మొదటి ప్రపంచ యుద్ధం: భారత సైన్యం అక్కడికి చేరుకోకపోతే.. చరిత్ర మరోలా ఉండేది

  • 10 నవంబర్ 2018
మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారత సైనికులు

మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. నాలుగేళ్లపాటు రక్తపుటేరులు పారించిన ఆ సంగ్రామం 1918 నవంబరు పదకొండున ముగిసింది.

ఈ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, కోటీ ముప్పై లక్షల మంది ప్రజలు మరణించినట్లు అంచనా.

అయితే తొలి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున లక్షల మంది బ్రిటిష్ ఇండియా సైనికులు పాల్గొన్నారు.

యూరప్, మధ్యప్రాచ్యం, మధ్యధరా ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో వారు పోరాడారు. బ్రిటిష్ ఇండియా సైనికుల త్యాగాలపై బీబీసీ ప్రతినిధి బుష్రా ఓవైసీ అందిస్తున్న కథనం.

భారత సైన్యం వెస్ట్రన్ ఫ్రంట్‌ను చేరుకోకపోయినా లేక ఇంగ్లిష్ చానెల్‌ తీరంలోని పోర్టులను జర్మనీ ఆక్రమించుకున్నా మొదటి ప్రపంచయుద్ధం చరిత్ర మరోలా ఉండేది.

బెల్జియం, ఈశాన్య ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీలు ఉన్న ప్రాంతానికే వెస్ట్రన్ ఫ్రంట్ అని పేరు. మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన వేదిక ఈ ప్రాంతమే. లగ్జెంబర్గ్, బెల్జియంలను ఆక్రమించుకున్న జర్మన్ సైన్యం వెస్ట్రన్ ఫ్రంట్‌కు తెరతీసింది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని కీలకమైన పారిశ్రామిక ప్రాంతాలపైనా పట్టు సాధించింది. జర్మన్ సైన్యంపై పోరాడటంలోనూ, నిలువరించటంలోనూ భారత సైన్యం ప్రముఖ పాత్ర పోషించింది.

వెస్ట్రన్ ఫ్రంట్ ప్రాంతంలోని బెల్జియం, ఫ్రాన్స్‌ల్లో భారత సైన్యానికి చెందిన 1,30,000 మంది తమ సేవలు అందించారు. వీరిలో 9 వేల మంది మరణించారు.

‘‘మొదటి ప్రపంచయుద్ధంలో భారత సైన్యం ఎంతో కీలక పాత్ర పోషించింది. ఎన్నో వనరులను కూడా అందించింది. యుద్ధ సమయంలో భారత సైన్యం 14లక్షల మందిని భర్తీ చేసుకుంది’ అని స్వ్కాడ్రన్ లీడర్ రాణా ఛినా తెలిపారు.

మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ ఇండియాకు చెందిన 14 లక్షల మంది సైనికులు పాల్గొనగా, వారిలో 74వేల మంది మరణించారు.

తొలి ప్రపంచయుద్ధంలో భాగంగా జరిగిన ప్రతి పోరాటంలో బ్రిటిష్ ఇండియా సైన్యం పాలుపంచుకుంది.

‘‘బ్రిటిష్ ఇండియాలో యుద్ధవిద్యల్లో ఆరితేరిన కొన్ని జాతుల వారిని మాత్రమే బ్రిటిషర్లు సైన్యంలో చేర్చుకున్నారు. ఈ జాతుల వారికి ధైర్యం, దేహధారుడ్యం, విశ్వాసం ఎక్కువ ఉంటాయనేది బ్రిటిషర్ల నమ్మకం.’’

‘‘మా తాత సుబేదార్ పత్ రామ్ తొలి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. సిపాయిగా చేరిన ఆయన సుబేదార్ ర్యాంక్‌కు ఎదిగారు. యుద్ధక్షేత్రంతో పాటు యుద్ధఖైదీల శిబిరాల నుంచి చాలా ఉత్తరాలు మాకు చేరాయి. మా తాత కూడా కొన్ని రాశారు’’ అని లెఫ్టినెంట్ కల్నల్ రాజ్ సింగ్ గర్సీ వెల్లడించారు.

‘‘ఆ ఉత్తరాలపై నిఘా ఉండేది. అందుకే వాటిలో రాసిన పదాలకు, అసలు అర్థాలకు తేడా ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉందని రాస్తే, దాని అర్థం ఎడతెరిపిలేని బాంబుల వర్షం కురుస్తున్నట్లు అర్థం. నల్ల మిరియాలంటే భారత సైనికులు. తెల్ల మిరియాలు అంటే బ్రిటిష్ అధికారులు.’’

‘‘యుద్ధంలో బ్రిటన్‌కు సైన్య సహకారం అందించడానికి ప్రధాన కారణం, వారిని మరింత రాజకీయ స్వయంప్రతిపత్తి ఇచ్చే స్థితిలోకి నెట్టడం కోసమే. అయితే యుద్ధం ముగిసే నాటికి బ్రిటన్ తన వాగ్దానాలను ఏ మాత్రం నిలబెట్టుకోదనే విషయం స్పష్టమైంది. దాంతో అప్పటి వరకు భారతదేశంలో స్వయం పాలన కోసం జరిగిన పోరాటం కాస్త సంపూర్ణ స్వరాజ్య సమరంగా మారింది’’ అని స్క్వాడ్రన్ లీడర్ రాణా ఛినా చెప్పారు.

‘‘రోజూ నిద్ర లేవగానే నేను మొట్టమొదట చేసే పని మా తాతకు వందనం చేయడం. ఆయన పోరాటం నాలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుంది’’ అన్నారు లెఫ్టినెంట్ కల్నల్ రాజ్ సింగ్ గర్సీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం