ఉత్తర కొరియా : 'వాళ్లు మమ్మల్ని సెక్స్ టాయ్‌లా భావించారు'

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు గళం వినిపిస్తున్నారు. #MeToo ద్వారా చాలా మంది తమపై జరిగిన వేధింపుల గురించి సోషల్ మీడియాలో చెబుతున్నారు.
ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాచ్(హెచ్ఆర్డబ్ల్యు) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఉత్తర కొరియా అధికారులు కూడా ఎలాంటి భయం లేకుండా మహిళలను లైంగికంగా వేధించేవారని బయటపడింది.
ఆ దేశంలో అధికారుల లైంగిక వేధింపులు చాలా మామూలుగా మారాయని, అవి వారి రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయాయని ఈ రిపోర్టులో తెలిపారు.
ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోయిన 62 మంది ఉత్తర కొరియా మహిళలతో మాట్లాడిన హెచ్ఆర్డబ్ల్యు ఈ నివేదిక రూపొందించింది. బాధితులందరూ తమపై జరిగిన అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి ఇందులో వివరంగా చెప్పారు.
ఈ రిపోర్టు దేశంలో లైంగిక వేధింపుల గురించి, అధికార దుర్వినియోగం గురించి బాధితులు ధైర్యంగా బయటపెట్టగల సంస్కృతిని తీసుకొచ్చింది. వీటిలో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న పురుషుల లైంగిక వేధింపులు ఉన్నాయి.
"వాళ్లు మమ్మల్ని(సెక్స్) టాయ్‌లా భావించేవారు. మేం వాళ్ల దయతో బతికేవాళ్లం. అప్పుడప్పుడూ ఎలాంటి కారణం లేకుండానే రాత్రి ఏడ్చేవాళ్లం" అని ఓ-జంగ్-హీ చెప్పారు.
గోప్యతను ఎక్కువగా పాటించే ఉత్తర కొరియా లాంటి దేశంలో ఇలాంటి వివరాలను సేకరించడం చాలా కష్టం. ఆ దేశం నుంచి ఇలాంటి రిపోర్టులు చాలా తక్కువగా బయటికొస్తుంటాయి.
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- ఉత్తర కొరియాలో జీవితం: పరులతో మాట్లాడితే జైలు శిక్ష, నాయకుడిని నిందిస్తే మరణ శిక్ష
వారి చేతుల్లో నా జీవితం
హెచ్ఆర్డబ్ల్యు నివేదిక ప్రకారం "కొంతమంది మహిళలపై నిత్యం లైంగిక వేధింపులు జరిగేవి. దాంతో అవి అసాధారణంగా అనిపించేవి కావని వాళ్లు చెప్పారు. కొందరు దాన్ని తమ రోజువారీ జీవితంలో భాగంగా స్వీకరించామని" అన్నారు.
ఉత్తర కొరియాలో లైంగిక విద్య తక్కువ, అధికార దుర్వినియోగం ఎక్కువగా ఉండడమే ఇలాంటి మానసిక స్థితికి కారణమని ఈ రిపోర్టు చెబుతోంది. లైంగిక వేధింపులకు పాల్పడే వారిలో ఉన్నత స్థాయిలో ఉన్న పార్టీ అధికారులు, జైలు గార్డులు, పోలీసులు, సైనికులు కూడా ఉన్నారని తెలిపింది.
"ఎవరైనా అధికారి మాలో ఒక మహిళను ఎంచుకుంటే, వాళ్లు చెప్పింది వినడం తప్ప, మాకు వేరే దారి ఉండేది కాదు" అని బాధితులందరూ ఈ నివేదికలో తెలిపారు.
మానవ హక్కుల ఉల్లంఘన
పార్క్ యుంగ్-హీ అనే మహిళకు ఇలాగే జరిగింది. ఉత్తర కొరియాను వదిలి వెళ్లిపోతున్న సమయంలో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. తర్వాత విచారణ చేశారు.
"వాళ్లు నన్ను చాలా దగ్గరగా కూచోబెట్టుకున్నారు. మాటిమాటికీ నా కాళ్ల మధ్య తాకేవారు. నా జీవితం అప్పుడు వాళ్ల చేతుల్లో ఉంది. అందుకే వాళ్లు ఏం చేయమంటే అది చేశాను. ఇంకేం చేయగలను చెప్పండి" అని పార్క్ అన్నారు.
ఉత్తర కొరియాలో లైంగిక వేధింపుల సమస్యపై దృష్టి పెట్టాలని, వాటిని నేరాలుగా భావించాలని ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాచ్ చెబుతోంది.
2014లో ఐక్యరాజ్యసమితి నివేదికలో కూడా ఇదే చెప్పారు. ఉత్తర కొరియా ప్రభుత్వం మానవహక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
ఉత్తర కొరియా జైళ్లలో, నిర్బంధంలో ఉన్నవారిపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, గర్భస్రావాలు కూడా జరిగాయని ఈ రిపోర్టులో తెలిపారు.
మా ఇతర కథనాలు:
- ఉత్తర కొరియా క్యాలెండర్లలో కనిపించని కిమ్ పుట్టినరోజు
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- వీళ్లు కవలలు.. కానీ ఒకే ‘ఏడాది’ పుట్టలేదు!
- జమాల్ ఖషోగ్జీ హత్య: గొంతు నులిమి చంపేశారన్న టర్కీ
- పాకిస్తాన్: దైవ దూషణ కేసులో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి
- గూగుల్ ఉద్యోగుల వాకౌట్: మహిళల పట్ల వివక్షపై ప్రపంచవ్యాప్త నిరసనలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)