ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎందుకు విధించింది? వాటి ప్రభావం ఎలా ఉంటుంది? - BBC REALITY CHECK

  • 5 నవంబర్ 2018
ఇరాన్ పై ఆంక్షలు Image copyright Reuters

ఈరోజు అంటే నవంబర్ 5న ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు (అమెరికా కాలమానం ప్రకారం నవంబర్ 4 అర్థరాత్రి నుంచి) అమల్లోకి వచ్చాయి.

అమెరికా ఆంక్షలు విధించడంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ తీవ్రంగా స్పందించారు.

"ఇరాన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ కొత్త కుట్రలో అమెరికా సఫలం కాదనడంలో సందేహమే లేదు" అని ఆయన అన్నారు.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చమురు ఎగుమతులపైనే ఆధారపడింది. ఇప్పుడు అమెరికా ఆంక్షల తర్వాత ఇరాన్ చమురు అమ్మకాలకు సమస్యలు ఎదురవుతాయి.

అయితే, ఇరాన్‌తో వ్యాపారం చేసే కంపెనీలకు తమ మద్దతు ఉంటుందని యూరోపియన్ యూనియన్ తెలిపింది.

కానీ ఆ కంపెనీలపై ఈ ఆంక్షల ప్రభావం పడుతుందా? ఎందుకంటే అవి ఇరాన్‌తో వ్యాపారం కొనసాగిస్తే, అమెరికాతో అవి చేసే వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం పడవచ్చు.

Image copyright Getty Images

అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు ఎందుకు విధించింది?

ఇరాన్ సహా ఆరు దేశాలతో 2015లో జరిగిన అణు ఒప్పందం నుంచి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా బయటకి వచ్చింది.

2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్‌తో ఈ అణు ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఇరాన్‌కు 2016లో అమెరికా, మరో ఐదు దేశాలకు చమురు అమ్మడానికి, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేయడానికి అనుమతి లభించింది.

ఈ అణు ఒప్పందం నుంచి బయటికి వచ్చాక ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చేసిన ఒక ప్రసంగంలో డోనల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలూ ఇరాన్‌తో సంబంధాలు తెంచుకోవాలన్నారు.

కానీ యూరోపియన్ యూనియన్ సహా, మిగతా దేశాలు మాత్రం ఇరాన్ అణు ఒప్పందానికి కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాయి. అణు ఒప్పందంపై ఏకపక్ష వైఖరితో అమెరికా దాన్ని ఉల్లంఘించిందని యూరప్ దేశాలు భావిస్తున్నాయి.

అమెరికా ఆంక్షలతో అంతర్జాతీయ కంపెనీలు ఇరాన్‌తో చేస్తున్న వ్యాపారాల నుంచి వెనకడుగు వేయడం ప్రారంభించాయి. దీంతో ఇరాన్ చమురు ఎగుమతులు పడిపోయాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఐఎంఎఫ్ ప్రకారం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 1.5 శాతం క్షీణిస్తుంది

అమెరికా ఆంక్షల ప్రభావం ఏ మేరకు ఉంటుంది?

అమెరికా ప్రకటనను బట్టి ఇరాన్‌తో ఏ కంపెనీలు వ్యాపారం కొనసాగిస్తే, వాటికి అమెరికాతో వ్యాపారం చేయడానికి అనుమతి లభించదు.

అంతే కాదు, ఇరాన్‌తో వ్యాపారం చేసే కంపెనీలతో బిజినెస్ చేసే అమెరికా కంపెనీలు కూడా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

నవంబర్ 5వ తేదీ సోమవారం నుంచి బ్యాంకింగ్ రంగంలో ఆంక్షలు అమలవుతాయి. ఆగస్టులో బంగారం, విలువైన లోహం, మోటార్ వాహనాల రంగం(అమెరికా సెక్టార్) సహా చాలా పరిశ్రమలను ఈ ఆంక్షలు చుట్టుముట్టాయి.

ఇరాన్‌తో చమురు వ్యాపారాన్ని పూర్తిగా ఆపివేయాలని అనుకుంటున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. కానీ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోడానికి 8 దేశాలు తాత్కాలిక అనుమతి ఇచ్చింది. దిగుమతులు తగ్గించుకోడానికి గడువు ఇచ్చింది.

అసోసియేటెడ్ ప్రెస్ వివరాల ప్రకారం ఈ 8 దేశాల్లో ఇటలీ, భారత్, జపాన్, దక్షిణకొరియా లాంటి అమెరికా సహచర దేశాలు ఉన్నాయి.

యూరోపియన్ యూనియన్ తమ కంపెనీలు ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించడానికి, అమెరికా ఆంక్షల వల్ల వచ్చే నష్ట నుంచి బయటపడడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పివి) అనే ఒక పేమెంట్ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తున్నాయి.

Image copyright Huw Evans picture agency

ఈ పేమెంట్ వ్యవస్థలో కంపెనీలకు అమెరికా ఆర్థిక వ్యవస్థ అవసరం లేకుండా ఉంటుంది. ఒక బ్యాంకులా పనిచేసే ఎస్‌పివి ఇరాన్, దానితో వ్యాపారం చేసే కంపెనీల మధ్య లావాదేవీలను చూసుకుంటుంది.

ఇరాన్ యూరోపియన్ యూనియన్ దేశాలకు చమురు ఎగుమతులు చేసినప్పుడు, దిగుమతి చేసుకునే కంపెనీలు ఎస్‌పివి ద్వారా చెల్లింపులు జరుపుతాయి.

ఇరాన్ వీటిని ఎస్‌పివిలో క్రెడిట్‌ రూపంలో ఉంచుతుంది. యూరోపియన్ యూనియన్ ఇతర దేశాల నుంచి ఏవైనా ఉత్పత్తులను కొనడానికి ఇదే ఎస్‌పివి ద్వారా చెల్లింపులు జరుపుతుంది.

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో యూరోపియన్ యూనియన్ తమ చట్టాల్లో కూడా మార్పులు తీసుకొచ్చింది. తాజా మార్పులతో అమెరికా ఆంక్షల వల్ల వచ్చిన నష్టాల నుంచి పరిహారం కోరడానికి ఈయూ కంపెనీలకు అనుమతి లభిస్తుంది.

చిత్రం శీర్షిక సోర్స్: క్లిపర్ గణాంకాలు

అయినా, ఈ ఆంక్షల వల్ల యూరోపియన్ యూనియన్ దేశాల్లోని ఎన్నో కంపెనీలపై విస్తృత ప్రభావం పడుతుంది.

ఉదాహరణకు షిప్పింగ్ ఆపరేటర్లు ఎస్‌పిబి వ్యవస్థ ద్వారా చమురు కొనుగోలు చేయాలని భావిస్తాయి. కానీ చమురు రవాణా చేసే కంపెనీలు అమెరికాలో కూడా తమ వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ఆ కంపెనీలపై ఆంక్షలు అమలైతే, షిప్పింగ్ ఆపరేటర్లకు చాలా నష్టం కలగవచ్చు.

"ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రత్యక్షంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి లేదు" అని కొలంబియా యూనివర్సిటీ సీనియర్ పరిశోధకులు, ఆంక్షల అంశాల్లో నిపుణులు రిచర్డ్ నఫ్యూ అన్నారు.

కానీ ఇరాన్‌తో పెద్ద ఎత్తున వ్యాపారం చేసే ఎన్నో దేశాలు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికే సిద్ధమవుతాయని ఆయన తెలిపారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్యతరహా సంస్థలు ఈ ఎస్‌పివి వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు.

"ఎస్‌పివి ద్వారా ఇరాన్‌కు విక్రయించే ఉత్పత్తులపై ద్వితీయ స్థాయి ఆంక్షలు ఉండవచ్చు. అప్పుడు ఈ లావాదేవీలే సమస్యలో పడుతాయి" అని రీడ్ స్మిత్‌లో అంతర్జాతీయ వ్యాపార, జాతీయ భద్రతా అధ్యక్షుడు లీ హాన్సన్ అన్నారు.

Image copyright Getty Images

అయితే ఇరాన్ ఏం చేయచ్చు?

"చమురు ఎగుమతులను పూర్తిగా జీరో చేస్తున్నట్టు అమెరికా ఇటీవల చెప్పింది. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే దానివల్ల చమురు ధరలు పెరుగుతాయి." అని బర్మింగ్ హాం యూనివర్సిటీ ప్రొఫెసర్ స్కాట్ లుక్స్ తెలిపారు.

"అంతే కాదు.. ఇరాన్ నుంచి చమురు కొనడంలో ఏయే దేశాలకు మినహాయింపులు లభిస్తోందో, అవన్నీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశమైన చైనాతో కలిస్తే అది కూడా గమనించాల్సిన విషయమే అవుతుంది".

ఇంతకు ముందు 2010, 2016 సంవత్సరాల్లో ఇరాన్ చమురు వ్యాపారంపై ఆంక్షలు విధించినపుడు, ఆ దేశ ఎగుమతుల్లో సుమారు 50 శాతం పతనం నమోదైంది.

ఈసారి కూడా ఎగుమతులపై ఆంక్షల ప్రభావం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇరాన్‌, దాని వ్యాపార భాగస్వాములు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తాయనేది కూడా స్పష్టం అవుతోంది".

"దీనివల్ల ఏవైనా సమస్యలు వస్తాయేమో, అని కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇరాన్ ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి ఆంక్షలు ఎదుర్కొంది" అని ఐరోపా యూనియన్ ఫారిన్ కౌన్సిల్ సీనియర్ ఫెలో ఎలీ గెరాన్మేహ్ అన్నారు.

ఇక్కడ, ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పచ్చు. ఇరాన్ తన చమురు అమ్మడానికి ఇంతకు ముందు అనుభవాలను ఉపయోగించుకుని వ్యూహాత్మక పద్ధతులను వెతుక్కోవాల్సి వస్తుంది.

ఇరాన్ ఈ లోటును భర్తీ చేయడానికి రష్యా, చైనాతో కొత్త సంబంధాలు ఏర్పరుచుకోవాలని కూడా చూడవచ్చు.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు