నాటో బలగాల భారీ విన్యాసాలు... 31 దేశాలు, 50 వేల మంది సైనికులు

సైనిక విన్యాసాలు

ప్రచ్ఛన్న యుద్ధం తరువాత నాటో బలగాలు అత్యంత భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసాల్లో భాగంగా నార్వే దేశాన్ని ఆక్రమించినట్లుగా మాక్ ప్రదర్శన నిర్వహించారు. దీనికి 'ఆపరేషన్ ట్రైడెంట్' అని పేరుపెట్టారు.

వారం రోజులుగా జరుగుతున్న ఈ విన్యాసాల్లో ఫిన్లాండ్, స్వీడన్‌ సహా మొత్తం 29 నాటో సభ్య దేశాలు పాల్గొంటున్నాయి. రష్యా, నాటోల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్యే రష్యా సరిహద్దుకు కొన్ని వందల మైళ్ల దూరంలోనే ఈ సైనిక ప్రదర్శన జరుగుతోంది.

31 దేశాలకు చెందిన 50 వేల మంది సైనికులు భూ, జల, గగనతలాల్లో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.

వీడియో క్యాప్షన్,

వీడియో: నాటో బలగాల భారీ సైనిక విన్యాసాలు

మరికొన్ని వారాలపాటు జరిగే విన్యాసాల కోసం సైనికులంతా నార్వే చేరుకున్నారు. ప్రచ్ఛన్న యుద్దం ముగిశాక నాటో దేశాలు చేపట్టిన అతి పెద్ద బల ప్రదర్శన ఇదే.

"ఏదైనా నాటో సభ్యదేశం దాడికి గురైతే దాన్ని ఎదుర్కొనే యుద్ధ విన్యాసం ఇది. ప్రస్తుతం అత్యంత తీవ్రమైన రక్షణ సవాళ్లను మేం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. అందుకే నాటో దళాలు సంయుక్తంగా తమ రక్షణ వ్యవస్థల్ని పూర్తిగా నవీకరించుకున్నాయి. ప్రపంచం మార్పు దిశగా సాగుతున్నపుడు నాటో కూడా మార్పు చెందాల్సిందే" అని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు.

ఇది కేవలం సైనిక బల ప్రదర్శన మాత్రమే కాదు. మిత్ర దేశం దాడికి గురైతే, భూ, జల, వాయు మార్గాల ద్వారా వేగంగా స్పందించగల సామర్ధ్యాల ప్రదర్శన కూడా.

బ్రిటిష్ సైన్యం ఇంగ్లిష్ చానల్ ద్వారా ప్రయాణిస్తూ జర్మనీ, డెన్మార్క్, స్వీడన్‌ దేశాలను దాటి నార్వే చేరుకుంది.

ఫొటో క్యాప్షన్,

ఇటీవల రష్యా కూడా భారీ సైనిక ప్రదర్శన నిర్వహించింది.

ఇక్కడ శత్రు స్థావరంపై ఓ నకిలీ దాడి చేయడానికి నాటో దళాలు ఒకచోట చేరాయి. వైమానిక దళం, నౌకా దళాల మద్దతుతో విమానంలోంచి సైనికులు కిందకు దిగుతున్నారు.

వీటిపై రష్యా స్పందించింది. ఇవి రష్యా వ్యతిరేక విన్యాసాలని ఆరోపించింది.

అయితే, ఈ మధ్యనే రష్యా కూడా వోస్టోక్‌లో భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ విన్యాసాల్లో దాదాపు మూడు లక్షల మంది సైనికులు పాల్గొన్నట్లు రష్యా తెలిపింది.

తమ సైనిక ప్రదర్శన ఎవరినో రెచ్చగొట్టేందుకు చేస్తున్నది కాదని నాటో స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.