ఆసియా బీబీ: ప్రాణభయంతో పారిపోయిన లాయర్.. విదేశీ ఆశ్రయం కోసం భర్త వీడియో మెసేజ్

ఆసియా బీబీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

ఆసియా బీబీకి మరణదండన విధించాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులు

దైవదూషణ కేసులో మరణశిక్ష నుంచి విముక్తి పొందిన క్రైస్తవ మహిళ తరఫున వాదించిన లాయర్ ప్రాణభయంతో పాకిస్తాన్ నుంచి పారిపోయారు.

ఆసియా బీబీ తరఫున నిలబడడాన్ని కొనసాగించాలంటే తాను దేశం నుంచి వెళ్ళిపోక తప్పదని లాయర్ సయీఫ్ ములూక్ ఏఎఫ్‌పి వార్తా సంస్థతో అన్నారు. ఆసియా బీబీ మరణశిక్షను పాకిస్తాన్ జడ్జిలు బుధవారం నాడు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఈ తీర్పు మీద పెల్లుబికిన హింసాత్మక నిరసనలను అదుపు చేయడానికి ఆసియా బీబీని పాకిస్తాన్ వదలి వెళ్ళకుండా చూసేందుకు అధికారులు అంగీకరించారు.

అయితే, ఇలాంటి నిర్ణయం ఆమెకు 'మరణశాసనం' వంటిదేనని హక్కుల ఉద్యమకారులు అంటున్నారు.

ఫొటో క్యాప్షన్,

ఆసియా బీబీ

విదేశీ ఆశ్రయం కోసం భర్త వీడియో మెసేజ్

ఆసియా బీబీ భర్త ఆషిక్ మసీహ్ తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ లేదా అమెరికాలో తమకు ఆశ్రయం కల్పించాలని కోరారు.

ఒక వీడియో మెసేజ్ పంపిన ఆషిక్ మసీహ్ అందులో "మాకు సాయం చేయాలని నేను బ్రిటన్ ప్రధానమంత్రిని వేడుకుంటున్నాను" అని తెలిపారు.

ఇలాగే తనకు సాయం చేయాలని కెనెడా, అమెరికా నేతలకు కూడా వీడియో సందేశాలు పంపించారు.

అంతకు ముందు జర్మన్ బ్రాడ్‌కాస్టర్ డీడబ్ల్యుకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాసీహ్ ఎప్పుడు ఏం జరుగుతుందోనని తన కుటుంబం భయపడుతోందన్నారు.

అడ్డుకోడానికి పాకిస్తాన్ ప్రభుత్వం, అతివాద ఇస్లామిక్ పార్టీలతో ఒక ఒప్పందం చేసుకుని ఆసియా బీబీని దేశం వదిలి వెళ్లడానికి అనుమతించకపోవడం తప్పు అని మాషిక్ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇలాంటి ఒప్పందాల వల్ల ఆందోళనలు చేసి న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడం అనేది అలవాటైపోతుంది అన్నారు.

"ప్రస్తుత పరిస్థితి మాకు చాలా ప్రమాదం. మాకు ఎలాంటి భద్రతా కల్పించలేదు. మేం అక్కడక్కడా దాక్కుంటూ తప్పించుకుని తిరుగుతున్నాం. నా భార్య ఆసియా బీబీ ఇప్పటికే పదేళ్లు జైల్లో ఉంది. మా పిల్లలు అమ్మను చూడాలని తపించి పోతున్నారు" అన్నారు.

ఆసియా బీబీకి ప్రమాదం లేదన్న పాక్

ఇటు పాకిస్తాన్ ప్రసార మంత్రి మాత్రం ఆసియా బీబీకి భద్రత మరింత పెంచుతున్నామని బీబీసీకి చెప్పారు. ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు.

ఆందోళనకారులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. "అలా చేయడం వల్ల హింసాత్మక పరిస్థితులు తలెత్తకుండా సమస్యను పరిష్కరించవచ్చు" అన్నారు.

"ప్రభుత్వం ఏర్పాటు చేసి 70 రోజులే అయ్యింది. ఈ అంశంలో గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. కానీ ఈ సమస్యను పరిష్కరించాం. మాకు ప్రత్యామ్నాయంగా అనిపించిన చర్యలు చేపట్టాం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పాకిస్తాన్ సుప్రీంకోర్టు

దైవదూషణ కేసులో ఆసియా బీబీని దోషిగా 2010లో కోర్టు ప్రకటించింది. ఆమె తన పొరుగువారితో ఘర్షణ పడిన సందర్భంలో మహమ్మద్ ప్రవక్తను దూషించిన నేరానికి మరణశిక్ష విధించింది.

అయితే, ఇటీవల ఆమెను సుప్రీంకోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దాంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఆమెకు మళ్ళీ మరణదండన విధించాలని చాలా మంది కోరుతున్నారు.

ములూక్ గతవారం బీబీసీతో మాట్లాడుతూ, రక్షణ కోసం ఆమెను ఏదైనా పాశ్చాత్య దేశానికి పంపించాలని అన్నారు. ఇప్పటికే ఆమె మీద చాలా సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి.

ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి కూడా చాలా దేశాలు ముందుకు వచ్చాయి.

ఆమెను విదేశాలకు పంపించమని ఒక ఇస్లాంవాద పార్టీతో ప్రభుత్వం అంగీకారానికి రావడం తీవ్రవాదులకు లొంగిపోవడం కిందకే వస్తుందన్న విమర్శలను ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధరి తోసిపుచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, "ఆసియా బీబీ రక్షణ కోసం అన్ని చర్యలూ తీసుకుంటాం" అని ఆయన అన్నారు.

ములూక్ మాత్రం ఈ ఒప్పందం "చాలా బాధాకరం" అని వ్యాఖ్యానించారు.

"దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు అమలు చేయలేని స్థితిలో ఉన్నారు" అని ఆయన యూరప్ విమానం ఎక్కడానికి ముందు ఏఎఫ్‌పీతో అన్నారు.

పాకిస్తాన్‌లో ఉండడం ఇక సాధ్యం కాదని, "ఆసియా బీబీ తరఫున పోరాటం కొనసాగించాలంటే నేను బతికి ఉండడం ముఖ్యం" అని ములూక్ అన్నారు.

తన క్లయింటు తరఫున పోరాడడానికి మళ్ళీ స్వదేశానికి వస్తానని, అయితే తనకు పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌తో అన్నారు.

కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలకు తెహ్రీక్-ఎ-లబాయిక్ (టిఎల్‌పి) పార్టీ నాయకత్వం వహిస్తోంది. టిఎల్‌పీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం, సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వచ్చే పిటిషన్లను అడ్డుకోబోమని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

ఆ ఒప్పందంలో ఇంకా ఏయే అంశాలున్నాయి?

ఆసియా బీబీకి ఉరిశిక్ష నుంచి విముక్తి కల్పించడాన్ని నిరసిస్తూ అరెస్టయిన వారిని విడుదల చేయాలి. వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరిగినా వాటిపై విచారణ జరిపించాలి.

పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేని నిషిద్ధ వ్యక్తుల జాబితాలో ఆసియా బీబీ పేరును చేర్చేందుకు ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలి.

దీనికి బదులుగా, టిఎల్‌పీ తన మద్దతుదారులను శాంతింప చేసేందుకు పిలుపునిస్తుంది.

అంతకుముందు అధికారులు ఈ వారాంతంలో ఆసియా బీబీ విడుదల అవుతారని చెప్పారు.

ఆమె మీద వచ్చిన ఆరోపణలేమిటి?

ఆసియా బీబీ పూర్తి పేరు ఆసియా నోరీన్. 2009 జూన్ నెలలో ఆమెకు, కొంత మంది మహిళలకు మధ్య ఘర్షణ జరిగింది. వారు అక్కడ పండ్ల చెట్టు నాటుతుంటే అక్కడున్న బకెట్ నీళ్ళలోంచి బీబీ ఒక కప్పు నీళ్ళు తీసుకున్నారు. వేరే మతానికి చెందిన మహిళ తాకడం వల్ల ఆ నీళ్ళు అపవిత్రమైపోయాయని వారన్నారు.

ఆ గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఆసియా బీబీ, మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, ఆమె ఇస్లాం మతం స్వీకరించాలని ఆ మహిళలు అన్నారు.

ఆ తరువాత బీబీని ఆమె ఇంట్లోనే కొట్టారు. అప్పుడు ఆమె దైవదూషణకు పాల్పడినట్లు అంగీకరించారని ఫిర్యాదుదారులు తెలిపారు. పోలీసులు వచ్చి విచారించి బీబీ మీద కేసు నమోదు చేశారు.

అయితే, దీనిపై బుధవారం నాడు తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు, ఈ కేసులోని సాక్ష్యం చాలా బలహీనమైనదని, ఆమె అంగీకారం కూడా "పది మంది చేరి చంపేస్తామని బెదిరించిన ఫలితమేనని" వ్యాఖ్యానించింది. ఆమెకు కింది కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.