ఎల్ చాపో గజ్మన్: ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడిపై ముగిసిన విచారణ

  • గెరార్డో లిసార్డీ
  • బీబీసీ ప్రతినిధి

మెక్సికన్ డ్రగ్ ముఠా నాయకుడు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గ్యాంగ్‌ అధిపతి అని భావిస్తున్న జోక్విన్ 'ఎల్ చాపో' గజ్మన్ అమెరికాలోకి కోట్ల విలువ చేసే టన్నుల కొద్దీ కొకైన్, హెరాయిన్‌, గంజాయిని స్మగ్లింగ్ చేశాడని న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది.

2019 ఫిబ్రవరి 12వ తేదీన ఈ తీర్పును వెలువరించింది. దాదాపు పాతికేళ్ల నుంచి ఎల్ చాపోపై వివిధ దశల్లో పలు కేసులు నడుస్తూనే ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడిగా భావించే 61 ఏళ్ల ఎల్ చాపో గజ్మన్ రెండుసార్లు తన స్వదేశం మెక్సికోలో జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

లాండ్రీ బండిలో దాక్కుని ఒకసారి, జైలు కింద సొరంగం తవ్వి దాని గుండా మరోసారి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

ఫొటో క్యాప్షన్,

గజ్మన్‌పై కోర్టు విచారణ సందర్భంగా న్యాయస్థానానికి హాజరైన అతడి భార్య ఎమ్మా కారోనెల్ ఐస్పురో. ఈమె వయస్సు 29 ఏళ్లు. మెక్సికన్ బ్యూటీ క్వీన్‌గా పేరొందిన కారోనెల్ 2007లో గజ్మన్‌ను పెళ్లి చేసుకుంది

అమెరికా అధికారులు గత 20 ఏళ్లుగా అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

2017లో అతన్ని అమెరికాకు తరలించారు. గతేడాది అతనిపై విచారణ ప్రారంభం అయ్యింది.

షార్టీ అని కూడా పిలిచే గజ్మన్‌.. డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, మనీలాండరింగ్ మొదలైన 11 ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

అయితే, ఈ కేసులన్నింటిలోనూ ఎల్ చాపో దోషి అని తేల్చిన కోర్టు, ఇంకా అతనికి శిక్ష విధించలేదు. బహుశా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గజ్మన్‌కు సంబంధించిన నాలుగు ముఖ్యమైన అంశాలు:

ఫొటో క్యాప్షన్,

గజ్మన్‌ను జైలుకు తీసుకెళ్లే దారి పొడవునా భారీ భద్రత

1. కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు

గజ్మన్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడని, అందువల్ల లక్షకోట్ల విలువైన అతని ఆస్తులను స్వాధీనం చేసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది.

2009లో ఫోర్బ్స్ పత్రిక అతని ఆస్తులను 7 వేల కోట్ల రూపాయలుగా లెక్కకట్టింది. సినాలోవా ముఠా నుంచి యేటా అతనికి సుమారు 21 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్‌లో 25 శాతం అతని ముఠా ద్వారానే జరుగుతోందని ఫోర్బ్స్ తెలిపింది.

గజ్మన్ పెద్ద ఎత్తున హెరాయిన్, కొకైన్, గంజాయి, మెథాంఫెటమైన్ అక్రమ రవాణా చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది.

2. లక్షకు పైగా ఆడియో రికార్డింగులు

అక్రమ డ్రగ్ రవాణాకు సంబంధించి దీనిని అతి పెద్ద విచారణగా భావిస్తున్నారు. 33 హత్యలలో గజ్మన్ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు.

విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్లు వేల పేజీల పత్రాలు, సుమారు లక్షకు పైగా ఆడియో రికార్డింగులను న్యాయస్థానానికి సమర్పిస్తారు.

అయితే గజ్మన్ విచారణ చాలా ఆలస్యంగా ప్రారంభమవుతోంది.

ఇటీవలే కొత్తగా మరో 14 వేల పేజీల కొత్త సాక్ష్యాలను ప్రవేశపెట్టగా, కేసును వాయిదా వేయాలని డిఫెన్స్ కోరినా న్యాయస్థానం అందుకు నిరాకరించింది.

3. భద్రత

గతంలో గజ్మన్ రెండుసార్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో విచారణ జరగనున్న నాలుగు నెలల కాలంలో అతనికి అసాధారణమైన భద్రత ఏర్పాటు చేశారు.

విచారణ నిర్వహిస్తున్న జడ్జీలకు ఫెడెరల్ భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారు. దారి పొడవునా, బాంబులను గుర్తించే స్నిఫర్ డాగ్స్‌ ఉంటాయి. కోర్టు హాలు ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేశారు. వారిని తీసుకువచ్చే వాహనాలను హెలికాప్టర్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.

అమెరికాకు తీసుకువచ్చిన నాటి నుంచి గజ్మన్‌ను మన్‌హట్టన్‌కు దక్షిణాన ఉన్న జైలులో ఒంటరిగా ఉంచుతున్నారు. కేవలం ఒక గంట మాత్రం అతన్ని ఆ సెల్ నుంచి బయటకు అనుమతిస్తున్నారు.

జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చేటప్పుడు గజ్మన్ తప్పించుకుపోకుండా అతనికి కోర్టు పరిసరాల్లో బస ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

షాన్ పెన్, గజ్మన్

4. అసాధారణ కేసు

''ఈ కేసు చాలా అసాధారణమైనది. దీనిపై ప్రజల్లో మునుపెన్నడూ లేని ఆసక్తి కనిపిస్తోంది'' అని ఈ కేసు విచారిస్తున్న జడ్జీలలో ఒకరైన కోగన్ వ్యాఖ్యానించారు.

అందువల్ల తీసుకోవాల్సిన భద్రతా చర్యలు మరింత పటిష్టంగా ఉండాలని సూచించారు.

హాలీవుడ్ నటుడు షాన్ పెన్ 2016లో ఒక ఇంటర్వ్యూ కోసం గజ్మన్‌ను కలిశాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. గజ్మన్ కేసులను టీవీల్లో నాటకీయ రీతిలో చూపిస్తున్నారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.