అమెరికా మధ్యంతర ఎన్నికలు: ఇంటి అద్దె కట్టలేను అంటున్న అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు

  • 11 నవంబర్ 2018
కాంగ్రెస్ మహిళకు అద్దె కష్టాలు Image copyright Reuters
చిత్రం శీర్షిక అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్

అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలికి ఇప్పుడొక సమస్య ఎదురైంది. ప్రస్తుతం ఏ ఆదాయం లేకపోవడంతో వాషింగ్టన్‌లో ఇంటి అద్దెను ఆమె భరించలేనంటున్నారు. జనవరిలో కొత్త పదవిలో కూర్చునేవరకూ ఆమెకు ఈ సమస్య తీరేలా కనిపించడం లేదు.

'సహస్రాబ్ది కాంగ్రెస్ మహిళ'గా వర్ణిస్తున్న అలెగ్జాండ్రా ఒకాసియో-కోర్టెజ్ వాషింగ్టన్ డీసీలో ఒక అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకోవాలని చూస్తున్నారు. కానీ దానికి ముందు తన మొదటి వేతనం అందుకోవడం కోసం వేచిచూస్తానని ఆమె న్యూయార్క్ టైమ్స్‌కు చెప్పారు.

శుక్రవారం ఫాక్స్ న్యూస్ ప్రజెంటర్ ఆమెతో మాట్లాడారు. "ఇటీవల ఒక మ్యాగజైన్లో మీరు వేసుకున్న లక్షల విలువ చేసే దుస్తుల వెనుక అసలు నిజం ఏంటో చెప్పాలి" అన్నారు. సమాధానంగా "ఆ బట్టలను ఫొటో షూట్ కోసం అద్దెకు తెచ్చుకున్నానని" అలెగ్జాండ్రా చెప్పారు.

నేను నిజంగా గందరగోళంలో ఉన్నాను. జనవరిలో ఈ సమస్య తీరుతుందని అనుకుంటున్నాను అని ఆమె వ్యాఖ్యానించారు. ఇంటి అద్దె కూడా భరించలేనని చెప్పడంతో, ట్విటర్‌లో చాలా మంది ఆమెపై సానుభూతి వ్యక్తం చేశారు.

ఒకాసియో-కోర్టెజ్ డెమొక్రాట్ నేత. అమెరికాలో పేదరికం, సంపద అసమానతలు, వలస అంశాలపై ప్రచారం చేసిన ఆమె న్యూయార్క్ 14వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికయ్యారు.

ప్యూర్టోరికోకు చెందిన కుటుంబంలో పుట్టిన ఈమె తమది చిన్న చిన్న పనులు చేసుకుని జీవించే వర్గం అని చెప్పారు. 2018 ప్రారంభం వరకూ తను రెస్టారెంట్లలో పనిచేశానని, తన వేతనాన్ని సామాజిక కార్యకర్తగా ఖర్చు చేశానని చెప్పారు.

కాంగ్రెస్‌ సభ్యులైన తర్వాత వాషింగ్టన్‌లో వసతి గురించి డైలమాలో పడ్డట్లు ఆమె గురువారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో ఎవరో ఒకరు మీ పరిస్థితి అర్థం చేసుకుంటారని కొందరు ఆమెకు సర్దిచెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వాషింగ్టన్ డీసీలో సింగిల్ బెడ్‌ రూం అద్దె నెలకు లక్షన్నర పైనే

కాంగ్రెస్ సభ్యులకు ఇంటి దిగులు

నగరంలో ఇంటి అద్దెల గురించి కాంగ్రెస్ సభ్యులు ఒకాసియో-కోర్టెజ్ మాత్రమే భయపడడం లేదు.

అత్యంత ఎక్కువ అద్దెలు ఉండే టాప్ టెన్ నగరాల్లో వాషింగ్టన్ డీసీ ఒకటి. బిజినెస్ ఇన్‌సైడర్ గణాంకాల ప్రకారం ఇక్కడ సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ అద్దె నెలకు లక్షన్నర రూపాయల (2,160 డాలర్లు) పైనే ఉంటుంది.

హార్వర్డ్ నివేదిక ప్రకారం ఇక్కడ ఐదుగురిలో ఒక చిన్నారి అత్యంత తక్కువ ఆదాయం వచ్చే కుటుంబంలో ఉంటున్నాడు. అలాంటి ఆదాయ వర్గాలకు ఇక్కడ చాలా తక్కువ ఇళ్లు అందుబాటులో ఉంటున్నాయి.

ఒక కాంగ్రెస్ సభ్యుడికి నెలకు కోటీ 26 లక్షల రూపాయలకు (174,000 డాలర్లు) పైగా వేతనం అందుతుంది. ఆ జీతంతో తమ కుటుంబాన్ని పోషించడంతోపాటు, వాషింగ్టన్‌లో ఇల్లు తీసుకోవడం వారికి ఆర్థిక భారమే అవుతుంది. అందుకే గతంలో కాంగ్రెస్ సెషన్స్ ఉన్నప్పుడు కొందరు సభ్యులు తమ ఆఫీసుల్లోనే పడక ఏర్పాట్లు చేసుకునేవారు.

కాంగ్రెస్ సభ్యులకు అందుబాటులో ఇళ్లు లేకపోవడంపై అమెరికాలో చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. ఒక అంచనా ప్రకారం దాదాపు 50 మంది సభ్యులు తాము పనిచేస్తున్న చోటే కునుకు తీస్తున్నారు. కొందరు వేరేవారితో కలిసి ఇల్లు పంచుకోవాలని కూడా చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)