ఫేక్‌న్యూస్‌కు వ్యతిరేకంగా బీబీసీ సరికొత్త భారీ అంతర్జాతీయ కార్యక్రమం

  • 11 నవంబర్ 2018
బియాండ్ ఫేక్‌న్యూస్

బీబీసీ బియాండ్ ఫేక్ న్యూస్ ప్రాజెక్టును నవంబర్ 12వ తేదీన ప్రారంభించబోతోంది. బూటకపు సమాచారాన్ని ఎలా, ఎందుకు షేర్ చేస్తారనే అంశం మీద బీబీసీ పరిశోధనలో గుర్తించిన అంశాల విడుదలతో ఇది ఆరంభమవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సమాచారం సామాజికంగా రాజకీయంగా హాని చేస్తోందని, వార్తల మీద జనం విశ్వాసం సన్నగిల్లుతోందని.. దీని వల్ల కొన్నిసార్లు హింస, మరణాలు కూడా సంభవిస్తున్నాయని గుర్తించారు.

ఈ రుగ్మతకు వ్యతిరేకంగా బీబీసీ ఈ బియాండ్ ఫేక్ న్యూస్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ బెడదకు సాంకేతిక పరిష్కార మార్గాలను అన్వేషించటానికి ఇండియా, కెన్యాల్లో గ్లోబల్ మీడియా లిటరసీ, హ్యాకథాన్లపై ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ఆఫ్రికా, ఇండియా, ఆసియా పసిఫిక్, యూరప్, అమెరికా, సెంట్రల్ అమెరికాలలో బీబీసీ నెట్‌వర్క్‌లు అన్నిటా ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది.

ఇండియా, కెన్యా, నైజీరియాల్లో ఎంపిక చేసిన యూజర్లు తమ ఎన్‌స్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను పరిశీలించటానికి గాను బీబీసీని అనుమతించటంతో పరిశోధన చేసి ఫలితాలను నవంబర్ 12వ తేదీన విడుదల చేయబోతోంది.

బియాండ్ ఫేక్ న్యూస్ ప్రాజెక్టులో భాగంగా ఇండియా, కెన్యాల్లో ఇప్పటికే వర్క్‌షాప్‌లను నిర్వహించాం. బ్రిటన్‌లో తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టటానికి.. దేశ వ్యాప్తంగా స్కూళ్లలో డిజిటల్ లిటరసీ వర్క్‌షాప్‌లను నిర్వహించటం సహా బీబీసీ చేసిన కృషి ప్రేరణతో ఈ ప్రాజెక్టును చేపట్టటం జరిగింది.

చిత్రం శీర్షిక ‘‘సమస్యలను గుర్తించటానికి, వాటికి ఆశాజనక పరిష్కారాలను గుర్తించడానికి ఓ ప్రధానమైన అంతర్జాతీయ గళంగా మా మార్గాన్ని నిర్మిస్తున్నాం''

ఈ సందర్బంగా బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్రూప్ డైరెక్టర్ జేమీ ఆంగస్ మాట్లాడుతూ.. ''ప్రపంచవ్యాప్తంగా 'ఫేక్ న్యూస్' ముప్పు గురించి కేవలం మాట్లాడటమే కాకుండా బీబీసీ ఇంకా ముందడుగు వేస్తుందని.. దానిని పరిష్కరించటానికి పటిష్ఠ చర్యలు చేపడుతుందని 2018లో సంకల్పం తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రమాణాలు పేలవంగా ఉండటం, డిజిటల్ వేదికల మీద దురుద్దేశపూరిత సమాచారం నిరాటంకంగా వ్యాప్తి చేయడం తేలికైన ఈ తరుణంలో.. విశ్వసనీయ వార్తలు అందించేవారు క్రియాశీల చర్యలు చేపట్టటం అత్యావశ్యకం.

కేవలం మాటలు చెప్పటం కాదు.. చెప్పిన మాటను ఆచరిస్తూ.. ఇండియా, ఆఫ్రికాల్లో క్షేత్రస్థాయిలో వాస్తవ చర్యలు చేపట్టాం. ఆన్‌లైన్‌లో షేరింగ్ తీరుతెన్నులు, ప్రవర్తనలపై లోతైన పరిశోధనలకు నిధులు సమకూరుస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మీడియా లిటరసీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన కొన్ని ఎన్నికల్లో బీబీసీ రియాలిటీ చెక్ (నిజానిజాల నిర్ధరణ) కార్యక్రమాలు చేపడుతున్నాం. సమస్యలను గుర్తించటానికి, వాటికి ఆశాజనక పరిష్కారాలను గుర్తించడానికి ఓ ప్రధానమైన అంతర్జాతీయ గళంగా మా మార్గాన్ని నిర్మిస్తున్నాం'' అని ఈ ప్రాజెక్టు గురించి వివరించారు.

బియాండ్ ఫేక్ న్యూస్ సీజన్

నకిలీ లేదా వాస్తవం.. నిజం లేదా అబద్ధం.. పారదర్శకం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేది - అనే తేడాను ఎలా చెప్పగలం? విశ్వసనీయత పెంచడం ఎలా? బియాండ్ ఫేక్ న్యూస్ సీజన్‌లో బీబీసీ శోధిస్తున్న సమస్యలు ఇవి. వాట్సాప్ సమాచారంతో భారత్‌లోని ఒక గ్రామం ఉన్మాద మూకగా మారినప్పుడు ఏం జరిగిందనే దానిపై లోతైన కథనం కూడా ఈ సీజన్‌లో ఉంటుంది. బీబీసీ జర్నలిస్టుల విశిష్ట అనుభవం నుంచి ప్రపంచవ్యాప్త కథనాలను టీవీ, రేడియో, ఆన్‌లైన్‌లలోకి ఈ సీజన్ తీసుకువస్తుంది.

ప్రోగ్రాములు, డాక్యుమెంటరీలు

గ్లోబల్: దిల్లీ నుంచి, నవంబర్ 12 నుంచి 15 వరకు

ఫేక్ న్యూస్ వైరల్‌గా మారిన ప్రపంచంలో విశ్వసనీయత బాధితురాలైనపుడు.. ఏం జరుగుతుందనేది శోధిస్తూ.. బీబీసీ ప్రతినిధి మాథ్యూ అమ్రోలివాలా టెక్నాలజీ దిగ్గజాలు, రాజకీయవేత్తలు, స్కూలు పిల్లలు, బాలీవుడ్ నటులతో మాట్లాడతారు.

బియాండ్ ఫేక్ న్యూస్ - టెక్ జెయింట్స్, నవంబర్ 12 & 17, 18

ఫేక్ న్యూస్ సంక్షోభం మీద, ఈ సమస్యలో వారి వారి వేదికల పాత్ర మీద, పరిష్కారం మీద చర్చించటానికి టెక్ దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విటర్, గూగుల్‌లను ఒక వేదిక మీదకు తేవటం జరుగుతుంది. మాథ్యూ అమ్రోలివాలా దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తారు.

ద షి వర్డ్: ఫేక్ మి - నవంబర్ 10

సోషల్ మీడియా విస్తరిస్తుంటే.. ఇన్‌స్టా-ఫేస్ నుంచి జీప్స్ వరకూ.. బ్లింగ్ నుంచి పూర్తిస్థాయి బూటకం వరకూ.. ఆఫ్రికాలో మిలీనియల్స్ 'లైకుల' మీద జీవిస్తున్నారు. కొన్నిసార్లు క్లిక్‌లను పెంచుకోవటానికి ప్రమాదకరమయ్యేంత దూరం వెళుతున్నారు. ఆన్‌లైన్ ప్రొఫైల్‌ను రూపాంతరం చేయటానికి.. ఇన్‌స్టాగ్రామ్ లుక్, కంటెంట్, ఫాలోయర్లు, టెక్నాలజీని ఉపయోగించుకుని.. ప్రైవేట్ నుంచి పబ్లిక్‌ చేస్తూ.. కేవలం ఐదు రోజుల్లో నకిలీ ప్రొఫైల్‌ను వైరల్ చెయ్యాలని ఒక కెన్యా స్టూడెంట్‌ని - సోషల్ మీడియా గురించి ఏ మాత్రం తెలియని 21 సంవత్సరాల యువతిని మేం చాలెంజ్ చేశాం.

స్పెషల్ రిపోర్టులు

ఇండియాలో వదంతుల కారణంగా పెచ్చరిల్లిన హింసను మ్యాప్‌లో చూపించే ఇంటరాక్టివ్ డాటా ప్రాజెక్ట్.

దిల్లీలోని బీబీసీ ఇండియా టీమ్ నుంచి.. ఇండియాలో సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల వల్ల పేట్రేగిన హింస, మూకదాడుల్లో కొట్టి చంపిన సమాచారాన్ని క్రోడీకరించటానికి మేం వందల వార్తాపత్రికలను అధ్యయనం చేశాం.

ఒక భారతీయ గ్రామాన్ని వాట్సాప్ ఒక ఉన్మాద మూకగా మార్చినప్పుడు ఏం జరిగింది - నవంబర్ 12

నీలోత్పల్, అభిషేక్‌ల కథ. ఇద్దరు వ్యక్తులు పిల్లలను అపహరించేవారని సూచిస్తూ వాట్సాప్‌లో వదంతులు వ్యాపించిన తర్వాత వారిని కొట్టి చంపిన ఉదంతం మీద మినీ-డాక్యుమెంటరీ.

ఇండియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి వెనుక ఉన్న వ్యక్తులు, నవంబర్ 12

ఇండియా వ్యాప్తంగా ఫేక్ న్యూస్ వ్యాప్తిచేస్తున్నట్లు ఆరోపణలున్న ఫేస్‌బుక్ పేజీలు, వెబ్‌సైట్ల వెనుక గల కొందరు వ్యక్తులను బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే కలిశారు.

సోషల్ మీడియాలో ఫాలో అవండి: #BeyondFakeNews

బీబీసీ వరల్డ్ సర్వీస్ గురించి..

బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్‌తో పాటు 41 ఇతర భాషా సర్వీసుల్లో.. రేడియో, టీవీ, డిజిటల్ వేదికల మీద ప్రతి వారం 26.9 కోట్ల మందికి వార్తా సమాచారాన్ని అందిస్తోంది. బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో భాగంగా.. బీబీసీ లెర్నింగ్ ఇంగ్లిష్.. ప్రపంచ ఆడియన్స్‌కు ఇంగ్లిష్ బోధిస్తోంది. బీబీసీ వరల్డ్ సర్వీస్, బీబీసీ వరల్డ్ న్యూస్ టెలివిజన్ చానల్, bbc.com/news సహా తన అంతర్జాతీయ న్యూస్ సర్వీసులకు ప్రతి వారం 34.6 కోట్ల మంది ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. బీబీసీ వాణిజ్యపరంగా నిధులు సమకూర్చే 24 గంటల అంతర్జాతీయ ఇంగ్లిష్ వార్తా వేదికలైన బీబీసీ వరల్డ్ న్యూస్, BBC.comల యజమాని, నిర్వాహక సంస్థ బీబీసీ గ్లోబల్ న్యూస్ లిమిటెడ్. బీబీసీ వరల్డ్ న్యూస్ టెలివిజన్ 200కి పైగా ప్రపంచ దేశాలు, ప్రాధికార ప్రాంతాల్లో 45.4 కోట్ల ఇళ్లు, 30 లక్షల హోటల్ రూమ్‌లలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)