసు చెప్పినట్లు నడుచుకుని ఉండాల్సిందని అంటారు.

ఆమె భర్త నిరుద్యోగి. కానీ తరచుగా ఇల్లు వదిలి వెళ్ళేవాడు. అయినా పిల్లలను భర్త సంరక్షణకు వదిలేంత నమ్మకం అతడి మీద కాసియానాకు లేదు. ఆమెకు కూడా ఉద్యోగం లేదు. దాంతో వికలాంగులకు ఇచ్చే కనీస పింఛను.. నెలకు 230 డాలర్లతోనే ఆ కుటుంబం నెట్టుకొస్తోంది.

ఆరు రోజుల తర్వాత కాసియానా, ఆమె కూతురు విటోరియాలను మళ్లీ కలిశాను. అల్టినో వెంచురా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కంటి పరీక్ష శిబిరంలో. వాళ్ళు 283 మంది పిల్లల్లో కాన్‌జెనిటల్ జికా సిండ్రోమ్‌ను గుర్తించారు. వీరిలో 161 మందికి పునరావాస కార్యక్రమంలో ఈ సంస్థ పనిచేస్తోంది. మిగతా వారు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు.

ఆ శిబిరానికి వచ్చిన అమెరికాకు చెందిన కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ లిండా లారెన్స్ విటోరియాను పరీక్షించారు. కాన్‌జెనిటల్ జికా సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో దాదాపు అందరికీ దృష్టి సమస్యలు ఉన్నాయి.

ఆ పాప కళ్ల ముందు మనిషి ముఖం రేఖా చిత్రాన్ని చూపారు. ''మనిషి ముఖం లోని భాగాలను.. ముఖ్యంగా కళ్లు, నోరును ఈ పాప గుర్తించగలదా లేదా అని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం" అని డాక్టర్ చెప్పారు.

ఆ పాపకు మెల్ల కన్ను ఉన్నా కూడా.. ఆ ముఖాకృతి రేఖాచిత్రం మీద దృష్టి నిలిపి నవ్వింది. డాక్టర్ సంతోషించారు. "దానిని గుర్తించటానికి పాప ప్రయత్నం చేస్తోంది. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. ఇది నిజంగా మంచి గ్రహణ శక్తి లక్షణమే'' అన్నారు.

‘‘మీ పాప మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది’’

నా కథ కన్నా కాసియానా కథ చాలా రకాలుగా భిన్నమైనది. దైనందిన జీవనం ఎలా గడుస్తుందని కానీ.. ప్రత్యేక అవసరాలున్న మా పాపను ఒంటరిగా చూసుకోవటం గురించి కానీ ఆందోళన పడాల్సిన పరిస్థితి నాకు ఎప్పుడూ లేదు.

ఇంటర్వ్యూల కోసం మీడియా నుంచి వచ్చే విజ్ఞప్తులను తిరస్కరిస్తూ.. అదే వయసులో ఉన్న మరో పాపనో బాబునో చూసుకోవాల్సిన పరిస్థితి నాకు లేదు.

మా ఇద్దరి పరిస్థితులు భిన్నమైనవప్పటికీ.. మా పిల్లల పరిస్థితి మాత్రం ఒకలాగానే ఉందని నేను అనుకుంటాను.

క్యాటీకి మెదడు స్కాన్ చేసిన వెంటనే.. ఆమెకు తీవ్ర దృష్టి లోపం ఉందని వైద్యులు నిర్ధారించారు. అయితే.. పిల్లలు పెరిగే కొద్దీ వారి దృశ్య గ్రహణ శక్తి పెరుగుతుంది. మా పాప మొదట్లో తలుపులు కిటికీలను ఆసక్తిగా గమనించేది. క్రమంగా మనుషుల ముఖాల మీద ఆసక్తి పెరిగింది. ఆమె తన తల్లిని, నన్ను కళ్లతో గుర్తు పట్టటం నేర్చుకునేటప్పటికి పాప వయసు పద్దెనిమిది నెలలు.

ఇప్పుడు కూడా తనతో మాట్లాడుతున్న మనిషి ముఖాన్ని చేతులతో తడమటం ఆమెకు ఇష్టం. వాళ్లు తనకు కావాల్సిన వాళ్ళైతే వాళ్ళ జుట్టు పట్టి లాగి.. చెవులు పట్టి గుంజి.. వాళ్ల తలను చిన్నగా కొరుకుతూ ముద్దు పెడుతుంది.

జికా వైరస్ ప్రభావంతో పుట్టిన పిల్లల గురించి తెలుసుకున్న తర్వాత.. నా కూతురు బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు నేను ఎంత కాలం ఆవేదన చెందానో వెనుదిరిగి చూసుకుంటే.. అప్పుడు నా మీద నేను జాలిపడటం ఇప్పుడు అసంబద్ధంగా అనిపించింది.

పిల్లలతో పాటు వచ్చే వారి మీద మన అంచనాలు, ఆకాంక్షలు.. వాళ్లు నడుస్తారు, మాట్లాడతారు, ఒక రోజు ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకుంటారు అనే ఆలోచనలను వదిలి సర్దుకుపోవాల్సిన సమయం ఒకటి ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు.. తమ పిల్లలు శారీరక బాధతో కొంత కాలమే జీవిస్తారన్న ఆలోచనకు కూడా అలవాటు పడాల్సి ఉంటుంది.

కానీ ఈ ప్రక్రియలో గొప్ప విషయం ఏమిటంటే.. చివరికి మీ అంచనాలను తారుమారు చేస్తూ మీ చిన్నారి మిమ్మల్ని ఆశ్చర్య చకితుల్ని చేయటం మొదలవుతుంది.

క్యాటీ తన తలను నిటారుగా నిలబెట్టటం, దొర్లటం, నిటారుగా కూర్చోవటం వంటి పనులు చేయటం చూసి మేం చాలా సంతోషించాం. ఒక వస్తువుని పట్టుకోవటం ఎలాగో తెలుసుకుంది. ఒక చేతి నుండి మరో చేతికి అందివ్వటం ఎలాగో అర్ధం చేసుకుంది. నేను బ్రెజిల్ రావటానికి నెల రోజుల ముందు మాత్రమె లేచి కూర్చోవటం మొదలు పెట్టింది.

మెలిస్సా విటోరియాలో.. తన పరిస్థితిని తానే మార్చేసుకోగల ఆ ఉత్సాహం, పట్టుదల నాకు కనిపించింది. ''ఓపికగా ఉండు.. వేచి చూడు.. నీ చిన్నారి పాప నిన్ను ఆశ్చర్చపరుస్తుంది'' అని కాసియానాకు చెప్పాలనుకున్నాను.

కానీ నేను మౌనంగానే ఉన్నా. వికలాంగ చిన్నారుల తల్లిదండ్రుల విజ్ఞాన పరిధి వారి సొంత పిల్లల విషయంలో పరిమితంగా ఉంటుంది.

కవల పిల్లల్లో జికా వైరస్ ప్రభావం వేర్వేరుగా ఉన్నది కాసియానా పిల్లలు ఒక్కరికి మాత్రమే కాదు. బ్రెజిల్‌లో ఇటువంటి మరో ఐదు కేసులు డాక్టర్లకు తెలుసు.

బ్రెజిల్'కు చెందిన జన్యు శాస్త్రవేత్త మయానా జాజ్... మూడు కుటుంబాలకు చెందిన కవల పిల్లలకు సంబంధించిన జన్యు నమూనాలు సేకరించి పరిశోధిస్తున్నారు. ఆ మూడు జంటల కవలల్లో ఒక్కొక్కరి మీదే జికా వైరస్ ప్రభావం ఉంది.

వారి నుంచి సేకరించిన జన్యు కణాలకు పరిశోధనశాలలో జికా వైరస్ ఎక్కించారు. మైక్రోసెఫలీ ఉన్న కవలకు చెందిన జన్యు కణాల్లో ఈ వైరస్ త్వరగా రెట్టింపయింది. ఈ వైరస్‌కు పిల్లలు ఎలా ప్రతిస్పందిస్తారనే విషయంలో జన్యు కోణం ఉందని ఇది నిర్ధారిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ పరిశోధన చాలా కీలకమైనది. ఎందుకంటే.. మున్ముందు ఈ వ్యాధికి గురయ్యే అవకాశమున్న ప్రజలను ప్రభుత్వం అంచనా వేసే వీలు కలగొచ్చు.

అయితే.. కవలల్లో ఒకరిపై ఈ వైరస్ ప్రభావం చూపి, మరొకరిపై చూపకపోవటం కాకతాళీయం కావచ్చునని డాక్టర్ ఎర్నెస్తో మార్కెజ్ అంటారు. ఆయన రసైఫ్‌లోని ఒస్వాల్దో కృజ్ ఫౌండేషన్‌లో పని చేస్తున్నారు.

చిత్రం శీర్షిక డాక్టర్ ఎర్నెస్టో మార్క్వెజ్, ఓస్వాల్డో క్రజ్ ఫౌండేషన్, రెసైఫ్

కాసియానా పిల్లల ఉదంతాన్నే తీసుకున్నట్లయితే.. ఆమెకు జికా వైరస్ సోకినపుడు అది పాపకు సంక్రమించి ఉండొచ్చని.. అంతలోనే ఆ వైరస్‌ని తట్టుకునే సామర్ధ్యం కాసియానాలో పెరగటంతో అది బాబుపై ప్రభావం చూపి ఉండక పోవచ్చని ఆయన చెప్తారు.

అయితే.. వాస్తవ దృశ్యం మరింత సంక్లిష్టంగా ఉండొచ్చంటారాయన.

జికా వైరస్ గురించి ఈ మధ్య జరుగుతున్న పరిశోధనలు గమనిస్తే వైరస్ ప్రభావం పూర్తిగా సమసిపోలేదన్న అభిప్రాయం కలుగుతోంది.

" ముందు ముందు ఈ వైరస్ వల్ల ఎటువంటి ముప్పు తెచ్చి పెట్టనుందో తెలీదు. ఐప్పుడున్న స్థాయిలో తీవ్రమైన ప్రభావము చూపలేక పోవచ్చు కానీ ఏంతో కొంత ప్రభావాన్ని చూపుతుంది."

జికా వైరస్ శాస్త్ర వేత్తలకు సైతం అన్తుబట్టనిదిగా మారితే మరో వైపున ఈ వ్యాధి బారిన పడిన కుటుంబాలకు మాత్రం శాస్త్ర విజ్ఞానం మాత్రం అక్కరకు రాని మేధో చర్చ గా మారింది.

నేను బ్రెజిల్‌లో కలిసిన అనేక మంది తమ పిల్లల వైకల్యానికి జికా వైరస్ కారణం కాదేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనేక అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు ముందుకు తెస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో గర్భిణులకు.. కాలం చెల్లిన రుబెల్లా వ్యాక్సిన్ కారణం కావచ్చన్నది అందులో ఒక వాదన. ఏడిస్ ఈజిప్టై దోమల వ్యాప్తిని నివారించటానికి మంచి నీళ్ళ ట్యాంకుల్లో వాడిన క్రిమి నాశకాలే విషపూరితమైనవన్నది మరో వాదన.

జికా వైరస్ వ్యాప్తిని ఈ 'విషం' ఇంకా పెంచిందని జెర్మానా సోరెస్ కూడా నమ్ముతున్నారు. ''దీనికి కారణం కేవలం జికా అని ఎవరూ నమ్మటం లేదు'' అని ఆమె చెప్పారు.

ఇటువంటి ఆలోచనలకు కారణం.. బహుశా సోషల్ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు ఎక్కువగా ప్రచారం కావటం కారణం కావచ్చు. ఈ వ్యాధి గురించి వాస్తవాలు వినటం కంటే అసత్యాలు వినటానికే నమ్మటానికే ఎక్కువగా సిద్ధపడుతున్నారు.

జికా వైరస్ 2015-2016లో పెచ్చరిల్లినపుడు బ్రెజిల్‌లోని పేదల వాడల్లో నివసించే జనాభాలో సగానికి సగం కుటుంబాలు ఈ వైరస్ బారిన పడ్డాయని ఒక అంచనా.

ఈ వైరస్ వ్యాప్తి తగ్గిపోవటానికి కూడా ఇదే ఒక కారణమై ఉండొచ్చు. వైద్య పరిభాషలో మంద బలం అన్న ఒక భావన ఉంది. దీని ప్రకారం ఒక ప్రాంతంలో ఓ అంటూ వ్యాధి ప్రబలినపుడు కాల క్రమంలో ఆ ప్రాంత ప్రజలు సదరు వ్యాధి ప్రబలతనికి కారణమైన క్రిముల పట్ల రోగ నిరోధక శక్తి పెంచుకుంటారు. బహుశా ఈ కారణంగానే బ్రెజిల్ పేదల వాడల్లో మొదలైన జికా వైరస్ త్వరలోనే ముగింపుకు వచ్చింది.

జికా వైరస్ 2015 తర్వాత కాలంలో కనీసం 40 దేశాల్లో వ్యాపించింది. అయితే, ఏ దేశంలోనూ బ్రెజిల్‌లో ఉన్నంత తీవ్రత నమోదు కాలేదు.

ఈ వ్యాధి నివారణ కోసం రూపొందించిన వాక్సిన్ ను అభివృద్ధి చేయటంలో మార్కెట్ వర్గాలు అంతగా ఆసక్తి చూపటం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఫ్రెంచి కంపెనీ సనోఫీ ఈ మధ్య ఒక ప్రకటనలో వ్యాక్సిన్ తయారీకి నిధులిచ్చే విషయంలో అమెరికా ప్రభుత్వం విధానాలు మార్చినందున, దీనిపై పరిశోధనలను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని తెలిపింది. మరోసారి ఈ వ్యాధి ప్రబలితే వైద్య పరిశోధనలు కొనసాగించే అవకాశం లేకపోలేదు.

మరో తొమ్మిది వ్యాక్సిన్‌లు ప్రయోగశాలల్లో ఉన్నాయి. మరికొన్ని రెండో దశ ప్రయోగంలో ఉన్నాయి. అయితే ముందు ముందు ఈ పురోగతి అనేక సమస్యలను ఎదుర్కోనుంది. ఈ వైరస్‌కి సంబంధించిన కీలకమైన వివరాలు - ఇది ఎలా విస్తరిస్తుంది, డెంగీ వైరస్‌ని కలిసినపుడు దీని స్పందన ఎలా ఉంటుంది అన్న వివరాలు - ఇంకా పరిశోధకులకు అంతుబట్టలేదు.

అయితే, ''ఎప్పుడు అన్నది తెలీదు. బహుశా ఐదు నుండి పదేళ్ళలో ఎప్పుడన్నా ఈ వైరస్ మళ్లీ విజృంభించొచ్చు. ఇక్కడే మరోసారి పెచ్చరిల్లే ముందు మరోచోట ఎక్కడన్నా ప్రబలుతుంది'' అని ఒస్వాల్దో క్రూజ్ ఫౌండేషన్‌లో పనిచేసే డాక్టర్ ఎర్నెస్తో మార్క్వెజ్ బలంగా చెప్తున్నారు.

''మగాళ్లు మరో భారంగా మారారు''

ఉమా ఫౌండేషన్‌కి, తన కూతురికి జీవితాన్ని అంకితం చేసిన జెర్మానా వైవాహిక జీవితానికి పగుళ్లు మొదలయ్యాయి.

తనూ, తన భర్తా ఎన్నో ఏళ్లుగా కావాలని పరితపించిన పాప పుట్టుకే.. వారి వేర్పాటుకు కారణమయింది.

తమ ఫౌండేషన్‌లో సభ్యులైన మహిళల్లో నాలుగింట మూడు వంతుల మంది తల్లులైన తర్వాత.. భర్తలు, భాగస్వాముల నుంచి విడిపోయారని జర్మానా చెప్పారు.

''మహిళలకు భాగస్వామిగా ఉండాల్సింది పోయి.. ఈ మగాళ్లు భారంగా మారారు. 'ఓహో.. నీ ధ్యాసంతా పిల్లలమేదే, నా గురించి పట్టించుకోవు. నా జీవితం ఏది?' అంటుంటారు. ఆడవాళ్ల కోసం పక్క చూపులు చూడటం మొదలు పెడతారు'' అని ఆమె వివరించారు.

జికా వైరస్ ప్రభావిత పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను భర్తలు వదిలిపెట్టటం 2015, 2016 సంవత్సరాల్లో పెరిగిందని చెప్తున్నారు. అలా జరిగింది. అయితే అందులో ఈ తల్లుల అభిప్రాయానికి ఏమాత్రం చోటు లేదంటే పొరపాటు. కుటుంబాన్ని వదిలివేసే విషయంలో తామే చొరవ తీసుకున్నామని పలువురు మహిళలు నాతో చెప్పారు.

''నా మాజీ భర్త తాగుబోతు'' అని చెప్పారు ఫ్రాన్సిలీదే ఫెరీరా. ఆమెకు జికా బాధితుడైన రెండేళ్ళ బాబుతో కలిపి ఐదుగురు పిల్లలున్నారు. ''అతడు తప్పుడు మనుషులందరినీ ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో ఇలాంటి పిల్లలను పెట్టుకుని అలాంటి వాళ్ళను భరించలేక పోయాను. అందువల్లనే ఇల్లు వదిలి బయటకు రావాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇంటి అద్దె భారమే అయినా నేను కోరుకున్న ప్రశాంతత ముందు ఇది పెద్ద భారం అనిపించటం లేదు" అన్నారామె.

చిత్రం శీర్షిక రెసైఫ్‌లోని యుఎంఏ ప్రధాన కార్యాలయంలో మదర్స్ డే వేడుకలు

‘‘మేం ఎన్నడూ ఓడిపోం’’

మేం రసైఫ్‌లో ఉమా ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. మాతృ దినోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

అక్కడ దాదాపు 70 మంది మహిళలున్నారు. అందరూ ఉచితంగా తోటి వారికి మేకప్ వేస్తున్నారు. సౌందర్య సేవలందిస్తున్నారు.

ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రయోజనాలు పథకాలకు వీళ్ళు అర్హులో ఒక న్యాయవాది వచ్చి అవగాహన కల్పించారు. స్థానిక పార్లమెంటు సభ్యులు, కౌన్సిలర్, నాలుగు వార్తా సంస్థల ప్రతినిధులు కూడా అక్కడకు చేరుకున్నారు.

ఈ కార్యక్రమానికి వచ్చే వారినందరినీ ఇతర తల్లులతో కలిసి మాట్లాడేలా జర్మానా ప్రోత్సహిస్తున్నారు. మధ్యాహ్నానికి కానీ ఆమె కాస్త తీరుబడిగా నలుగురితో కలిసి కూర్చోటానికి, సరదాగా కాలం గడపటానికి కుదరలేదు. సేల్ఫీలు తీసుకుంటున్న గుంపులో చేరి మమ్మలను ఓడించలేరు అన్న పాట అందుకోవటంతో అందరూ ఒక్కసారి గొంతు కలిపారు.

వాళ్ళ పిల్లలందరూ పక్కనే ఉన్న గదుల్లో స్వచ్ఛంద సహాయకుల పర్యవేక్షణలో ఆడుకుంటున్నారు.

గ్రానైట్ మీద చాపలు పరిచి ఉన్నాయి. కొద్ది మంది పిల్లలు నిటారుగా నిలబడి ఆడుతున్నారు. రంగు రంగుల బొమ్మలతో ఆడుకుంటుంటే మరికొంత మంది నేలమీద పడుకుని స్మార్ట్ ఫోన్లలో కార్టూన్లు చూస్తున్నారు. కొందరు ఉక్కపోతకు విశ్రాంతి తీసుకున్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు తమకు నచ్చిన ఆటలాడుకోటానికి చూస్తున్నారు.

విలేకరులు తమ పనిలో నిమగ్నవటం చూశాను. వాళ్ళ వార్తా కథనాలు ఎలా రూపొందిస్తారో అనిపించింది. నాకు మైక్రోసెఫలీ బిడ్డ లేకపోతే.. నేను దీనిపై వార్త రాస్తే ఎలా ఉంటుందో అనిపించింది.

విచారకరమైన విషయం ఏమిటంటే.. వికలాంగులను విచారకరంగా అభివర్ణిస్తుంటారు. మీడియా మాత్రమే కాదు.. డాక్టర్లు, ఆ పిల్లల సొంత తల్లిదండ్రులు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తారు.

ఎందుకంటే.. పిల్లలు ఏయే పనులు చేయగలుగుతున్నారనే దానికి బదులుగా ఏయే పనులు చేయలేక పోతున్నారన్నది పరిశీలించి వైకల్యాలను గుర్తిస్తారు. అయితే, ఆ పిల్లలకు దగ్గరగా ఉన్నవాళ్లు చివరికి వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆ బాబు లేదా పాపను వారికి సొంతమైన ప్రత్యేక అవసరాలు, శక్తిసామర్థ్యాలు గల వ్యక్తులుగా చూడటం ఆరంభిస్తారు.

కానీ, వైకల్యం గురించి ఏమాత్రం తెలియని వాళ్లు ఇటువంటి ఒక గదిలోకి.. ఎన్నో ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో నిండివున్న గదిలోకి అడుగుపెట్టినపుడు.. వారు ఈ విశిష్టతను చూడలేరు. కూర్చోలేని, పాకలేని, నడవలేని, నోట్లో పెట్టింది మింగలేని పిల్లలు చాలా మందిని మాత్రమే వారు చూస్తారు. పిల్లలు చేయలేని పనులు మాత్రమే వాళ్ళకు కనిపిస్తాయి.

వాళ్ళ దృష్టిలో ఈ పిల్లల తల్లితండ్రుల ప్రేమ పవిత్రమైనది. సాహసోపేతమైనది. బహుశా కొంత ఊహాజనితమైనది. విషాదంలో చిక్కుకుపోయిన కుటుంబాలు అనే ఈ ఆలోచననే.. జికా వైరస్ మీద 2015, 2016 సంవత్సరాల్లో మీడియా కవరేజీ ప్రచారం చేసింది.

కడుపులో ఉన్నప్పుడు బిడ్డ గురించి కన్న కలలన్నీ నిజం కాలేదని, మీ పిల్లలు బహుశా నడవలేరు, మాట్లాడలేరు అని తెలిసినప్పుడు మీకు నిరుత్సాహం కలిగిందా? అవును. మరి సర్దుకుపోవడానికి కొంత సమంయ పడుతుందా? కచ్చితంగా.

కానీ, ఒక్కటి మాత్రం నిజం. మీ బిడ్డను ప్రేమించడమన్నది సాహసంతో కూడిన పనైతే కాదు. అది ప్రపంచంలో అన్నింటికన్నా చాలా తేలికైన పని.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్‌కౌంటర్ చేయడం సాధ్యమేనా’

దిల్లీ: స్కూలు బ్యాగుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం... 43 మంది మృతి

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మీద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌.. ఏ తుపాకీతో కాల్చారనే అంశాలపై ఎన్‌హెచ్ఆర్‌సీ దృష్టి

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’

నల్లజాతి బ్రిటన్ విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తొలిసారిగా స్కాలర్‌షిప్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌‌‌పై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?

ఉత్తర కొరియా: ''చాలా ముఖ్యమైన పరీక్ష నిర్వహించాం''