ఫేస్‌బుక్ హ్యాకింగ్: 'ఇచ్చట పర్సనల్ మెసేజ్‌లు అమ్మబడును'

ఫేస్ బుక్ నేమ్ బోర్డు వద్ద సెల్ఫీ తీసుకుంటున్న యువత

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌బుక్‌ అకౌంట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 81,000 మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులకు చెందిన వ్యక్తిగత మెసేజ్‌లను హ్యాకర్లు ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేశారు.

తమ వద్ద ఉన్న దాదాపు 12 కోట్ల ఫేస్‌బుక్‌ అకౌంట్లకు చెందిన సమాచారం అమ్మకానికి సిద్ధంగా ఉందని బీబీసీ రష్యా సర్వీస్‌కు హ్యాకర్లు తెలిపారు.

మరోవైపు.. వినియోగదారుల సమాచార గోప్యతకు ఎలాంటి ప్రమాదమూ లేదని ఫేస్‌బుక్‌ చెబుతోంది.

వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లకుండా తాము ఇప్పటికే గట్టి చర్యలు తీసుకున్నామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

హ్యాకర్ల చేతికి చిక్కిన ఫేస్‌బుక్‌ అకౌంట్లలో ఎక్కువ ఖాతాలు ఉక్రెయిన్, రష్యా దేశాలకు చెందినవే! ఇంగ్లండ్, అమెరికా, బ్రెజిల్ దేశాలకు చెందిన ఫేస్‌బుక్‌ ఖాతాలు కూడా కొన్ని హ్యాక్ అయ్యాయని బీబీసీ పరిశీలనలో తేలింది.

ఒక ఫేస్‌బుక్‌ ఖాతాను 10 సెంట్స్ చొప్పున హ్యాకర్లు అమ్మేస్తున్నారు.

''బ్రౌజర్స్ తయారీదారులను మేం సంప్రదించాం. కొన్ని హానికరమైన బ్రౌజర్ ఎక్స్టెన్షన్లను వారి స్టోర్స్‌లో అందుబాటులో ఉంచరాదని వారిని కోరాము'' అని ఫేస్‌బుక్‌ ఎక్జిక్యూటివ్ గైరోజన్ అన్నారు.

''ఫేస్‌బుక్‌ అకౌంట్‌ల అమ్మకం ప్రకటనలున్న వెబ్‌సైట్‌ను తొలగించడానికి సంబంధిత అధికారులను ఇప్పటికే సంప్రదించాం'' అని గైరోజర్ వివరించారు.

కళ్లజోడుపై ఫేస్ బుక్ పేరు ప్రతిబింబం

ఫొటో సోర్స్, Getty Images

ఏం జరిగిందంటే..

సెప్టెంబర్ నెలలో, 'ఎఫ్‌బీ సేలర్' పేరుతో ఓ వ్యక్తి..

''మేము ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముతాం. మావద్ద 12 కోట్ల ఖాతాలకు చెందిన సమాచారం ఉంది'' అని ఇంగ్లీష్ భాషకు చెందిన ఒక ఇంటర్‌నెట్ ఫోరమ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సైబర్ సెక్యూరిటీ సంస్థ 'డిజిటల్ షాడోవ్స్' బీబీసీ తరపున ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసింది. హ్యాకర్లు.. తమ వద్ద ఉన్న మొత్తం సమాచారంలో మచ్చుకు 81వేల ఖాతాలను మాత్రమే అమ్మకానికి పెట్టారని డిజిటల్ షాడోవ్స్ సంస్థ నిర్ధారించింది.

కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించడం కోసమే ఈ డేటాను ఇంటర్‌నెట్‌లో ఉంచారని అర్థమవుతోంది.

వ్యక్తిగత ఖాతాల్లో గోప్యత పాటించని 1,76,000 ఫేస్‌బుక్ వినియోగదారుల చిరునామా, ఈమెయిల్, ఫోన్ నంబర్లు ఇతర సమాచారాన్ని హ్యాకర్లు ఇంటర్‌నెట్‌లో ఉంచారు.

హ్యాకర్లు నెట్‌లో ఉంచిన ఫేస్‌బుక్‌ ఖాతాల్లో 5 ఖాతాలకు చెందిన వ్యక్తులను బీబీసీ రష్యా సంప్రదించింది. ఆ ఖాతాలు వారివేనని, అందులోని పోస్టులు తాము చేసినవేనని వారు చెప్పారు.

ఉదాహరణకు.. ఆ ఐదుగురి ఖాతాల్లోని ఫోటోలు, మ్యూజిక్ కాన్సర్ట్ గురించిన మెసేజ్‌లు, మరొకరు తన అల్లుడిపై ఫిర్యాదులు చేస్తూ పంపిన మెసేజ్‌లు అన్నీ తమవేనని వారన్నారు.

హ్యాకర్లు నెట్‌లో ఉంచిన మెసేజ్‌లలో ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచిన శృంగారభరితమైన మెసేజ్‌లు కూడా ఉన్నాయి.

ఈ సమాచారాన్ని పబ్లిష్ చేసిన వెబ్‌సైట్లలో ఒకటి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన వైబ్‌సైట్‌గా తెలుస్తోంది. దాని ఐ.పి.అడ్రస్‌ను కూడా సైబర్‌ క్రైమ్ ట్రాకర్ సర్వీస్ కనుగొంది.

ఫోన్‌లో ఫేస్ బుక్

ఫొటో సోర్స్, Getty Images

తప్పు ఎవరిది?

ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్ గేమింగ్ సౌకర్యాలను క్రోమ్, ఒపెరా, ఫైర్‌ఫాక్స్ లాంటి బ్రౌజర్లు.. ‘థర్డ్‌పార్టీ ఎక్స్టెన్షన్లు’గా అందిస్తున్నాయి.

బ్రౌజ్ చేస్తున్నపుడు మీ 'యూఆర్ఎల్ అడ్రస్ బార్' పక్కనే ఒక చిన్న ‘ఎక్స్టెన్షన్’ గుర్తు.. మీరు తనపై ఎప్పుడు క్లిక్ చేస్తారా.. అని వేచి ఉంటుంది.

ఈ గుర్తు.. ఇంటర్నెట్లో మీ కదలికలను, మీరు పంపే వ్యక్తిగత మెసేజ్‌లను, మీ సమాచారం మొత్తాన్నీ చడీచప్పుడు లేకుండా హ్యాకర్లకు చేరవేస్తుందని ఫేస్‌బుక్‌ చెబుతోంది.

అలాంటి ఎక్స్టెన్షన్ల పేర్లు చెప్పడానికి ఫేస్ బుక్ నిరాకరించింది. కానీ, ఆ ఎక్స్టెన్షన్ల ద్వారానే సమాచారాన్ని దొంగలించారని, ఇందులో తమ నిర్లక్ష్యం లేదని వివరించింది.

ఒకవేళ కొన్ని ఎక్స్టెన్షన్ల వల్లనే సమాచారం లీక్ అయ్యుంటే, ఆ తప్పు హ్యాకర్లది మాత్రమే కాదు. బ్రౌజర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో విఫలమైన డెవలపర్ల మీద కూడా ఉంది. ఎందుకంటే తమ బ్రౌజర్ వేదిక ద్వారానే సమాచారం లీక్ అయ్యింది అని సైబర్ నిపుణులు బీబీసీతో అన్నారు.

గోప్యత విషయంలో ఫేస్‌బుక్‌కు ఇది కష్టకాలమని చెప్పొచ్చు. ఇలాంటి సమస్యలను ఫేస్‌బుక్‌ దీటుగా ఎదుర్కోగలదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

20 లక్షల అకౌంట్లను కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ 'బీబీసీ రష్యా సర్వీసు' హ్యాకర్లకు మెయిల్ చేసింది.

కేంబ్రిడ్జ్ అనలిటికా, సెప్టెంబర్‌లో బయటపడ్డ సెక్యూరిటీ హ్యాకింగ్ వివాదాలకు, ప్రస్తుతం మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధం ఉందా? అని బీబీసీ రష్యా అడిగింది.

బీబీసీ రష్యా, హ్యాకర్ల మధ్య నడిచిన ఈమెయిల్స్

అటువైపు నుంచి.. 'పై రెండు వివాదాలకు ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేదు' అంటూ జాన్ స్మిత్ పేరిట సమాధానం వచ్చింది.

బీబీసీ రష్యా, హ్యాకర్ల మధ్య నడిచిన మెయిల్స్‌లో భాగంగా.. తమ వద్ద ఉన్న 12 కోట్ల వినియోగదారుల సమాచారంలో 27 లక్షల ఖాతాలు రష్యావేనని అవతలి వ్యక్తి చెప్పుకొచ్చాడు.

ఈ మొత్తం వ్యవహారంలో రష్యా ప్రభుత్వానికి, లేక రష్యా హ్యాకర్లకు చెందిన 'ఇంటర్నెట్ రీసెర్చ్ ఏజెన్సీ'కు సంబంధం ఉందా అని ప్రశ్నించినపుడు అటువైపు నుంచి 'లేదు' అని సమాధానం వచ్చింది.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.