పాము కాటేశాక ఏమవుతుంది? శాస్త్రవేత్త స్వీయ మరణగాథ

  • 11 నవంబర్ 2018
పాము విషంపై ప్రయోగాలు Image copyright Science Photo Library

ఎవరైనా ఒక శాస్త్రవేత్త ప్రయోగాల కోసం తన ప్రాణాన్నే త్యాగం చేయగలడా?

చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. వాటిలో కార్ల్ పాటర్‌సన్ షిమిట్ కథ ఒకటి.

1957 సెప్టెంబర్‌లో అమెరికాలోని షికాగో లింకన్ పార్క్ జూలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఒక వింత పాము దొరికింది.

76 సెంటీమీటర్లున్న ఆ పాము ఏ జాతికి చెందిందో అతడు తెలుసుకోవాలని అనుకున్నాడు. పామును షికాగో నేచురల్ హిస్టరీ మ్యూజియం తీసుకెళ్లాడు. అక్కడ ప్రముఖ సరీసృపాల శాస్త్రవేత్త కార్ల్ పాటర్‌సన్‌ షిమిట్‌ను కలిశాడు.

షిమిట్‌ను సరీసృప శాస్త్రానికి సంబంధించిన ప్రముఖ నిపుణులుగా భావించేవారని పబ్లిక్ రేడియో ఇంటర్నేషనల్‌కు సంబంధించిన ఎలిజబెత్ షాక్‌మెన్ తెలిపారు.

ఆ పాము శరీరంపై రకరకాల రంగుల ఆకృతులున్నట్టు షిమిట్ గుర్తించారు. అది ఏ జాతి పామో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు.

తర్వాత సెప్టంబర్ 25న ఆయన తన పరిశోధనల్లో అది ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఒక రకమైన పాము అని గుర్తించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాము తల బూమ్‌స్లాంగ్ లాగే ఉంటుంది

ఆ పాము ఎలా ఉండేది?

ఆ పాము తల సబ్-సహారా ఆఫ్రికా అడవుల్లో కనిపించే బూమ్‌స్లాంగ్ పాముల్లాగే ఉండేది.

కానీ షిమిట్ తన పరిశోధనలో ఆ పాము గురించి ఒక నిర్ణయానికి రాలేకపోయారు.

షిమిట్ తన దగ్గర ఉన్న జర్నల్‌లో ఆ పాము బూమ్‌స్లాంగ్ కాదేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ పాము యానల్ ప్లేట్ విభజించినట్లు లేదు.

కానీ ఆ సందేహం దూరం చేసుకోడానికి షిమిట్ చేసిన ప్రయోగం, ఆయన ప్రాణాలమీదకు తెచ్చింది.

Image copyright CHICAGO DAILY TRIBUNE

పాము కరిచిన సమయంలో..

షిమిట్ పామును తనకు దగ్గరగా తీసుకొచ్చాడు. దాని శరీర ఆకృతులపై అధ్యయనం చేస్తున్నారు.

షిమిట్ బూతద్ధంతో పాము తల, శరీరంపై ఉన్న ఆకృతుల రంగులను పరిశీలిస్తున్నారు. అప్పుడే ఆ పాము హఠాత్తుగా ఆయన బొటనవేలుపై కాటేసింది.

కానీ షిమిట్ డాక్టరు దగ్గరకు వెళ్లలేదు, బదులుగా వేలిని నొక్కుతూ పాము విషయం బయటకు పిండేయాలని ప్రయత్నించారు.

అంతే కాదు, ఆయన తన జర్నల్ తీసి పాము కాటేసిన తర్వాత ఎలాంటి అనుభవాలు కలుగుతున్నాయో తీరిగ్గా రాయడం మొదలెట్టారు.

షిమిట్ తన జర్నల్‌లో రాసిన విషయాలు:

  • ఉదయం 4:30 - 5:30: పాము కరిచింది. కడుపులో వికారంగా అనిపిస్తోంది. కానీ వాంతులు రాలేదు. నేను హోంవుడ్ వరకూ రైల్లో వెళ్లాను.
  • 5:30 - 6:30: చాలా చలేస్తోంది. షాకులు వచ్చినట్టు అనిపిస్తోంది. తర్వాత 101.7 డిగ్రీల జ్వరం వచ్చింది. సాయంత్రం 5.30కు చిగుళ్లలో రక్తం రావడం మొదలైంది.
  • "రాత్రి 8:30: రెండు టోస్టులు తిన్నాను.
  • రాత్రి 9:00 నుంచి 12:20 వరకు నేను ప్రశాంతంగా నిద్రపోయాను. తర్వాత నేను మూత్రానికి వెళ్లాను. దాన్లో ఎక్కువ రక్తమే కనిపించింది.
  • సెప్టంబర్ 26 ఉదయం 4.30: నేను ఒక గ్లాస్ నీళ్లు తాగాను, వికారంగా ఉండడంతో వాంతి అయ్యింది. కడుపులో జీర్ణం కానివన్నీ బయటికి వచ్చేశాయి. తర్వాత నాకు చాలా హాయిగా అనిపించింది. ఉదయం 6.30 వరకూ నిద్రపోయా.
  • ఉదయం 6.30 - నా శరీర ఉష్ణోగ్రత 98.2 డిగ్రీ ఉంది. నేను టోస్టుతోపాటు ఉడకబెట్టిన గుడ్లు, ఆపిల్ సాస్, ధాన్యాలు తిన్నా. కాఫీ తాగాను. తర్వాత మూత్రం వెళ్లాను. కానీ ప్రతి మూడు గంటలకు ఒక ఔన్సు రక్తం వచ్చింది. నోట్లో, ముక్కులో రక్తం ఆగకుండా కారుతోంది. కానీ కొద్దికొద్దిగానే వస్తోంది.
Image copyright CHICAGO DAILY TRIBUNE

అప్పటికే ఆలస్యమైపోయింది..

ఆ తర్వాత మధ్యాహ్నం 1.30కు ఆయన భార్యకు ఫోన్ చేశారు. కానీ డాక్టర్ అక్కడికి వచ్చేటప్పటికే ఆయన శరీరం చెమటతో తడిసి ముద్దైపోయింది.

ఆయన స్పృహతప్పిపోయే స్థితిలో ఉన్నారు. ఆస్పత్రి తీసుకెళ్లేలోపు ఆయన్ను స్పృహలోకి తెచ్చేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నాలు చేశారు.

కానీ మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్లు షిమిట్ మరణించినట్లు ధ్రువీకరించారు. ఊపిరి తీసుకోవడంలో సమస్యల వల్ల ఆయన చనిపోయారని తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక షికాగోలోని నేచురల్ హిస్టరీ మ్యూజియం

బూమ్‌స్లాంగ్ పాము విషం ఎంత ప్రమాదం?

ఆఫ్రికా పాము బూమ్‌స్లాంగ్ విషం చాలా వేగంగా ప్రభావం చూపిస్తుంది. ఏదైనా ఒక పక్షి ప్రాణం తీయడానికి ఆ పాము విషం 0.0006 మిలీగ్రామ్ సరిపోతుంది.

ఈ విషం ప్రభావం వల్ల మొదట శరీరంలో రక్తం గడ్డకట్టడం మొదలవుతుంది. దానివల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది.

తర్వాత శరీరంలోని చాలా భాగాల నుంచి రక్తంస్రావం మొదలవుతుంది. తర్వాత బాధితులు చనిపోతారు.

షిమిట్ పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆయన ఊపిరితిత్తులు, కళ్లు, గుండె, కిడ్నీలు, మెదడులో రక్తస్రావం జరిగిందని తెలిపారు.

షికాగో ట్రిబ్యూన్‌లో ముద్రించిన ఒక వార్తలో "పాము కరిచిన తర్వాత షిమిట్‌కు డాక్టర్ దగ్గరకు వెళ్లాలని చెప్పారని, కానీ ఆయన దానికి ఒప్పుకోలేదని, అలా చేయడం వల్ల దాని ప్రభావం లక్షణాలపై పడవచ్చని అన్నారని" తెలిపారు.

షిమిట్ జిజ్ఞాసే ఆయన ప్రాణం తీసిందని కొంతమంది భావిస్తున్నారు.

అయితే, ప్రముఖ శాస్త్రవేత్త అయిన షిమిట్‌కు ఆ పాము విషానికి విరుగుడు కేవలం ఆఫ్రికాలో మాత్రమే ఉందనే విషయం తెలుసని, అందుకే ఆయన తన మరణాన్ని స్వీకరించారని కొంతమంది చెబుతారు.

పబ్లిక్ రేడియో ఇంటర్నేషనల్‌లో సైన్స్ ఫ్రైడే ప్రోగ్రాం సమర్పించే టామ్ మెకనామారా "మృత్యువును కళ్లముందే చూస్తున్నా షిమిట్ వెనక్కు తగ్గలేదు, బదులుగా ఆయన తనకు తెలీని మార్గంలో ముందుకు వెళ్లారు" అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)