డెమొక్రాట్ల అండ లేకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయలేని 5 పనులు

  • 9 నవంబర్ 2018
డోనల్డ్ ట్రంప్ Image copyright Getty Images

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభ అంటే అమెరికా పార్లమెంటులోని దిగువ సభ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో డెమొక్రటిక్ పార్టీ పట్టు సాధించింది.

ఈ ఫలితాలతో చాలా సమీకరణాల్లో మార్పులు వచ్చాయి. ఇప్పటివరకూ రెండు సభల్లో( సెనేట్, హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్) అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీనే ఆధిక్యంలో ఉంటూ వచ్చింది.

అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాల్లో మెజార్టీకి అవసరమైన 218 స్థానాలను దాటిన డెమొక్రటిక్ పార్టీ 245 స్థానాల వరకూ గెలుచుకుంది.

అయితే సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. రిపబ్లికన్ పార్టీకి సెనేట్‌లో మొత్తం 100 స్థానాల్లో గతంలో 51 స్థానాలు ఉండగా.. ఇప్పుడు 54 స్థానాలు లభించాయి.

8 ఏళ్ల తర్వాత ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ తిరిగి ఆధిక్యం సంపాదించింది. డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పలోసీ ఇక ట్రంప్ పాలనకు పగ్గాలు వేస్తామని చెప్పారు. ఈమె స్పీకర్ పదవి కూడా చేపట్టే అవకాశం ఉంది.

ఈ ఫలితాలు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు కష్టాలు తీసుకొచ్చేలా ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆరోపణల కేసు దర్యాప్తు కూడా ముందుకు నడిచే అవకాశం ఉంది. ట్రంప్‌పై అభిశంసన పెట్టే పరిస్థితి కూడా రావచ్చు.

ఈ ఫలితాలు ఎందుకంత కీలకం?

ఈ ఫలితాలను చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలు అమెరికాలో పాలనను దారిలోకి తీసుకొస్తాయని భావిస్తున్నారు. 2016 ఎన్నికల తర్వాత నుంచి ట్రంప్ రెండు సభలలో ఆధిక్యంలో ఉండేవారు. ఎలాంటి చట్టాన్ని ఆమోదించడానికైనా ఆయన్ను అడ్డుకునేవారు ఎవరూ లేకపోయేవారు.

ఇప్పుడు డెమొక్రాట్లు అలాంటి చట్టాలను అడ్డుకోగల స్థితికి చేరుకున్నారు. రెండు నెలల తర్వాత కొత్త సభ డెమొక్రాట్ల నియంత్రణలోకి వచ్చినపుడు పరిస్థితులు మారిపోనున్నాయి. డెమొక్రటిక్ పార్టీ నేత పలోసీ ప్రతినిధుల సభలో స్పీకర్ పదవిలో కూర్చోవచ్చు.

డెమొక్రాట్లు తన పాలన పనితీరుపై సమీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు అధ్యక్షుడు ట్రంప్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతినిధుల సభలోని నిఘా కమిటీ 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. దాని కళ్లెం ట్రంప్ ఆగర్భ శత్రువుగా భావించే ఆడం షిఫ్ చేతుల్లో ఉంది. ఈ దర్యాప్తులో ఫలితం రాబడతామని, ట్రంప్ విదేశీ లావాదేవీలపై పూర్తిగా విచారిస్తామని ఆయన చెబుతున్నారు.

ట్రంప్ మాత్రమే కాదు, ఆయన ప్రభుత్వంలోని మిగతా సభ్యులపై కూడా డెమొక్రాట్లు దృష్టి పెడతారు. అందరి కంటే ముందు హోంమంత్రి రేయాన్ పట్టు బిగించవచ్చు. వ్యాపార ప్రయోజనాల కోసం తన హోదాను ఉపయోగించుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభలో తమ ఆధిపత్యం పోగొట్టుకున్న తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తన రాజకీయ అజెండాను కొనసాగించడానికి కష్టాలు ఎదుర్కోవచ్చు. వచ్చే ఏడాది జనవరిలో ఆయనకు చాలా విషయాల్లో డెమొక్రాట్ల అనుమతి అవసరం అవుతుంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

ట్రంప్ చేయలేని ఆ ఐదు పనులేంటి?

మెక్సికో హద్దుల్లో గోడ నిర్మాణం - 2016 ఎన్నికల ప్రచారంలో మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానని ట్రంప్ హామీ ఇచ్చారు. బిలియన్ డాలర్ల ఈ ప్రాజెక్టుకు పార్లమెంటు ఆమోదం లభించాలి. చర్చల ద్వారా ఈ గోడ కోసం ట్రంప్ నిధులు సేకరించవచ్చు. కానీ ప్రతినిధుల సభలో మెజారిటీ లేకపోవడంతో ట్రంప్‌కు ఇబ్బందులు ఎదురుకావొచ్చు.

ఒబామా కేర్ రద్దు కాదు - పార్లమెంటులో సమీకరణలు మారిన తర్వాత రిపబ్లికన్ పార్టీకి ఇప్పుడు దీనిని రద్దు చేయడం కష్టం అవుతుంది. ప్రతినిధుల సభలో ఇప్పుడు డెమొక్రాట్లకు ఆధిక్యం ఉంది. మధ్యంతర ఎన్నికల సమయంలో డెమొక్రాట్లు ఒబామా కేర్‌ తరఫున ప్రచారం నిర్వహించారు. దీన్ని రద్దు చేయాలనే ఏ చర్యనైనా పార్లమెంటు ఇప్పుడు వ్యతిరేకిస్తుంది.

వలస సంస్కరణలు - వీసా లాటరీకి తెరదించడం, వలస వచ్చినవారిని వారి దేశాలకు పంపించడం లాంటి చర్యలను కూడా ట్రంప్ పాలన గత రెండేళ్లుగా అమలు చేస్తోంది. అయితే వీటిలో పూర్తిగా విజయం సాధించలేదు. ఇప్పుడు డెమొక్రాట్లు బలంగా ఉండడంతో వీటిని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

పుట్టుక ఆధారంగా పౌరసత్వం - పుట్టుకతో వచ్చే పౌరసత్వానికి సంబంధించిన చట్టాన్ని తొలగించేందుకు ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తెస్తామని ట్రంప్ చెప్పారు. దీని ప్రకారం అమెరికాలో పుట్టినవారినే అమెరికా పౌరులుగా భావిస్తారు. ఇప్పుడు ఈ చట్టానికి ఆమోదం లభించడం కూడా అంత సులభం కాదు.

పన్నుల్లో మరింత కోత - పౌరులపై ఆదాయపు పన్ను మరింత తగ్గించాలంటూ 2017 చివర్లో రిపబ్లికన్ పార్టీ సభ్యులు వైట్‌హౌస్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనను ఆమోదించకుండా డెమొక్రాట్లు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ మధ్యంతర ఎన్నికలను ట్రంప్ విధానాలపై రిఫరెండంగా పరిగణిస్తున్నారు

ట్రంప్‌ను గద్దె దించడం

వీటితోపాటు ఇప్పుడు ట్రంప్‌కు అభిశంసన ముప్పు కూడా ఉంది. అధ్యక్షుడిని తొలగించడానికి ప్రారంభించే ఈ ప్రక్రియలో మొదటి అడుగు వేసేందుకు సాధారణ మెజారిటీ చాలు. డెమొక్రాట్లకు ఇప్పుడు ఆ బలం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)